Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 6

 

 

    దూరమయి పోతున్న తండ్రి తాలుకూ ఆత్మ రూపాన్ని దిగులు దిగులుగా చూచింది జ్యోతి మనో పటలం మీద ప్రత్యక్షమయిన చిన్నారి జ్యోతి.
    క్రమంగా మనోపటలం మీదినించి ఆమె రూపం కూడా అదృశ్యమయి పోయింది. అంతరిక మయిన లోకం తిరిగి వాకిళ్ళు మూసి వేస్తోంది.
    ఉలికిపడి లేచింది జ్యోతి.
    కొబ్బరి పీచుతోనూ, జూట్ ముతకబట్టతోనూ తయారయిన ఆ దిండు జారి నేల మీద పడిపోయింది. బద్దకంగా వొళ్ళు విరుచుకుంది. ఇంకా నిద్రమత్తు వొదిలిపోలేదు. కలలో కన్పించిన తండ్రి చెప్పిన మాటలు తిరిగి వినిపిస్తున్నట్లే అనిపించాయి.
    తండ్రి చనిపోయాక అతని గురించి చాలాసార్లు ఆలోచించిందామె" గంటల పర్యంతం అతని గురించే దిగులుపడిన సందర్భాలు ఉన్నాయి." కాని ఇంతకు మునుపు ఎన్నడూ అతడు కలలో కన్పించలేదు.
    ఈ విధంగా చెప్పింది లేదు.
    ఆ చెప్పిన సంగతులు తిరిగి జ్ఞాపకం రాగానే శరీరాన్ని పట్టిన నిద్రమత్తు పూర్తిగా ఒదిలిపోయింది. రమణ ఆదమరచి ఉన్నాడు. ఒక కాలూ, చెయ్యి బల్ల మీది నించి క్రిందికి జారి వ్రేలాడుతున్నాయి.
    లేచి వెళ్ళి రమణను సరిగా పడుకో బెట్టింది జ్యోతి. పనివాడయినా అతడే ఆమెకు ఆత్మీయుడు. అనాధగా ఎవరూ లేని ఇద్దరు లాంచి ప్రయాణంలో ఒకటి అయినారు.
    అలల తాకిడి అధికమయింది. ఏటి మీద గాలి విసురు ఎక్కువగా ఉంది కాబోలు, లాంచి ఉయ్యాలలా ఊగుతోంది.
    ఓ కిటికీ తలుపుగా వున్న అద్దాన్ని తొలగించింది జ్యోతి. చల్లని గాలి విసురులోనికి చొచ్చుకు వచ్చింది. ఆమె ముఖం మీద మంచు ముద్దలు పెర్చినట్లుగా అయింది. లాంచి లోపలి వెచ్చదనం మటుమాయమయింది.  చల్లని గాలితో నిండిపోయింది. చలిగా అన్పించింది కాబోలు రమణ మరింతగా ముణగదీసుకుని పడుకున్నాడు.
    తిరిగి వచ్చి బల్లపై కూర్చుంది. ఎదురుగా తలుపుల మీద సర్పాకృతులు కన్పిస్తున్నాయి. ఆమె ఆలోచిస్తున్నది.
    వాటి వెనుక అద్భుతమయిన రహస్యాలు దాగున్నాయి. మూడు వేల సంవత్సరాల అద్భుత రహస్యాలు. ఆ తామ్రపత్రాల మీద ఏమి వ్రాసి వున్నదో ! ఏ బాషలో వ్రాసి వున్నదో!
    దానిని చదవాలన్న వుబాలటంతో రెండు తరాలు గడిచినాయి. చదవలేని అశక్తత వల్ల తండ్రి వాటి గురించి పట్టించుకోవటం మానివేశాడు.
    అలా చేయటం అతనికే తృప్తిని ఇచ్చి ఉండదు. అందుకే ఆత్మ రూపంలో తిరిగి వచ్చాడు. తనకు దాని గురింఛి చెప్పాడు.
    అసలు ఈ సృష్టిలో ఆత్మలు అనేవి ఉన్నాయా!
    ఏమో ప్రకృతి అనంతమయినది. అర్ధం కానిది. లేదనుకోవటం అజ్ఞానమే అవుతుంది. అగదమయిన ప్రకృతి రహస్యాలలో ఒకటి సాధ్యమూ, మరొకటి అసాధ్యమూ అనే సమస్య లేనేలేదు. ఇది కేవలం కల కూడా అయి వుండవచ్చు.
    అది నిజమయితే సర్పాకృతులు తలుపుల వెనుక తామ్రపత్రాలు ఉండవు. ఆ తలుపులు తెరచి చూస్తె అసలు విషయం తెలుస్తుంది. కాని తగిన సమయం వచ్చిందాకా ఆ తలుపులు తెరవకూడదని చెప్పాడు తండ్రి -- అలా ఎందుకు చెప్పాడో ! ఆలోచిస్తూ ఉండగానే ఆమెకు తిరిగి శ్రద్దాదేవి జ్ఞాపకం వచ్చింది. సౌజన్యమూర్తి అయన ఆమె రూపం, కనుల ముందు కదలాడింది. వాత్సల్యం నిండిన ఆమె మాటలు, ప్రేమ కలశాల్లో అర్ధ్రతా పూర్వకమయిన ఆమె చూపులూ ఎట్టఎదుట ప్రత్యక్షమయినట్లు అన్పించినాయి.
    ఆమె విద్యాధికురాలు. ఒకవేళ తామ్రపత్రాలను చదువవలసిన అవసరం వస్తే ఆమె సాయం అర్ధించవచ్చు.
    విద్యాధికురాలయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి భవిష్యత్తులో తనకు మార్గనిర్దేశకురాలు కాగలదని ఆమెకు అనిపించసాగింది.
