"ఇంక వస్తాను గురూజీ... నా పెళ్ళికి మాత్రం మీరు తప్పకుండా వచ్చి, ఆశీర్వదించాలి గురూజీ" అన్నాడు రాజు.
"మంచిది నాయనా... శుభం" ఆశీర్వదిస్తూ అన్నాడు ప్రేమానందం.
రాజు మరోసారి ప్రేమానందానికి సాష్టాంగ దండ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు.
"మేం కూడా వస్తాం గురూజీ" అంటూ చిట్టబ్బాయ్ లేచి నిలబడ్డాడు.
కన్నారావు గబుక్కున లేచి నిలబడి-
"అదేంట్రా.... అప్పుడే వెళ్ళిపోతానంటావేం? మనం వచ్చిందెందుంకూ?" అంటూ చిట్టబ్బాయ్ చెవిలో కసిరాడు.
ప్రేమానందం ఆశ్చర్యంగా చిట్టబ్బాయ్ ముఖంలోకి చూశాడు.
"నీ ప్రాబ్లెమేంటో చెప్పకుండా, నా సలహాలు తీస్కోకుండా వెళ్ళిపోతానంటా వేం నాయనా?" అన్నాడు మెల్లగా.
చిట్టబ్బాయ్ సందేహిస్తూ నిలబడ్డాడు.
"మొహమాటపడకుండా చెప్పునాయనా!"
"మరేమో... ఇందాకేమో రాజేమో..." నసుగుతూ చెప్పబోయాడు చిట్టబ్బాయ్. కానీ ప్రేమానందం అతని మాటలకి అడ్డుతగిలాడు.
"రాజెవరు నాయనా?" అర్ధనిమీలిత నేత్రాలతో చూస్తూ గంభీరంగా అడిగాడు.
"అదేంటి గురూజీ... ఇప్పుడేగా మీ దగ్గరికివచ్చి, మీకు సాష్టాంగ నమస్కారాలు చేసి వెళ్ళాడు! అప్పుడే మర్చిపోయారా? ఆశ్చర్యంగా అడిగాడు చిట్టబ్బాయ్.
"ఓహో-అతనా? అతని పేరు రాజన్న మాట!! అయినా మీలాంటి వాళ్ళు నా దగ్గరికి ఎందరో వస్తుంటారు పోతుంటారు. ఈ గుమ్మం దాటి వెళ్తే నాకిక వాళ్ళ గురించి గుర్తే వుండదు. మీరైనా అంతే నాయనా. నీకు మాత్రం రాజు జీవితాంతం గుర్తుంటాడు, కదు నాయనా?"
"అలా ఎందుకు అనుకుంటున్నారు గురూజీ?" కళ్ళు పెద్దవిచేసి చూస్తూ అడిగాడు చిట్టబ్బాయ్.
"నా పేరు చెప్పి నీ చేత బలవంతంగా జై జై అనిపించాడు కదు నాయనా! అందుకు!"
చిట్టబ్బాయ్ ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. నా మనసులో భావం పట్టేశాడు' అనుకున్నాడు.
"హబ్బే! మా వాడికి అటువంటి మొగమాటాలు ఏమీ లేవండి, ఇష్టం లేకపోతే వాడి చేత ఏ పనీ చేయించలేం" కన్నారావు స్నేహితుడిని సమర్ధిస్తూ అంటూ చిట్టబ్బాయ్ డొక్కలో మోచేత్తో పొడిచాడు.
"హవునండీ - హిహి, వాడు చెప్తున్నది నిజమే. బలవంతంగా నాచేత ఏపనీ చేయించలేరు" ఇబ్బందిగా కదుల్తూ అన్నాడు చిట్టబ్బాయ్.
వెంటనే ప్రేమానందం మొహం సీరియస్ గా మారిపోయింది.
"ప్రేమలో పడాలని అనుకున్నవాడికి ఆ లక్షణం ఉండడం మంచిది కాదు నాయనా. అది పెద్ద అవలక్షణం. తెలుసా నాయనా?"
"అలాగే గురూజీ, ఒకనుండి రోజూ మీకు జై జై అంటుంటాను. ఇంటి దగ్గర వీడు మీపేరు చెప్తే నేను 'జై' అంటుంటాను గురూజీ" అమాయకంగా అన్నాడు చిట్టబ్బాయ్.
"నేను అంటున్నది నాకు జై చెప్పడం గురించికాదు నాయనా! నీకిష్టంలేని పనులను చెయ్యకపోవడం గురించి!! ప్రేమలో పడ్డవాడు ఇష్టంలేని పనులే ఎక్కువ చెయ్యాల్సి వుంటుంది. నువ్వు సిగరెట్లు కాలుస్తావనుకో-"
"నేను సిగరెట్లు కాల్చను గురూజీ" వెంటనే అన్నాడు చిట్టబ్బాయ్.
"ఉదాహరణకి చెప్తున్నా నాయనా!!" గట్టిగా అరిచాడు ప్రేమానందం.
వాళ్లిద్దరూ ఉలిక్కిపడ్డారు. ప్రేమానందంకి కోపం కూడా వస్తుందని వాళ్ళు ఊహించలేదు.
"అతను చెప్పేదేదో నోర్మూసుకుని విను. నువ్వు మధ్యలో అడ్డు తగలకు" చిట్టబ్బాయ్ చెవిలో కసిరి డొక్కలో ఓ పోటు పొడిచాడు కన్నారావు.
కాస్త గట్టిగా పొడిచాడేమో "హూ" అంటూ బాధగా మూలిగాడు చిట్టబ్బాయ్.
