"మీకేదయినా కలొచ్చిందేమో. కలలో జరిగినవి కూడా ఒక్కోసారి మెలకువ వస్తే నిజంలాగే భ్రాంతి కలిగిస్తాయి" అంది కామాక్షమ్మ.
భద్రం మొహం మరింత ఎర్రగా మారింది.
"మా చిన్నప్పుడు ఇలాగే ఓ అమ్మాయి గది కన్నంలోకి ఏదో పాములాంటిది వెళ్ళటం చూశానంది. గునపాల్తో గోడలు బ్రద్ధలు కొట్టినంత పని చేశారు"
నేను వంగి దుప్పటి తీసి, జాగ్రత్తగా దులిపి మడతపెట్టి మంచంమీద వేసేను. ఈ టాపిక్ ని తొందరగా మారిస్తే బావుణ్ణు అనిపించింది. డాక్టర్ వైపు తిరిగి "థాంక్స్! చాలా సమయస్ఫూర్తితో ప్రవర్తించారు. ఇంకొకరెవరయినా అయితే ఈ ఆలోచన రాకపోయేదేమో" అన్నాను. రంగారావు మొహమాటంగా నవ్వాడు.
"తాడుమీద డాక్టర్ గారు క్లోరోఫాం పిచికారీ కొట్టరని తెలిస్తే రేపట్నుంచి ఎవరూ పేషెంట్లు రారు" అంది కామాక్షమ్మ. ఈ మాటకి భద్రం భార్యకూడా నవ్వింది. డాక్టర్ గారు కూడా ఏడుపు మొహం పెట్టి నవ్వాడు.
ఇంతలొ దూరంనుంచి జీపు శబ్దం వినిపించింది.
"అదిగో మనవాళ్ళు వస్తున్నారు."
స్థూలకాయాన్ని చాలాసేపు నిలబెట్టలేక కామాక్షమ్మ కుర్చీలొ కూర్చుంటూ "నాల్రోజులపాటు దీంతో మనందరికీ భలే కాలక్షేపం" అంది.
డాక్టర్ ఆమెవైపు చూస్తూ "చాలా గొప్పవిషయం ఇది. భద్రంగార్ని అభినందించాలి" అన్నాడు. జీపు మరింత దగ్గరైంది. కామాక్షమ్మ భద్రంభార్యవైపు తిరిగి "నిజంగా అది పామే అయితే మంచి సమయస్ఫూర్తి వున్న పాము అయి ఉంటుందమ్మాయ్! నువ్వొచ్చే సమయానికి అది మీ ఆయన ఛాతీమీద నుంచి తప్పు కుంది" అంది. ఈ మాటలకి భాద్రానికి కూడా నవ్వు వచ్చింది. నేనూ నవ్వాను. డాక్టరు కూడా ముసిముసిగా నవ్వేడు. దాంతో కామాక్షమ్మ మరింత బిగ్గరగా నువ్వుతూ "బహుశా ఆడపాము అయి వుంటుంది" అని తన జోకుకి తనే బిగ్గరగా నవ్వసాగింది. తెరలు తెరలుగా వస్తూన్న ఆ నవ్వు గదిలో పూర్తిగా వ్యాపించకుండానే చటుక్కున ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి అందరం ఆవిడవైపు చూసేం. గుర్రపువాతం వచ్చిన దాన్లా ఆవిడ కుర్చీలో బిగుసుకుపోయింది.
"ఏమైంది?"
అప్పటివరకూ ఎడా పెడా జోకులేస్తున్న ఆవిడ మొహం చెమటతో తడుస్తూంది. నూతిలోంచి పలికినట్టు "పాము" అంది.
"ఎక్కడ....ఎఅక్కడ?"
"నా కాళ్లమీద నుంచి పైకి పాకి...."
పాము ఇంకా అక్కడే ఉన్నటు ఆవిడ మొహమే చెబుతూంది. నేను, డాక్టరూ మొహ మొహాలు చూసుకున్నాం. భద్రం మొహంలొ లీలగా చిరునవ్వు కదలాడినట్లు అనుమానం. డాక్టర్ మాత్రం సీరియస్ గా గుండెల్నిండా గాలి పీల్చుకుని మరోసారి పిచికారీని చేతిలోకి తీసుకున్నాడు.
