Previous Page Next Page 
జాలిలేని జాబిలి పేజి 5


    "అలాకాదు చూడండి" అన్నాడు ఉమాపతి. "ఒక నిర్దుష్టమైన గమ్యం లేకుండా ఎవడూ ఉత్తమ రచయిత కాలేడు. మీ అభిమాన రచయితలంటూ ఎవరైనా వున్నారా?"

    "శరత్..."

    "శరత్ ని మీరెందుకు అభిమానిస్తున్నారు?"

    మధుబాబు ఆలోచించసాగాడు.

    "ఆయన వ్రాసే ప్రతి ఆలోచనలోనూ యీ సమాజంలోని కఠిన నియమాలకూ, మూర్ఖపు దురాచారాలకూ బలయిపోతున్న అభాగ్యుల ఆక్రందన పౌరుషంగా వినిపిస్తుంది. ఆ నిర్భాగ్యుల్ని వివిధ కోణాలలో చిత్రించాడు. తన ఆశయ నిర్వహణకు యీ సమాజాన్నే ఒక విలన్ గా తీసుకున్నాడు. సాధారణంగా ఆయన పుస్తకాల్లో విలన్ లు వుండరు. సంఘాన్ని పాలిస్తోన్న దారుణ సిద్దాంతాలకు గురై, బలయిపోతుంటాయి పాత్రలు. తను చెప్పదలచుకున్న విషయాన్నిబట్టి దానికి అనుగుణ్యమైన భాషా, వాతావరణం శిల్పం తీసుకున్నాడు. రాసిన ప్రతి అక్షరంలోనూ తను గోచరిస్తూ వుంటాడు. అతని ఆశయమూ, దాని ఆచరణ విధానమూ రెండూ ఉదాత్తాలయినాయి ఏదీ ఏవగింపు కలగచెయ్యకుండా. అంచేతనే అతను నిలిచాడు. కొందరు శరత్ ని పిరికి, స్పష్టంగా ముగించడు అని  విమర్శిస్తూ వుంటారు. ఇట్లా విమర్శించే వాళ్లు తాము వాంఛించిన సంఘాన్ని, అప్పుడే ఏర్పడిపోయినట్లు చిత్రిస్తున్నారు. వీటిలో కసేగాని, కరుణ లేదు. మనుషుల్ని ఊహకతీతమైన స్థితిలో పెట్టటానికి ప్రయత్నించారు. అదీగాక సమస్యనుబట్టే భాష అన్న సంప్రదాయాన్ని విచ్చల విడిగా వాడుతున్నారు. వాస్తవికతకు విపరీత అర్ధాలుతీసి సాహిత్యాన్ని రసహీనంచేసి, వట్టి పొడిగా తయారుచేశారు. అంచేత ఎంత ఆర్భాటం చేసినా శరత్ హృదయాలను ఆకర్షించినట్లు ఆకర్షించలేకపోయారు. మనకు సమాజంపట్ల వున్న కసిని వికృతంగా తీర్చుకాకూడదు. అదిగాక నిజాయితీ ఉద్రేకం ఎరుపు తెచ్చుకోకూడదు. మన సాహిత్యాన్ని వెయ్యిమంది దుర్భాష లాడితే- వాళ్ళెవారూ చేరుకోలేని వున్నత శిఖరాలను చేరుకున్నానను కోవటం ప్రగల్భం."

    ఎక్కడా తముడులాట లేకుండా, స్వచ్ఛమైన కంఠస్వరంతో చెప్పాడు ఉమాపతి. ప్రక్కన నిశ్శబ్దంగా కూర్చున్న అతని తమ్ముడు సత్యనారాయణకూడా శ్రద్ధగా ఆలకించాడు. శరత్ ని గురించి నేను ఇలా మాటలాడగలనా అని ప్రశ్న వేసుకున్నాడు మధుబాబు. అతనికి ఆశ్చర్యంగా వుంది.

    "శైలీ, శిల్పం వీటిగురించి మీకున్న నమ్మకాలేమిటి? అవి వాస్తవికతకు ఎంతవరకూ ప్రతిబంధకాలౌతాయి?" అన్నాడు ఉమాపతి ఒక్క నిముషం ఆగి.

