నా జవాబు విని "కోరమిన్ అవసరం లేదండీ, యిచ్చినందువల్ల నష్టమేమీ లేదనుకోండి. కండిషన్ ఏమీ బాగులేదు. ఈ రాత్రిలోపల కొలాప్స్ అయేటట్లుగా వుంది" అంటూంటే ఆయన ముఖంలో విచారరేఖలు గోచరించాయి. "ఆల్ రైట్! జాగ్రత్తగా చూస్తూ వుండండి" అంటూ ముందుకు కదిలాడు.
రౌండ్స్ అయిపోయాయి. చీఫ్, అసిస్టెంట్లు వెళ్ళిపోయాక జగన్నాధం గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగివచ్చి "చూడు మధూభాయ్! ఓ సాయం చేసి పెట్టాలి" అన్నాడు ప్రాధేయపడుతూన్న భంగిమ పెట్టి.
"ఏమిటి ?"
"నిన్న నువ్వు రాలేదు కదూ! నీ వార్డు పనంతా నేనే చేయాల్సి వచ్చింది. ఇవాళ ఒంట్లో ఓపికలేదు భాయి. రిపీట్ ఓ.పి.కి వచ్చే పరిస్థితిల్లో లేను. నీకెలాగూ డ్యూటీ తప్పదు కాబట్టి కాస్త సాయంపట్టెయి."
"అలాగే"
"థాంక్యూ, థాంక్యూ!" అంటూ స్టెతస్కోప్ వూపుకుంటూ వెళ్ళిపోయాడు. టైము చూసుకుంటే ఒంటిగంటన్నర అయింది. ఇహ యీ పూట భోజనానికి వెళ్ళివచ్చే ప్రసక్తిలేదు .ఇంతవరకూ వార్డులో యింజక్షన్లు యివ్వటమే మొదలుపెట్టలేదు. బయటకు వెళ్ళి కాఫీ త్రాగి వద్దామని బయల్దేరాను.
డ్యూటీ వున్నవారు పెందలకడనే యింటికి వెళ్ళి రావచ్చని తర్వాతెప్పుడో తెలిసింది, కాని తర్వాత నేనెప్పుడూ పెందలకడనే వెళ్ళిపోవాలని ప్రయత్నించలేదు. అసలు నా హౌస్ సర్జన్ పీరియడ్ లో టైముని గురించి నేనెప్పుడూ ఆలోచించినట్లు గుర్తు లేదు.
కాఫీ త్రాగి వార్డులోకి వచ్చి యింజక్షన్లు పూర్తిచేసుకునే సరికి మరోగంట పట్టింది. డ్రిప్ పెట్టిన కేసు అలానే వుంది. ఆమె తరపు బంధువులుకూడా ఎవరూ కనిపించలేదు. తర్వాత ఓ కేసు షీటు తీసుకుని పూర్తిచేసేసరికి దాదాపు మూడయింది. ఇహ రిపీట్ ఓ.పి.కి వెళ్ళే టైము అయిందని బయటకు వచ్చాను.
ఓ.పి. దగ్గర జనాన్ని చూసేసరికి గుండె బేజారయిపోయింది. ఆడవాళ్ళు ఎన్ని వందలమందో వున్నట్లు క్రిక్కిరిసి వున్నారు. మొగవాళ్ళ వైపు ముప్పయి నలభయి మంది మాత్రం వున్నట్లు కనిపించారు.
"రండి" అని చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించింది. ఓ.పి.సిస్టర్, లోపలికి అడుగుపెడుతూంటే.
నేనూ నవ్వి, వెళ్ళి, నా సీటులో కూర్చున్నాను.
జనంలో అలజడి బయల్దేరింది. గుమ్మందగ్గర ఆయా నిలబడి ఒక తలుపు మూసి గదమా'యిస్తూ జనాన్ని అదుపులో వుంచుతోంది.
సిస్టర్ బల్లకు ప్రక్కన వున్న స్టూల్ మీద కూర్చుంది. "సారీ డాక్టర్, మీ ముందు కూర్చుంటున్నాను" అంటూ.
మళ్ళీ తనే "చూడండి డాక్టర్! ఈ స్లిప్స్ మీద మీరు సంతకాలు పెడుతూండండి. నేను రిపీట్ చేసి పంపింవేస్తూ వుంటాను. ఇదిగో యీ పుస్తకంలో మనం ఓ.పి. చీట్ల నెంబర్లు నోట్ చేసుకోవాలి" అంది ఓ పుస్తకం చూపిస్తూ.
