Previous Page Next Page 
ది బ్లడ్ పేజి 4


    తృతీయ ప్రపంచ మహాయుద్ధనైకి ఇది నాందీప్రస్థావనా అనిపిస్తుంది.

    మరికొన్ని ఘడియలలో ఈ అనంత విశ్వం భస్మీపటలం కానున్నట్టున్నది.

    మనిషి మనసు పైశాచిక ఆనందంపొందుతున్నది. పిశాచగణం పేట్రేగుతున్నది.

    యుద్దోన్మాది నరనరాన ఉన్మత్తం వ్యాపించింది. అతనిలో వింత వింత కోర్కెలు వక్రగతుల పుడుతున్నాయి. మనిషి మరి మిగలకూడదు...

    స్వార్ధం ,సంకుచితత్వం, దానవత్వం విలయతాండవం చేస్తున్నాయి. మానవ మేధస్సు పొగచూరింది. మానవత మైలపడింది.

    కడచిన ఇరువది నాలుగు గంటలలో ఆసియా ఖండంలో రెండు దేశాల మధ్య జరిగింది_ అది యుద్ధం కాదు, జాతుల నిర్మూలనా హోమం...

    జాతి జాతి నిర్ఘాత పాత సంఘాత హేతువై గర్జించిన తూర్యారావం...

    ఆ యుద్ధమే కొనసాగివుంటే, ప్రపంచ పటంలో ఇక ఆ రెండు దేశాల ఉనికి విలుప్త మయేది. ప్రకృతి పరిణామ క్రమంలో ఐతిహాసికులు వీటిని వెతుక్కోవలసివచ్చేది.

    ఒకవేళ మిగిలివుంటే, ప్రపంచ దేశాలు వైరిపక్షాలకు ఇరువైపులా కొమ్ముకాయవచ్చు. అదే జరిగితే... మూడవ ప్రపంచ యుద్ధం తథ్యం! అంటే... ఇక భూప్రళయమే! కాని, రెండు మదపుటేనుగుల భీకర పోరాటాన్ని  చూస్తూ కూర్చున్న అమెరికా సింహం జూలు విదల్చిలేచింది. ఇరువర్గాలకు శాంతింపజేసింది.

    సగటు భారతీయుడు 1947 ఆగస్టు 15న స్వేచ్చను పొందాడు. మరల ఇప్పుడు స్వేచ్చా వాయువులను పీల్చుకోగలుగుతున్నాడు.

    ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో భారత ప్రధాని తన బృందంతో రాజధాని న్యూడిల్లీ నుంచి బయలుదేరారు.

    అదే సమయాన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుంచి ఆ దేశ ప్రధానితో ప్రత్యేక విమానం పైకి లేచింది.

    వాషింగ్టన్ (డి.సి.)లో అమెరికా ప్రెసిడెంట్ ఇరుదేశాల ప్రధాన మంత్రుల మధ్య మైత్రీ చర్చలకు ఏర్పాట్లు చేయడం ఆధునిక ఆసియా చరిత్రలో ఒక కొత్త పుట...


.....ఇదే "ది బ్లడ్" ఆంగ్ల నవల తొలి అధ్యాయం.   

    అడుగునపడి, ఎన్నడూ తన రచనలకు వెలుగు చూపని 'శ్రీ' వ్రాసిన ఒకే ఒక్క నవల అది.

    'శ్రీ'కి బాహ్యరూపం చింపిరి జుత్తు, మాసినగడ్డం, శుష్కదేహం, చిరిగిన బట్టలు.

    అతని జీవితం చీదరింపులు, చీత్కారాలు, అపహాస్యాలమయం, గతుకుల బ్రతుకు.

    జీవితంలో విసిగివేసారి పొడారిపోయిన 'శ్రీ' ఈ సమాజంలో ఇమడలేక, నిరాశానిస్పృహలతో అసలు జీవితాన్నే అర్ధంతరంగా ముగించుకోవలె ననుకున్న తరుణంలో అతని మెదడులో తళుక్కున మెరిసిందొక ఆలోచన.

    తనదంటూ  ఒక్క రచన అయినా మిగలాలి. అది వెలుగు చూడాలి. రచయితగా నిలవాలి...అందుకు ఏదో వ్రాయాలి అనేదే ఆ ఆలోచన.

    తన ఆలోచనకు తనే ఉత్తేజితుడయాడు రచయితగా 'శ్రీ'.

    సమకాలీన సాంఘిక జీవనం ఇతివృత్తంగా, సామాజిక చింతన నేపథ్యంగా "ది బ్లడ్" నవలను ఇంగ్లీషులో వ్రాశాడు. అది ఆకర్షణీయంగా ప్రచురితమయింది.

    'ది బ్లడ్' __ఆ ఒక్క నవల రీడర్ షిప్ లో 'గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్' రికార్డును బ్రద్దలుగొట్టి యావత్ ప్రపంచాన్ని విస్మయపరచింది.

    భారతీయుని ఆంగ్లనవల 'దిబ్లడ్' విడుదలైన కొన్ని గంటలలోనే విశ్వవ్యాప్తంగా కోట్లాది ప్రతులు అమ్ముడుపోయి ప్రపంచ వింతలలో మరొకటిగా చరిత్రను సృష్టించింది.

    అతని కలం నుంచి జాలువారే మరొక రచనకోసం అటు అసంఖ్యాక పాఠకలోకం, ఇటు పుస్తక ప్రచురణకర్తలు అర్రులు చాస్తున్నారు. ఎదురు తెన్నులు చూస్తున్నారు.

    'శ్రీ' శైలి, శిల్పం, కథ, కథనం, శబ్దజాల విన్యాసం ఇత్యాదులు "ది బ్లడ్" పాఠకులను ఉవ్వెత్తున ఊరించి కవ్వించి కదలించడం ఆ నవల ప్రాచుర్యానికి ఒక కారణం అయితే కావచ్చునేమో కాని, ప్రధానకారణం మాత్రం వేరే వున్నది!

    ఫలితం......

    'శ్రీ' ని తక్షణమే అరెస్టు చేయవలసిందిగా భారత ప్రభుత్వం ఉత్తర్వు చేసింది!

    దేశ బహిష్కరణే అతనికి సరయిన శిక్ష అంటూ సనాతనులు వీధుల కెక్కారు. కాదు, శిరచ్చేదమే అతనికి అసలు సిసలైన శిక్ష అంటూ ఛాందసులు గగ్గోలు పెట్టారు!

    అయితే, 'గయోపాఖ్యానము' అనే పౌరాణిక నాటకంలో గయుడు పరుగెత్తినట్టు శరణం పాహిమాం అంటూ ఎవరి కాళ్ళూ పట్టుకోలేదు 'శ్రీ'. అతను స్వీయ వ్యక్తిత్వం గల రచయిత!

 Previous Page Next Page