    ఇతరుల రచనలు చదువుతూన్నప్పుడు యీ చెప్పబడిన వాటిలోని ప్రత్యేకత, సమర్ధత మధుబాబుని ఆకర్షిస్తూ వచ్చాయి. ఒక్కొక్క రచయిత రచనా విధానంలో ఒక్కొక్క విశిష్టత వుంటుందని అతనికి తెలుసు.

    "శైలి, శిల్పం లేకుండా సూటిగా చెపితే చాలా డ్రైగా, వట్టి పిందెల్లా వుంటాయి" అన్నాడు జవాబు చెప్పాలి గనుక.

    "సూటిగా చెప్పటంకూడా ఓ శైలే" అన్నాడు ఉమాపతి నవ్వుతూ.

    మధుబాబు ఇబ్బందిలోపడి "నేను అలాంటివాటికోసం ఏమీ సాధనం చెయ్యలేదండీ" అన్నాడు.

    "చెయ్యనక్కరాలేదు నిజానికి. నిజమైన వ్యక్తిత్వం ప్రత్యేకమైన శైలిని సృష్టిస్తుంది. ఉదాహరణకు మిమ్మల్నే తీసుకుందాం. అజ్ఞాతంగా చాలామంది రచయితల ప్రభావం మీమీద ప్రసరిస్తున్నా, కథను మలచటంలోనూ, సంభాషణలను పలికించటంలోనూ మీది చాలా  చిత్రమైన పద్ధతి. ఓ  సుకుమారత్వం వుంది అందులో. పాఠకుల్ని చాలా చప్పున ఆకర్షిస్తుంది. అయితే ఇంకా నిశితమైన నిర్దుష్ఠత రాలేదనుకోండి. రాసే సమయంలో ఇతర రచయితల గురించి మరిచిపోయి. మిమ్మల్నే కళ్ళముందు వుంచుకుంటే చెక్కుచెదరని శైలి అమరుతుంది. కాని మీ టెక్నిక్ మెచ్చుకోదగ్గది సుమండీ."

    మళ్ళీ ఓ కొత్తపదం.
   
    "సమస్యను తీసుకుని కథ అల్లుకోక ఆలోచించటమే ఇతివృత్తంలోని మొదటి సంఘటనతో ప్రారంభించటంవల్ల యీ టెక్నిక్ గొప్పగా కుదిరింది. మొట్టమొదట మీకు కథలోని మొదటివాక్యామో, దృశ్యమో మనసులో మెదుల్తుంది. దాన్నిబట్టి మిగతాగాథ అంతా చరచరమని సంఘటనలతో సాక్షాత్కరిస్తుంది. ఆప్పుడు మీరు రాయటానికి కొంచెంకూడా తడుముకోవాల్సిన అవసరం వుండదు."

    ఎంత బాగా కనుక్కున్నాడు తనగురించి అతను! తనకు తెలీని ఎన్నో విషయాలు అతనికి తెలుసు. తనకంటే ఒక ఏడాది పెద్ద. అంతే- అతని కథలు తన వాటికన్నా బాగుండవు. అతని సాహిత్యంకన్నా అతను గొప్ప. తనకన్నా తన సాహిత్యం గొప్ప. ఇంతకీ అతని ఆశయమేమిటో!

    "మె ఆశయం ఏమిటి మరి?" అన్నాడు.

