చదివిన తర్వాత అతడు బిగ్గరగా నవ్వేస్తాడనుకున్నాను. కానీ అతడు నాకు తిరిగి దాన్ని అందచేస్తూ -"బావుంది" అన్నాడు.
"నిజంగా బావుందా?"
"ఏం? నీకెందుకా అనుమానం వచ్చింది?"
"మీలాటి రైటర్స్- చిన్నవాళ్ళు ఏం చదవమని ఇచ్చినా 'బావుందంటా' రనుకున్నాను".
ఈసారి జాన్ డేవిడ్ బిగ్గరగా నవ్వేడు.
"చాలా తప్పుగా అనుకున్నావ్. నిజానికి- దానికి వ్యతిరేకంగా అంటారు" అంటూ తిరిగి నా దగ్గర్నుంచి ఆ కాగితం తీసుకుని, జేబులోంచి కలంతీసి, దానిమీద "పాపా బాగా వ్రాసావు. హ్యూమరూ, భావుకతా.... మంచి మిక్సింగ్. కిపిటప్....." అని సంతకం పెట్టి అందించాడు.
చాలు. దీన్ని ఆ అమ్మాయి జీవితాంతం దాచుకుంటుంది.
కాగితాన్ని జేబులో పెట్టుకుంటూ, "దయ ఎలా వుంది?" అని అడిగాను.
"బావుంది. నువ్వొచ్చావని తెలీదు. తెలీస్తే నీ పని దయనీయంగా మారుతుంది".
"ఎందుకు?" అర్థంకానట్టు అడిగాను.
"మా ఇంట్లో దిగకుండా బయట హొటల్ లో దిగినందుకు".
ఈసారి నవ్వటం నావంతయింది. ".........వచ్చినప్పుడల్లా మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం దేనికి జాన్? హైద్రాబాద్ తరచూ వస్తూంటాగా. ఈసారి అంకిత్ వాళ్ళతో వచ్చినప్పుడు మీ ఇంట్లోనే దిగుతాను" అని ఓ క్షణం ఆగి, "....అదీగాక నా ప్రిన్స్ పులస్ నీకు తెల్సుగా!" అన్నాను.
గ్లాస్ ఎత్తి అతడోగుక్క తాగాడు. "ప్రిన్సిపుల్స్ అంటూ వుండాల్సిందే! కానీ స్నేహితుల మధ్య ఎందుకు? నువ్వు ఆ ఇంటికి వస్తే నేనూ, దయా నిజాయితీగా సంతోషిస్తాం. దాన్ని మేము ఒక బాధ్యతగా చేస్తున్నట్టు గుర్తించావనుకో. అప్పుడు నీ థియరీ కరెక్టవుంతుంది. దేనికి ఒక నిర్దుష్టమైన చట్రం అంటూ ఏదీ ఉండదు మైడియర్. కాబట్టి గుర్తుంచుకో. మన వాళ్ళంటూ కొందర్ని ఎప్పటికీ మిగుల్చుకోవాలి".
నేను నిశ్శబ్దంగా వుండిపోయాను. 'మనవాళ్ళనంటూ కొందర్ని మిగుల్చు కోవాలి' అని ఆరోజు అతడన్న మాటలు ఆ తర్వాత నేను చాలా సందర్భాల్లో గుర్తు తెచ్చుకోవల్సి వచ్చింది.
అలాంటి సందర్భాలు భవిష్యత్తులో చాలా వ్రాసిపెట్టి వున్నాయని నాకా క్షణం తెలీదు.
నాకు అరుంధతి గుర్తొచ్చింది. పెళ్ళయిన కొత్తలో క్లబ్ లో పేకాడుతూండగా (అప్పుడు జాన్ డేవిడ్ కూడా వున్నాడు) పోలీసులు రెయిడ్ చేయటం, ఆ విషయం తెలిసి అరుంధతి పోలీస్ స్టేషన్ కి రావటం, పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకురావటం, తర్వాత కోర్టు.....! అదృష్టవశాత్తు ఫైన్ తో వదిలిపెట్టటం, అది తను కట్టటం....
"ఏమిటాలోచిస్తున్నావ్?"
నేను నవ్వి- ఆ రోజు సంఘటన గురించి చెప్పాను.
"అవునవును. నాకూ గుర్తుంది. దాదాపు పదిహేనేళ్ళక్రితం కదూ. చాలా అసహ్యకరమైన సంఘటన. నేను మా ఆవిడని ఇప్పటికీ ఏడిపిస్తూ వుంటాను. పెళ్ళయిన కొత్తలో అలా జరిగితే నువ్వయితే అలా కారియర్ పట్టుకొస్తావా అని..."
