'నల్లనివాడు - అరుణ నయనమ్ములవాడు
కృపారసం బెరుగని వాడు
బాలుర్ జూసిన భీతి గొలుపు వాడు
అతగాడే మన అహమదుల్లా ఖానుడు!'..... అని!
అది విని సెక్షన్ లో అందరూ గొల్లున నవ్వారు. పాపం.... సాహెబుగారికి తెలుగు తెలీదు కనుక, రేగిపళ్ల కథ చందాన అక్కడ్నించే తానూ నవ్వేశాడు.
అవి... ల్యూనా మోపెడ్ లు కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన రోజులు. మా సెక్షన్ లో ఒకతను లూనా కొనుక్కున్నాడు. ఓరోజు అతను పదకొండైనా ఆఫీసుకి రాలేదు.
నేను "మన ల్యూనటిక్ (పిచ్చివాడు) ఇంకా రాలేదేమిటి?" అని మావాళ్లతో అన్నాను.
వాళ్లు "ఈ ల్యూనటిక్ ఎవరా.... "అని వితర్కించుకుంటున్నట్లు ముఖాలు పెట్టారు.
అది చూసి, "ల్యూనా గలవాడు ల్యూనటిక్!" అన్నాను. అప్పుడు వాళ్లకి అర్దమై గొల్లున నవ్వారు. ఇంతలో.... ఆ 'ల్యూనటిక్ ప్రకాష్' అన్న పేరు స్థిరపడిపోయింది. అతనూ ఏమీ అనుకునేవాడు కాదు. నవ్వుకునేవాడు. (ఏడవలేక నవ్వేవాడనుకోను.)
తెలుగు అజంత భాష. ఈ కారణంగా మాటలను కలపడం లేదా విరవడం సులభమై, మాటలతో కొత్త కొత్త అర్దాలు తీస్తూ ఆడుకోవచ్చు. ఫలితంగా కావలసినంత హాస్యాన్ని దండుకోవచ్చు. .. పిండుకోవచ్చు. ఈ సౌలభ్యం మరే భాషకూ లేదు.
ఇంక.... నా ప్రస్థానం బందరు నుంచి భాగ్యనగరానికి మారాక, అనేకమంది రచయితలు, సాహిత్య, సాంస్కృతిక సంస్థలతో పరిచయాలు ముదిరాక - హాస్యం పరవళ్లు తొక్కసాగింది.
ఒకసారి వై. యం. సి. ఏ. లో విశ్వసాహితీ వారు ఏదో కార్యక్రమం పెట్టారు. దానికి ఆవుల సాంబశివరావుగారు ముఖ్య అతిథి. ముందు ఆవుల సాంబశివరావుగారు నడుస్తున్నారు. వెనకాల పోతుకూచి సాంబశివరావుగారు నడుస్తున్నారు.
నా మిత్రుడు ఒకాయన ఆ వెళ్తున్నవారు ఎవరని అడిగాడు.
"ముందు ఆవులు వెళ్తుంటే వెనక పోతు వెళ్తోంది" అన్నాను కామ్ గా.
మా వరుసలో వున్నవారు ఫక్కున నవ్వారు.
మరోసారి ఏదే ఆవుల వారు ముందు వెళ్తుంటే. ... ఆయన వెనుక మరికొందరు వెళ్తున్నారు. వారిని గురించి నా ప్రక్క ఆయన అడిగారు.
"ముందు వెళ్తున్నది ఆవులు....., వెనకాల వెళ్తున్నవారు మేధావలు!"అన్నాను. ట మా వరుసలోనివారు ఫక్కున నవ్వారని వేరే చెప్పనక్కరలేదు.
రచయిత కప్పగంతుల మల్లిఖార్జునరావు గారు కొంతకాలం ఆంధ్రభూమి వీక్లీకి "కల్చరల్ కపస్పాండెంట్'గా పనిచేశారు. అందుకోసం ఆయన స్థానికంగా రోజూజరిగే కార్యక్రమాలలో కొంతసేపు అటెండెన్స్ వేసుకునేవారు. ఒకసారి రవీంధ్రభారతి మినీహాల్ లో ఏదో కార్యక్రమానికి ఆయన వచ్చారు. ఒక పది నిమిషాలు కూర్చొని లేచి వెళ్లిపోయారు.
అది చూసి నా మిత్రుడు ఒకాయన - "ఏమిటి.. .ఈ కప్పగంతుల మల్లికార్జునరావుగారు ఏ మీటింగ్ లోనూ పట్టుమని పదినిమిషాలు కూడా వుండరు" అని అడిగారు.
