"మేము అంటే?"
"నేనూ ఇంకో అమ్మాయి!"
'అమ్మాయి'- అన్నప్పుడు అతడి కళ్ళలో మెరిసిన వెలుగుని యశ్వంత్ సునిశితమైన చూపులు పట్టుకున్నాయి. అందువల్ల ఆ విషయమై మరిన్ని ప్రశ్నలు వేసి అతడిని ఇబ్బంది పెట్టకుండా, "మీరు తప్పకుండా వెళ్ళటానికి, మీ ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగటానికి ఏర్పాటు చేద్దాం సరేనా-" అన్నాడు.
"థాంక్స్ గురువుగారూ" అని, వెంటనే వాలుక్కరుచుకుని, "సారీ" అన్నాడు- అతి చనువు తీసుకుంటున్నట్టు.
"మన పరిచయమైన ఆ అయిదు నిముషాల్లోనూ రెండుసార్లు 'సారీ' చెప్పారు. ఇన్నిసార్లు 'సారీ' చెప్పటం అంత మంచి పద్ధతి కాదు" అన్నాడు యశ్వంత్ నవ్వుతూ. వాయుపుత్ర కూడా నవ్వేశాడు.
తనతోపాటు స్పేన్ సిటీకి రాబోయే అమ్మాయి ఒకప్పటి యశ్వంత్ భార్య అని తెలిస్తే అతడు ఎంత పెద్ద 'సారీ' చెబుతాడో కాలమే నిర్ణయించాలి.
* * *
వాళ్ళు ముగ్గురూ కార్యాలయానికి చేరుకున్నాక, తనకి కావాల్సిన వివరాలు అయిదు నిముషాల్లో పట్టుకున్నాడు యశ్వంత్.
సరిగ్గా యాభై రెండు సంవత్సరాల క్రితం, అరసెకను కాలం ఇలా ఒకసారి సంకేతాలు ఆగిపోయినట్టు రికార్డుల్లో వుంది.
వాయుపుత్ర యశ్వంత్ వైపు ఆరాధనా పూర్వకంగా చూశాడు. జ్ఞాపకశక్తి అంటే అలా వుండాలి- అనుకున్నాడు.
"అంతరిక్ష నగరంనుంచి మనవాళ్ళు నిరంతరం పంపే సంకేతాలు అరక్షణం పాటు ఎందుకు ఆగిపోయాయో, ఈ యాభై రెండు సంవత్సరాల్లోనూ ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆగింది అరక్షణమే కాబట్టి దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ ణా ఉద్దేశ్యం ఈ రెండింటికీ సంబంధం వుందని-" అన్నాడు యశ్వంత్.
ఈ లోపులో ప్రపంచ అంతరిక్షయాణ సంస్థ ప్రెసిడెంట్ టి.వి. తెరమీదకి వచ్చాడు. అతడి మొహం వేదనతో నిండివుంది.
"మీకు చాలా దురదృష్టకరమైన విషయం చెప్పవలసి వస్తున్నందుకు చింతిస్తున్నాను. భూలోక వాసులకు గర్వకారణమైన అంతరిక్ష నగరం సమూలంగా నాశనమై పోయింది. కారణాలు మన శాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారు. తొందర్లోనే ఆ నివేదన సమర్పించటానికి ప్రయత్నం చేస్తాము."
ఆ తరువాత అంతరిక్ష నగరంమీద దృశ్యాలు టీ.వీ.లో రావటం ప్రారంభించాయి. చాలా హృదయ విదారకంగా వున్నాయి ఆ దృశ్యాలు. వాయుపుత్రకి కడుపులో దేవినట్టయింది.
