Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 6

   
    స్డూడెంట్స్ ని పట్టించుకోకుండా వూరుకుంటే కొందరు లెక్చరర్స్ కూడా సతాయించేవారు. ప్రాక్టికల్స్ చేస్తుంటే వచ్చి పక్కనే నించుని తనని రాసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడేవారు కెమిస్ట్రీ లెక్చరర్ పద్మనాభం. జువాలజీ నోట్స్ ఇస్తాను, ఇంటికి రమ్మని పిలిచి జాకెట్లో చేయి పెట్టిన జువాలజీ లెక్చరర్ జీవరత్నం.

    కంచే చేను మేసినట్లుగా..... ఈ లెక్చరర్స్ బారినుంచి తప్పించుకోవడం పెద్ద హెడేక్ అయ్యేది. పెద్దవాడు కదాని తెలుగు లెక్చరర్ కి చెపితే "నీ కెందుకు నన్ను నమ్ముకో! నీ సంగతి నేను చూసుకొంటాను" అన్నాడు జానకిరాం మాష్టారు బుజంమీద చేయి వేస్తూ. విదిలించుకుని వచ్చేసింది.

    ఎవరికి వాళ్ళే!

    ఈ మగవాళ్ళ తీరే అంత? ఆడవాళ్ళంటే చులకన.

    అవకాశం ఇసుమంత దొరికితే బెడ్ ఎక్కించాలన్న కోరిక.

    ఛ! అసహ్యం..... అయినా ప్రతి సమస్యని తనే ఏదోలా పరిష్కరించుకుని డిగ్రీ పూర్తి చేసింది. పరీక్ష పాసయిన వెంటనే ఉద్యోగం వచ్చింది.

    తన అదృష్టానికి మురిసిపోయింది.

    ఆరోజు మార్నింగ్ షిప్ట్.

    బస్సు కదలటంతో పాటే పెద్దగా వాన మొదలైంది. తన స్టేజీ వచ్చినా అది తగ్గలేదు. బస్టాప్ లో నుంచుంది. టైం  దాటితే ఆఫీసులోకి "ఎలోవ్" చెయ్యరు.

    "గొడుగు తీసుకోండి"

    తలెత్తి చూసింది.

    అతను............

    ఎవరో తెలీదు.

    కానీ! రోజూ చూస్తూనే వుంటుంది. నలుగురైదుగురు తన బస్సులోనే వస్తారు వాళ్ళు. పేరు తెలీకపోయినా, అతని వివరాలు తెలీకపోయినా బస్సులో పరిచయమున్నముఖమే! తనకేసి ఎప్పుడూ అదోలా చూస్తుంటాడు.

    "ఫర్వాలేదు. తీసుకోండి మీకు ఆలస్యం అవకుండా వుంటుంది!" అన్నాడు.

    "మరి మీరు?" అంది.

    "నేను మగాణ్ణి. తడిసిపోయినా ఫర్వాలేదు" చెప్పాడు.

    అతని చేతిలోంచి గొడుగు తీసుకుని వడివడిగా అడుగులేసుకొని వెళ్లిపోయింది.

    రెండోరోజు తను ఆఫీసులోంచి బయటికి వచ్చేసరికి బస్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ కనిపించాడు. అతని గొడుగు ఇచ్చేసింది.

    "మీ పేరు?" అడిగాడు.

    "నాగమణి" చెప్పింది.

    "నా పేరు కిరణ్" అంటూ జేబులోంచి విజిటింగ్ కార్టు తీసి అందించాడు.

    దాన్ని చూసింది.

    అతను జూనియర్ ఆఫీసర్. అందంగా వున్నాడు. మాటల్లో మంచితనం.... కనిపిస్తోంది. చురుగ్గా, చలాకిగా వున్నాడు.

    మంచివాడే అనిపించింది. తన వయస్సుకి దగ్గరవాడే.

    రోజూ బస్టాప్ లో కనిపించినప్పుడు దగ్గరకొచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక్కోసారి ఆఫీసులోంచి బయటికి వచ్చేసరికి ఎదురు చూస్తూ నించునేవాడు.

    "ఏంటిక్కడ నిలబడ్డారు?" అని అడిగితే,

    "నీ కోసమే!" అని నవ్వేవాడు.

    పరిచయం పెరగకముందు పోకిరీలా కనిపించేవాడు. కానీ జంటిల్మన్ అనే నిర్ణయానికి వచ్చింది.

    ఇద్దరికీ ఒకే షిప్ట్ అయినప్పుడు తప్పనిసరిగా కనిపించేవాడు కిరణ్.
 

 Previous Page Next Page