    అనేక సంశయాలతో నిండిన ఆలోచనల మధ్య కూరుకుపోయి ఎలాగో ఆ రాత్రిని తెల్లవార్చుకుంది జ్యోతి.
    అద్దాల కిటికీల నించి ఒకవంక బారేజ్ కన్పిస్తోంది. మరోవంక దూర దూరాల నించి సాగివచ్చె కృష్ణా సలిల ధారలు కన్పిస్తున్నాయి. నీలి నీలి తరంగాలు ఎగసి ఎగసి పడుతున్నాయి.
    ఉవ్వెత్తున లేచి వచ్చి లాంచి అంచుల్ని తాకే అలల విరిగిపడుతున్నాయి. అవి లాంచిని తాకుతున్నప్పుడు జలతరంగిణులు విన్పిస్తున్నాయి.
    రవిచంద్రుల దివారాత్రాల దోబూచులాటలో రాత్రి ప్రొద్దు ఆసాంతమయిపోయింది. బ్రాహ్మ ముహూర్తాన్ని సమయించిన ప్రాతసంధ్య పరవశింప చేస్తోంది.
    తూర్పు ఆకాశంలో భాసూదయమౌతోంది. సంతలు చెప్పుకోవడానికి చాత్రుల కోసం అలికి ముగ్గులు పెట్టిన ఎర్రమట్టి అరుగులా అయింది తూర్పు దిక్కు. ప్రాతఃకాల సమీరాలు వచ్చి వచ్చి జ్యోతి చెంపల్ని తాకి గిలిగింతలు పెట్టినాయి.
    ఇంక ఒక్క క్షణమయినా లాంచి లోపల కూర్చోలేక పోయిందామె. లేచి వచ్చి నిచ్చెన మీదుగా ఎక్కి వచ్చింది. డెక్ మీద ఇనుప చట్రంలో బిగించిన కర్ర కుర్చీ మీద జారగిలబడి కూర్చుంది.
    విసురు గాలికి ఎద సయ్యేద రెపరెపలాడుతోంది. దీర్ఘతరాలయిన ఊర్పుల వల్ల వక్షస్సు ఎగసి ఎగసి పడుతోంది.
    ఒంటరితనం మనిషికి విశ్రాంతి నిస్తుంది. మనసుకి మాత్రం కాదు.
    ఎవరో పిలిచినట్లుగా అయి తలతిప్పి చూచింది జ్యోతి. నాస్తా కొట్టేందుకు వెళ్ళిపోతూ రమణ పిలిచాడేమో అనుకుంది. నాస్తాకు వెళ్ళే ముందు తనకు చెప్పి కావలసిన చిల్లర డబ్బులు అడిగి తీసుకుపోవటం అతని కలవాటు. ప్రయాణీకుల దగ్గర వసూలు చేసిన కొద్ది కొద్ది మొత్తాల్లో మిగిలిన డబ్బు దాచే తోలుసంచీ ఎప్పుడు ఆమె దగ్గరే వుంటుంది.
    బి.ఎ . ఫస్టియర్ చదువు ఆపేసిన ఆమెకు పర్స్ వాడటం రాదని కాదు. అయినా పడవ నడిపేవారి పద్దతి ప్రకారం ఆమె తండ్రినించి వారసత్యపు ఆస్థిగా వచ్చిన తోలుసంచినే వాడుతోంది.
    ఇప్పుడు ఆ సంచి బయటకు తీసింది. చిల్లర కోసం వెతుకుతుంటే శ్రద్దాదేవి యిచ్చిన  విజిటింగ్ కార్డ్ చేతికి తగిలింది. దాన్ని బాగా లోపలకు తోసేసి చిల్లర బయటకు తీసి సంచిని తిరిగి తన దగ్గరే భద్రం చేసుకుంది.
    ఇంతా చేసి చూస్తె అక్కడ రమణ లేడు. రేవులో చివరిమెట్టు మీద ఒక వ్యక్తీ నిలబడి వున్నాడు. అతడి వాలకం చూస్తే అంతగా చదువు సంధ్యలు ఒంటబట్టిన వాడిలా లేడు. కాని వేషధారణ చూస్తె గొప్ప యింట పుట్టిన వారిని అనుకరించే ధోరణి కన్పిస్తోంది.
    అంతసేపు అయాక ఆమె తన వంక తిరిగి చూడటం అతనికి రవంత చికాకు అనిపించింది. మరొకమారు చేతులు చరచి ఆమె కోసం పిలిచాడు.
    "ఏమిటి?" అన్నట్లు తల ఊగించింది జ్యోతి.
    "క్రిందికి దిగిరా!" అన్నట్లు సైగ చేశాడతను. ప్రయాణీకులలో పలురకాల వారుంటారు. వెంటనే ఆమె తన నిత్యకృత్యాలలో మునిగి పోయేందుకు దిగివచ్చింది. పైనించి ఘాట్ లో చివరి మెట్టు మీదికి దిగేందుకు అమర్చిన నిచ్చెన మీదినించి మెట్టు పైకి దిగింది.
    ఆమె అలా దిగి వస్తూ వుంటే రెప్ప వేయక చూశాడు అప్పుడే వచ్చిన యువకుడు. ఆమె అతని దగ్గరగా వచ్చింది.
    "నీతో మాట్లాడాలి" అన్నాడతను.
    "బోటులో కూర్చుందుకు వచ్చావు కాబోలు ఇంకా మాటలెందుకు రవంత సేపు కుదురుగా కూర్చో రేపు దాటించేస్తాను" అన్నది జ్యోతి . ఆ నావగతుడు విస్పారితమయిన నేత్రాలతో ఆమె వంక చూశాడు.

 Previous Page Next Page