"ఉత్తమురాలు. కోడలిని కూతురులాగా చూసుకుంటుంది"
"కూతురైనా, కోడలయినా ఒక్కతే కదా!"
"ఇంతకీ మంగమాంబ సమాధానం వినండిమీరు. నాకు కావల్సింది శ్రీవెంకటేశ్వరుడు. అందిట."
"వెంకన్న బాబేమన్నా పదార్థమా, వండి పెట్టటానికి?"
"ఇది భక్తా? పిచ్చా?"
"భక్తేటమ్మా!"
"దెయ్యం పట్టిందేమో!"
"పిచ్చికుదిరింది రోకలి తలకుచుట్టమన్నాట్ట ఒకడు. అట్లా..."
"పుట్టబోయే పిల్లవాడు భక్తుడేమో?"
"ఏం భక్తుడో ఏమో?- ఎప్పుడూ దేవుడి ముందు కూర్చుంటుందిట నిద్రాహారాలు కూడా లేకుండా..."
"కృష్ణవిగ్రహాన్ని తదేకంగా చూస్తూ ఉంటుందిట"
"ఏమైనా అత్తగారికి తిప్పలు. పాపం!"
"అదేం లేదు. ఆవిడకిదంతా సంతోషంగానే ఉందిట. మురిసిపోతోందిట!"
"అదిగో మురిపాల అత్తగారు వస్తున్నారు."
"కోడలు కులాసాగా ఉందా?" నాంచారమ్మ ప్రేమగా అడిగింది.
"ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం వల్ల బాగానే ఉందత్తా!"
"పురిటికి పుట్టింటికి ఎప్పుడు పంపుతున్నావు?"
"ఆయన, అబ్బాయి పుట్టింటికి పంపమంటున్నారు. బిడ్డని బొడ్డుకోయకుండా చూడాలట!"
"ఏం విడ్డూరం?" బుగ్గలు నొక్కుకుంది ఓ నడివయస్కురాలు.
"పోనీ సీమంతం అయినా ఉందా?" ఒక కొత్తకోడలు ప్రశ్న.
"అన్ని ముచ్చట్లు తీరుస్తారుట. సూడిదలు తెచ్చిన మంగతల్లిని ఇక్కడే నిలిపేస్తారుట పురుడు అయ్యేదాకా!"
"సరే! మాకు చలిమిడి పెట్టేదెప్పుడు?" - పారిజాత ప్రశ్నించింది.
"మంచి ముహూర్తంకోసం చూస్తున్నారు. త్వరలోనే ఉంటుంది. ఇదుగో ఇప్పుడే చెపుతున్నాను. ఎవరూ మానకూడదు. ఎవరింట్లోనూ పొయ్యి వెలగటానికి వీలులేదు. ఆరోజు పసిపిల్ల బాలాది మాఇంట్లోనే భోజనాలు. పిల్లలు చద్దన్నాలు కూడా వదినా! అర్థం అయిందా!"
కృష్ణయార్యుడి తల్లి అందరినీ పేరు పేరునా పిలిచింది.
* * *
వారం రోజుల తర్వాత సీమంతం ఘనంగా జరిగింది. మంగమాంబ పుట్టింటివారు సూడిదలు ఘనంగానే తెచ్చారు.
కృష్ణయార్యుడి తండ్రి ఇంటి అరుగుమీద కూర్చుని మనస్సులో ఉన్న ఉద్వేగం బయట పడకుండా, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణయార్యుడు ఏదో పని ఉన్నవాడిలాగా అటూఇటూ తిరుగుతున్నాడు.
ఇంటిలో నుండి "క్యార్" మని పసిబిడ్డ ఏడుపు వినగానే ఇద్దరూ ఒకరివంక ఒకరు ఆనందంగా చూసుకున్నారు. కృష్ణయార్యుడి తల్లి గడపలోపలే ఉండి తొంగిచూసి "మహాలక్ష్మి" అంది.
"మాఇంటి మహాలక్ష్మి" అన్నాడు కృష్ణయార్యుడి తండ్రి.
కృష్ణయార్యుడి ముఖంలో లక్ష్మీకళ తాండవించింది.
అప్పుడే అటుగా వస్తున్న సోమయాజి వీరిమాటలు విన్నాడు.
