"నీ ఇష్టం చెప్పు?"
నిముషంపాటు ఆమె జవాబు చెప్పలేకపోయింది. ఆలోచిస్తోంది.
"మంచి కుర్రాడిలాగే వున్నాడు."
"అవుననుకుంటాను సర్!"
"అయితే పెట్టుకుందామా?"
మళ్ళీ తెల్లబోతూ చూసింది.
కల్నల్ నవ్వాడు.........అదే నవ్వు.
"ఆల్ రైట్...వుయ్ ఆర్ టేకింగ్ హిమ్" బజర్ నొక్కాడు.
"అతన్ని లోపలకు పంపించు."
ఆ యువకుడు లోపలకు వచ్చికూర్చున్నాక "మిమ్మల్ని తీసుకుంటున్నాను. అన్నట్లు - ఆర్ యు ఏన్ ఆల్కహాలిక్?"
"లేదండీ."
"ఎప్పుడన్నా టచ్ చేశారా? జస్ట్ ఫర్ కంపెనీ సేక్."
"లేదండీ."
"గుడ్! మీరు పనిచెయ్యవలసిన అంశంగురించి వివరంగా మిస్ శైలజ చెబుతుంది. తర్వాత - ఎప్పుడు జాయిన్ అవుతారు?"
"మీరు చేరమంటే ఇవాల్టినుంచే."
"గుడ్, మిస్ శైలజా! మీరింక వెళ్ళవచ్చు."
"యస్ సర్!" శైలజ లేచి అతనివంక చూడకుండా వెళ్ళిపోయింది.
"చూడండి మిస్టర్ ఫణి! మీ లగేజీ ఎక్కడ వుంది?"
"ఊళ్ళోనే చిన్న లాడ్జిలో దిగానండీ. అక్కడే వుందండీ. లగేజీ ఏముంది? చిన్న సూట్ కేస్, ఓ బ్యాగ్."
"ఆల్ రైట్. సెక్రటరీకి చెబుతాను. అక్కడకు వెళ్ళి పేపర్ మీద సంతకాలు చెయ్యండి. ఊళ్ళోకివెళ్ళి ఆ బ్యాగూ అవీ తెచ్చుకోండి. ఈలోగా కాలనీలో మీ క్వార్టర్స్ ఎలాట్ చేయిస్తాను. ఆఫీసులో కనుక్కుంటే ఏది ఎలాట్ అయిందో చెబుతారు. రేపట్నుంచీ డ్యూటీకి వద్దురుగాని. మీరు సెక్రటరీ గదిలోకి వెళ్ళండి" రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు.
సెక్రటరీకి చెప్పవలసినవన్నీ చెప్పటం అయిపోయాక కల్నల్ వంటరిగా కూర్చుని గట్టిగా నవ్వుకున్నాడు.
తానీ నిర్ణయం తీసుకునేందుకు బలీయమైన కారణముంది.
ఈ కంపెనీ స్థాపించి అయిదేళ్ళయింది. మొదట్లో మామూలుగా ఈ పెళ్ళి నిబంధనలు లేకుండానే అందరికీ ఉద్యోగాలిచ్చాడు. పెళ్ళయి పిల్లలున్న వాళ్ళకి ఒకరకం సమస్యలు. పెళ్లాం, పిల్లలకు ఎప్పుడూ రోగాలు, గృహసమస్యలు, ఆనవాయితీలు, సెలవులు పెట్టటం, ఊళ్ళు వెళ్ళటం - ఇలా వుంటే క్రొత్తగా పెళ్లయినవాళ్ళకి ప్రేమలు, శృంగారాలు, కడుపులు, కాన్పులు.....వీరివల్ల తాను అనుకున్న స్థాయిలో కంపెనీ పని జరగటం లేదు. ఎవరిలోనూ కార్యదీక్ష కనబడటంలేదు. క్రొత్త విధానాలు అమలు జరపటానికి అవకాశం ఉండటంలేదు. ఒక విధమైన అలసత్వం వ్యాపిస్తోంది. రీసెర్చిమీద ఎవరూ ఏకాగ్రతతో ఉండటంలేదు. తన ఆశయాలు వేరు, కార్యదీక్ష వేరు. జీవితంలో డిసిప్లిన్ లేకపోవటం అతను సహించలేడు. ఒక సంస్థ ఉద్యమరూపం ధరించాలంటే ఈ క్రమశిక్షణ అవసరం. మొదట్నుంచీ పనిచేస్తున్న వాళ్ళనిగురించి బాధపడి ప్రయోజనం లేదు. కొత్తగా చేర్చుకునే వాళ్లకుమాత్రం ఈ నియమాలు విధించాలి. అందుకు ఒప్పుకుంటేనే ఉద్యోగాలివ్వాలి.
