Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 4

   
    హేమమాధురి నవ్వింది. "థ్యాంక్స్. నాకు పూర్తిగా కావాల్సిన సమాధాన మదికాదు."


    " మరి?"


    "నీ....."


    "చెప్పు."


    "లవ్"


    "ఉలికిపడ్డాడు.


    "ఏం?"


    "నాకు ... యిలాంటివి యిష్టంలేదు."


    "అంత పసిపిల్లాడివా?" అంటూ దగ్గరకొచ్చింది. "చంద్రా! రియల్లీ ఐ లవ్ యూ వెరీమచ్. నిన్ను దగ్గరకు తీసుకోవాలనీ, నీ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవాలనీ, నీపెదాలమీద గట్టిగా ముద్దు పెట్టుకోవాలనీ....."


    అతనేదో చెప్పబోతున్నాడు. ఆమె చప్పున ముందుకు వొంగి అతని పెదవులమీద ముద్దు పెట్టేసుకుంది.


    పెదవులమీద ఎంగిలితోబాటు మిళితమైన చిన్నది వొణుకు.


    అతన్ని భయాన్ని గమనించినట్లుగా ఆమె చిలిపిగా నవ్వేసి అక్కడ్నుంచి పారిపోయింది.


    అప్పట్నుంచీ ఆమెనుంచీ అతను తప్పించుకుని, తప్పించుకుని తిరగసాగాడు.


    అతనికి ఆడపిల్లలంటే ఎలర్జీ అని ఉద్దేశం కాదు. అతనికి తనలాగే సున్నితంగా, నిష్కల్మషంగా వున్న మనస్తత్వం, నీలాంటి నవనీత హృదయం నచ్చుతాయి.


    తనకు తెలీకుండానే అన్వేషణ మొదలుపెట్టాడు.


    ఈ అన్వేషణలో అతని కనేక విచిత్రమైన వ్యక్తులు తారసిల్లారు. విపరీతమైన సంఘటనలు ఎదురయినాయి.

 
    అతనెంత మృదు మనస్కుడో - అంత కఠినమైన,  వికృతమైన నిజాలు లోకంలో కనబడసాగాయి.
 స్వార్దం, అవినీతి, గూండాయిజం, వికృతత్వం, పై శాచికతత్వం, నీచత్వం - యివే ఎక్కువగా గోచరించసాగాయి.


    మొదట్నుంచీ అతన్లో రచనా వ్యాసంగంమీద అభిరుచి వుంది. ఏమీ తోచనప్పుడు, హృదయంలో భావాలు చెలరేగినప్పుడు వాటిని అక్షర రూపంలో కాగితాలమీద పొందుపరుస్తూ వుండేవాడు.


    ఇప్పుడి సంఘటనలవల్ల, తనలోని కల్లోలంవల్ల మనసు కదిలి వాటిని చిన్న చిన్న కథలుగా  రాయసాగాడు.

 
    తన పేరుతో రాయటానికి బిడియపడ్డాడు. "మంజరి" అనే పెన్ నేమ్ తో తన రచనలు పంపసాగాడు.

 
    మొదట్లో కొన్ని తిరిగొచ్చాయి.


    కొన్నాళ్లకు ఓ ప్రముఖ వారపత్రికలో అతని మొదటి కథ అచ్చయింది.

 
    ఆ కథ సగజత్వానికి, వాస్తవికతకు చాలా  దగ్గర్లో వుంది.


    ఒకరకంగా తాను సమాజానికి ఎదురీత యీదుతున్నాడని తెలుసు. ప్రస్తుతం సాహిత్య ధోరణి కమ్మర్షియల్ రంగు పులుముకుని వీరవిహారం చేస్తోంది. సెక్స్ వయలెన్స్ క్రైమ్, విశృంఖలత్వం, అసహజత్వం, నిజాయితీ ధోరణులు, యివి వెస్టిగేటివ్ ఎలా లేవో  పేరుతో అర్దంలేని ప్రయోగాలు, ట్యాలెంట్ ఎక్కువ లేకపోయినా పబ్లిసిటీ స్టంట్స్ ద్వారా,  వక్రమార్గాల ద్వారా కొందరు రచయితలు రంగ ప్రవేశంచేసి వీరవిహారంచేస్తూ వుండటం, ఏవిటో చెప్పలేని ఊపిరాడనంత వేగం, రచనల్లో ఫైటింగ్స్, కొత్తరకం  తుపాకులతో యుద్దాలు, అవే సినిమాలుగా వచ్చి ప్రజలు ఎగబడి చూడటం, లేకపోతే ముందుగా సినిమా కథ తయారుచేసి, అదే నవలగా యివ్వటం....


    ఈ మహా ప్రవాహానికి ఎదురీదుతున్నామని తెలుసు.