"కొన్ని హాస్పటల్స్ హౌస్ సర్జన్ సంతకం పనికి రాదనుకుంటాను. అసిస్టెంట్లే సైన్ చేసి రెడీగా వుంచితే హౌస్ సర్జన్లు ఉపయోగిస్తూ వుంటారు" అన్నాను.
"ఇక్కడా యిదివరకు అంతే. కాని ఆ పద్ధతి వల్ల అసిస్టెంట్లకు పని ఎక్కువయిపోతూందని మీకు పవర్సు యిచ్చేశారు. అయితే దీనివల్ల మరో నష్టం వచ్చిపడింది. తమకు కావలసిన మందులు రాసేసుకుని, సంతకాలు పెట్టుకుని యిళ్ళకు పట్టుకుపోతున్నారు హౌస్ సర్జన్లు. ఎక్కడలేని మందులూ వీళ్ళకే సరిపోవటం లేదు" అంది సిస్టర్ నవ్వుతూ.
నేను విద్యార్ధిగా వున్నప్పటి నుంచే ఆ విషయం తెలుసు నాకు, అందుకని ఏమీ మాట్లాడలేదు.
"ఇంక పంపమంటారా అమ్మగారు?" అని అడుగుతోంది ఆయా, గుమ్మం దగ్గర్నుంచి.
"ఒక్క నిమిషం" అంటూ ఓ సిస్టర్ లోపలకు అడుగుపెట్టి "గుడ్ ఆఫ్ టర్ నూన్ డాక్టర్! నేను మేల్ ఓ.పి.సిస్టర్ని అక్కడి హౌస్ సర్జన్ గారు రాలేదు సైడ్ స్లిప్స్ యిస్తే నేను మేనేజ్ చేస్తాను" అంది, నా దగ్గరకు వచ్చి, బల్లమీద వేలితో రాస్తూ.
"అవునవును అతను రానని చెప్పాడు. నేనే మరిచిపోయాను" అంటూ ఓ గుప్పెడు సంతకం చేసిన స్లిప్స్ తీసి ఆమెకందిచ్చి "ఇవి అయిపోయాక మళ్ళీరండి" అని చెప్పాను.
"థాంక్యూ డాక్టర్ !" అంటూ వెళ్ళిపోయింది.
"ఆమె పేరేమిటి ?" అన్నాను.
"అమ్మా, ఆశ! మనిషిని చూడగానే పేరు తెలుసుకోవాలని పించిందా ? చెప్పను" అంది ఊరిస్తున్నట్టు.
నేనేం మాట్లాడలేదు .అనవసరపు చనువు ప్రదర్శించాననిపించింది. తల వంచుకుని మాట్లాడకుండా సంతకాలు పెడుతున్నాను. ఆయా ఆడవాళ్ళని లోపలకు విడిచి పెట్టింది. ఇహ వాళ్ళు దురాక్రమణ మొదలుపెట్టారు.
గబగబ సంతకాలు చేసి ఓ రాశి తయారుచేసి, సిస్టర్ పని తగ్గించటానికి నేను కూడా కొంతమందికి వ్రాసి పంపించేస్తున్నాను.
మనసులో యింకేమో ఆలోచన్లున్నాయి. ఊరికినే చూసి వ్రాసి వెయ్యటమేగా, మెదడు ఉపయోగించవలసిన పని లేకపోతూంది.
"హఠాత్తుగా మాట్లాడటం ఆపేశారేం ?" అంది సిస్టర్ నా వంక చూడకుండానే చీటీ వ్రాస్తూ ,మెల్లిగా.
"పని చేస్తున్నాంగా."
"మహలావు యింతోటి పనికి మాట్లాడటం ఆపెయ్యాలా ఏమిటి ? కబుర్లు చెప్పండి."
"ఏం కబుర్లు చెప్పను ?"
"ఎందు కనిపించింది మీకు ఆ అమ్మాయి పేరు తెలుసుకోవాలని....?"
"ఓస్! అదా ? దాన్ని గురించి సీరియస్ గా ఆలోచించి మనసు పాడుచేసుకోకండి. ఇ.ఎన్.టీ ప్రాక్టికల్స్ రోజున నా సీటు దగ్గర ఆ అమ్మాయే నిలబడి లైటు ఫోకస్ చేస్తోంది. అటూ యిటూ చూసి మెల్లగా డయాగ్నిసిస్ కూడ చెప్పేసింది. ఇ.ఎన్.టీ. పరీక్షలై ఎనిమిది నెలలకు పైనా అయిపోయింది. ఆమెకు తెలిసివుండదు, కాని నేను గుర్తుపట్టాను.
