Previous Page Next Page 
ప్రేమ నక్షత్రం పేజి 5


    టైముచూస్తే ఏడయింది.

 

    ఒళ్లంతా చికాకు అనిపించి బాత్ రూంలోకి వెళ్లి తనివితీరా స్నానం చేశాడు. ఇవతలకు వచ్చి పైజామా, లాల్చీ వేసుకున్నాడు.

 

    ప్రాణం హాయిగా వుంది.

 

    మనసులో బాధగానూ వుంది, అర్థంలేని సంతోషంగానూ వుంది.

 

    ఈ బాధలో ఎంత తీపి? ఈ సంతోషంలో ఎంత దిగులు!!

 

    బయట సిట్ అవుట్ లో లైటుకూడా వేసి తలుపు తీసుకుని యివతలకు వచ్చి నిలబడ్డాడు.

 

    చాలా ఇళ్ళలో లైట్లు వెలుగుతున్నాయి. చెదురుగా అక్కడక్కడా ఒకళ్లిద్దరు మనుషులు నడుస్తూ కనిపిస్తున్నారు. ఏ ఇంట్లోంచో రేడియోలో సినిమా పాట వినిపిస్తోంది.

 

    ఎదురుగా వున్న ముప్ఫయి నాలుగోనంబరు కిటికీ బయటి తలుపు వేసివుంది. లోపల మనుష్యులు వున్నట్లుగా కాంతి కనబడుతోంది.

 

    పదినిముషాలు గడిచాయి. అతనలాగే ఆలోచిస్తూ పరధ్యానంగా నిలబడివున్నాడు.

 

    ఎదురుగా ఇంటి బయట దీపం వెలిగింది. అతని దృష్టి అటువిపు మళ్ళించబడి, అప్రయత్నంగా అటువైపు చూశాడు.

 

    తలుపు తెరుచుకుని ఓ స్త్రీ రూపం సిట్ అవుట్ లోకి వచ్చి నిలబడింది.

 

    విద్యుద్ఘాతం తగిలినట్లయి - తృళ్ళిపడ్డాడు. ఎంత ఆశ్చర్యం-శైలజ!

 

    తలంటుపోసుకుని జుట్టు విరబోసుకుని ఆశ్చర్యంగా నిలబడి కన్నార్పకుండా తనవైపే చూస్తోంది.

 

    ఆమె కళ్ళలో ఆతృత, కనిపించీ కనిపించనట్లు ఆ కళ్ళల్లో కన్నీళ్ళు.

 

    గొంతెత్తి పిలవబోయాడు "శైలూ!" అని. ఆ గొంతెవరో నొక్కినట్లయింది. శైలూ! అని పిలిచినట్లు పెదవులు మూగగా కదిలాయి.

 

    కానీ మనసు జడుస్తోంది, విలపిస్తోంది. ఆ ఏడుపులోనే వెనక్కి పరిగెడుతోంది.

 

                                            2

 

    ఫణి బి.ఎస్.సి. పూర్తిచేశాడు.

 

    చిన్నతనం నుంచి క్లాసులో ఫస్టూ, ఫైనల్ పరీక్షలో ఫస్టుక్లాసులోనూ ప్యాసవటం అతనికలవాటు.

 

    బి.ఎస్.సి. లోకూడా క్లాసే వచ్చింది.

 

    తర్వాత చదవాలి. పోస్టుగ్రాడ్యుయేట్ చెయ్యాలి. పి.హెచ్.డి. చెయ్యాలి. డాక్టరేట్ చెయ్యాలి.

 

    ఫస్టుక్లాసు స్టూడెంటే అయినా ఇరవైనాలుగ్గంటలూ పుస్తకాలు పుచ్చుకుని కూర్చోవటం, మిగతా వ్యాపకాలకు దూరంగా వుండటం అతనికలవాటు లేదు. స్నేహితులతో సరదాగా తిరిగేవాడు. ఆట పాటల్లోనూ వుండేవాడు. చిలిపిగానూ ఉండేవాడు. అవకాశం దొరికితే అమ్మాయిలను ఏడిపిస్తూ వుండేవాడు.

 

    అతని అందం చూస్తే అమ్మాయిలకు సంతోషం, అతని అల్లరిచూస్తే సంకోచం.

 

    కాని అతని అల్లరిలోని పసితనాన్ని గుర్తించినవాళ్ళు మాత్రం దగ్గరకు రా ప్రయత్నించేవాళ్లు.

 

    ఎమ్.ఎస్.సి.కి అప్లికేషన్ ఫారం తెప్పించి ఎంతో సంతోషంతో పూర్తి చేస్తోంటే తండ్రి వేసిన కేక వినిపించింది. "ఫణీ! ఫణీ!"

