ఆ రోజు తల్లి అంతగా ఎందుకేడుస్తోందో అర్థం కాలేదు తనకు....
"మీ నాన్నగారు ఏ ఊళ్ళో ప్రాక్టీస్ చేస్తున్నారు?" మళ్ళీ అడిగాడు వెంకట్రావు జ్యోత్స్నను పరీక్షగా చూస్తూ.
అతని ధోరణి చూస్తోంటే జ్యోత్స్నను తను ఎక్కడ చూశాడో తేల్చుకుని తీరవలసిందేనన్నట్లుగా ఉంది.
"మా నాన్నగారు లేరు. చచ్చిపోయారు."
"అయ్యో: పాపం: మీ అమ్మగారెక్కడ ఉన్నారు?"
"మా నాన్నగారు పోయిన కొద్దిరోజుల్లోనే, మా అమ్మ కూడా పోయింది బెంగతో...."
తండ్రి వెళ్ళిపోయిన తరువాత తన తల్లి బెంగ పెట్టుకున్న మాట నిజమే: కానీ, తండ్రి కోసం కాదు - ఎలా గడుస్తుందా, అని.
కానీ, అదృష్టం బాగుంది - ఆ రోజుల్లో మెట్రిక్ కూడా పాసవకుండానే టీచర్ ఉద్యోగం దొరికేది. తన తల్లికి అక్కడి ప్రైమరీ స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికింది.
రోజులు గడుస్తున్నాయి. తన తల్లి తన చదువు విషయంలో చాలా శ్రద్ధ వహించేది. "నువ్వు బాగా చదువుకుని పైకి రావాలమ్మా:" అనేది.
ఆ రోజుల్లోనే ఆ బుంగ మీసాలాయన తమ ఇంటికి వచ్చేవాడు....
ఒకరోజు తల్లి తనను దగ్గిర కూచోబెట్టుకుని సంకోచిస్తూ అడిగింది. "చౌదరిగారు నన్ను పెళ్ళి చేసుకుంటానంటున్నారు - చేసుకోనా?" అని.
తను తెల్లబోయింది. అప్పటికి తనకు పన్నెండేళ్లు వచ్చాయి. పెళ్ళంటే ఏమిటో తెలుసు - అలాగని అంటే అర్థం చేసుకోగలిగేటంత వయసూ లేదు. ఒక్క విషయం మాత్రం అంత లేత వయసులోనూ అర్థం చేసుకోగలిగింది. తన తల్లి ముఖంలో ఇటీవల చిరునవ్వు కనిపిస్తోంది. అలాంటి చిరునవ్వు తనకు జ్ఞానం వచ్చాక ఎన్నడూ చూడలేదు....
ఆ చిరునవ్వు తల్లి ముఖంలో అలాగే చూడాలనిపించింది. అయినా సందేహంతో "చౌదరిగారికి పెళ్ళయింది కదూ: పిల్లలు కూడా ఉన్నారు" అంది.
తల్లి మరింత సంకోచంతో "అవును - కానీ ఆవిడ రోగిష్టిది మంచం మీద నుంచి లేవలేదు. అందుకే నన్ను పెళ్ళి చేసుకుంటానంటున్నారు" అంది.
తన మనసులో ఏవేవో అపశ్రుతులు పలుకుతున్నా తల్లి కళ్ళలో ఎన్నడూ చూడని జీవకళ చూసి "నీకు బాగుంటుందని తోస్తే పెళ్ళి చేసుకో:" అంది.
పరిస్థితులు చిన్నతనంలోనే మనుష్యులను పెద్దవాళ్ళను చేస్తాయి. అందుకే తన అంత ఆరిందాలా మాట్లాడగలిగింది.
తమ ఇంట్లోనే దేవుడి ముందు ఏదో జరిగింది. అదే పెళ్ళి అంది అమ్మ. తను ఏదీ పట్టించుకోలేదు. రెండు సంవత్సరాలు హాయిగా గడిచాయి. తల్లి ముఖంలో ఒక కొత్త వెలుగూ, ఉత్సాహమూ చూసి చాలా సంతృప్తిపడింది తను.
కానీ, ఒక రోజున తను స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి తల్లి మూర్తీభవించిన శోకదేవతలాగ కూర్చుని ఉంది.
"చౌదరిగారు పెళ్ళి చేసుకుంటున్నారు" అంది తనతో.
తను ఆశ్చర్యంగా "నిన్ను పెళ్ళి చేసుకున్నారుగా?" అంది.
"ఆ పెళ్ళికి విలువ ఏముంది?" అంది తల్లి.
"పెళ్ళికి విలువ లేకపోవటం అంటే ఏమిటో అప్పుడు తనకు అర్థం కాలేదు. అంత విలువ లేని పెళ్ళి చేసుకోవటం ఎందుకో అసలు అర్థం కాలేదు.
వచ్చీరాని మిడి మిడి జ్ఞానంతో "ఆయన నిన్ను ప్రేమించారుగా?" అంది.
"ప్రేమించారు - భార్య మంచంలో ఉండి మరొక పెళ్ళికి ఆస్కారం లేనంతవరకూ ప్రేమించారు. ఇప్పుడు భార్య చచ్చిపోయింది. హాయిగా మరో కన్నెపిల్లను పెళ్ళి చేసుకోవచ్చు - నా ప్రేమతో అవసరమేముందీ?"
ఆ వయసులో తల్లి మాటలూ, ప్రేమ, అవసరమూ, ఇవేమీ తనకు అర్థం కాలేదు. తల్లిని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాక, బాధపడుతున్న తల్లి ముఖంలోకి జాలిగా చూస్తూ ఉండిపోయింది.
తరువాత కొద్ది రోజులకే చౌదరిగారింట్లో పెళ్ళి వాయిద్యాలు మ్రోగాయి. తన తల్లి శవం చెరువులో తేలింది. అప్పటికి తన వయసు పదిహేను - మెట్రిక్ పాసయింది....
"అయితే మీకెవరూ లేరన్నమాట?" అడిగాడు వెంకట్రావు ఆలోచనగా.
"లేరు."
"మీరు ఇక్కడ కాక మరెక్కడైనా ఉద్యోగం చేశారా?"
"రెండు మూడు చోట్ల చేశాను."
"నన్నెక్కడన్నా చూశారా?"
"ఏమో: ఎవరెవరినో చూస్తుంటాను. నాకెవరూ గుర్తుండరు...."
"నాకు మాత్రం మనుష్యులు బాగా గుర్తుంటారు. కొన్నాళ్ళాగండి. తప్పకుండా మిమ్మల్ని ఎక్కడ చూశానో చెప్పగలను."
జ్యోత్స్న పెదవులు కొద్దిగా అదిరాయి. తనను తాను అదుపులో పెట్టుకుని స్తిమితంగా స్వీట్ తినడం మొదలుపెట్టింది.
3
వాళ్ళ వాటాలోంచి జ్యోత్స్న మృదుస్వరంతో "సుశీలగారూ: కొంచెంసేపు మీ నల్లా ఆపుచెయ్యరూ? నాకు నీళ్లు రావటం లేదు. స్నానం చెయ్యాలి." అంది.