"అలా ముక్కుతూ మూలుగుతూ కాకుండా కాస్త శ్రద్దగా నోర్మూసుకుని నేను చెప్పేది విను నాయనా, బాగుపడ్తావ్" ఈసారి కాస్త శాంతంగా అన్నాడు ప్రేమానందం.
"అబ్బే నేను మూలిగింది అందుక్కాదు గురూజీ, వీడు నా డొక్కలో పోటు పొడిచాడు. మీరు చెప్పండి గురూజీ" అన్నాడు చిట్టబ్బాయ్ చేతులు కట్టుకుని ముందుకు వంగి అతి శ్రద్ధని కనబరుస్తూ.
"ఏం చెప్తున్నానూ? ఆ!! నీకు సిగరెట్లు కాల్చే అలవాటుందనుకో, కానీ నీ ప్రేయసికి సిగరెట్లు కాల్చడం అంటే ఇష్టం లేదనుకో, నువ్వు వెంటనే సిగరెట్లు మానేయాల్సి ఉంటుంది. అందాకా ఎందుకూ? నువ్వు పార్కుకి వెళ్దామంటే నీ ప్రేయసి సినిమా కెళ్దాం అంటుంది, నువ్వు రెస్టారెంటుకెళ్దాం అంటే నీ ప్రేయసి పార్కు కెళ్దాం అంటుంది. నువ్వు చచ్చినట్టు ఆమె మాట వినాల్సిందే నాయనా. లేకపోతే నీ ప్రేమ వ్యవహారం బెడిసికొడ్తుంది. ఆ మూడు ముళ్ళూ పడేదాకా వ్యవహారం చాలా జాగ్రత్తగా లాక్కు రావాలి నాయనా."
"అలాగయితే నేను అక్కడికెళ్దాం అని అనకుండా ఎక్కడికెళ్దాం అని ఆమెనే అడిగి ఆ ప్రకారం నడుచుకుంటాను గురూజీ" అన్నాడు చిట్టబ్బాయ్.
"శభాష్ నాయనా... ప్రేమ ఫలించడానిక్కావలసిన ఆయువుపట్టు పట్టేశావ్ నాయనా. ఇంతకీ నీ సమస్యలు చెప్పకుండా నా సలహాలు తీసుకోకుండా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావేం నాయనా?"
"మరేమో... రాజేమో" చెప్పబోయాడు
"రాజెవరు నాయనా?" మళ్ళీ మొదటికొచ్చాడు ప్రేమానందం.
చిట్టబ్బాయ్ నెత్తి కొట్టుకున్నాడు.
"అంత విసుగు పనికిరాదు నాయనా... ప్రేమించేవాడికి ఓర్పు చాలా అవసరం" అర్థనిమీలిత నేత్రాలతో చూస్తూ అన్నాడు ప్రేమానందం.
"అలాగే గురూజీ" అన్నాడు చిట్టబ్బాయ్ లోలోపల విసుక్కుంటూ.
"ఆ...ఇంతకీ రాజెవరు?"
"అదే గురుజే... ఇందాక మీకు వెయ్యి నూట పదార్లు ఇచ్చి సాష్టాంగ పడ్డాడే... అతనే!"
"ఓ... అతని పేరు రాజా? ఊ.... యేంటి?"
"అతను మీకు వెయ్యి నూట పదార్లు ఇచ్చాడు కదండి... నేనేమో అంతంత డబ్బు ఇచ్చుకోలేదు కదండీ! అందుకే వెళ్ళిపోతున్నాను"
ప్రేమానందం చిరునవ్వు నవ్వాడు.
"పిచ్చివాడా! అతను నాకు చెల్లించింది నా ఫీజు కాదుగా!... ఏదో తన తృప్తి, ఆనందం కోసం తనకు తోచింది తాను ఇచ్చాడు. మీరు నా కన్సల్టేషన్ ఫీజు ఇస్తే చాలు."
అసలు ఆ రాజు ప్రేమానందం మనిషేననీ, ఆ వెయ్యి నూట పదహార్లు కూడా ప్రేమానందం డబ్బేనని పాపం వెర్రివాళ్ళు చిట్టబ్బాయ్, కన్నారావులకి ఏం తెలుసు?
"నీ సందేహం తీరిందిగా, ఇక కూర్చో" కన్నారావు చిట్టబ్బాయ్ వంక కొరకొరా చూస్తూ అన్నాడు.
చిట్టబ్బాయ్, కన్నారావు ప్రేమానందం ముందు. కింద పరిచివున్న జంబుఖానామీద కూర్చున్నారు. ప్రేమానందం ఎత్తయిన అరుగుమీద, పరుపుమీద కూర్చున్నాడు.
"మీ సమస్యలూ, సందేహాలూ చెప్పేముందు మీ గురించి వివరంగా చెప్పండి నాయనా" అన్నాడు ప్రేమానందం చిట్టబ్బాయ్వంక చూస్తూ.
చిట్టబ్బాయ్ గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు
"నాపేరు చిట్టబ్బాయ్, వీడు నా స్నేహితుడు. వీడి పేరేమో కన్నారావు. మాది రాజమండ్రి. మేమిద్దరమూ చిన్నప్పటి నుండీ కలిసి చదువుకున్నాం. మా నాన్నగారు పరమేశ్వరరావుగారు, కలెక్టరేట్ ఆఫీసులో పనిచేస్తున్నారు. మా అమ్మ పార్వతమ్మగారు. నాకు ఒక చెల్లెలు వుంది. పేరు రాజేశ్వరి రాజమండ్రిలోనే ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇకపోతే కన్నారావు తండ్రి."
"ఆగు నాయనా" ప్రేమానందం చిట్టబ్బాయ్ మాటలకు అడ్డు తగిలాడు. "ఈ కన్నారావుకి కూడా ప్రేమ విషయంలో నా సలహాలు కావాలా?"