 

    అప్లికేషన్ ఫారంమీద పేపర్ వెయిట్ ప్రక్కగదిలోకి వెళ్ళాడు.

 

    లోపలకు అడుగు పెట్టేసరికి ఆయన వరుసగా తుమ్మటం మొదలు పెట్టాడు. ఆయనకు విపరీతమైన ఎలర్జి. కొంతకాలం రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేసి అక్కడి దుమ్మూ దూగరకు వచ్చే తుమ్ములు భరించలేక ఆ ఉద్యోగం మానేశాడు. తర్వాత ఓ పొగాకు కంపెనీలో పనిచేసి అక్కడి పొగాకు వాసనకు తుమ్ములబాధ ఎక్కువై ఆ ఉద్యోగానికి తిలోదకాలిచ్చాడు. ఆ తర్వాత ఓ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసి అక్కడ చల్లదనానికి జలుబూ, తుమ్ముల బాధ మరింత ఎక్కువై అదీ ఒదులుకున్నాడు. ఏ ఉద్యోగానికి వెళ్ళినా పడటంలేదు. ఇంట్లోకూడా ఇళా ఊడ్చేటప్పుడు ముక్కు మూసుకుని తప్పుకు తప్పుకుని తారట్లాడుతుంటాడు. చేసేదిలేక చివరకు ఇంట్లోనే వుండి ప్రయివేట్లు చెబుతూ కాలం వెళ్ళబుచ్చసాగాడు.

 

    కాసేపటికి తుమ్ములు ఆగాయి. "కూచో."

 

    "ఫర్వాలేదు, చెప్పండి."

 

    "నువ్వు ఫస్టుక్లాసు స్టూడెంటువి కావటం నాకు సంతోషమే. నువ్వు ఆశావాదివనీ, పై చదువులకోసం ఉబలాటపడుతున్నావనీ నాకు తెలుసు. కానీ మన ఇంటి పరిస్థితిని కూడా నువ్వు తెలుసుకోవటం ముఖ్యం. నిన్ను ఇంతకన్నా పైకి చదివించటానికి నాకు శక్తిలేదు. అంతేకాదు, నువ్వు వెంటనే ఏ ఉద్యోగమో చూసుకుని మాకందరికీ సాయపడటం మంచిదని నా ఉద్దేశం."

 

    ఫణి ఖిన్నుడయ్యాడు. మాట్లాడకుండా అక్కణ్నుంచి వెళ్ళిపోయి తన గదిలో మంచంమీద కూర్చుని మౌనంగా ఆలోచిస్తున్నాడు.

 

    "అన్నయ్యా!"

 

    తల త్రిప్పి చూసేసరికి చెల్లెలు వసుమతి ప్రక్కనే నిలబడి వుంది.

 

    "వసూ!"

 

    అతనికెదురుగా వచ్చి కళ్ళలోకి చూస్తూ అంది "నువ్వు చదువు ఆపవద్దు!"

 

    "కానీ ఎలా?"

 

    "నా పెళ్ళిగురించి, నా వెనక ఇంకావున్న ఇద్దరి చదువుగురించి మొయ్యలేక సతమతమవుతూ నాన్న నిన్ను చదువు మానుకోమంటున్నాడు. నా పెళ్ళికి ఇప్పుడేం తొందరలేదు. అదీగాక కొత్తగా అయిదారు హిందీ ట్యూషన్లు ఒప్పుకున్నాను. వాటితో ఈ కుటుంబ భారాన్ని ఈదుకురాగలను."

 

    "కానీ అక్కడ నా చదువుకు ఖర్చు?"

 

    వసుమతి కొంచెంసేపు ఆలోచించింది. "నీ మార్కుల్నిబట్టి చూస్తే నీకు స్కాలర్ షిప్ వస్తుందని నమ్మకముంది. ఇంకా పైఖర్చులకి? నీ స్వశక్తి నాకు తెలుసు. నువ్వు నెగ్గుకురాగలవు."

 

    చెల్లెలి మాటలు అతనిమీద మంత్రశక్తిలా పనిచేశాయి. సాహసం చేశాడు. తండ్రి మొదట కొంచెం గొణిగినా తర్వాత ఏమీ మాట్లాడలేదు.

 

    అతనికి ఎమ్.ఎస్.సిలో సీటు వచ్చింది.

 

    స్నేహితులదగ్గర చేబదుళ్ళు తీసుకుని అయిదారు వందలదాకా పోగు చేశాడు. పెద్దాపురంనుంచి బయల్దేరి వైజాగ్ వెళ్లటానికి సామర్లకోట చేరుకున్నాడు.

 Previous Page Next Page