    ఉమాపతి మందహాసం చేశాడు. "ఈ రోజుల్లో ఎవర్ని కదిపినా సెక్స్, ప్రేమ, స్త్రీ వీటినిగురించే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. వీటిల్లో నిజంకన్నా ఆర్భాటం ఎక్కువ. నిజాయితీకన్నా శిల్పం ఎక్కువ! ఇంతా చూస్తే తెలుగుతనం వుండదు. తెలిసినవాళ్ళూ, తెలియనివాళ్లూ పతితుల్ని గురించీ, దొంగల్ని గురించీ రాయటం చెరిగేస్తున్నానని భుజాలెగరేయటం ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక సంఘటన చూసి అది తాము కొత్తగా కనిపెట్టామన్న ధీమాతో రాసేటంతటి అసహనస్థితికి వచ్చారు. విషయం పాతదే అయినా, నాకు వీటినుంచి ఒక రిలీఫ్ ఇవ్వాలనిపించింది. మనచుట్టూ వ్యాపించివున్న సామాన్యమైన నిజంలోంచి ప్లాట్ ఎన్నుకోవాలి. అతీతంగా రాస్తేనే ఉత్తమరచన అన్న భ్రమ తొలగించాలి. అట్టహాసం, ఆడంబరం, పాండిత్యప్రకర్ష వుండకూడదు. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. వారి సాధనబాధకాలు, స్థితిగతులు క్షుణ్నంగా తెలుసుకున్నాను, అనుభవించాను. ఉదాహరణకి "పొదుపు" అన్నది ఓ సమస్య. ఈ పొదుపు, దుబారాల గురించి చక్కని నవల రాయొచ్చు. వంకరటింకర డైలాగులూ, జీవితంలో సెక్స్ సమస్య అనుకొనటం నా రచనల్లో వుండదు. కుటుంబజీవితాలని యధాతథంగా, మృదువుగా కొంచెం మెరుగు పెట్టి చిత్రించటమే నా ఆశయం" అన్నాడు.

    అతనిపద్ధతి మధుబాబుని ఆకర్షించింది. నిజంగా ఓ రిలీఫ్ ఇవ్వగల ఆత్మవిశ్వాసం కనబడుతోంది అతన్లో, తననిగురించి తాను చక్కగా ఓ దారి ఎట్లా యేర్పాటు చేసుకున్నాడో!

    ఏడున్నర అయేసరికి వాళ్ళింక వెళతామని లేచారు. తరుచు వస్తూండమని మధుబాబు మనఃపూర్వకంగా కోరాడు. అన్నదమ్ములిద్దరూ సెలవు తీసుకుని బయటకు నడిచారు.

    మధుబాబు గుమ్మంలో నిల్చుని చూడసాగాడు. ఓ పదిగజాలు పోయాక ఇద్దరూ సిగరెట్లు వెలిగించుకుని ఏవో కబుర్లు చెప్పుకుంటూ నడిచిపోసాగారు. అతనికి నవ్వు వచ్చింది.

    "ఎవర్రా? కొత్తవాళ్లలాగా కనిపిస్తున్నారే" అంది తల్లి అన్నం వడ్డిస్తూ.

    "అవునమ్మా. ఇవాళేస్నేహమైంది. అందులో ఒకతను రచయిత" అన్నాడు మధుబాబు ఉత్సాహంగా.

    ఆ రాత్రి అతనికెంతకీ నిద్రపట్టలేదు. తనకోసం ఓ రచయిత వెదుక్కుంటూ రావటం, తనలోని ప్రత్యేకతని బయటపెట్టటం ముదావహంగానే వుంది. కాని తను తనకేమీ ఆశయంలేదని తనతోనే వప్పించిపోయాడు. ఎట్లా వస్తుంది తనకది? ఏంచెయ్యాలి? ఇలా ఇష్టం వచ్చినట్లు దేన్నిపడితే దాన్నిగురించి రాయటం ప్రగతికి ప్రతిబంధకమా? స్త్రీనిగురించి తీసుకుంటే? తనకేమీ తెలీదు వాళ్లగురించి. నిరుపేదలు, దరిద్రం, గుమాస్తా, కళాకారుడు, కులమత తారతమ్యాలు. ఓ రాజకీయ సిద్దాంతం.... వీటిల్లో దేన్నో ఒకదాన్నే తన పథకంగా నిర్దేశించుకోవాలా? దాన్నిగురించే ప్రత్యేకంగా పుస్తకాలు చదివి అనేక విషయాలు గ్రహించి, వాటిని గురించి తర్జనభర్జనలు జరుపుతూ వుండాలా? ఎలా లభిస్తుంది తనకు ఆశయం? తన ముద్ర, ప్రజలమీద వేసే ఆ మంత్రం ఏమిటి?

    ఎంత తన్నుకున్నా అతని ఆలోచనలకు ఓ ఫలితం ఏర్పడలేదు. విసిగి పోయాడు. ఎలాగో నిద్రపట్టింది.

   
                                    6

    ఇంటర్మీడియట్ మొదటి యేడు పూర్తయింది. సెలవుల్లో మధుబాబుకు కావలసినంత తీరిక. చదవాలన్న ఉత్కంఠకూడా బాగా పెరిగింది. ఇంగ్లీషు క్లాసిక్సూ, షేక్ స్పియర్ నాటకాలూ చదవటం ప్రారంభించాడు. అభిరుచి లేకపోయినా అవసరంక్రింద చేసుకుని తెలుగు పద్యకావ్యాలూ, ప్రబంధాలూ చదవసాగాడు. అతనికి ఛందస్సు రాదు. అయినా కొన్ని గేయాలు రాశాడు. వాటిలో కొన్నిప్రముఖ వారపత్రికల్లో అచ్చయినై కూడా. కాని యీ కావ్యాలు అతనికి సరిగ్గా వంటబట్టేవి కావు. సగం సగం అర్థమయేవి. కఠినమైన పదం ఒకటి తటస్థపడినప్పుడల్లా దాన్ని మననం చేసుకుని హృదయసీమలో పదిలం చేసుకునేవాడు. కాని చదువుతోంటే సరిగ్గా ఏకాగ్రత కుదిరేది కాదు. ఊహలమీద ఊహలు పొర్లుకుంటూ వచ్చేవి. అవి కాగితంమీదకు ఎక్కించే వరకూ చేతులు దురదలు పట్టేవి.

    క్రమంగా అతని బంధువులలో అందరికీ అతను రచయితగా ఆదరపాత్రుడు కాసాగాడు. అతని మేనమామలూ, వరుసకు అన్న అయినవాళ్ళూ అభినందిస్తూ ఉత్తరాలు రాసేవాళ్ళు. "మధూ! నీకథలు బాగుంటున్నాయి. చక్కని సైకాలజీ ద్యోతకమౌతోంది. ఏ మనిషినికూడా నిర్లక్ష్యం చేసి చూడకు. ప్రతివారినుంచీ ఏరుకుంటే కావలసినంత సామాగ్రి లభిస్తుంది. ముఖాలు పరిశీలించి అంతఃకరణలు గ్రహించటం నేర్చుకో" అని ఓ మేనమామ రాశాడు.

    ఉమాపతి తరచు కలుస్తున్నాడు. అయితే మధుబాబు మునుపటిలాగా మాటాడలేని వాజకాదు. అతనిప్పుడు కొన్ని కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయగలడు తనకు ఓ మార్గం లేదే అన్న చింత అంతగా ఇప్పుడు లేదు. రాసిన ప్రతిదాన్ని గురించీ ఓ ప్రయోజనం సిద్ధింపచేసి చెప్పగలడు. అతనికిలా చెప్పగలగటం సాధనమీద వచ్చింది. కథ రాసేముందు కాకపోయినా, రాశాకయినా ఏముందా అని ఆలోచిస్తున్నాడు. అందులోంచి ఓ ముత్యాలసరం బయటకు తీస్తున్నాడు. ఒక అంశాన్ని గురించి వాదోపవాదాలు వచ్చినప్పుడు అవతలివాడ్ని సరికిసరి ఎదిరించి తట్టుకునేంతటి శక్తి రాకపోయినా, తన పాయింటుమీద పెనుగులాడగలడు.

    అయితే ఒక్క లోపంమాత్రం అతన్ని విడిచిపోలేదు. తనకు ఏది అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువో అతనింకా గ్రహించలేదు. ఓ గదిలో పలురకాల జంత్రాలు మ్రోగుతున్నాయనుకోండి. అన్నీ కదలిక కలిగించేస్తే ప్రత్యేకంగా "ఇది నన్ను బాగా కదిలించింది" అని చెప్పలేనిస్థితి. తనకు నచ్చిన అన్ని పథాలలోనూ పాంథుడిగా నడిచి ప్రయోగాత్మకంగా అనుభవిస్తున్నాడు.

    అన్నట్లు - అతను ఎన్నాళ్ళనుంచో కోరిన కోరిక సఫలమయింది. మొదటి సారిగా అతని కథ బారతిలో అచ్చయింది. ఉమాపతి రచనలింతవరకూ అచ్చు కాలేదు. బహుశా ఇంత చిన్నవయస్సులో భారతిలో కథ రాసిన వాళ్లెవరూ లేరేమో. అతనికి గర్వం కలిగింది. తాను పైకి పోతున్నాడు.

 Previous Page Next Page