Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 5


    "అవునేవ్. ప్రొద్దున్న  'సిస్టర్, బి.పి.కట్టు, టెంపరేచర్ తియ్యి' అంటూ అథార్టీ  చేస్తున్నాడు. రెండుమూడుసార్లు  చూసి, ఓసారి  చెప్పేస్తాను." 

    "ఏం చేబుతావేం ? నీ డ్యూటీ  నువ్వు చెయ్యవద్దా ?"

    "చెయ్యాల్సిందే కాని యివాళ గాక నిన్న  ప్యాసయిన హౌస్ సర్జన్ కదా, అప్పుడే  పెద్ద  డాక్టరయిపోయిన్నట్లు  అథార్టీ చలాయిస్తే  ఎలా ?"

    "ఒక్కొక్కరి మాట  ఒక్కోరకంగా  వుంటుంది. సరిపెట్టుకుని  పని చేసుకుపోవాలిగానీ, అందరితోనూ  దెబ్బలాడతామా  ఏమిటి ?"

    "చాల్లే, చెప్పొచ్చావు ! నీకున్నంత ఓర్పు  నాకు లేదు."

    "లేకపోతే  నష్టం నీకే."

    నాకు ఈ సంభాషణ రుచించలేదు, అక్కణ్నుంచి  ఎలా లేచి వెళ్ళిపోదామా  అని చూస్తున్నాను. ఇంతలో  ఓ ఆయా చేతిలో  చిన్న పుస్తకం  పట్టుకువచ్చి "ఇక్కడ  డ్యూటీ  హౌస్ సర్జన్ గా రున్నా రామ్మా ?" అని అడుగుతుంది  గుమ్మందగ్గర  నిలబడి.

    "మీకు తాఖీదు వచ్చింది  వెళ్ళండి" అంది నళిని సిస్టర్ తన సంభాషణ ఆపి.

    "మోమో. ఈ రోజంతా  యిలానే వస్తుంటాయి మీకు....ఇదిగో  వీరే ఇలా  తీసుకురా ఆయా."

    ఆయా  చేతిలోంచి  పుస్తకం  తీసుకుని చూశాను. పిడియాట్రిక్ వార్డు నుంచి వచ్చింది మెమో. ఒక మూడేళ్ళ పిల్లాడికి జ్వరం  ఎక్కువగా  వుండి, ఫిట్సులా  వస్తున్నాయట. వచ్చి, అవసరమైనది  చెయ్యమని అక్కడ వుండే శ్యామల అనే నర్సు  రాసింది. ఆ పుస్తకంమీద  సంతకం  పెట్టి  వస్తున్నానని  చెప్పి, అక్కడి  సిస్టర్స్ కి చెప్పి వెనకనే  బయలుదేరాను.

    "ఇవాళ  మీ డ్యూటీ  హెవీగా  వుంటుంది. వెళ్ళిరండి" అంది, వెనక నుండి నళిని సిస్టర్ నవ్వుతూ.

    "భయపడతా ననుకున్నారా ?డ్యూటీ  ఎంత  బరువుగా  వుంటే  నాకంత  ఆనందం" అన్నాడు వసారా మెట్లు దిగుతూ.

    పిడియాట్రిక్ వార్డుకు  వెళ్ళేసరికి  చిన్నపిల్లల  అరుపులతో, రోదనలతో, తల్లుల హడావుడితో, ఊసుపోక కబుర్లతో గీవురు గావురు మంటూ  వుంది. అందులో  సాయంత్రం  నాలుగునుంచి  ఆరుగంటలవరకూ  విజిటర్స్ టైమేమో_ పిల్లల తండ్రులు, ఇతర చుట్టపక్కాలూ  వచ్చేసి  మరింత  రభస చేసేస్తున్నారు.

    నేను రావటం చూసి  లోపలనుంచి  ఎదురుగా  ఓ స్టాఫ్ వచ్చింది. "రండి డాక్టర్, డ్యూటీ హౌస్ సర్జనేకదూ" అన్నది చిరునవ్వు ముఖంతో.

    "అవును. ఎలా వుంది, కేసు?"