"దయ కూడా నిశ్చయంగా అలానే పట్టుకొస్తుంది" అతడి మాటలకి అడ్డు తగులుతూ ధృఢంగా అన్నాను.
"అవునవును. పట్టుకొస్తుంది. ఆ విషయంలో మనం అదృష్టవంతులం. చాలామంది ఆడాళ్ళు అలా చేయరు. రొమ్ములు బాదుకుంటూ ఏడవటమో, స్పృహతప్పి పడిపోవటమో చేస్తారు. ఒకవేళ క్యారియర్ తెచ్చినా, ఆ తరువాత జీవితాంతం దెప్పుతారు. అరుంధతి అలా చేయలేదు కదూ".
నిజమే. ఈ పదిహేనేళ్ళ కాలంలోనూ ఎప్పుడూ ఆ ప్రసక్తి తీసుకురాలేదు అరుంధతి.
నవ్వుతూ అవునన్నట్లు తలూపాను.
"......నీ భార్యా చాలా మంచిపిల్ల. అలాటి కూతురు మాకుంటే బావుండేదని నేనూ, దయా ఎప్పుడూ అనుకుంటూ వుంటాం".
"మళ్ళీ నవ్వేను. అయితే ఈసారి నవ్వింది ఆ మాటలకి కాదు. జాన్ కి అప్పుడప్పుడు తన వయసూ, పేదరికం గుర్తొస్తూ వుంటుంది. మళ్ళీ మామూలు సందర్భాల్లో చిన్నపిల్లడైపోతూ వుంటాడు. రచయితలంతా ఇంతేకామోసు.
"రేపు సాయంత్రం ఖాళీయేనా?"
"ఎందుకు?" ప్రశ్నించాను.
"క్లబ్ కెళదాం. పేకాడి చాలా రోజులయింది. నువ్వొచ్చావ్ గా. దయకూడా పర్మషన్ ఇస్తుంది".
నేను మాట్లాడలేదు.
"ఇదేమిటి -కుక్క దాలిగుంట వ్యవహారం అనుకుంటున్నావా?"
నేనో క్షణం మౌనంగా వూరుకుని, నేను పేకాట మానేసాను జాన్" అన్నాను.
అతడు విస్మయంగా "అదేమిటి మొన్నటివరకూ వైజాగ్ క్లబ్ లో-" అనబోతూండగా మధ్యలో అడ్డుకుని, "....ఈ మధ్యే మానేసాను" అన్నాను.
"ఏం?"
"దానికో కారణం వుంది".
"ఏమిటి?"
"ఏమిటి అనకు, ఎవరు? అని అడుగు".
"ఎవరు?"
"అంకిత్".
* * *
"మనిద్దరం జూదం ఆడదామా డాడీ?" ఓ రాజు నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చి అడిగాడు అకింత్.
అర్థంకానట్టు "....జూదమా?" అన్నాను.
"అవును. రీడైర్స్ డైజెస్ట్ లో చదివాను. ఆ ఆట ఆడదాం. కానీ...... డబ్బుల్తో".
ఇద్దరం కూర్చున్నాం.
"నీ దగ్గర ఎన్ని డబ్బులున్నాయ్?" అని అడిగాడు.
లెక్కపెట్టి "ఆరొందలా నలభై" అన్నాను.
"నాకు సగం అప్పుడు ఇవ్వు" అన్నాడు.
"అదేంటి జూదంలో అప్పు ఇవ్వరు".
"BUT AFTERALL I AM YOUR SON DADDY"
నేను నవ్వేసి వాడికి సగం డబ్బులిచ్చాను. "నేను బ్యాంకర్ నన్నమాట....." అంటూ జేబులోంచి రూపాయి బిళ్ళ తీసి "పందెం కాయి డాడీ గెలిస్తే రెట్టింపు ఇస్తాను" అన్నాడు.
"ఇది చాలా బోర్ గేమ్" అన్నాను నిరాసక్తంగా.
"ఆరు గేమ్ లుఆడదాం డాడీ! గెలిస్తే రెట్టింపు ఇస్తాను".
"అంతేనా?" తేలిగ్గా అడిగాను.
"అంతే.... అయితే ఒకషరతు. నీ దగ్గర ఎంత డబ్బుందో అందులో సగమే కాయాలి. మొత్తం కాసి గెలిస్తే, మొదటి ఆటలోనే నేను దివాళా తీస్తాను".
"ఓడితే నేనూ అంతేగా" నవ్వేను. జూదంలోకూడా అదే జరుగుతుంది కదా! మన దగ్గరున్న దాంట్లో సగం ఆడతాం. మిగతాది తరువాత ఆటకోసం వుంచుకుంటాం.