గత కొన్ని నెలలుగా ఈ నియమావళి ప్రారంభమయింది.
* * *
ఫణి ఊళ్ళోకివచ్చి సూట్ కేసు వగైరాలు తీసుకుని తిరిగి కంపెనీకి చేరేసరికి మధ్యాహ్నం మూడయింది. ఆఫీసులో విచారిస్తే అతనికి నలభయి మూడోనంబరు కాటేజి కేటాయించినట్లు తెలిసింది.
ఆఫీస్ బాయ్ రాముడు అతనివెంట వచ్చాడు.
కాలనీ చాలా విశాలంగా, నీట్ గా, అందంగా వుంది. మొదట్లో కల్నల్ నివసించే బంగళా వుంది. అదిమాత్రం పెద్దదిగా, ప్రత్యేకమైన విధంగా వుంది. మిగతావన్నీ ఒకే తీరుగా, తగుమాత్రం పెద్దవిగా వున్నాయి. మధ్య చక్కనిరోడ్డు. ఇరువైపులా చెట్లు. వేసవికాలంలో కూడా చల్లగా వుండేటట్లు చెట్లు బాగా వ్యాపించి వున్నాయి. మధ్యలో చిన్న పార్కులాంటిది వుంది. పిల్లలు ఆడుకునేందుకు ఆ పార్కులో అనేక సదుపాయాలున్నాయి. అంతేగాక కాలనీ చివర ఎదిగిన పిల్లలు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్స్ వున్నాయి. ఆ ప్రక్కనే చిన్న స్కూల్ కూడా వుంది. అదికూడా కంపెనీయే నిర్వహిస్తోంది.
రాముడు నలభయిమూడో నంబరు కాటేజీ తలుపు తెరచి ఫణిని లోపలకు తీసుకెళ్ళాడు.
బయట చిన్న సిట్ అవుట్, లోపల డ్రాయింగ్ రూం, బెడ్ రూం, చిన్న కిచెన్, బాత్ రూం అన్ని సౌకర్యాలు వున్నాయి. గదిలో ఫోన్ వుంది. ప్రాధమికంగా కావల్సిన సామాను వుంది.
అతను ఇల్లంతా కలియతిరిగి చూస్తూండగా రాముడు ఎక్కడ్నుంచో టీ తీసుకొచ్చాడు. "తీసుకోండి సార్" అన్నాడు.
ఫేముకుర్చీలో కూర్చుని టీ త్రాగుతూ "ఎక్కడిది?" అన్నాడు.
"క్యాంటీన్ వుంది సార్ ఇక్కడ!"
"అవునూ.......భోజనానికీ దానికి ఏం చెయ్యాలి?"
"కుటుంబాలతో వున్నవాళ్లు మామూలుగా వండుకుంటారు. కొత్తగా వచ్చిన పెళ్ళికానివాళ్ళు - ఇష్టమున్నవాళ్ళు వండుకుంటారు, లేకపోతే క్యాంటీన్ నుంచి క్యారియర్ తెప్పించుకోవచ్చు. రేట్లుకూడా తక్కువే సార్...
"సరే నువ్వెళ్ళు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను."
రాముడు వెళ్ళిపోయాక తలుపు వేసుకోబోతూ ఎదురుగా వున్న కాటేజి వంక యధాలాపంగా చూశాడు. తలుపువేసి వుంది. డోర్ మీద ముప్పయి నాలుగు అని అంకెలు వేసివున్నాయి.
లోపలకువచ్చి బట్టలు మార్చుకుని మంచంమీద వ్రాలాడు. మంచం మీద-పరుపు, దిండు, దుప్పటి అన్నీ వేసే వున్నాయి. రాత్రంతా రైల్లో ప్రయాణం చేసి రావటంవల్లా, ప్రొద్దుటినుంచీ తిరుగుతూ వుండటం వల్లా అలసటగా వుంది. మనసులో ఏవో ఆలోచనలు మెదులుతున్నాయి, అయినా నిద్ర పట్టేసింది.
మెలకువ వచ్చేసరికి గదంతా చీకటిగా ఉంది. టైమెంతయింది అనుకుంటూ లేచాడు. కొత్తచోటు అవటంవల్ల స్విచ్ ఎక్కడవుందో తెలియలేదు. గోడమీద తలకన్నా కొంచెం ఎత్తులో చెయ్యివేసి తడుముకుంటూ ఎలాగయితేనేం చివరకు స్విచ్ చేతికి తగలగా ఆన్ చేశాడు.
గదంతా వెల్తురుతో నిండిపోయింది. ఒక్కక్షణం తనింకా వైజాగ్ లో వున్నాడా లేక విజయవాడలోనా అనిపించింది.