నేను కామ్ గా -"మరి - ఆయన ఇంటిపేరు సార్దకం చేసుకోవద్దా?" అన్నాను.
మా వరుసలోని వాళ్ళంతా ఫక్కున నవ్వారు.
హైదరాబాద్ కి వచ్చార నాకు పరిచయం అయి, స్వల్పకాలంలోనే అత్యంత ఆప్తమిత్రుడిగా మారినవారు కె. యస్. కె. వెంకటేశ్వర్లు. మాటల్లో, రచనల్లో అంత చక్కని హాస్యాన్ని వడ్డించగలవారు అతి అరుదు. ఆయనతో మాట్లాడినా, ఆయన రచనలు చదివినా నవ్వీనవ్వీ కళ్లంబట నీళ్లు కార్చవలసిందే. ఆయన రాసిన 'శాలువోపాఖ్యానం' , 'నిర్వచనోత్తర ప్రేమాయణం' వంటి అధ్బుతమైన హాస్య వచనకవితలు వేరెవరూ రాయలేదు. శాలువోపాఖ్యానంలో ఆయన ఇచ్చిన కొన్ని నిర్వచనాలు చూడండి -
'నల్లగా వుండునది నల్లి ; పిల్లల్ని పెట్టునది పిల్లి; బల్లపై పాకునది బల్లి!;
దర్జాగా వుండువాడు దర్జీ!;
అభివృద్ది నిరోధకులు - నిరోధ్ ధరించువారు!;
బుస్సుమనునది బస్సు;
పిల్లలపైనుంచి వచ్చే గాలి పిల్లగాలి!'...ఇలా ఎన్నో.
'మిల్క్ బూత్' లకు ఆయన చేసిన తెలుగుసేత...... 'పాలిండ్లు.'
1970 ల్లో ఆయన 'హారతి' అన్న మాసపత్రిక పెట్టి ఆద్యంతం హాస్య రచనలను అందించేవాడు. మొదటి సంచికను వెలువరించి మొదటి కాపీ నాకు ఇయ్యగానే నేనడిగాను -
" ఇదేమిటి? పత్రికకు ఈ పేరు పెట్టావు?" అని.
"ఏం ... పేరు బాగా లేదా?" అన్నాడు.
"బాగానే వుంది. అయితే ఆ పేరుతోనే చిక్కు!" అంటూ ఆ పేరు చరిత్ర చెప్పాను.
"1940 లలో మద్రాసు నుంచి వుండవల్లి నళినీకుమార్ 'హారతి' అన్నపత్రిక నడిపారు. అది త్వరలోనే ఆరిపోయింది. ఆ తర్వాత 1950 లలో సినీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుగారు, ఈశ్వరరావు అన్న షావుకారుగారితో కలిసి బందరు నుంచి 'హారతి' పత్రికనడిపారు. ముచ్చటగా మూడు సంచికలైనా రాకముందే ఆ 'హారతి' ఆరిపోయింది." అని చెప్పాను.
"ఈ హారతి ఆరదులే! దీనికి కావలసిన తైలం బాగానే వుంది" అన్నాడు.
కాని, నాలుగో సంచిక వెలువడకుండానే ఆయనే హరించుకుపోయాడు. ఆయనతోపాటు ఆ హారతీ ఆరిపోయింది. 35 ఏళ్ళ పిన్నవయసులో అకాలమరణం చెందాడు. అది నిజంగా తెలుగు హాస్యప్రియుల దురదృష్టం.
1980 దశకంలో యండమూరి వీరేంధ్రనాథ్ 'హారిక' అన్న వారపత్రిక పెట్టారు. అదీ స్వల్పకాలంలోనే 'హరీ......' అంది. మరి, 'హరి'యను రెండక్షరములు హరియించును పాతకముల నెల్ల - కు బదులుగా పత్రికలను హరిస్తాయేమో!
ఒకసారి మద్రాసులో ఒక కార్యక్రమానికి వెళ్లాను.
వేదిక మీద మద్రాసు మేయరు, ప్రక్కన ఇంకొకరు వున్నారు. ఒకరు అరవంలో అరుస్తూ, కథాకళి లెవెల్లో ఉపన్యాసం ఇస్తున్నారు.
నా ప్రక్కన కూర్చున్న మద్రాసు ('చెన్నై' అని అనాలనిపించదు నాకు. చెన్నై అనగానే 'ఎన్నై...' అనిపిస్తుంది.) మిత్రుడు వేదిక మీదున్న ఒకాయన్ని చూపిస్తూ -