Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 4


    అతని చేతిక్రింద బోలెడుమంది వర్కర్సు వున్నారట. సాయంత్రానికల్లా ఇచ్చేస్తానన్నాడు.

 

    అక్కడ్నుంచి బజారుకెళ్ళి డిసెక్షన్ బాక్స్ లు కొనుక్కుని హాస్టల్ కి వెళ్ళిపోయారు.

 

    ఆ రాత్రికూడా గరల్స్ హాస్టల్ లో ర్యాగింగ్ జరిగింది. కొంతమంది జూనియర్స్ ని మరీ వల్గర్ గా కూడా ఏడిపించారు.

 

    అంతకు ముందురోజులాగానే కల్యాణికి నిద్రపట్టలేదు. ఒకరాత్రివేళ మాధవికి మెలకువ వచ్చేసరికి ఆమె కళ్ళు తెరుచుకుని పై కప్పుకేసి చూస్తూ కనబడింది.

 

    "కల్యాణీ!" అని పిలిచింది.

 

    తల ఇటుకేసి త్రిప్పింది.

 

    "ఏమిటి ఆలోచిస్తున్నావు?"

 

    "ఆ గదిలో..."

 

    "ఏ గది?"

 

    "మన ఫ్లోర్ లోవున్న ఆ కార్నర్ గది. కొన్నేళ్ళక్రితం ఓ ఫైనలియర్ స్టూడెంట్ ఫ్యాన్ కి ఉరేసుకుని సూయిసైడ్ చేసుకుందని చెప్పారుగా."

 

    "ఇప్పుడా సంగతి దేనికి?"

 

    "అప్పట్నుంచీ ఆ రూమ్ నెవరికీ ఇవ్వటం లేదట స్టూడెంట్స్ భయపడతారని. ఆ గదికి అటూ ఇటూవున్న గదుల్లో వాళ్ళుకూడా భయపడిపోతూ వుంటారుట. ఆ స్టూడెంట్ దెయ్యమయిందని..."

 

    "దెయ్యంలేదు గియ్యంలేదు. అట్టేమాట్లాడితే నేవెళ్ళి ఆ గదిలో పడుకుంటాను."

 

    "మీకు చాలా ధైర్యమెక్కువ. ప్రొద్దుట చూశానుగా."

 

    మాధవి తన మంచాన్ని ఆమె మంచానికి దగ్గరగాలాక్కుంది. ఆమె భుజంమీద చెయ్యివేసి రాస్తూ పడుకుంది.


                                      2


    మరునాడు ఉదయంకూడా మెడికల్ కాలేజి క్యాంపస్ లో ర్యాగింగ్ జరుగుతోంది.

 

    గేటుదాటి లోపలకు వెళ్ళగానే, అటూఇటూ బిల్డింగ్స్. మధ్యలో గార్డెన్. గార్డెన్ ముందుభాగంలో పెద్ద స్త్రీమూర్తివిగ్రహం గొప్ప శిల్పసంపదను ఒలకబోస్తూ.

 

    కొందరు సీనియర్స్ జూనియర్స్ ని పిలిచారు.

 

    ఒకర్ని ఆ స్త్రీమూర్తి పెదవులు ముద్దుపెట్టుకు రమ్మన్నాడు. ఒకర్ని ఆ స్త్రీ వక్షోజాలమీద పెదవులు వుంచి రమ్మన్నారు.

 

    కుర్రాళ్ళు వెళ్ళి అలా చేసి వస్తున్నారు.

 

    రాత్రి హాస్టల్లో ర్యాగింగ్ కు గురికాబడ్డ విద్యార్థులు ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకున్న వారవటంచేత కిక్కురుమనకుండా సీనియర్స్ చెప్పినట్లు చేసి వస్తున్నారు.

 

    రాత్రి హాస్టల్లో...

 

    ఒకర్ని జయమాలినిలా డాన్స్ చెయ్యమన్నారు. ఒకర్ని ఎన్టీ రామారావులా అభినయించమన్నారు. ఇంకొకర్ని రాజబాబులా కిచకిచలాడమన్నారు.

 

    హాస్టల్ టెర్రస్ మీద కొంతమంది జూనియర్స్ కి- పూర్తిగా బట్టలూడదీసేసి న్యూడ్ గా చేసేశారు. వాళ్ళిప్పిన బట్టలన్నీ ఓ ప్రక్క కుప్పగా పోసి- అందర్నీ న్యూడ్ గానే కబాడీ ఆడమన్నారు.

