"ఇదిగో. అటూఇటూ చూడకుండా పైకి నడవమన్నానా?"
మళ్ళీ ఉలిక్కిపడి సెకండ్ ఫ్లోర్ లోకి దారితీసింది. మెట్లెక్కేసరికి ఎదురుగా పెద్ద ఏప్ బొమ్మ- చేతిలో డార్విన్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ పుస్తకం...
అంతవరకూ జూనియర్స్ లో కొందరికి ఆవేశం వచ్చి క్యూలోంచి తప్పుకుని అటూఇటూ చెదిరిపోయారు.
కల్యాణి చూసింది. "ఇదిగో! థియేటర్ దాకా క్యూ వదలకండి" అని అరిచింది ఆందోళనగా.
"ఏం? నువ్వే మహా లీడర్ లాగా ఆజ్ఞల్ని జారీచేస్తున్నావు?" అంది ఓ జూనియర్ ఉక్రోషంగా.
"ఆజ్ఞలుకాదు. మీరు క్యూ కట్టకపోతే వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇస్తారు.
"అవన్నీ మాకు అనవసరం" అని జూనియర్స్ వినిపించుకోకుండా ఎవరిదార్న వాళ్ళు విడిపోయారు.
దడదడలాడుతోన్న గుండెతో కల్యాణి థియేటర్ ద్వారం దగ్గరకు వచ్చేసరికి రాజా ఎదురయ్యాడు.
"నువ్వు క్యూ ఎందుకు మెయిన్ టెయిన్ చెయ్యలేదు?" అనడిగాడు కటువుగా.
కల్యాణి గొంతు తడబడింది... "వాళ్ళు నా మాట వినలేదు."
"నువ్వొట్టి చవటవన్న మాట."
ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంతలోనే రోషం ముంచుకువచ్చి.
"చవటనేం కాను. అన్నవారే అన్నీ" గబుక్కున అనేసి అతన్ని రాసుకుంటూ లోపలకు వెళ్ళిపోయింది.
రాజా ఒక్కక్షణంపాటు నిర్ఘాంతపోయాడు. ఇంకా పూర్తిగా తేరుకోకముందే మాధవి అతనికి దగ్గరగా వచ్చింది.
"హల్లో సోమలింగంగారూ! బాగున్నారా?"
చురుక్కుమన్నట్లయింది. ఎర్రబడ్డ కళ్ళతో ఆమెవంక చూశాడు.
ఆమె నవ్వుతూ అతనికి గుడ్ మార్నింగ్ చెప్పి లోపలకు నడిచింది.
* * *
ఎనాటమీ థియేటర్ లో టేబిల్స్ మీద డెడ్ బాడీస్ పేర్చబడి వున్నాయి. ఒక్కొక్కచోట సంపూర్ణమైన డెడ్ బాడీ, కొన్నిచోట్ల విడివిడిగా తీయబడ్డ అవయవాలు.
మాధవి, కల్యాణి ఒకచోట పడలేదు. వారివారి పేర్లనిబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వేరేవేరే బ్యాచ్ లలో పడ్డారు.
ఒక్కొక్క బ్యాచ్ కి నలుగురు. కల్యాణివున్న బ్యాచ్ కి లోవర్ లింబ్ వచ్చింది.
ఎనాటమీ ట్యూటర్ వచ్చి డిసెన్షన్ ఎలా చెయ్యాలో చెప్పి, కొంచెంచేసి చూపించి వెళ్ళిపోయాడు.
జీవితంలో మొదటిసారి... డెడ్ బాడీని ముట్టుకోవాలంటే భయంగావుంది. ఒళ్ళు జలదరిస్తోంది. నువ్వంటే నువ్వని వంతులు వేసుకుంటున్నారు.
అందర్లోకి కల్యాణి మెతకకాబట్టి ఆమెకు అంటగట్టి మిగతా ముగ్గురూ ఆమె వెనకచేరారు. అందులో ఒకమ్మాయి కన్నింగ్ హాం మాన్యువల్ తీసుకుని ఎక్స్ ప్లెయిన్ చెయ్యసాగింది. సోల్ ఆఫ్ ది పుట్. కల్యాణి స్టూల్ మీద కూర్చుని స్కాల్ వెల్, ఫోర్ సిఫ్స్ చేతుల్లోకి తీసుకుని స్కాల్ వెల్ తో డెడ్ బాడీ పాదంమీద ఒక్క గీటుగీసింది. వ్రేళ్ళు బిగుసుకున్నాయి. ఒళ్ళు గగుర్పాడుస్తోంది. ముచ్చెమటలు పడుతున్నాయి.
