"అబ్బే, నాకేమీ అక్కర్లేదు గురూజీ. నేను కొన్నాళ్ళపాటు సుఖంగా ఉండదల్చుకున్నాను" అన్నాడు కన్నారావు ఠపీమని.
ప్రేమానందం కన్నారావు వంక అదోమాదిరిగా చూసి చిట్టబ్బాయ్ వంక తిరిగి అన్నాడు. "ప్రేమలో సలహాలు కావలసింది నీకు మాత్రమే కాబట్టి నీ గురించిన వివరాలు మాత్రమే చెప్పు నాయనా, అతని గురించి ఎందుకు?"
"అలాగే గురూజీ, మా ఇద్దరికి హైదరాబాద్ లో ఒకేసారి, ఒకే ఆఫీసులో ఉద్యోగం వచ్చింది. ఇద్దరం రాజమండ్రి వదిలిపెట్టి ఇక్కడ ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. విజయనగర్ కాలనీలో చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుని అంటున్నాం. ఇంతకి మించి నా గురించి చెప్పడానికి ఇంకేమీ లేవు గురూజీ."
"ఆ ఇప్పుడు నీ సమస్య ఏమిటో చెప్పు నాయనా!" అన్నాడు ప్రేమానందం వెనక్కి దిండు మీదికి జారగిలబడుతూ.
"ఇంతదాకా సమస్యలేమీ లేవు గురూజీ, ఇంక ముందు సమస్యల్లో పడాలనే మీ దగ్గరికి వచ్చాడు" అన్నాడు కన్నారావు.
చిట్టబ్బాయ్ కన్నారావు వంక కొరకొరా చూశాడు.
"అమాయకుడివి నాయనా. ప్రేమలోని మాధుర్యం నీకింకా తెలీదు. ప్రేమించి సమస్యల్లో పడడంలోని ధ్రిల్ గురించి నీకు అర్థం కాదు నాయనా. ఆ బాధలోనే అనిర్వచనీయమైన ఆనందం ఉంది నాయనా. ఆ బాధలోని థ్రిల్ అనుభవించేవాడికే తెలుస్తుంది నాయనా" అన్నాడు ప్రేమానందం.
"మీరు చెప్పింది అక్షరాలా నిజం గురూజీ" అన్నాడు చిట్టబ్బాయ్.
"ఇప్పుడు చెప్పు నాయనా ఎందుకోసమని నువ్విక్కడికి వచ్చావ్?"
"నాకు ప్రేమించి పెళ్ళి చేస్కోవాలని ఉంది గురూజీ. మామూలుగా తల్లిదండ్రులు పెళ్ళిచూపులకి తీస్కెళ్ళడం. అందులో ఎవరో ఒకమ్మాయిని చూసి పెళ్ళి చేస్కోడం. దాంట్లో ఏ విధమైన ధ్రిల్ లేదు కద గురూజీ."
"అవును నాయనా! నువ్వు చాలా తెలివైనవాడిని నాయనా" అన్నాడు చిట్టబ్బాయ్ తో కన్నారావు వంక చూస్తూ.
"కానీ నాకు ప్రేమించడంలో బొత్తిగా అనుభవంలేదు గురూజీ. అమ్మాయిల్ని ఎలా ఆకర్షించాలో తెలీదు గురూజీ" అన్నాడు చిట్టబ్బాయ్.
"ఇంక ఆ విషయం నా కొదిలేయ్ నాయనా.... చూడు నాయనా, నువ్వేమయినా ఆటలు ఆడావా నాయనా?"
"చిన్నప్పుడు గోళీలు, కోతికొమ్మచ్చి ఆటలు ఆడేవాణ్ని గురూజీ" సిగ్గుపడ్తూ చెప్పాడు చిట్టబ్బాయ్.
"ఇంకా నయం అచ్చంగాయలు ఆడ్తానని అన్లేదు. నేననేది అట్లాంటి ఆటలు గురించి కాదు నాయనా. క్రికెట్, వింబుల్ డన్, పుట్ బాల్ అలాంటి ఆటలు నాయనా."
"లేదు గురూజీ."
"ఊ! అయితే క్రీడాకారుడివి కావన్నమాట! పోనీ కధలూ. కవిత్వాలూ లాంటివి రాస్తావా?"
"ఛీ-నేనటువంటివి రాయను గురూజీ..."
"సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా నాయనా?"
"లేదు గురూజీ".
ప్రేమానందం కనుబొమ్మలు ముడిపడ్డాయ్.
"ఊ.... అయితే ఏదీ చేతకాదన్నమాట?.... ఏదైనా ప్రత్యేకత ఉంటే అమ్మాయిల్ని ఆకర్షించడం కాస్త సులువయ్యేది నాయనా" ఆలోచిస్తూ అన్నాడు ప్రేమానందం.
అటువంటి పత్యేకతలే వాడికుంటే మీ దగ్గరికి ఎందుకొస్తాడు గురూజీ? వాడే సొంతంగా సెటప్ చేస్కునుండేవాడు" అన్నాడు కన్నారావు.
ప్రేమానందం కన్నారావు వంక కళ్ళు చిట్లించి చూశాడు.
"అధికప్రసంగం చేసేవాడిని అమ్మాయిలు ఇష్టపడరు నాయనా.... గుర్తుంచుకో... ముందు ముందు నీకు ఉపయోగపడుతుంది"
"మీరు వాడి మాటలు పట్టించుకోకండి గురూజీ.... వాడలా మాట్లాడ్తాడు గానీ వాడికి మీరంటే భలే గురి గురూజీ... అసలు వాడే మీ దగ్గరికి నన్ను తీస్కొచ్చాడు..." అన్నాడు చిట్టబ్బాయ్.