 

    జూనియర్స్ నూడ్ గా వుండి కబాడీ ఆడారు- టెర్రెస్ మీద మూన్ లైట్ లో.

 

    చెమటలు పట్టేదాకా ఆడించారు.

 

    తర్వాత గభాల్న ఎవరి బట్టలు వాళ్ళు తడుముకోకుండా తీసుకోవాలి. డ్రాయరుగానీ, బనీన్ గాని, ప్యాంటుగానీ, షర్ట్ గాని హడావుడిలో ఒకరిది ఒకరు వేసుకున్నా- మళ్ళీ పనిష్మెంట్ వుంటుంది. అది రకరకాలుగా వుంటుంది. మెట్లు క్రిందకీ పైకీ పరిగెత్తించటం, అందరికీ పాదాభివందనం చేయించటం... ఇత్యాదులు.

 

    ఇద్దరు జూనియర్స్ ని ఒక గదిలోకి తీసుకొచ్చారు. అందులో ఒకరు స్త్రీగా భావించుకోవాలి. స్త్రీగా భావించుకున్న విద్యార్థిని పురుషుడిగావున్న విద్యార్థి రేప్ చేసినట్లు అభినయించాలి. చాలా సీరియస్ గా, నిజంగా రేప్ చేస్తున్నట్లు అభినయించాలి. రేప్ కి గురికాబడుతున్న విద్యార్థి చాలా సీరియస్ గా ప్రతిఘటించాలి. కాళ్ళూ, చేతులూ తన్నుకోవాలి. కేకలూ, పెడబొబ్బలూ పెట్టాలి.

 

    ఇంకో జూనియర్ని పిలిచారు. అతనికో కథ చెప్పారు.

 

    ఒక గ్రుడ్డివాడు, కుంటివాడు, మూగవాడు వున్నారు. గ్రుడ్డివాడి పెళ్ళాన్ని కుంటివాడు రేప్ చేశాడు. అది మూగవాడు చూశాడు. ఆ విషయం గ్రుడ్డివాడికి చెప్పాలి. "నీ పెళ్ళాన్ని ఆ కుంటివాడు రేప్ చేశాడు" అని చెప్పాలి. గ్రుడ్డివాడికి కళ్ళులేవు. చెప్పేవాడు మూగవాడు. అభినయంతో చెప్పాలి. తన పెళ్ళాం రేప్ కి గురికాబడిందని గ్రుడ్డివాడికి అర్థంకావాలి. జూనియర్ ని అభినయించ మన్నాడు. అతను అభినయిస్తూ నానా తంటాలూ పడుతున్నాడు. రకరకాల భంగిమలు ప్రదర్శిస్తున్నాడు. "అబ్బే చాలదు. ఏమీ అర్థం కావటంలేదు. ఇంకా బాగా చెయ్యాలి. ఇంకా బాగా ఎక్స్ ప్లెయిన్ చెయ్యాలి" అని అరుస్తున్నారు సీనియర్స్.

 

    ఆ కుర్రాడు తన శాయశక్తులా ప్రయత్నించి ఆ సన్నివేశాన్ని మలిచి చివరకు సొమ్మసిల్లిపోయాడు.


                                                           * * *


    కాలేజి క్యాంపస్ లో ఒక్కొక్కర్నీ గేలంవేసి చేపను పట్టుకున్నట్టు పట్టుకుంటున్నారు సీనియర్స్.

 

    ఒకతన్ని అడిగారు. "నాయనా! ఎంట్రన్స్ లో పాసయి కాలేజీలో చేరావుగాని ఎమ్.బి.బి.ఎస్ అంటే అర్థం తెలుసా?"

 

    తెలుసన్నట్లు తల వూపాడా కుర్రాడు.

 

    "ఏమిటి చెప్పు."

 

    "బ్యాచ్ లర్ ఆఫ్ మెడిసిన్ ఎండ్ బ్యాచ్ లర్ ఆఫ్ సర్జరీ."

 

    "కాదు."

 

    ఆ కుర్రాడు తెల్లబోయాడు.

 

    "తెలీకపోతే తెలుసుకో. మ్యారీడ్ బోత్ బట్ సఫరింగ్" ఆ కుర్రాడు అర్థమయినట్లు తల వూపాడు.

 

    "మళ్ళీ చెప్పు."


                                      3


    రిపీట్ చేశాడు.

 

    "ఎమ్.బి.బి.ఎస్ అయాక ఎమ్.డి. చేస్తావా? ఎం.ఎస్. చేస్తావా?"

 

    "ఎమ్.డి." 

 Previous Page Next Page