Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 5

 
    ఆమె కళ్ళలో ఆశ, ఆరాధన అతను కనిపెట్టకపోలేదు. మొహం ప్రక్కకి త్రిప్పుకుని కారుని ముందుకు పోనిచ్చాడు.
    
                                         3


    శకుంతల కాకినాడకు చేరటం చేరటం బావగారింట్లోనే వుండిపోయింది.


    ఆ కాళరాత్రి జరిగిన భయంకరమైన సంఘటనల గురించి ఎవరికీ చెప్పటానికి సాహసించలేకపోతోంది. తలుచుకుంటూనే వొళ్ళు గగుర్పొడుస్తోంది. అదో పీడకలలా మరిచి పోయేందుకు ప్రయత్నిస్తోంది.


    అసలు మొదటి నాలుగయిదు రోజులూ షాక్ లో, తనవాళ్లు తనకు తెలీని స్థితిలోవుంది. రోజుకు నాలుగయిదు సార్లుదాకా ఫిట్స్ కూడా వచ్చేవి.


    దహన సంస్కారం అన్నీ అయాక ఆమె బావగారు నరహరి డాక్టర్ని తీసుకొచ్చి చూపించాడు.


    మందులూ, ఇంజక్షన్లూ అవీ వాడాక ఆమెకు ఫిట్స్ తగ్గిపోయాయిగానీ- ఆరోగ్యం మాత్రం ఏమీ కుదుటపడలేదు.


    తోడుకోడులు ప్రమీల మూడో రోజునుంచీ రుసరుసలు మొదలుపెట్టింది.


    "నాకు వొంట్లో బావుండకపోతే ఎప్పుడూ డాక్టర్ని యింటికి పిల్చుకు వచ్చిన పాపాన పోలేదే. ఏమిటీ మరదలు మీద అంత ప్రేమ గుమ్మరిస్తున్నారు. ఎర్రగా బుర్రగా వున్నదనా?"


    " ఛా! ఊరుకోవే. వింటే బాధపడుతుంది. సాక్షాత్తూ తమ్ముడి భార్య గురించి నువ్వలా అవటం బాగాలేదు." అన్నాడు నరహరి మందలింపుగా.


    "తమ్ముడి భార్య అయితే వరసకడ్డం వచ్చిందేమిటి? ఆవిడగారు యిదివరకు మనింటికి వచ్చినప్పుడల్లా మీరిద్దరూ కళ్లతో కలిపి చూసుకోవటం, మీ ముసి ముసినవ్వులూ,  నేను గమనించలేదనుకున్నారా?"


    "ఛా! నోరు మూసుకో"


    శకుంతల ఏమి చెయ్యాలో తెలీని నిస్సహాయస్థితిలో పడింది. తన తండ్రి అసమర్దుడు. తల్లి అనారోగ్యం మనిషి.  తాను ఇంటికి పెద్ద కూతురు! తానుగాక యింకా ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక్కడే తమ్ముడూ. వాడికి ఇంటి బాధ్యత లేమి పట్టనట్టు నిర్లక్ష్యంగా తిరుగుతూ వుంటాడు. వేళకొచ్చి కంచం ముందు కూర్చుని అన్నంలో అదిలేదనీ, యిదిలేదనీ ఇంత ఎత్తను ఎగిరి నానా రభసా చేసి ఇంట్లోంచి వెళ్లిపోతూ వుంటాడు.


    చెల్లెళ్లు... .ఒకరి తర్వాత ఒకరుగా పెళ్లికి ఎదిగివున్నారు.


    భర్త పోయినప్పుడూ తల్లీ తండ్రి వచ్చారు. కూతుర్ని ఎక్కడ వుంచాలో, ఏం చెయ్యాలో తెలీటంలేదు.

 
    రెండు రోజులుండి "పెద్దకర్మకు మళ్లీ వస్తానమ్మా. అప్పుడు ఆలోచిద్దాం" అంటూ వెళ్లిపోయారు.


    పెద్దకర్మ అప్పుడు కూడా అంత తేలిగ్గా పరిష్కారం లభించలేదు.


    నరహరితో మాట్లాడాడు.

 
    "కొన్నాళ్లిక్కడ వుంటేనే బావుంటుందేమో  మావాడి ఉద్యోగంలో రావల్సిన రాయితీలు, ఎల్. ఐ. సి. పాలసీ పాతిక వేలకున్నట్లుంది- యివన్నీ  చూసి ఓ ఏర్పాటు చెయ్యటానికి వీలుంటుంది. అక్కడవుంటే మీ ఒక్కరివల్ల ఏమీకాదు" అన్నాడు. అతనా మాటలు అంటూన్నప్పుడు పెళ్లామంటే  భయం లేకపోలేదు. కాని బాధ్యతను గుర్తుతెచ్చుకుంటూ అన్నాడు.

