"శ్రీనివాసుడిపేరు పెట్టాలనుకున్నారు సరే! అది మగపిల్లవాడైనప్పటి మాట."
"అమ్మాయి పుడితే కూడ ఆ మాట మీద నిలబడాలా?"
ఈ మాటలు విన్న కృష్ణయార్యుడికి మళ్ళీ మనుషుల బేరాలు, వ్యాపార బుద్ధి గుర్తొచ్చాయి.
"ఆపేరు ఆడపిల్లకి బాగుండద్దూ..."
ఈ మాటలన్నీ తనకి సంబంధించిన విషయాలు కావన్నట్టువినీ, విననట్టున్నారు తండ్రీకొడుకులు.
తాము వేంకటేశ్వరుని దర్శించుకున్నాక పుట్టిన బిడ్డ కనక ఆ స్వామిపేరే పెట్టదలుచుకున్నారు.
"వెంకమాంబ" అని బియ్యంలో పేరు రాశాడు కృష్ణయార్యుడు, తండ్రిమాట మీద.
"వెంకమ్మ అని ఉంటుంది కదా పేరు మధ్యలో ఈ 'మా' ఏమిటి?" సోమయాజిముఖం చిట్లించి అడిగాడు.
"మా అంటే లక్ష్మి. వెంకన్న, పద్మావతి ఇద్దరిపేర్లూ కలిసి రావాలని వెంకమ్మ కాకుండా 'వెంకమాంబ' అని పేరు పెట్టాంలే" కృష్ణయ్య తండ్రి సమాధానం చెప్పాడు.
"ఏమిటో మీ వన్నీ వితండవాదాలు. వింత చేష్టలూ" సోమయాజి మొహం ముటముటలాడింది.
తండ్రీ కొడుకులు నవ్వుకున్నారు. మాట్లాడలేదు.
* * *
మంగమాంబలో గర్భవతిగా ఉన్నప్పుడు కనిపించిన విపరీత ప్రవృత్తి బిడ్డ బొడ్డుకోయగానే తగ్గటం మొదలయ్యింది. అయితే అప్పుడు నేర్చిన పాటలు మాత్రం వదలలేదు. చిన్నారి వెంకమాంబకి మేలుకుని ఉన్నంతసేపూ పాటలను వినిపిస్తూనే ఉండాలి. పాటలు వినపడుతుంటేచాలు నిద్రాహారాలక్కరలేదు. పాలు అడగదు. ఏడవదు, పేచీ పెట్టదు. అల్లరి చెయ్యదు. ఇంట్లో పసిబిడ్డ ఉన్నట్టే చుట్టుపక్కలవారికి తెలియదు. ఏడుస్తే కదా పసిబిడ్డ ఉన్నట్టు తెలిసేది!
ఆరోజు మంగమాంబ బిడ్డ నిద్రపోతోందని మామగారిని ఊయల దగ్గర కాపుంచి పనిచేసుకోటానికి వెళ్ళింది. నెలల గుడ్డు, వెంకమ్మలేచి ఏడవటం మొదలు పెట్టింది. అటూఇటూ చూచాడు పెద్దాయన. ఎక్కడా కోడలు కాని, భార్యకాని కనపడలేదు. జోలపాటలు తను పాడలేదు. అక్కడే ఉయ్యాల ఊపుతూ "ళొళొళొ..." అన్నాడు. ఆ శబ్దాన్ని మించిన గొంతుతో ఏడవటం మొదలు పెట్టింది.
"ఈ బిడ్డతో వేగటం ఎట్లా శ్రీరామచంద్రప్రభో!..." బిడ్డ ఏడుపు ఠక్కున ఆగిపోయింది.
కిటుకు తెలిసింది.
"శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం...
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి"
శ్రీరాముడి పేరు వింటూనే ఏడుపు ఆపిన పసిబిడ్డ లక్షణం ఏమిటి? అని ఆశ్చర్యంతో, ఆలోచనలోపడి స్తోత్రం ఆపాడు.
పసికూన మళ్ళీ ఏడుపు ప్రారంభించింది. తనని తాను సంబాళించుకుని ఇంకో స్తోత్రం మొదలు పెట్టాడు.
"వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్..."
కృష్ణశబ్దం వినగానే కేరింతలు పెట్టటం మొదలు పెట్టింది. ఆనందంతో పెట్టే కేకలు ఇంటి కప్పుని చీల్చుకుని ఆకాశంలోకి వ్యాపిస్తున్నాయి.
"అతసీపుష్ప సంకాశం హారనూపుర శోభితం...
నోటితో అలవాటుగా కృష్ణాష్టకం సాగిపోతోంది. కాని తాతగారికేదో అద్భుత లోకంలో ఉన్నట్టనిపించింది. రాముడంటే, కృష్ణుడంటే తనకున్న ఇష్టంలోని తారతమ్యాన్ని కూడా పసిబిడ్డ ఎంత బాగా ప్రదర్శించ గలుగుతోంది? అయినా ఇంత చిన్న వయసులో ఇంత దైవభక్తా?'...