    "చూపిస్తాను రండి. హైపర్  పైరెక్సియా  కేసండీ. టెంపరేచర్ నూటా ఆరుంది. కన్వల్షన్స్ కూడా వస్తున్నాయి" అని పక్క  గదిలోకి  దారితీసింది.

    క్రెడిల్  ప్రక్కన  పిల్లాడి తల్లి గ్రుడ్ల  నీరు  క్రుక్కుకుంటూ  నిల్చుంది. వొంగి  ముట్టుకుని  చూశాను. జ్వరంతో  వొళ్ళు  పేలిపోతోంది. అప్పుడప్పుడు  ఫిట్సులా  వచ్చి కాళ్ళూ, చేతులూ  నిగడదీసి పిడికిళ్ళు  బిగిస్తున్నాడు. స్టెతస్కోప్ తో గుండె, ఊపిరితిత్తులు  పరీక్ష చేశాను. నార్మల్ గానే  వున్నాయి.

    "ఎప్పుడు  ఎడ్మిట్  అయిందీ కేసు ?" అనడిగాను.

    "నిన్న."

    కేసు షీటు  తీసి చూశాను. ఒక్క  అక్షరం  వ్రాసిలేదు. అంతా  ఖాళీగా వుంది. నిన్నా, ఈవేళా ఎండలు  ఉధృతంగా వున్నాయి; వడదెబ్బ  కావచ్చుననిపించింది.

    "వాంతు లేమైనా  అయినాయా ?"

    తల్లి కొంచెం  ముందుకు  వచ్చి  చీరెచెంగుతో  కళ్ళు తుడుచుకుంటూ  "పొద్దుటినుంచీ  ఏడెనిమిదిసార్లు  అయినాయండీ" అన్నది  నమ్రతగా.

    ఏం చెయ్యాలో  ఒక నిముషం  ఆలోచించి  "చూడండి స్టాఫ్, తలకి ఐస్ బ్యాగ్  పెట్టండి. వళ్ళంతా  తడిగుడ్డలు  చుట్టెయ్యండి. మెటాసిస్ టాబ్లెట్  వుందికదూ. నాలుగోవంతు  బిళ్ళ  పోసిచేసి  మింగించండి. పెరాల్డిహైట్_ టూ సి.సి. చేద్దాం తీసుకురండి" అన్నాను.

    స్టాఫ్  అవతలకు  వెళ్ళేసరికి  ఆ పిల్లాడితల్లి  వెక్కి వెక్కి ఏడుస్తూ, "డాక్టరుగారూ! నాకు ఒక్కగా నొక్క కొడుకు. వీడు  పుట్టిన ఆరునెల్లకే  కలరా  వచ్చి తండ్రి  చనిపోయాడు. అప్పట్నుంచి  వంటలు  చేసుకుంటూ  అష్టకష్టాలూ పడి  వీడ్ని  పెంచుకొస్తున్నాను. నా ఆశలన్నీ  వీడిమీదే  పెట్టుకుని జీవిస్తున్నాను. బ్రతుకుతాడంటారా ? చెప్పండి డాక్టరుగారూ, చెప్పండి నాకు నిజం కావాలి" అంది.

    అప్పుడు చూశానా స్త్రీవంక _ పరీక్షగా. ఇరవై, ఇరవైమూడు సంవత్సరాలకంటే  ఎక్కువ  వుండవు. మాసిన చీరెకట్టుకుని, బలహీనంగా వున్నా ముఖంలో ఓ విధమైన వర్చస్సు  కనిపించింది.
   
    "ఫర్వాలేదమ్మా! ఓ గంటలోపల  చంటిబిడ్డగుణం  తగ్గిపోయి, జ్వరతీవ్రత  కాస్త నిమ్మదిస్తే ప్రమాదం  దాటిపోయినట్లే. నీ వలా దుఃఖపడకూడదు. తగ్గిపోతుందనే  నాకు నమ్మకంగా వుంది" అన్నాను. మనసులో మాత్రం  'ఈరోజు  గడవాలి' అనుకున్నాను. నాకు చేతనైనట్లు  ఓదార్చాను.