అనుకోకుండా తల పైకెత్తి చూసింది. దూరంగా ఒక డెడ్ బాడీ దగ్గర రాజా కనిపించాడు. ఒక స్టూల్ మీద కూర్చుని ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ ఆమెవంకే చూస్తున్నాడు.
కల్యాణికి చాలా భయంవేసింది. ఈ మెడికల్ కాలేజి, ఈ శవాలు, ర్యాగింగులు ఒదిలి ఇంటికి పారిపోదామా అనిపించింది.
లైట్ గా తీసుకుందామని ప్రయత్నిస్తోంది. చేతకావటం లేదు.
మొత్తంమీద రెండుగంటలు గడిచింది. తర్వాత థీరీక్లాస్ జూనియర్సందరూ వెళ్ళి ప్రక్కనేవున్న గ్యాలరీలో కూర్చున్నారు. ఇంకా ప్రొఫెసర్ రాలేదు.
కల్యాణి, మాధవి ప్రక్కనే కూర్చుంది.
గుమ్మందగ్గర రాజా కనిపించాడు. కల్యాణివంక చూస్తూ ఇటురమ్మని చేత్తో సౌంజ్ఞ చేశాడు.
కల్యాణి బిత్తరపోయి మాధవివంక చూసింది.
"వెళ్ళు ఫర్వాలేదు. వెళ్ళకపోతే ఇంకా రెచ్చిపోతాడు" అంది మాధవి.
విధిలేక గబగబ కొట్టుకుంటూన్న గుండెతో కల్యాణి లేచింది. "ధైర్యంగా వుండు" అని మాధవి హెచ్చరించింది. కల్యాణి గుమ్మం దగ్గరకు వెళ్ళింది.
"బయటకురా."
కల్యాణి అతని వెనకనే వెళ్ళింది.
"నీకు చాలా పొగరులా వుందే."
ఆమె ఏమి జవాబు చెబుదామా అని ఆలోచిస్తోంది.
"మాట్లాడవేం?"
"పొగరుగా ఏం ప్రవర్తించాను?" అనడిగింది చివరకు.
"ఇందాక నన్ను చవటనన్నావు."
"అనలేదు... అదేదో... దొర్లిపోయింది."
"దొర్లిపోయిందా? ఈ రాజా అంటే ఎవరో నీకింకా తెలీదల్లే వుంది, వెళ్ళి నీ సీనియర్స్ ని కనుక్కో. నా గురించి చెబుతారు."
ఆమెకు ఏడుపు వస్తోంది. "మిమ్మల్ని ఎదిరించాలని అనలేదు. నాకా ఉద్దేశం లేదు" అంది ఒణికే గొంతుతో.
అతను గర్వంగా చూశాడు. "సరే. అయితే సారీ చెప్పుకో" అన్నాడు.
"సారీ" అంది కల్యాణి.
"అలా కాదు. నా పాదాలు పట్టుకుని క్షమించండి అణు."
ఒక్కసారిగా ఆమెలో రక్తం జరజర ప్రవహించింది. ఆమె పుట్టి పెరిగిన ఫ్యామిలీ స్టేటస్, తాను ఎంతో పదిలంగా కాపాడుకున్న ఆత్మగౌరవం....చేయని తప్పుకు ఒక మొగవాడిముందు దాసోహమనటమా? అతని పాదాలు తాకటమా?
ఆమె కళ్ళలోని రక్తపుజీరనతను చూశాడు. "ఏం?" అహం అడ్డు వస్తోందా?" అన్నాడు హేళనగా.
అప్పటికీ ఆమె ఏమీ మాట్లాడలేదు.
"మర్యాదగా చెబుతున్నాను. పాదాలు తాకి క్షమార్పణవేడు. నిన్నింతటితో వదిలేస్తాను. లేదంటావా? నిన్ను ఫ్రెషర్స్ డే అయేటంతవరకూ కాల్చుకు తింటాను. నేను చెయ్యటమేకాదు హాస్టల్లో నీ సీనియర్లలో నామాట కెదురు చెప్పేవారులేరు. వాళ్ళతో దుర్భరంగా ర్యాగింగ్ చేయిస్తాను." రాజా ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నట్లన్నాడు.