తన పిచ్చికాని, నిజానికి దైవభక్తి మనసులో గట్టిగా నాటుకునేది పసివయసులోనే కదా! బీజం పడేది తల్లి గర్భంలో. ప్రహ్లాదుడు, అభిమన్యుడు అందుకు గొప్ప ఉదాహరణలు కూడా. గర్భవతిగా ఉన్నప్పుడు మంగమాంబ భక్తి ప్రపత్తులు అందరికీ తెలిసినవే. అవి ఇప్పుడు మొలకెత్తి మారాకులు వేస్తున్నాయి. స్వచ్చంగా, ఇంకా మాలిన్యాలు చేరని మనసులలో ఆ భక్తి కొమ్మలు రెమ్మలువేసి విస్తరిస్తుంది. కాని, ఎదుగుతున్న కొద్దీ పిల్లల మనసులని అప్పటికే స్వార్థంతో పూర్తిగా తమ మనసులని కిక్కిరిసి పోయేట్టు నింపుకున్న పెద్దలు కలుషితం చేస్తుంటారు. ఆ కొమ్మలు రెమ్మలు విరిచేస్తారు. చిగుళ్ళు గిల్లిపడేస్తారు. బలంగా వేళ్ళూనుకుంటే మళ్ళీ చిగురిస్తుంది. లేకపోతే అంతే! తమ ఇంట్లో చిరునవ్వు వెన్నెలలు చిలికిన మహాలక్ష్మి హృదయంలో మారాకులు వేస్తున్న భక్తికి తామందరూ దోహదం చేయాలి.
కృష్ణాష్టకం పూర్తి అయ్యే సమయానికి ఒక నిశ్చయానికి వచ్చాడాయన. తన మనుమరాలిలో ఉన్న భక్తిని వికసింపచేయాలే తప్ప, దానిని నిరసించటం కాని, నిరుత్సాహం పరచటంకాని చేయకూడదు. అందరూ తమ వంతు ప్రోత్సాహించాలి. తగిన వాతావరణం కల్పించాలి. ఒక్క భక్తుడో, భక్తురాలో జన్మిస్తే వంశం ధన్యమౌతుంది. ప్రహ్లాదుడి కారణంగా రాక్షస వంశమే ధన్యమయింది.
* * *
కృష్ణయార్యుని ఇంట మంగళవాయిద్యాలు. గుమ్మంముందు తాటాకు పందిరి, గుమ్మానికి మంగళతోరణాలు, పురోహితుని మంత్రాలు. ఇల్లంతా సందడి సందడి. వంట ఇంట్లోనుండి ఘుమఘుమలు. పీటలమీద కూర్చున్నారు మంగమాంబ కృష్ణయార్యులు. మంగమ్మఒడిలో వెంకమాంబ. అది వెంకమాంబ అన్నప్రసాధన ఉత్సవం. దేవుడికి నివేదన చేసిన ఆవుపాలతో చేసిన పరమాన్నం బంగారు ఉంగరంతో నోటికి తాకించారు. ఎంతో ఇష్టంగా చప్పరించింది. అంతే! తరువాతి కార్యక్రమం చూడటానికి అమ్మలక్కలంతా గుమిగూడారు. బిడ్డలక్షణం తెలియచేసే అంశం అది.
అక్కడే దేవుడి పటంముందు ఒక చిన్న కత్తి, ఒక గంటం, ఒక గరిట, ఒక తాళపత్ర గ్రంథం, మిలమిలా మిడిసి పడుతున్న వజ్రాల పతకం ఉన్న హారం, ఎర్రని మందార పూలు, మెరిసిపోయే ఎర్రదనంతో ఉన్న దానిమ్మపండు బంగారు జలతారుతో తళుక్కుమంటున్న పట్టు వస్త్రం పెట్టి ఉన్నాయి. వెంకమాంబని వాటి దగ్గరకు తీసుకుని వెళ్ళి వదిలి పెట్టారు. అందరూ ఏం వస్తువు తీస్తుందా అని ఆత్రంగా చూస్తున్నారు. ఆశ్చర్యం! వెంకమాంబ ఎట్లా కూర్చోపెట్టినది అట్లాగే ఉండి, రెండు చేతులూ కలిపి నోటి దగ్గరికి తెచ్చి, పటంలో ఉన్న కృష్ణుడిని చూస్తూ నిర్నిమేషంగా ఉండిపోయింది. నిద్ర పోతోందో, మేలుకుందో తెలియదు. మంగమాంబ చేతులు నోటి దగ్గర నుంచి తీసి, బిడ్డని కదిలించి చూసింది కాని దృష్టిమాత్రం మరలించలేక పోయింది.
తాతగారి మనసుకేదో స్ఫురించింది. వెంటనే అక్కడున్న కృష్ణుడి చిత్రపటాన్ని తీసి కనపడకుండా అవతల పెట్టారు. దృష్టి మరల్చటానికి ఎత్తుకుని అటూఇటూ తిప్పి, తిరిగి ఆ వస్తువుల దగ్గర వదలి పెట్టారు. ముందు ఒక చేత్తో తాళపత్రాలు తీసి, రెండో చేత్తో గంటం పట్టుకుంది.