కొంతమంది శారీరం కాలిపోయింది. కొంతమంది అవయవాలు 'కరిగి' పోయాయి. ఎక్కడి వస్తువులు అక్కడ అలాగే వున్నాయి. మిషన్ లు మాత్రం పని చేయడంలేదు. అంతా స్తబ్దంగా వుంది. ఎన్నో సంవత్సరాలుగా మనిషి కృషిచేసి, భూమికి లక్షలమైళ్ళ దూరంలో నిర్మించుకున్న స్దావరాన్ని ఎవరో శత్రువులు ఆక్రమించుకుని నాశనం చేసినట్టు అక్కడ శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. అందరూ విషణ్ణ వదనాలతో ఆ దృశ్యాన్ని చూడటం సాగించారు. విస్ఫోటనాలేవీ లేవు. ఎవరో వచ్చి నాశనం చేసిన దాఖలాలు లేవు.
ఎక్కడో ఏదో సాంకేతిక లోపంవల్ల పై పోర తొలగిపోయి, రేడియో ఆక్టివ్ కిరణాలు, ఆ నగరంలో మనుషుల్ని కాల్చేసినట్టు తోస్తుంది. దాదాపు నూటయాభై మంది శాస్త్రజ్ఞులు- ఎక్కడి వారక్కడే దారుణమైన బాధతో గిలగిలా కొట్టుకొని ప్రాణాలు వదిలేసినట్టు ఆ భంగిమలు చెపుతున్నాయి.
దూరదర్శన్ ప్రసారం అయిపోయింది. ఎవరూ మాట్లాడలేదు. ఆ దృశ్యాల తాలూకు ప్రభావం నుంచి ఇంకా బయటపడనట్టు మౌనంగా వుండి పోయారు.
యశ్వంత్ ఆలోచనలు మరోవిధంగా వున్నాయి. ధృవప్రాంతంలో సూర్యుడి సమీపంగా చూసిన మరో వెలుగు, ఈ అంతరిక్ష నగర నాశానానికి కారణమా అని అతడు ఆలోచిస్తున్నాడు. ప్రంపంచంలో మరెవరికీ అది కనపడి వుండదు. ధృవప్రాంతంలో వుండబట్టి అది తమకి మాత్రమే కనపడింది. దాని నుంచి వెలువడిన రేడియో ఆక్టివ్ కిరణాలు ఈ శాస్త్రజ్ఞుల్ని చంపేశాయా?
ఎందుకో అది సహేతుకమైన ఆలోచన కాదనిపించింది. కేవలం మనుష్యులు చచ్చిపోతే సంకేతాలు ఆగిపోవలసిన పనిలేదు. మనుష్యుల కన్నా శక్తివంతమైన కంప్యూటర్లు తమ పని తాము చేసుకుంటూ పోతాయి.
యశ్వంత్ ఆలోచన్లని భంగపరుస్తూ హాట్ లైన్ లో వినిపించింది.
"ఇప్పుడే అందిన వార్త ప్రకారం, అంతరిక్ష నగరంలో శాస్త్రజ్ఞుల మరణానికి కారణం కనుక్కోబడింది."
ముగ్గురూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంత తొందరగా ఈ రహస్యం ఛేదించబడుతుందని వారు అనుకోలేదు. హాట్ లైన్ రేడియో వివిధ దేశాల సాంకేతిక నిపుణుల మధ్య వార్తాప్రసారం కోసం ఉపయోగించబడుతుంది.
"సోలార్ ఎనర్జీ సరీగ్గా అందని కారణంగా స్పేస్ సిటీ విధ్వంసం అయిపోయింది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్నుంచి అందిన సమాచారం బట్టి గంటక్రితం, ఒక అయిదు నిముషాలపాటు సూర్యుడి ఎనర్జీ అంతా అనూహ్యమైన రీతిలో తగ్గిపోయింది. సోలార్ ఆధారంగా నడిచే ఈ అంతరిక్ష నగరానికి ఎప్పుడైతే ఆ ఎనర్జీ సరియైన పరిణామంలో అందటం మానేసిందో, అప్పుడే సాంకేతిక లోపాలకి గురి అయింది. రేడియో ఆక్టివిటీ నుంచి అంతరిక్ష నగరాన్ని రక్షించే పరికరాలు ఆ విధంగా పనిచేయటం మానేసి వుండవచ్చునని శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు........" రేడియోలో ప్రసారం సాగుతోంది.
వాయుపుత్ర నిర్విణ్ణుడయ్యాడు.
ఇదే ప్రమాదం కొన్ని రోజుల తరువాత జరిగి వుంటే తానూ, అనూహ్య కూడా ఈ ధార్మిక శక్తికి బలైపోయి వుండేవారు. ఆ ఊహ రాగానే అతడి శరీరం వణికింది.
యశ్వంత్ ఇది ఆలోచించటంలేదు. అతడి దృష్టిలో ఇంకా ఆ 'ఆకారమే' మెదుల్తూ వుంది. సూర్యుడి తాలూకు శక్తిని ఒకస్పష్టమైన ఆకారంలో దూరంనుంచి ఎవరో 'లాగినట్టు' తను స్పష్టంగా చూసిన ఆకారం. దీనికి సుదూర తీరాలనుంచి వచ్చిన ఆ సంకేతాలకీ ఏదైనా సంబంధం వుందా?
దీనికి-యాభై రెండు సంవత్సరాల క్రితం ఆ ఒక క్షణం పాటు ఆగిపోయిన ప్రసారాలకీ కూడా ఏదైనా సంబంధం వుందా?
మిగతా ఇద్దరూ ఆ రేడియో ప్రసంగాన్ని వింటూ వుండగా సాలోచనగా అతడు వాయుపుత్ర దగ్గిర వున్న కాగితాన్ని అందుకుని చూశాడు. కంప్యూటర్ ప్రింట్ చేసిన ఆ కాగితం మీద గీతలు అగమ్యగోచరంగా వున్నాయి.
........అలా సాగిపోయింది.
ఏమిటి ఈ సంకేతానికి అర్థం?
నిజంగా ఎవరైనా పంపించిందా? లేక వాతావరణంలో మార్పులవల్ల వచ్చిన పిచ్చిగీతలూ ఇవి?
రేడియో ప్రసారం అయిపోయింది. డైరెక్టర్ యశ్వంత్ వైపు ఏం చేద్దామన్నట్టు చూశాడు. అనూహ్యతో కలిసి స్పేస్ సిటీకి వెళ్ళటం అన్నది ఇక ఆగిపోయినట్లే. అందువల్ల వాయుపుత్ర దిగులుగా వున్నాడు.
యశ్వంత్ అతడివైపు చూస్తూ "మన దగ్గర ఏ జనరేషన్ కంప్యూటర్ వున్నది?" అని అడిగాడు.
"అత్యంత అధునాతనమైన 260 జనరేషన్."
"ఈ గీతల్ని మన భాషలోకి మార్చలేరా?"
"ఎంతో కష్టపడ్డాం. అసలు బేస్ తలిస్తేనేగా మనం 'ఫీడ్' చేసే అవకాశం కలిగేది. అది తెలియనప్పుడు, ఈ భాష ఏదో కనుక్కోవటం మానవమాత్రుడికి కంప్యూటర్.
"మీరు దీన్నొక సవాలుగా తీసుకుని పనిచేయవలసి వుంటుంది. ఇరవై నాలుగ్గంటల్లో దీన్ని డీకోడ్ చేయాలి."
వాయుపుత్ర విసుగ్గా "ఇప్పటివరకూ మేము చేస్తున్న పని అదే- జవాబు అన్నమాట వినిపిస్తే 'ఆ మాట అన్నవాడి తలను కత్తితో నరికేసేవాడట" అన్నాడు నవ్వుతూ. వాయుపుత్ర నవ్వలేదు.
"నేను ఉదాహరణ చెప్పానంతే. మీరు నొచ్చుకోవద్దు. దేశంలో కెల్లా పెద్ద కంప్యూటరిస్ట్ మీరు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు" అని అతడి జవాబు అశించకుండా అక్కడినుంచి బయటకు వచ్చాడు. క్రిందికి వెళ్ళటానికి లిప్ట్ దగ్గిర నిలబడ్డాడు.
