"ఎమ్.డి. సీట్లేమీ బొట్టు, కాటుకాపెట్టి పిలిచి ఇవ్వటల్లేదులే. ఎమ్.డి. అంటే అర్థం తెలుసా?"
"డాక్టర్ ఆఫ్ మెడిసిన్."
"అదికాదురా నాయనా. మ్యారీడ్ ఎండ్ డైవోర్స్ డ్. తెలిసిందా?"
ఆ కుర్రాడు బుర్ర ఊపాడు.
"ఏదీ! రిపీట్ చెయ్యి."
అలా చేశాడు.
ఇంకో జూనియర్ని పిలిచారు.
"నువ్వేం చదువుతావు ఎమ్.బి.బి.ఎస్ అయినాక?"
"ఎం.ఎస్."
"అర్థం చెప్పు."
"మేస్టర్ ఆఫ్ సర్జరీ.
"నీ మొహం. నే చెబుతున్నా విను. మ్యారీడ్ ఎండ్ సెపరేటెడ్. రిపీట్ చెయ్యి."
తిరిగి చెప్పాడు.
అంతలో మెడికల్ కాలేజి ఆఫీస్ దగ్గరకు కూతుర్ని చేర్పించటానికి గావును- ఓ లేడీ స్టూడెంట్ తో కలిసి మధ్య వయస్కుడొకాయన వచ్చాడు.
సీనియర్స్ మధ్య నుంచి రాజీ ఊడిపడ్డాడు.
"నీ పేరేమిటి?" అనడిగాడా అమ్మాయిని.
తండ్రి ముఖం కొంచెం ఎర్రబడింది. "ఎందుకు?" అనడిగాడు.
"తెలుసుకోవాలని."
తెలుసుకుని ఏం చేస్తావు?"
"మీ అమ్మాయినేమీ చెయ్యనులెండి... చెప్పు. ఏమిటి నీ పేరు?"
అనవసరంగా గొడవెందుకనుకుని "మోహిని" అని చెప్పిందా అమ్మాయి.
"ఇంటర్ లో తెలుగు మీడియమా? ఇంగ్లీషా?"
"ఇంగ్లీషు."
"గుడ్. మీ నాన్నకి నువ్వు ఎన్నో కూతురివి" అన్న ప్రశ్నను ఇంగ్లీషులో ఏమంటారో చెప్పు."
ఆ అమ్మాయి సీరియస్ గా ముఖంపెట్టి ఆలోచిస్తోంది.
"ఏమిటి చెప్పలేవా? మీ నాన్నకు నువ్వు ఎన్నో కూతురివి అన్నదానికి ఇంగ్లీషులో తెలీదూ?"
"వాట్ ఈజ్ యువర్ నంబర్ ఎమాంగ్ ది డాటర్స్ ఆఫ్ యువర్ ఫాదర్?" అని చెప్పింది చివరకు ఆలోచించి ఆలోచించి.
"ఏడిసినట్లుంది. ఇంతకన్నా కరెక్ట్ గా చెప్పలేవూ?"
"హౌమెనీ సిస్టర్స్ ఆర్ యూ అండ్ వాట్ యీజ్ యువర్ నంబర్?"
"ఆపు. నీ ఇంగ్లీష్ నాలెడ్జి చాలుగాని ఇహ జనరల్ నాలెడ్జి అడుగుతాను ఇండియాకు మూడో ప్రెసిడెంట్ ఎవరు?"
ఆ అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిన సూపర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. చాలా సిన్సియర్ గా ఆలోచిస్తోంది. గుర్తు రావటంలేదు.
"పోనీ ఇది చెప్పు. ఇంకా సింపుల్. సంజీవరెడ్డికి ముందు ప్రెసిడెంట్ గా వున్న వ్యక్తి ఎవరు?"
ఆ అమ్మాయి ముఖం తెల్లగా పాలిపోయింది. అన్నీ తెలిసిన విషయాలే. అయినా ఎందుకు గుర్తు రావటంలేదో అర్థంకావటం లేదు.
రాజా ఆ అమ్మాయి తండ్రివంక తిరిగాడు. "చూశారా మీ అమ్మాయి తెలివితేటలు. ఇలాంటివాళ్ళంతా డాక్టర్లయితే- వేరే ఫామిలీ ప్లానింగ్ అక్కర్లేదు. దేశజనాభా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది" అని దూరంగా వెళ్ళిపోయాడు.