    చేయవలసిందంతా  ఓ పావుగంటలో చేసి, ఇవతలకు  వచ్చాను. స్టాఫ్, మరో సిస్టరూ  నా వెనకాలే  వచ్చారు.
    "చూడవలసిన  కేసులు  యింకా  రెండుమూడున్నాయి  డాక్టర్. శ్యామలా ! డాక్టరుగారికి  ఆ జాండిస్  కేసూ, మెనింజైటిస్  కేసూ, న్యూమోనియా కేసూ చూపించు" అన్నది స్టాఫ్.

    "రండి డాక్టర్" అని  సిస్టర్  దారితీసింది.

    ఆమె చూపగా  ఆ కేసులు కూడా  చూశాను. అవికూడా  సీరియస్ గానే వున్నాయి. అయితే వాటికి అప్పటి  కప్పుడు చేయగలిగిందేమీలేదు. రొటీన్ ట్రీట్ మెంటు పకడ్భందీగా  జరుగుతోంది. న్యూమోనియా  కేసుకు మాత్రం, పాప ఆయాసంగా వుంది కాబట్టి ,ఆక్సిజన్  పెట్టమని  చెప్పి, చెయ్యి  కడుక్కుందామని వాష్ బేసిన్  దగ్గర కొచ్చాను.

    "ఆ పంపు రాదు. నేను నీళ్ళు  పోస్తా  నుండండి డాక్టర్!" అంటూ సిస్టర్ ముందుకు వచ్చి, నేను కార్బాలిక్ సోప్ తో  చేతులు  కడుక్కుంటూంటే, కెటిల్ తో నీళ్ళు  పోస్తోంది.

    "మీది  న్యూ బ్యాచా ?" అనడిగింది, టవల్ తో  చెయ్యి  తుడుచుకుంటూంటే.

    "అవు"నన్నాను  కొద్దిగా  నవ్వి.

    "ఎంతమంది  ప్యాసయ్యారండీ మీ బ్యాచిలో ?"

    "పాతికమంది వుంటారేమో" అంటూంటే  నాకో సందేహం తోచింది. "మీ ఫిడియాట్రిక్  వార్డు హౌస్ సర్జన్లు సాయంత్రం పూట రౌండ్సుకి రారా ? వార్డులో సీరియస్ కేసులు   కొన్ని వున్నాయి కదా" అనడిగాను.

    "ఏమోనండీ, రాలేదు. నాకూ యిక్కడ  పోస్టింగ్  నిన్న మధ్యాహ్నం నుంచే  కదా. వస్తారో రారో తెలియదు.

    యింతలో  నాలో మరో  సందేహం  ఉదయించింది. ఈ సిస్టర్ నన్ను రమ్మని మెమో పంపింది. నేను వచ్చాను, బాగానే వుంది. నేను మెడికల్  పైవార్డుకు  చెందినవాణ్ని  కదా, నా విధు లెంతవరకూ  అని. ఆ అనుమానమే బయట పెట్టాను.

    "అదా ? మీ యూనిట్ కాకపోయినా హాస్పిటల్ లో  వున్న అన్ని యూనిట్ల మెడికల్ వార్డ్స్, పిడియాట్రిక్, ఇ.ఎన్. టి, చెస్టు_యివన్నీ  మెడికల్  హౌస్ సర్జన్  డ్యూటీ క్రిందకు వస్తాయి. అలాగే అన్ని సర్జికల్ వార్డ్స్, ఆర్దోపిడిక్, ఆప్ థాల్ మాలజి _ యివన్నీ  సర్జరీ  హౌస్ సర్జన్ కిందకు వస్తాయి. గైనిక్ వార్డుకు  మళ్ళీ విడిగా  వుంటారు క్యాజుయాలిటీ లో  వేరే వుంటారు" అంది విడమర్చి చెబుతూ.

    కొంతవరకూ  అర్ధమయింది....అవసరమైతే  డ్యూటీరూమ్ కి కబురు చెయ్యమని  చెప్పి బయటకు వచ్చాను.

                                                                   *    *    *

    టెన్నిస్ కోర్టు దగ్గర  అప్పుడే  ఆట ముగించి  అసిస్టెంట్  రామదాసు కోర్టులోంచి  బయటకు వస్తూ నన్ను చూచి  దగ్గరకు రమ్మన్నట్లు  చెయ్యి ఊపాడు.