పక్కనుంచి మరొక లిప్ట్ పైకి వస్తూంది.
ఈ లోపులో మొదటిది ముందు ఆగింది. దాంట్లోప్రవేశించి క్రిందకి దిగసాగాడు. ఈ లోపులో పైకి వచ్చేదాన్లో అనూహ్య ఆ అంతస్తుకొచ్చింది. ఆమె ఆందోళనగా వుంది. అంతరిక్ష నగరానికి తమ ప్రయాణం రద్దయినట్టు అప్పుడే ఆమెకు తెలిసింది.
మానసిక శాస్త్రవేత్త ఇచ్చిన సలహా ప్రకారం ఆమె తన భర్త విషయం గుర్తుకు తెచ్చుకోకుండా, తిరిగి మామూల జీవితంలో పడాలని చేసే ప్రయత్నంలో మొదటి అంశంగా, వాయువుపుత్రతో స్నేహం తనకిష్టమే అని చెప్పెయ్యాలనుకుంది. ఎలాగూ అంతరిక్షయానంలో తామిద్దరే కాబట్టి, వివాహ విషయం కూడా అంతకుముందే వెల్లడిచేస్తే బావుంటుందని అనుకుంది. అనుకోవటమైతే అనుకుంది. గానీ, ఈ నిర్ణయం ఆమెకు పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు.కానీ ఇలా నిరంతరం మానసిక ఘర్షణతో బ్రతకడంకంటే, నిర్ణయం తీసేసుకుంటేనే మంచిదనిపించింది. క్రమక్రమంగా మనసుతో సర్దుబాటు చేసుకుంది.
ఇప్పుడు ప్రోగ్రాం కాన్సిలయింది. కాబట్టి అతడికి మామూలుగానే తన నిర్ణయం తెలియజేయాలనుకుంది.
లిప్ట్ లో పైకి వస్తున్నంతసేపూ ఆమె టెన్షన్ గానే వుంది.
అతికష్టంమీద ఆలోచన్లను పక్కకు పెట్టి, కంప్యూటర్ రూమ్ వైపు నడవసాగింది. ఎవరి ఆలోచన్ల నుంచి తను దూరమవ్వాలనుకుంటూందో అతడు తనకు సరిగ్గా రెండడుగుల దూరంలోనే మరో లిప్ట్ లో క్రిందికి దిగుతున్నాడని ఆమెకు తెలీదు.
అదే సమయానికి లిప్ట్ లో క్రింది అంతస్తుకు దిగిన యశ్వంత్ కు ఒక క్షణం పాటు ఏం చెయ్యాలో తోచలేదు. ఆ కాగితంలో వున్నదేదో తెలిస్తేకానీ చెయ్యటానికేమీ లేదు. ఒకసారి స్టాఫ్ డిపార్టు మెంట్ కి వెళ్ళి అనూహ్య కోసం వాకబు చేద్దామా అనుకున్నాడు. కానీ సముద్రంలాంటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లో ఆమె సంగతి ఎవరు చెప్పగలరు? అదీగాక అసలు ఆమె ఈ నగరంలోనే వున్నదో-లేదో.
ఒక్కసారి ఆమెను చూడాలన్న కోర్కె అతడి మనసులో కెరటంలా కొట్టుకుంటూంది. పాత జ్ఞాపకాలు గాలికి కదిలే పుస్తకపు కాగితాల్లా రెపరెపలాడుతున్నాయి. 'ఐ లవ్యూ, ఐ లవ్యూ అనూహ్యా' అనుకున్నాడు. ఒక కంప్యూటర్ ద్వారా అతను ఈ మాటను ఎన్నిసార్లు అనుకున్నాడో లెక్కకడితే-బహుశా 'అంత పెద్ద సంఖ్య నా దగ్గిర లేదు' అని కంప్యూటర్ జవాబిస్తుందేమో! తను ఇంతగా ఆలోచిస్తున్న ఆ అమ్మాయి కేవలం గోడకి అటుపక్క వుందని తెలిస్తే ఏం చేసేవాడో మరి.