"నెలరోజులు మన కళ్లు మాట్లాడుకున్నాయి. ఇప్పుడు పెదవులు మాట్లాడుకోవాలనీ.... ఇలా ఒకరి కళ్లలోకి ఒకరం చూచుకుంటూ ఈ చెట్ల చాటున ఏకాంతంగా గడపాలనీ....."
"గడిపితే ఏమొస్తుంది?"
"గడిపాక ఏమొస్తుందో నువ్వే చూస్తావు. నేను చెప్పడమెందుకు? తెలిసి అడుగు పెడితే ఏముంటుంది? తెలియకుండా అడుగుపెడితే ఆ లోకం చాలా అధ్బుతంగా వుంటుంది."
"ఏ లోకం?"
"ప్రణయలోకం."
"అంత తెలియకుండా అడుగుపెట్టి అధ్బుతాలు చూడాలనే కుతూహలం నాకేం లేదు. జీవితాన్ని అంత తెలివి తక్కువగా నడిపే పదహారేళ్ల వయసు కాదు నాది!"
"వయసు ఆలోచనా విధానాన్ని మార్చవచ్చు!ఆలోచనా శక్తి పెంచవచ్చు. అంతవరకు ఒప్పుకొంటాను. కాని, ప్రేమ మనిషినే కాదు వయసుని కూడా తలక్రిందులు చేసివేస్తుంది. అలా తలక్రిందులు కానిదే నువ్వు నా కళ్ళలో కళ్లు కలిపేదానివనుకోను. ఆడదాని ఆహ్వానం లేనిదే ఏ మగవాడూ ముందడుగు వేస్తాడనుకోకు, స్వప్నా! అంటే నాలాంటి సభ్యతకలవాడు!"
స్వప్న ముఖం ఎర్రబడింది, సూటిగా కొట్టిన ఈ దెబ్బకు! తను ఇతడితో చిలిపి కయ్యాలాడడానికి వచ్చిందా? అన్ని సంగతులూ అడిగి అనుకూలంగా వుంటే పెళ్లి సంగతి ఎత్తాలనీ.......
అయినా అంత చటుక్కున నన్ను పెళ్లాడతారా అని ఎలా అడుగుతుంది?
"ఆలోచనలో పడిపాయావేం, స్వప్నా?" సిగరెట్ కేస్ సైజులో వున్న ట్రాన్సిస్టరు చేతిలోకి తీసుకుని స్టేషన్ మారుస్తూ అడిగాడు.
"ఏం లేదు. మీ సంగతులు చెప్పండి, వింటాను!"
"హైదరాబాద్ మా నేటివ్. మా నాన్నగారు ఎక్జిక్యూటివ్ ఇంజనీరు, ప్రస్తుతం సాగర్ లో. అన్నయ్య ఫారిన్ లో వున్నాడు, మెడిసిన్ లో స్పెషలైజ్ చేస్తూ. చెల్లెలు ఐ. ఏ. ఎస్. కు ట్రై చేస్తోంది. ఇవీ నా వివరాలు. చాలా?"
కులం గురించి అడగాలని పెదవుల వరకూ వచ్చింది. కానీ, సభ్యత అడ్డు పడింది. కులం గురించి అడగడం ఈ కాలంలో నాగరికత కాదు! అయినా ముఖం పట్టుకొని నీ కులమేమిటి అని ఎలా అడుగుతుంది?
"అందమైన వాళ్లను చాలామందినే చూసాను. కాని, విసనకర్రల్లా ఇంతపొడుగాటి రెప్పలతో ఇంత పెద్దగా వున్న కళ్లని ఈ ముఖంలోనే చూసాను. చూసిన మొదటి క్షణంలోనే అనిపించింది ఈ కళ్లని నా స్వంతం చేసుకోవాలనీ.... ఈ కళ్ళలో కాపురముండాలనీ..."