"అదా ? మొత్తానికి బలేవారే. ఆ అమ్మాయి పేరు లలిత. నాలాగే సెకండియర్. మేమిద్దరం ఒకటే బ్యాచి" అంది.
రెండు నిమిషాలు మౌనంగా గడిచాయి. చేతులు వాటి పని అవి చేసుకుపోతున్నాయి. పేషెంట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చివెళ్ళిపోతున్నారు. గుమ్మం దగ్గరనుంచి ఆయా అరుపులు, గదమాయింపులు వినబడుతున్నాయి.
"మరి నా పేరు ఆడగలేదేం ? నేను మీకు పరీక్షల్లో సాయం చెయ్యలేదనా ?"
"అలా అని కాదు. మీ పేరు నాకు ముందే తెలుసుగా."
"ఆఁ అన్నీ అబద్ధాలు. ఎలా తెలుస్తుంది ? చెప్పండి చూద్దాం. పోనీ"
"ఇంత చిన్న విషయం కనుక్కోలేనుకున్నారా ? నళిని."
ఆమె కనులు ఆశ్చర్యంతో మరింత విప్పారితాలయాయి. "గడుసు వాళ్ళేనే. ఏమో ననుకున్నాను. ఎలా తెలుసుకున్నారు ?"
"ఎలానేమిటి ? మీ నీలనేత్రాలు చెప్పాయి."
"అబ్బా! చాలా మాటలు వచ్చే ! బడాయిలు మాని నిజం చెప్పండి . ప్రొద్దుట నా టెక్ట్స్ బుక్ మీద చూశారుకదూ !"
నేను నవ్వుతూ తల ఊపాను.
"బలేవారే" అని ఊరుకుంది.
నేను కొంచెమాగి పని చూసుకుంటూనే "మీరు సెకండియర్ అన్నారు కదా, ఏయేటి కాయేడు ,తేడా ఏమిటి?" అనడిగాను.
"మీకు నిజంగానే తెలియదా ?"
"ఊహు. ఎప్పుడూ శ్రద్ధగా గమనించేవాణ్ని కాదు."
"ఇక్కడ భుజం క్రింద ఆకు పచ్చని పట్టీలు చూశారా ? అవి ఎన్నుంటే_అన్నో ఏడని సూచిస్తాయి. నేను రెండో ఏడు కాబట్టి రెండున్నాయన్నమాట. మూడో ఏడుకూడా అయిపోయాక ఆరు నెలలు గైనిక్, యాంటీనేటాల్ డిపార్ట్ మెంట్సులో పనిచెయ్యాలి. అప్పుడు మూడు పట్టీలూ పోయి వేరే యింకొకటి వస్తుంది. అది ప్యాసయితే స్టాఫ్ అవుతాము. యూనిఫారం కొద్దిగా మారి, తలమీద యీ కిరీటంలాంటిది చూశారా. అది యింకోరకంగా తయారౌతుంది" అన్నది, సాధ్యమైనంతవరకూ విశదీకరిస్తూ.
నేను ఊ, ఆ అంటున్నాను.
అలాగే ఏవో కబుర్లు చెప్పుకుంటూ పేషెంట్సుని అయిదింటికల్లా పూర్తిచేసేశాము. ఈలోగా మేల్ ఓ.పి.సిస్టర్ వచ్చి మరో బొత్తు చీట్లు పట్టుకు వెళ్ళింది.
"నేనింక వార్డుకి వెళ్తాను. అక్కడ కేసు లెలా వున్నాయో చూద్దాం" లేవబోతున్నాను.
ఆమె నన్ను వారిస్తూ "ఉండండి. కాఫీ త్రాగి వెళ్దురు గాని" అంటూ లేచి గోడ నానుకొని వున్న బీరువా దగ్గరకు వెళ్ళి, తలుపు తెరిచి అందులోంచి ప్లాస్క్, మూడు గాజుగ్లాసులు బయటకు తీసింది.
"కాఫీ ఎప్పుడు తెప్పించారు ?"
"తెప్పించాంగా మీ కోసం" అని ఆయాని పిలిచి మేల్ ఓ.పి. సిస్టర్ని తీసుకురమ్మని కబురుచేసింది.
ఆమె కూడా వచ్చాక మూడు గ్లాసుల్లోనూ కాఫీ పోశాక ముగ్గురం తీసుకున్నాం.
"మా డాక్టరుగారు చాలా మంచివారు" అంది నళిని సిస్టర్ మధ్యలో.
"అలాగా ? అప్పుడే నీకెలా తెలిసిందాయన మంచితనం ?"
"తెలిసిందిలే. నేను కనిపెట్టేసేగా. మీ డాక్టర్ వొట్టి నాలిముచ్చు?"