"అలాగా నాయనా..." ప్రేమగా కన్నారావు వంక చూశాడు ప్రేమానందం.
"వాళ్ళూ వీళ్ళూ చెప్పిన దాన్నిబట్టి చూసి ప్రేమానందం అంటే గొప్పోడని అనుకుని ఇతని దగ్గరికి వద్దామని నీతో చెప్పానుగానీ మనిషిని చూస్తుంటే నాకేమంత ఇంప్రెసివ్ గా కనబడ్డంలేదు..." చిట్టబ్బాయ్ చెవిలో గుసగుసలాడ్తూ అన్నాడు కన్నారావు.
"మనిషెలా ఉంటే మనకెందుకూ?... అతనిచ్చే సలహాలు బాగుండాలిగానీ... నాకెందుకో మనిషి కూడా పరవాలేదనిలిస్తుంది...." చిట్టబ్బాయ్ కన్నారావ్ చెవిలో గుసగుసలాడాడు.
"ఏమో!.... సలహాలు ఎలా ఇస్తాడో??" మళ్ళీ కన్నారావు చిట్టబ్బాయి చెవిలో గుసగుసలాడాడు.
"బాగానే ఇస్తాడనుకుంటా... లేకపోతే ఇందాక వచ్చాడే.... ఆ రాజుగాడు వారం రోజుల్లో ప్రేమలో ఎలా పడ్తాడు?" చిట్టబ్బాయి కన్నారావు చెవిలో గుసగుసలాడాడు.
"ఏమిటి నాయనా ఇద్దరూ చెవుల్లో చర్చించుకుంటున్నారు?"
"ఏంలేదు గురూజీ... మావాడు మిమ్మల్ని నా చెవిలో తెగ పొగిడేస్తున్నాడు.... వాడికి డైరెక్టుగా మనిషి మొహం మీద పొగడాలంటే చచ్చేంత మొగమాటం సిగ్గూనూ... హిహి" నువ్వు తెప్పించుకుంటూ అన్నాడు చిట్టబ్బాయ్.
"అలాగా నాయనా.....?" కళ్ళు పెద్దవిచేసి అప్యాయంగా కన్నారావు వంక చూశాడు ప్రేమానందం.
"గురూజీ... మీరిక నాకు ప్రేమోపదేశం చెయ్యండి గురూజీ...." అన్నాడు కంగారుగా చిట్టబ్బాయ్ ఆ సంభాషణని ఇంకా పొడిగిస్తే కన్నారావు ఏమేమి అవాకులూ చవాకులూ పేల్తాడోనని.
"అగు నాయనా... ప్రేమ వ్యవహారంలో అంత కంగారు పనికిరాదు నాయనా...." అని కళ్ళు మూస్కుని ఒక నిముషంపాటు ఆలోచించాడు ప్రేమానందం.
చిట్టబ్బాయ్ కన్నారావులు ఇద్దరూ అతనేం చెప్తాడోనని ఆతృతగా ఎదురు చూడసాగారు.
ప్రేమానందం మెల్లగా కళ్ళు తెరిచి ఇద్దరి వంకా చూసి చిరునవ్వు నవ్వాడు.
వాళ్ళిద్దరూ కూడా నవ్వకపోతే బాగుండదేమోనని నవ్వారు.
"బ్రహ్మండమైన ఆలోచన వచ్చింది నాయనా.... ఇది తిరుగులేనిది... మొదటిసారిగా నీ మీద ప్రయోగిస్తున్నా నాయనా..."
"ఏంటి గురూజీ అది?..." కుతూహలంగా అడిగాడు చిట్టబ్బాయి.
ప్రేమానందం మరోసారి చిరునవ్వు నవ్వాడు. చిట్టబ్బాయి, కన్నారావులు కూడా లోలోపల విసుక్కుంటూ నవ్వారు. ఎంతకీ చెప్పడేం అనుకుంటూ.
ప్రేమానందం గొంతు సవరించుకున్నాడు.
"నువ్వు ఆడపిల్లల కాలేజీ దగ్గర రెండు రోజులపాటు నేను చెప్పిన డ్రెస్ వేస్కుని తచ్చాడు నాయన..."
"సూట్ వేస్కోమంటారా గురూజీ....?" ఆతృతంగా అడిగాడు.
"అమాయకుడివి నాయనా...."
"మరి ఏం వేస్కోమంటారు గురూజీ?"
"ఎర్రపంట్లాం మీదికి చిలకాకు పచ్చరంగు షర్టు వేస్కో నాయనా..... వీలుంటే తెల్లబూట్లేస్కునినెత్తిన నీలిరంగు టోపీ పెట్టుకో నాయన...."
అది వింటూనే ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"అలా తయారైతే కలర్ సినిమాలోని తెలుగు హీరోలా ఉంటానేమో కద గురూజీ?" తెల్లమొహం వేసి అన్నాడు చిట్టబ్బాయి.
"తప్పదు నాయనా... అమ్మాయిల దృష్టిని నీవైపుకి తిప్పుకోవాలంటే అలాంటి డ్రెస్ వేస్కోక తప్పదు నాయనా... నువ్వేమో మరీ గొప్ప అందగాడివి కూడా కాదుగా... అందుకని నాయనా"
"కానీ అప్పుడు అమ్మాయిలే కాక అందరూ వీడిని చూస్తారుగా గురూజీ?" కన్నారావు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు.
"అందుకే అమ్మాయిల కాలేజీ దగ్గర నిలబడుమన్నాను నాయనా" చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ప్రేమానందం.
"అలాంటి డ్రెస్ వేస్కుంటే అమ్మాయిలంతా చూసి నవ్వరా గురూజీ?" అనుమానంగా అడిగాడు చిట్టబ్బాయి.