"ఆడపిల్లా?" అన్నాడు ఎంతో చులకనగా.
"తొలిచూలు ఆడపిల్ల అయితే మంచిది సోమయాజీ! మా అదృష్టవశాన అమ్మాయే పుట్టింది. ఇక మా ఇంట లక్ష్మితాండవిస్తుంది చూడు" కృష్ణయార్యుడి తండ్రి ఎంతో సంబరంగా అన్నాడు.
"మరే! అట్లా సరిపుచ్చుకోవాలి మరి! ఏమైనా మొత్తానికి కృష్ణయార్యుడు తండ్రి అయ్యాడు" సోమయాజి నిలవలేక వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం ఉన్న ఆనందంలో ఎవరి మాటలూ పట్టించుకునేట్టు లేరు తండ్రీకొడుకులు. కృష్ణయార్యుడు తమ ఇంటి దీపాన్ని చూడటానికి ఇంటిలోపలికి వెళ్ళాడు.
* * *
కృష్ణయార్యుడు పురిటిగదిలో అడుగుపెట్టే సమయానికి మంగమాంబ తట్టుకోలేని భావోద్వేగంలో ఉంది. దరిదాపు ఎనిమిది, తొమ్మిది నెలలపాటు సమయాన్నంతా దైవ చింతనలో గడిపి ఉండటం వల్ల తట్టుకో గలిగింది. అసలు ఆ కారణంగానే చూడగలిగిందేమో కూడ.
పురిటి నెప్పులు అనుభవిస్తున్న మంగమాంబకి అవి దుర్భరవేదనగా అనిపించలేదు. తల్లి అనిపించుకోటానికి ఈ మాత్రం బాధపడవలసిందే. దైవాంశ సంభూతుడు పుట్టబోయే సమయంలో కలిగే అనుభూతి మళ్ళీరాదుకదా! మనస్సులో జాగ్రత్తగా పదిల పరచుకుందాం అనుకుంటోంది.
'క్యార్' మన్న శబ్దానికి శిశువు జన్మించినట్టు తెలిసింది. తాను చూడలేదుకదా! చూడటానికి లేద్దామని కళ్ళు తెరవగానే ఎదురుగా కాంతిపుంజం కనపడింది. అదే తనబిడ్డ అనుకుంది. కాని అదెట్లా సాధ్యం. ఈ కాంతి పుంజం నేలకి చాలా ఎత్తుగా, పైకప్పుకి సమీపంలో ఉంది. ఆశ్చర్యకరంగా, చూస్తుండగానే ఆ వెలుగు బాలకృష్ణుడుగా ఆకృతి ధరించింది. నెమ్మదిగా దిగి అప్పుడే పుట్టిన శిశువు పక్క నిలిచింది. ఆ బిడ్డ బాల కృష్ణుడిని చూచి కేరింతలు కొట్టి చెయ్యిపైకి లేపింది. బాలకృష్ణుడు ఆ చేతిని తన చేతిలోకి గ్రహించాడు. ఇద్దరూ ఏమో ముచ్చటించుకుంటున్నారు. తనకి వినపడటం లేదు. అర్థం కావటం లేదు.
మంగమాంబకి ఆశ్చర్యం. తాను కదలలేదు. బిడ్డను ఎట్లా చూచింది? అంతా భ్రమ అనుకుంది. అయినా బాగానే ఉందిగా అనుకుంది.
మంత్రసాని బొడ్డుకోసింది. బిడ్డని మెత్తటి పాతబట్టతో తుడిచి, తల్లిపక్కన పడుకోబెట్టింది. కృష్ణయార్యుడు లోపలికి వచ్చి బిడ్డను చూచాడు. బిడ్డ వంక చూచి,
"ఆడపిల్లా!" అంది మంగమాంబ.
"అవును మన ఇంటి మహాలక్ష్మి" అన్నాడు కృష్ణయార్యుడు.
* * *
బాలసారె ఎంతో ఘనంగా జరిగింది. చుట్టపక్కాలు, పొలిమేర గ్రామాల్లోవారు ఎంతోమంది వచ్చారు. ఒక తిరణాలలాగా అందరి హృదయాలలోను నిలిచిపోయేట్టుగా వైభవోపేతంగా జరిగింది. పేరు పెట్టే విషయంలో ముందునుంచి తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి.