Previous Page Next Page 
అంకితం పేజి 4


    అలాంటి వ్యక్తిత్వం- వాడికి చిన్నప్పటినుంచీ రీడర్స్ డైజెస్ట్ లాంటి పుస్తకాలు చదవటం వలన వచ్చిందనుకుంటాను- ఈ విషయంలో మాత్రం అరుంధతిని అభినందించాల్సిందే! ఈ క్రమశిక్షణని వాడికి తనే నేర్పింది. తను చేసిన మంచిపనుల్లో ఒకటి- టి.వి.కి వాడిని దూరంగా వుంచటం.

    చాలామంది తల్లులు - పిల్లల అల్లరి మాన్పించటానికో, లేక తమతో పాటూ కంపెనీగానో- టి.వి.కి వాడిని దూరంగా వుంచటం.

    చాలామంది తల్లులు - పిల్లల అల్లరి మన్పించటానికో, లేక తమతో పాటూ కంపెనీగానో - టి.వి.ని "అలవాటు" చేస్తారు. అదృష్టవశాత్తూ అరుంధతికి అటువంటి "వ్యసనం" లేకపోవటంతో కొడుకుతో "గడిపే" సమయాన్ని ఎక్కువ మిగుల్చుకుంది. తెలుగూ లెక్కలూ తను చెప్పేది. ఇంగ్లీషు నేను చెప్పేవాడిని. ఈ విధంగా- మేము ముగ్గురం ఒకరితో ఒకరు గడిపే సమయం పెరిగింది.

    అయితే, అభిరుచి అన్నది ఒకరు చెప్తే వచ్చేది కాదు, స్వతహాగా రావాలి. ఆ విషయం నాకు ఒక చిన్న అనుభవం ద్వారా తెలిసింది.

    ఒక ప్రైవేట్ ఛానల్ వారు విశాఖపట్టణం వచ్చి, వివిధ స్కూళ్ళ నుంచి విద్యార్థులని ఎంపిక చేసారు. వారి తల్లిదండ్రులని ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోబెట్టారు. విద్యార్థులని బ్యాచ్ లాగా విడగొట్టి వారిమధ్య క్విజ్ పోటీ పెట్టి, చివరికి ఇద్దర్నీ విజేతలుగా ప్రకటిస్తారట. మొత్తం షూటింగ్ అంతా ఒకే రోజున జరుగుతుందట. ఆ తరువాత అది వారం వారం ప్రసారమవుతుందట.

    మొదటి బ్యాచి పోటీ ప్రారంభమయింది. ఇద్దరిద్దరు చొప్పున మూడు గ్రూపులున్నాయి. బల్లలమీద గ్రూపుల పేర్లు వ్రాసి వున్నాయి.

    'సినీ సర్వస్వ' ,మొదటి గ్రూపు పేరట. అలాగే, "సినీ చైతన్య', 'సినీ జీవిత' అని మిగతా రెండు గ్రూపుల పేర్లట. నా కిదేమీ అర్థం కాలేదు. వ్యాపారంలో పని వత్తిడివల్ల నా కిలాటి ప్రోగ్రామ్ లు వస్తాయని తెలీదు. కానీ- వెలిగిపోతున్న అక్కడి పిల్లల తల్లితండ్రుల మొహాలు చూస్తోంటే, ఒలింపిక్స్ లో వారు సెలక్టయినట్టు వార్తా తెలిసినా- ఇంత సంబరపడరేమో అన్నట్టు వున్నారు. నిజమే కాదా- అని నాకూ అనిపించింది. తమ పిల్లలు టి.వి.లో కనబడటం కన్నా సంబరం ఏముంది?

    ఈ లోపులో ప్రోగ్రాం ప్రారంభమైంది.

    తాను చాలా హుషారైన వ్యక్తినని ప్రేక్షకుల్ని నమ్మించటానికి క్విజ్ మాస్టర్  కొంచెం సేపు ప్రయత్నం చేసాడు. అందంగా నవ్వటానికి విశ్వప్రయత్నం చేస్తున్నా స్కోరర్ అమ్మాయితో రెండుమూడు జోకులు వేసాక, మేమెవరమూ నవ్వకపోయేసరికి కుర్రాళ్ళని ప్రశ్నలడగటం ప్రారంభించాడు.

    "మొదటి ప్రశ్న..... సినీ సర్వస్వ గ్రూప్ కి" అన్నాడు గంభీరంగా!

    పాపం చిన్నపిల్లలందరూ బిక్కు బిక్కి మంటూ చూస్తూన్నారు.

    "శివ సినిమాలో నాగార్జున- సైకిల్ చైన్ కుడిచేత్తో పట్టుకున్నాడా ఎడమ చేత్తోనా?"

    ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. గడియారం టిక్కుటిక్కుమంటోంది. "పాస్" అన్నారు సర్వస్వగ్రూపు విద్యార్థులు.

    "సినీ చైతన్య.....?" వారిని చెప్పమన్నట్టు దగ్గరికి వెళ్ళాడు.

    "కుడిచేత్తో!" అన్నాడు ఆ బ్యాచ్ లోని పదేళ్ళ కుర్రాడు.

    "......తప్పు" అంటూ తుర్వాత గ్రూప్ వైపు చూసాడు.

    "......ఎడమ చేత్తో" అన్నాడు సినీ జీవితం గ్రూపు కుర్రాడు.

    "కరెక్ట్....." అంటూ గట్టిగా అరిచాడు క్విజ్ మాస్టర్. స్కోరర్ తో పాటు మేమందరం చప్పట్లు కొట్టాము.

    "రెండో ప్రశ్న...... అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో మెగాస్టార్ కి అత్తగా చేసిన నటీమణి ఎవరు?"

    "వాణిశ్రీ" అంటూ టక్కున చెప్పాడు ఆరో క్లాసు చదువుతున్న కుర్రాడు.

    "కరెక్ట్...... చాలాకాలం విరామం తరువాత వాణిశ్రీ తిరిగి నటించిన చిత్రమది" అంటూ విద్యార్థులకి చెప్పాడు. స్కోర్ వేస్తున్న అమ్మాయి మెరుస్తూన్న కళ్ళతో అతడిని అభినందన పూర్వకంగా చూసింది. కేవలం క్విజ్ నిర్వహించటమే కాకుండా, సినీ చరిత్రకు సంబంధించిన ఎన్నో మరుగుపడిన వాస్తవాల్ని చెపుతున్నందుకు కాబోలు అనుకున్నాను.

    అంకిత్ నా పక్కనే కూర్చుని అభావంగా ఆ తతంగాన్ని చూస్తున్నాడు.

    ".......డాక్టర్ రాజశేఖర్ నటించిన మొట్టమొదటి చిత్రమేది?"

    మూడు బ్యాచీల వారూ చెప్పలేకపోయారు. క్విజ్ మాస్టర్ వికటాట్టహాసంలో వికృతంగా నవ్వుతూ" కాష్మోరా" అన్నాడు.

    అంకిత్ నా చెవిదగ్గర వంగి చిన్న గొంతుతో "......కాష్మోరా అంటే ఏమిటి డాడీ" అన్నాడు. నేను బిక్కమొహం వేసి..... "తెలీదు" అన్నాను.

    ఈ లోపులో 'దృశ్యం రౌండ్ ' మొదలయింది. ఒక విస్కీ గ్లాసులో రక్తం నింపి హీరోయిన్ నాగేశ్వర్రావ్ కి ఇస్తోంది. 'ఇదే సినిమాలోది?' అని అడుగుతున్నాడు. క్విజ్ నిర్వాహకుడు.

    అంకిత్ నా చెవిలో రహస్యంగా "హారర్ ఆఫ్ డ్రాక్యులా" అన్నాడు.

    "ష్....." అన్నాను గట్టిగా మాట్లాడొద్దున్నట్టు. ఆ తరువాత వరసగా ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. అర నిముషంలో ఎన్ని ప్రశ్నలకి సరి అయిన సమాధానం చెప్పితే అన్ని మార్కులట.

    "నట శేఖరుండేది జూబ్లీహిల్సా? బంజారాహిల్సా? వెంకటేష్ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? దర్శకేంద్రుడి గెడ్డం ఏ వేపు తెలుపు? నాగపూజా మహిమ చిత్రంలో వాడింది నిజం పామా? రబ్బరు పామా? సిల్కుస్మిత అసలు పరిమిటి?....." అంటూ ప్రశ్నలు కొనసాగాయి. బ్రేక్ టైమ్ లో అంకిత్ నాతో...... "వెళ్ళిపోదాం డాడీ" అన్నాడు.

    "అదేమిటి! నువ్వు పాల్గొనవా?" అన్నాను ఆశ్చర్యంగా.

    వాడు దిగులుగా, "నాకు ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం తెలియటం లేదు" అన్నాడు ఇద్దరం బయటకొచ్చాం.

    "ఇదంతా ఎందుకు డాడీ?" అని ప్రశ్నించాడు. నాలో కూడా అదే భావం కదలాడుతోంది. కానీ, వాడి అంతరంగం తెలుసుకోవటానికి వాదన కొనసాగించాను. "మనం ఎప్పుడూ ప్రొడక్టివ్ పనే చేయలేంగా అంకిత్! అప్పుడప్పుడు వినోదం కూడా వుండాలి కదా!"

    "చిన్నపిల్లలకి వినోదం అంటే దేశభక్తి కథలూ, క్విజ్ ప్రోగ్రామ్ లూ కాదా డాడీ?"

    "ఇది క్విజ్ కదా".

    "చిన్నపిల్లలకి వినోదం అంటే దేశభక్తి కథలూ, క్విజ్ ప్రోగ్రామ్ లూ కాదా డాడీ?"

    వాడు సమాధానం చెప్పకుండా చాలాసేపు వూరుకున్నాడు. ఏదో- తనలో తానే ఆలోచించుకున్నట్టు నిశ్శబ్దంగా వుండిపోయి, తరువాత హఠాత్తుగా అడిగాడు....." ఒక దేశాన్ని కాళ్ళ బేరానికి వచ్చేలా చేయాలంటే, యుద్ధంచేసి- దానిమీద ఆటంబాంబు వేయాలి. అది మొదటి ఆయుధం. ఆ దేశానికి పెట్రోల్ అందకుండా చేయాలి. అది రెండో ఆయుధం. మూడోదేమిటి?"

    నేను ఆశ్చర్యంగా అయోమయంగా చూసాను. తార్కికంగా చాలా  సమాధానాలు చెప్పొచ్చు. కానీ, రెండోది పెట్రోలట. పెట్రోల్ లేకపోతే చాలా దేశాలు 'వెంటనే' కాళ్ళబేరానికి రావు. అది దృష్టిలో వుంచుకుని నా సమాధానం కూడా తెలివిగానే వుండాలి. 'నీళ్ళు, గాలి-' లాంటి మామూలు సమాధానాలు అయి వుండకూడదు.

    అయినా అదికాదు నేను ఆలోచిస్తూన్నది.

    అంకిత్ ఎంత ఇన్ డైరెక్టుగా నన్ను దెబ్బకొట్టాడు అన్నా పాయింట్ గురించి ఆలోచిస్తున్నాను. దర్శకేంద్రుడి గెడ్డం ఏ వేపు తెలుపు? అన్న ప్రశ్నకన్నా- చిన్నపిల్లల్లో ఆసక్తి కలిగించే విషయాలు చాలా వున్నాయని చెప్పటం వాడి ఉద్దేశ్యం కావొచ్చు. పెద్దలు ఎలాగయినా చావనీ, కనీసం పిల్లల్లోనైనా ఈ సినిమా మత్తు ఇంజెక్ట్ చేయకూడదన్నది వాడి బాధకావొచ్చు. అభిప్రాయాల్ని సరీగ్గా వెల్లడి చేసేటంత వయసుగానీ, భాషాపరిజ్ఞానంగానీ వాడికి లేదు.

    అయితే, నేనూ వ్యాపారం చేస్తున్నాను కాబట్టి- వాడికి మరోవైపు వాదనని వినిపించదల్చుకున్నాను. "ఇదంతా బిజినెస్ రా అంకిత్! ఒక కుర్రాడు టి.వి.లో కనపడతాడంటే వాడి తాలూకు బంధుమిత్రులంతా ఆ ఛానల్ ని వారాల తరబడి చూస్తారు కదా!" అన్నాను.

    వాడేమీ మాట్లాడలేదు. నా ఓటమి నాకే తెలుస్తూంది. అందుకే మాట మారుస్తూ "ఒక దేశంలో అభివృద్ధి ఆగిపోవాలంటే ఏది ఆపుచేయాలి? చెప్పలేదేం" అని అడిగాను.

    దాంతో అంకిత్ ఉత్సాహం తలెత్తి ".......రబ్బర్ డాడీ" అన్నాడు. "మొదటి ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ అందుకే ఇబ్బందిపడింది. టైర్లు ట్యూబ్ లూ లేకపోతే అభివృద్ధి లేదు".

    నేను అప్రతిభుడినై వాడివంక చూసాను. వాడింకా ఏదో చెపుతూనే వున్నాడు. నేను మాత్రం మనసులో అనుకున్నాను.

    'ఉహూ. అదికాదు. పెట్రోలూ రబ్బరూ కాదు. దేశపు పిల్లలబాల్యంలో కుతూహలం'.


                         *    *    *

    "అంత నెమ్మదిగా పరుగెడుతున్నావేంటి డాడీ?" వెనుకనించి వస్తూ హెచ్చరించాడు అంకిత్. నేను నవ్వేసి, వేగంగా హెచ్చించాను. చిన్నపుడు- వాడు బుల్లి బుల్లి పాదాలు తడబడుతూండగా, గోడను పట్టుకుని నడవటం నాకిప్పటికీ గుర్తే! అలాటి చిన్న కుర్రాడు ఈ రోజు...... నిండా పన్నెండేలేవు......నా ముప్పై ఆరేళ్ళ కాయాన్ని సునాయాసంగా దాటేసి పరుగెత్తటం నాకు గర్వాన్ని కలిగిస్తూంటుంది.

    ఫిరంగి దగ్గర పడుతుంది.

    బీచ్ వడ్డునే వుందది! అదే మా గమ్యం.

    అక్కడివరకూ వెళ్ళాక దాన్ని ఎక్కిచెరోవేపూ కాలేసి కూర్చుని- సామ్రాజ్యాలు జతించిన రారాజులా  సగర్వంగా నావేపు చూసి నవ్వటం అంకిత్ కి అలవాటు. ఆ సమయంలో వాడు గుర్రానెక్కిన యువరాజులా నా కళ్ళకి కనబడుతూ వుంటాడు.

    నీళ్ళల్లో నిల్చుని చేపలు పడుతూన్న జాలర్లని చూస్తూ "వాళ్ళంతా కట్టేసిన పడవల్లా వున్నారు కదూ డాడీ" అంటాడు.

    నేను తెలుసుకున్నది ఏమిటంటే-నిజానికి నేను వీటన్నిటినీ ఇష్టపడుతున్నది నా గురించి కాదు, అంకిత్ కి ఇష్టం అందుకే నాకిష్టం.

    ఫిరంగి సమీపిస్తూ అకస్మాత్తుగా ఆగిపోయాను.

    అంకిత్ ఫిరంగి ఎక్కటం లేదు.

    ఇసుకలో కూలిపోయి వున్నాడు. మేటవేసిన ఇసుక తిన్నెల వెనుక వాడు సరీగ్గా కనబడటం లేదు.

    ఆందోళనగా పరుగువేగం హెచ్చింది.

    ఫిరంగి చక్రాల దగ్గిర పడిపోయి వున్నాడు వాడు.

    వాడి శారీరం మెలికలు తిరుగుతోంది.


                                1


    ఎన్ని ప్రశ్నలు ఈ చరిత్రలో ఒక్క సమాధానంతో బ్రతికాయో!


                        *    *    *


    వెడల్పాటి కిటికీల అద్దాల అవతల, తెల్లటి వెన్నెల తివాచీలా పరుచుకుని వుంది. అక్కడంతా గుబురు గుబురుగా చెట్లు. ఆ మొక్కల మధ్యనున్న ఫౌంటెన్ లో నీరు పైకి చిమ్మి, తుంపర్లుగా క్రిందికి రాలుతోంది!

    ఆ తుంపర్ల మధ్య చిక్కుకుపోయిన వెన్నెల- అక్కడ స్నానం చేసి, మరింత తెల్లదనాన్ని సంతరించుకొంటోంది. ప్రశ్నల మధ్య ప్రక్షాళనమైన సమాధానంలా!

    "ఏమిటి నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావ్?"

    "నీ గురించే......."

    జాన్ డేవిడ్ బిగ్గరగా నవ్వేడు..... "బీర్ తొణుకుతుంది జాగ్రత్త" అన్నాను. వినిపించుకోలేదు. నవ్వుతూనే వున్నాడు. .......ఇద్దరం బంజారా హొటల్ లాన్ లో కూర్చుని వున్నాం. ఆ వెన్నెల రాత్రి చాలా అందంగా వుంది!

    ఆ రోజే అక్కడికి వచ్చేన్నేను. ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా సాయంత్రాలు డేవిడ్ కీ నాకూ ఆహ్వానం పలుకుతాయి. స్నేహానికి నిర్వచనం జాన్  డేవిడ్!

    "సో.... ఆలోచించటానికి సరిపడేటంత మాటరు నాలో వుందన్నమాట" అన్నాడు జాన్ నవ్వాపి.

    "....ఆలోచించటానికి పెద్ద మాటారు వుండాలా ఏమిటి? ఆ మాటకొస్తే ఏ మాటరూ లేనివాళ్ళే తమలో గొప్ప మాటరుంది అనుకుంటారు. అయినా నీకేం తక్కువ. డాక్టరువి. పైగా రచయితవి....." అని ఆగి, ".....అన్నట్టు రచయిత అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఏమీ వ్రాయటం లేదే" అని అడిగాను.

    "నా కలం పురిటినొప్పులు పడుతోంది" అంటూ మళ్ళీ బిగ్గరగా నవ్వేడు.

    జాన్ డేవిడ్ చాలా ఎత్తు. వెడల్పు కూడా. అంత స్థూలకాయంతో అతడలా నవ్వుతూంటే ఎంతో గమ్మత్తుగా, స్వచ్ఛంగా వుంటుంది. నిష్కల్మషంగా వుంటుంది. అంకిత్ చిన్నప్పుడు ఏడుస్తూంటే జాన్ డేవిడ్ ఎత్తుకుని, మొహంలో మొహంపెట్టి నవ్వేవాడు. నాకు బాగా జ్ఞాపకం. అంకిత్ వెంటనే ఏడుపు మానేసి, ఆ గుబురు మీసాలవైపు ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయేవాడు. అందరం నవ్వుకునేవాళ్ళం.

    "నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళుతున్నావ్?"

    "రెండ్రోజులు యిక్కడ పనివుంది. బహుశ అవతల ఎల్లుండి వెళ్తానేమో" అన్నాడు. అంతలో ఏదో గుర్తొచ్చింది. జేబులోంచి కాగితంతీస్తూ "......మా ఆఫీసులో ఒకమ్మాయి వుంది. కొత్తగా చేరిందనుకో! నువ్వూ నేను స్నేహితులని ఎవరో చెప్పినట్టున్నారు. బాగా థ్రిల్ అయింది. తనూ చిన్న చిన్న కవితలు వ్రాస్తుందట. భయపడుతూ నాకో కాగితం ఇచ్చింది. నీ అభిప్రాయమట చెప్పు" అంటూ ఆ కవిత అందించాను. తీసుకుని బిగ్గరగా చదివాడు.

    "చంద్రుడ్ని పర్మిషనడిగి
    వెన్నెల నీ పైటమీద పరుచుకుంది.
    నక్షత్రాల నైట్ డ్యూటీ ఎగ్గొట్టి
    కాంతి నీ కన్నుల చేరుకుంది.
    సిక్ లివ్ నెపంమీద సైకతపవనం
    నీ కురుల్ని కదిపే పనిలో కుదుర్చుకుంది.
    అందుకే-
    జీవితానికి రాజీనామా చేసి
    నేన్నీ ప్రేమలో పడ్డాననుకుంటాను". 
  

 Previous Page Next Page