అంకిత్ కి అప్పు ఇవ్వగా ఇంకా 320 రూపాయిలు మిగిలాయి.
160 రూపాయలు టేబుల్ మీద పెట్టి "బొమ్మ" అన్నాను.
గెల్చాను. నాకు రెట్టింపు ఇచ్చాడు.
నా దగ్గర 480 వుంది అలా ఆరు ఆటలు కొనసాగాయి.
ధర్మ జూదమే కొనసాగింది. అంటే మూడుసార్లు వాడు గెల్చాడు, మూడుసార్లు నేను గెల్చాను. నేను వేసినదల్లా నా దగ్గర ఎంత వుంటే అందులో సగం కాయటమే.
అలా ఆరు గేమ్ లు పూర్తయ్యేసరికి నా దగ్గర 135(అక్షరాలా నూట ముప్పై అయిదు) రూపాయలు మిగిలాయి.
బిక్కమొహం వేసి చూసాను.
"ఇంకో రెండు గేములు ఆడదామా డాడీ?" అన్నాడు.
"సరే" అన్నాను పంతంగా.
మొదటిసారి గెల్చాను. రెండోసారి ఓడాను. ధర్మజూదమే. కానీ నా దగ్గర వందరూపాయాలూ కాస్త చిల్లరా మిగిలాయి.
"ఇంకో రెండు గంటలు" పంతంగా అన్నాను.
అంకిత్ నావైపు జాలిగా చూస్తూ "ఇలా ఆడేకొద్దీ నువ్ వోడిపోతూనే ఉంటావ్ డాడీ" అన్నాడు.
"ఎలా?"
"అదే మరి లాజిక్" నవ్వు బిగ్గపట్టి అన్నాడు. నన్ను ఏడిపిస్తున్న ఫీలింగ్ వాడి కళ్ళలో కదలాడుతోంది. వున్న డబ్బంతా ముందుకు తోసి "బొమ్మ" అన్నాను.
గెల్చాను. అశ్వారోహణ చేసిన ఫీలింగ్ కలిగింది.
నా మొత్తం పెట్టుబడి రాబట్టటం కోసం అంతాపెట్టి- "బొరుసు" అన్నాను ఈసారి.
బొమ్మ పడింది.
తెల్లబోయి చూసాను. వాడు కుర్చీ వెనక్కివాలి నవ్వుతున్నాడు. నా మొహం వెల్లవేసినట్టు అయిపోయిందని తెలుస్తోంది. అయినా పెద్దగా బాధలేదు. ఓడింది వాడి దగ్గరే కదా! క్లబ్ లో అయితే రెండు చేతులూ (ఖాళీ) జేబుల్లో పెట్టుకుని, మొహంలోని ఫీలింగ్ బయటపడకుండా గంభీరంగా బయటకి నడవాలి గానీ ఇక్కడేముంది?
చివరిలో ఓడింది ఎందుకో తెలుస్తోందిగానీ, మొదటి ఆరుగేముల్లో మూడు గెల్చినా కూడా ఎందుకు నా దగ్గర డబ్బులు తరిగిపోయాయో అర్థంకాలేదు మొదట్లో. కానీ ఆలోచిస్తే అర్థమయింది. ఉన్నదాంట్లో సగం కాయటమే నా నష్టానికి కారణం. కావాలంటే మీరు కూడా లెఖ్ఖకట్టి చూడండి. పేకాటలో సాధారణంగా జరిగేది అదే. చివర్లో మొత్తం ఓడిపోవటం కూడా అంతే! మొదటిరోజు గెలిచినా మరుసటిరోజూ ఓడటం ఖాయం.
ఈ విషయం అర్థంకాగానే నవ్వేసేను. అంకిత్ ని దగ్గరికి తీసుకుని నుదుటిమీద గట్టిగా ముద్దు పెట్టుకుని - "గుడ్" అన్నాను.
"థాంక్యూ".
"ఇదంతా ఎక్కడో చదివానన్నావ్ కదూ".
"అవును డాడీ! రీడర్స్డైజెస్ట్ లో"
వాడి మంచి అలవాట్లకి బహుమతిగా ఏదయినా ఇవ్వాలనుకున్నాను "చెప్పు నీకేం ప్రజెంటేషన్ కావాలి?" అనడిగాను.
"దేనికి డాడీ?"
"నీ పుట్టినరోజుకి.....రీడర్స్ డైజెస్ట్ చందా కట్టనా?"
"వద్దు డాడీ....." అంటూ వూరుకుండిపోయాడు.
"చెప్పరా?"
"తప్పకుండా ఇస్తావా?"