అమ్మాయి తండ్రి చాలా అవమానంగా ఫీలయ్యాడు. క్విజ్ పోటీలో ఓడిపోయినట్లు బిక్కమొహం పెట్టుకుని నిలబడ్డ కూతురితో "ఏమిటమ్మా! ఇంత చిన్న జవాబులు చెప్పలేకపోయావు?" అన్నాడు.
"కుదరటంలేదు నాన్నా. పోనీ నువ్వు చెప్పు. ఆ అబ్బాయి ఇంకా అక్కడే నిలబడి వున్నాడు. గభాల్న వెళ్ళి మొహంమీద గుద్దినట్లు చెప్పేసి వస్తాను."
ఆయనెప్పుడూ ఇంగ్లీషు నవలలు విడవకుండా చదువుతూ వుంటాడు. రోజూ ప్రొద్దుటే పేపర్ చదవకుండా వుండలేడు.
"అదా... అదీ... అదీ..." బుర్ర గోక్కోసాగాడు.
ఇంతలో ఆపద్బాంధవుడిలా అటెండర్ వచ్చి ప్రిన్స్ పాల్ గారు లోపలకు పిలుస్తున్నారని చెప్పాడు.
"పదమ్మా పద. మొదట జాయినవుదువుగాని. ఈ కిష్కిందావాసుల ప్రశ్నలకు మనం జవాబుచెప్పవల్సిన అవసరమేమిటి?" అంటూ కూతుర్ని తీసుకుని లోపలకు నడిచాడు.
అదే సమయానికి లేడీస్ హాస్టల్ నుంచి వచ్చిన బస్సు కాలేజి క్యాంపస్ లోకి వచ్చి ఆగింది. మొదట సీనియర్స్ గబగబ దిగి జూనియర్సందర్నీ ఒక్కొక్కరుగా దింపి వరసగా నిల్చోబెడుతున్నారు.
మాధవి, కళ్యాణికూడా దిగారు.
మాధవి ఏప్రాన్ తొడుక్కుంది. కల్యాణికి అంత ప్రగల్భాలు కొట్టిన టైలరు సకాలానికి ఇవ్వలేకపోయాడు.
"ఏయ్. నీ ఏప్రానేదీ?" అనడిగింది ఓ సీనియర్.
"టైలర్ ఇవ్వలేదు."
"అవన్నీ మాకనవసరం. నువ్వు ఏప్రాన్ వేసుకోలేదు కాబట్టి అందరికన్నా ముందు నిలబడు" అని కల్యాణిని ముందు నిల్చోబెట్టి జూనియర్సందర్నీ ఆమె వెనక క్యూలో నిల్చోబెట్టింది.
"కమాన్ మార్చ్. ఇక్కడ్నుంచి లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ ఎనాటమీ థియేటర్ దాకా పదండి. స్టార్ట్."
జూనియర్సందరూ అటూ ఇటూ చూడకుండా మార్చింగ్ చేసుకుంటూ నడుస్తున్నారు. గార్డెన్ చుట్టూ తిరిగి మెట్లెక్కి వరండాలోకివచ్చి తర్వాత హాల్లోకి వచ్చారు.
ఎదురుగా రెండు నిలువెత్తు మిర్రర్స్ బిగించి వున్నాయి.
అనుకోకుండా కల్యాణి అటుకేసి చూసింది.
ఒకదానిమీద "యామ్ ఐ ప్రెజంటబుల్?" అని రాసివుంది. రెండో దానిమీద ఏమి రాసివుందో చూసేలోపలే ప్రక్కనుంచి ఓ సీనియర్ "దిక్కులు చూడకుండా నడవమన్నానా?" అని గద్దించటం వినిపించి ఉలిక్కిపడి మెట్లెక్క సాగింది.
"అవుట్ ఆఫ్ ది ఓల్డ్ వార్న్ కమెత్ ఏ న్యూవార్న్" అని వెనకనుంచి ఇంకో స్టూడెంటు అక్కడున్న బోర్డులోని వాక్యాలని చదవడం వినిపించింది.
ఫస్ట్ ఫ్లోర్ చేరుకునేసరికి ఎదురుగా "ది బెస్ట్ డాక్టర్స్ ఆర్ డాక్టర్ డయట్, డాక్టర్ క్వయిట్, డాక్టర్ మెర్రీమ్యేన్ అన్న పెద్ద పెద్ద అక్షరాలు... వాటి క్రింద...