    అయినా మనసులోని వేదన. ....


    తన దారికి భిన్నంగా వెళ్ళలేకపోతున్నాడు.


    క్రమంగా అతని కథలు కొన్ని ప్రతులవరకూ అచ్చయినాయి.  పాఠకలోకంలో కొంతవరకూ 'మంజరి' పేరు వినబడసాగింది. అయినా మంజరి ఎవరో తెలీకుండా జాగ్రత్తపడ్డాడు. ఎందుకో.... ఎందుకో.... తనలోని రచయితను గుప్తంగానే వుంచాలనిపించింది.


    ఈ మధ్యనే ఒక నవల రాయాలని సంకల్పించి రాయటం మొదలుపెట్టాడు.


                        *    *    *    *

    
    ప్రక్క యింట్లో స్లాబ్ పోసే పని మొదలయింది. రోడ్డుమీద సిమెంటు, కంకర కలిపే మెషీన్ వికృతంగా శబ్దం చేస్తూ తన పని తాను చేసుకుపోతోంది. ఇరవై ముప్పయి మంది కూలీలు - ఎక్కువగా ఆడవాళ్ళు గబగబ తట్టలతో సిమెంటు, నీళ్లతో కలిపిన ఛిప్స్ మ్రోసుకుంటూ- అటూ యిటూ హడావుడిగా తిరుగుతున్నారు.

 
    అతన్నంతకంటే  ఆకర్షించిన దృశ్య మింకొకటుంది.

 
    ఆ పనివాళ్లు  మొదట పని ప్రారంభం కాకముందే - తమ మూటలు విప్పుకుని, వాటిలోని అన్నాన్నీ, ఎర్రని ఉల్లిపాయ కారంలాంటి పదార్దాన్ని కలుపుకుని ఆప్యాయంగా తింటున్నారు. ఇంచుమించు గంటకోసారి బ్యాచీలుగా,  బ్యాచీలుగా పనిలోంచి దిగివచ్చి అన్నాలు తింటున్నారు.


    అలా - ఏ భేషజాలూ లేకుండా, ప్రతి ముద్దనూ ఎన్ జాయ్ చేస్తూ తినటం - అతనికెంతో మనోజ్ఞంగా వుంది.


    అతనికి నోరూరుతోంది.


    అలా వాళ్లతో కలిసి సహజసిద్దంగా కూర్చుని, అలాంటి ఆహారం తినాలని అతని మనసు ఉవ్విళ్లూరుతోంది.
    ఎప్పట్నుంచో అతని కది తీరని కోరిక.


    కొంతమంది హీరోలుగా చలామణీ అవాలని కలలు కంటారు. కొంతమంది తమకు నచ్చిన రంగాల్లో అతీతులుగా, అసమాన్యులుగా వున్నట్లు కలలు కంటారు.

 
    అతను  జీవుతపు పొరల్లోకి చొచ్చుకుపోయి, అతి సామాన్యంగా వుండటాన్ని కోరుకుంటున్నాడు.

 
    చాలాసేపలా చూసి, తర్వాత తాను ఒక చోటుకు వెళ్లాలన్న సంగతి గుర్తుకొచ్చి, డ్రెక్ ఛేంజ్ చేసుకుని క్రింద కొచ్చి, కారెక్కి డ్రైవింగ్ సీటు ముందు కూచున్నాడు.


    "బాబుగారూ" అన్న కంఠం వినిపించి తల ప్రక్కకు త్రిప్పి చూశాడు.

 
    పదహారేళ్ల అమ్మాయి - ఆ అమ్మాయి ముఖంలో కళవుంది; పెద్ద పెద్ద కళ్లలో సౌందర్యముంది.


    ఆ అమ్మాయి రోడ్డుప్రక్క చిన్నకొట్టు పెట్టుకొని సీమచింతకాయలూ, జామకాయలూ, ఉప్పూకారం అద్దిన మామిడికాయ ముక్కలూ, సీజన్లబట్టి అమ్ముకుంటూ వుంటుంది.


    తలత్రిప్పి ఆప్యాయంగా ఆమెవైపు చూశాడు.


    "మీ పువ్వు" అంటూ చిన్న బుట్టలోంచి ఎర్రగులాబీ తీసి అతని కందించింది.


    నవ్వి అందుకుని 'థాంక్స్' అన్నాడు.


    ఆ అమ్మాయి పేరు పాప. అసలు పేరేమిటో తెలీదు. అందరూ పాపా అనే పిలుస్తారు.


    పాప నవ్వింది. ముత్యాలు రాలినట్లయినాయి. ఎర్రటి లేతచిగుళ్లు ఎండ కాంతికి తళుక్కుమంటూ మెరిశాయి.

 Previous Page Next Page