* * *
"తరువాత ఏమయింది?" అడిగాడు ఆదిశేషు.
శివ మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు.
"అబ్బా, ఈ సస్పెన్స్ భరించలేం- చెప్పరా. తరువాత ఏమయింది?"
"ఏం లేదు- కథ అక్కడితో అయిపోయిందంతే".
"ఒరేయ్,చెప్తావా చంపెయ్యమంటావా?" అసహనంగా అడిగాడు విజ్జి.
శివ మా అందరివైపూ పరకాయించి చూసి, "గుడ్" అన్నాడు.
"ఏమిటి గుడ్డు?"
"మీ అందరిలోనూ నా కథ ఇంత ఉత్సుకత రేపిందీ అంటే నేను ఈ బిల్లు ఇవ్వటం అనే పందెం బారినుండి తప్పించుకున్నట్టే."
'అమ్మ-దెబ్బ కొట్టావురా' అనుకున్నాను. నిజ్మగా చాలా చక్కటి కథ చెప్పాడు. సస్పెన్స్ ప్రతి వాక్యంలోనూ మెయిన్ టెయిన్ చెయ్యటమే మా పందెం ఉద్దేశ్యమయితే దాన్ని వాడు చాలా చక్కగా పోషించాడు. కానీ అప్పుడే ఎక్కడయిందీ? నేను విజ్జివైపు చూసేను. వాడు ఆలోచిస్తున్నాడు. బహుశా శివ కథ కన్నా మంచి కథ చెప్పటం కోసం అయి వుంటుంది.
విజ్జి ఎప్పుడూ ఏవో పుస్తకాలు చదువుతోనే వుంటాడు.
విదేశీ వాతావరణం వాడికి బాగా తెలుసు.
ఇక్కడో టెక్నిక్ వుంది.
మాలో ఎవరికి వాళ్ళం ఏదో ఒక కొత్తదనం వుపయోగించి ఈ బిల్లు ఇవ్వటం బారినుంచి తప్పించుకోవాలి. సాహిత్యంలోలాగే ఇక్కడా కాంపిటీషను పెరిగిపోయింది. ఏదో ఒక కొత్తదనం చూపించకపోతే పాఠకుల్లటి ఈ శ్రోతలు మెచ్చరు. ఇది ఒక పరుగుపందెం లాటిది. మొదటి వరసలో వుండాలంటే ఒక కొత్తదనం కోసం నిరంతరం అన్వేషణ వుండాలి. కృషి వుండాలి. సిన్సియారిటీ వుండాలి. పల్స్ తెలుసుకుని వుండాలి.
నా వంతు వచ్చేటప్పటికి నేనూ ఒక మంచి కథతో రెడీగా వుండాలి. అన్నట్టూ నా కథే చెప్పే? నా కథకన్నా థ్రిల్లింగ్ అయినది మరొకటి వుంటుందని అనుకోను. నాపాలిట విలన్ అయిన డాక్టర్ విలియమ్స్ గురించి చెప్తాను.
..... ఈ ఆలోచన రాగానే, నా కథ ఎంత రసవత్తరంగా చెప్పాలా అని ఆలోచించటం మొదలుపెట్టాను. అప్పట్నుంచి ఒక రకంగా, మిగతావాళ్ళ కథలు ఏకాగ్రతతో వినటం మానేసేను.
ఈ లోపులో విజ్జి కంఠం సర్దుకుని అన్నాడు, "మనం మన పందెంలొ మంచి కథ రసవత్తరంగా చెప్పాలి అని అనుకున్నామే తప్ప ప్రతికలవాళ్ళు పెట్టినట్టు 'తెలుగు జీవితం ప్రతిబింబించాలి, అన్న షరతు పెట్టుకోలేదు. అందువల్ల నాకు తెలిసిన ఒక సంఘటన ఒక కథ రూపంలో చెప్తాను"
నేను అనుకున్నది నిజమైంది.
వీడు తనకున్న విదేశీ విజ్ఞానాన్ని ఉపయోగించి మార్కులు కొట్టెయ్యబొతున్నాడు.
అంతలో విజ్జి కథ మొదలుపెట్టాడు.
* శుభం*
(26 ఎపిసోడ్ నుంచి విజ్జి చెప్పిన కథ వస్తుంది)