 
    పదిహేను రోజులు గడిచేసరికి శకుంతల షాక్ నుంచి కొంచెం కోలుకుంటోంది.

 
    ఆమె చేతిలో పైసాలేదు. ఏలూరునుంచి వచ్చేటప్పుడు పర్సులో రెండు మూడువేల రూపాయలదాకా పెట్టుకున్నారు. ఆ భయానకమైన గంద్రగోళంలో పర్సు ఏమయిందో తెలీదు. తెలివొచ్చాక ఎంత వెతికినా కనబడలేదు.

 
    బావగారితో డబ్బు విషయం ప్రస్తావిద్దామనుకుంది. కాని ఆయన అపార్దం చేసుకుంటాడేమో. తోడికోడలు వింటే "మా యింట్లో వున్నది కాకుండా లేనిపోని దొంగతనాలు అంటగడతావా?" అంటూ విరుచుకుపడుతుందేమో అని  నోరు మూసుకుని వూరుకుంది.


    కాని పిల్లలతో బాధపడలేకుండా వున్నది. వాళ్లు చిరుతిళ్ళు కొనుక్కోవటానికి రోజూ, రూపాయో రెండో యివ్వటం అలవాటు.


    పదవ్వగానే "అమ్మా! ఆకలేస్తోంది. ఏమన్నా పెట్టవే" అని పీడించేవారు.


    డబ్బులేదు.


    తోడికోడలు పన్నెండయేదాకా పూజలూ, పునస్కారాలూ పూర్తిచేసి కాని - భోజనాల ప్రసక్తి పట్టించుకొనేది కాదు. తన ఉపవాసాలూ, భక్తీ ఇవేగానీ, ప్రక్కవాళ్ల ఆకలి గురించి అర్దం చేసుకునే గుణం ఆవిడలో లేదు.


    భర్త ఆఫీసుకి రెండు మూడుసార్లు వెళ్లి వచ్చింది. వాళ్లు ఏవేవో లెక్కలువేసి ఎప్పటికప్పుడు వ్యవధి పొడిగిస్తూ ఆ సంతకం కావాలి, యీ సంతకం కావాలి అంటూ కాలయాపన చేస్తున్నారు.


    "నాకు  జరగటం చాలా కష్టంగా వుంది. నా భర్త చేసిన ఉద్యోగం నాకివ్వండి" అని శకుంతల వేడుకొన్నది.

 
    "చాలా కష్టవమ్మా, నీ ఎడ్యుకేషన్, నాలెడ్జి సరిపోదు" అన్నాడు ప్రొప్రయిటరు.


    "పోనీ ఏదో ఒక ఉద్యోగం- క్లర్కులాంటిదన్నా యివ్వండి. పిల్లలు తిండిలేక మాడిపోతున్నారు" అని శకుంతల ప్రాధేయపడింది.


    ప్రొప్రయిటరు కొంచెం ఆలోచించి "సాయంత్రం ఒకసారి యింటికిరా. మాట్లాడదాం" అని ఎడ్రెస్ ఇచ్చాడు.

 
    ఆ సాయంత్రం యించుమించు రెండు మైళ్లదూరం నడిచి, అతని ఎడ్రెస్ వెతుక్కుంటూ వెళ్లింది.

 
    ప్రొప్రయిటర్ కొత్తగా అద్దెకు తీసుకున్న బిల్డింగ్ లో హాల్లో కూచుని వున్నాడు. అతనిముందు టీపాయ్ మీద విస్కీసీసా,  సోడాలు, గ్లాసులు సరంజామా అంతా వున్నది. అప్పటికే  రెండు మూడు పెగ్గులూ పూర్తిచేసినట్లున్నాడు.


    అక్కడి వాతావరణం చూసి శకుంతల వులికిపడినట్లయి ఒకఅడుగు వెనక్కి వేసి వుండిపోయింది.

 
    "ఫర్వాలేదు. లోపలకు రా "అన్నాడు ప్రొప్రయిటరు - యిలాంటివన్నీ మామూలే అన్నట్లు.


    శకుంతల సంకోచంతో లోపల కడుగుపెట్టింది.


    ఇంట్లో అతనొక్కడే వున్నట్లు అర్దమౌతోంది.


    "కూచో" అన్నాడు.


    "వొద్దులెండి"


    "సరే" అన్నాడు. అతనికి నలభై అయిదేళ్లు దాటి వుంటాయి. చెంపల దగ్గర జుట్టు నెరిసింది. బలంగా, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు.


    "ఉద్యోగం కావాలన్నావుకదా" అన్నాడు గ్లాసు చేతిలో పట్టుకుని కొంచెం త్రాగి.


    శకుంతలకి ముళ్లమీద వున్నట్లుగా వుంది. అవునన్నట్లు తలవూపి మౌనంగా నిలబడింది.

 Previous Page Next Page