    నేనాయన్ని  సమీపించగానే  "వార్డులో  కేసులన్నీ  సవ్యంగా  వున్నాయా ? కొత్త కేసులేమైనా  ఎడ్మిట్ అయ్యాయా ?" అనడిగాడు.

    మొదట స్త్రీల వార్డులోని  పరిస్థితి  గురించి చెప్పాను. మేల్ వార్డుకి యింకా వెళ్ళలేదనీ, ఇప్పటిదాకా తీరిక  చిక్కలేదనీ  చెప్పి, పిడియాట్రిక్ వార్డులోని  కేసు విషయం  చెప్పాను. అంతవరకూ  ఆ పిల్లాడికి నావల్ల ఏమయినా  అన్యాయం జరిగిందా ,నేను  అనవసరపు  తెలివితేటలు  చూపించానా  అన్న శంక  నన్ను  వేధిస్తూనే వుంది.

    అంతా విని ఆయన "గుడ్ ! ఆ మాత్రం  సమయస్పూర్తి వుంటే చాలు. పిల్లల విషయంలో, వాళ్ళ  కిచ్చే డోసుల  విషయంలో  చాలా జాగ్రత్తగా  వుండాలి. కాసేపున్నాక  నేను కూడా పోయి  చూస్తాను. మేల్ వార్డుకి కూడా వెళ్ళి చూడండి. కొత్త కేసు ఎడ్మిట్  అయితే మాత్రం  నాకు మెమో  పంపించండి" అంటూ తన డ్యూటీ రూమ్వైపు వెళ్ళిపోయాడు.

    స్టెతస్కోప్  మెళ్ళో  వేసుకుని  నేను మెడికల్  వార్డ్సువైపు బయల్దేరాను. త్రోవలో  యిద్దరు ముగ్గురు  హౌస్ సర్జన్ లు ఎదురై  "ఓహో ! డ్యూటీనా ? ఎలా వుంది ?" అంటూ  పరామర్శించారు.

    మెడికల్  వార్డుముందువున్న వసారాలోకి  అడుగు పెట్టగానే  మెట్లెక్కి  పైకిపోయి  ఒకసారి సర్జికల్స్ వార్డ్సు  తిరిగివద్దామని  ఊహ కలిగింది. నాకు మొదటినుంచీ  మెడిసిన్ కన్న సర్జరీ  అంటే మక్కువ ఎక్కువ. గొప్ప సర్జన్ కావాలని  ఎన్ని కలలు  కంటున్నానో !

    సరిగ్గా అప్పుడు  ఆరు దాటినట్లుంది. విజిటర్సు  అందరూ  వెళ్ళి పోవాలని  సూచిస్తూ  వార్డుబాయ్  ఒకడు  చేతిలో  గంట  వాయిస్తూ వరండా  అంతా  తిరుగుతున్నాడు. వాళ్ళు కూడా క్రమ క్రమంగా  బయటకు  వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళకుండా  ఇంకా లోపలే  నడయాడేవాళ్ళు  అక్కడి నర్సులచేతా, వార్డుబాయ్ లచేతా, "మీకు  కాదూ  చెప్పేది?" అని చివాట్లు తింటున్నారు.

    సర్జికల్  నాలుగు, మూడు యూనిట్ల వార్డులు బయటనించే  తిలకించి రెండవనంబరు  యూనిట్ దగ్గరకు  వచ్చేసరికి  పాదాలకు  సంకెలలు  వేసినట్లు  ఆగిపోయాను. ఒక పేషెంటుకు, చెయ్యి  నర్సు గట్టిగా పట్టుకుని  వుండగా  యింట్రావీనస్  చెయ్యటానికిగావును  ప్రయత్నిస్తోంది  మృదుల. ముఖం ప్రక్క నుంచి  కనిపిస్తోంది.

    చప్పున  లోపలకు  వెళ్ళాను.

    అలికిడి విని ఆమె తల ప్రక్కకి త్రిప్పిచూసి, వెంటనే  విప్పారిన ముఖంతో "అరె! మధూ, నువ్వా ? ఎప్పుడు వచ్చావు ?" అంటూ చేస్తూన్న పనిని ఆపి, నిలువుగా  నిల్చుంది.

 Previous Page Next Page