Previous Page Next Page 
దుప్పట్లో మిన్నాగు పేజి 4


    "పోనీ ముంతపొగ పెడితేనో?" అంది కామాక్షమ్మ మళ్ళీ ముందుకొచ్చి, "మంచంకింద పోగపేడితే సరి. ఆ పొగకి అది బయటికొస్తుంది."
    "ఈ లోపులో మా ఆయన దగ్గలేక మంచం మీదనుంచి లేచి పరుగెడతాడు" అంది భద్రం భార్య. కామాక్షమ్మగారి తెలివితేటల్ని చాలా తొందరగా గ్రహించి నందుకు. నేను ఆవిడవైపు అభినందిస్తున్నట్టు చూశాను.
    మమ్మల్ని పట్టించుకోకుండా డాక్టరు ఆలోచిస్తూనే  వున్నాడు.
    కామాక్షమ్మ తన పథకాలు చెప్పటం ఇంకా ఆపలేదు. "పోనీ నాదస్వరం వాయిస్తే?" అంది. ఆవిడవైపు క్రూరంగా చూస్తూ- "నాదస్వరానికి నాగుపాములు లేస్తాయని విన్నాను కానీ, మిన్నాగులు పాడగా విప్పుతాయని ఎక్కడా వినలేదే? అన్నాను.
    ఈ లోపులో డాక్టర్ తన ఆలోచన నుంచి తెప్పరిల్లి, "నాకు ఒకే ఒక ఆలోచన తోస్తూంది" అన్నాడు. అందరం ఆయన వైపు తిరిగాం.
    "ఆ పాము వున్న చోటికి ఎనస్తీషియాని పంపించాలి."
    నేను చప్పున "ఎక్స్ లెంట్ ఐడియా" అన్నాను. తనలో తను ఆలోచించుకుంటూ కళ్ళు మూసుకుని డాక్టర్  చెప్పటం కొనసాగించాడు. "ఊహుఁ. ఇదంతా మంచి ఆలోచన కాదు. అయినా  ఇది తప్ప మనకి మరో మార్గం లేదు. పాము కోల్డు బ్లడ్డెడ్ ఏనిమల్. దానిమీద  ఎనస్తీషియా అంతగా ప్రభావాన్ని చూపించదు. కానీ ఈ పరిస్థితుల్లో ఇంకో ఆలోచన తోచటంలేదు. ఈథర్ కానీ, క్లోరోఫాం కానీ  వుపయోగించాలి" అని కళ్ళు తెరచి నావైపు చూచి, "క్విక్" అన్నాడు. మా ఇంటికి వెళ్ళండి. ఫాస్ట్! నా కప్ బోర్డులో పాయిజన్ అని వ్రాసివున్న అర ఒకటి వుంటుంది. అందులో క్లోరోఫాం సీసా కనబడుతుంది. నా బోయ్ కి చెప్పి దాన్ని తీసుకురండి. అర్జెంట్"
    నేను ఒక్క గెంతులో మోటారుసైకిల్ దగ్గిరకి పరుగెత్తాను. చలి మరింత ఉధృతమైంది. దూరంగా కోయవాళ్ళు డప్పులు వినబడుతున్నాయి. మోటార్ సైకిల్ ఎలా డ్రైవ్ చేశానో నాకే తెలీదు.
    పదిహేను నిముషాల్లో క్లోరోఫాం సీసా పట్టుకొచ్చాను.
    "గుడ్" అంటూ డాక్టర్ నా చేతిలోంచి సీసా తీసుకున్నాడు. ఇద్దరం గదిలోకి ప్రవేశించాం.
    భద్రం పరిస్థితి చాలా ఘోరంగా వుంది. మొహం తెల్లగా పాలిపోయింది. చెమట్లు ఇంకా కారి దిండుని మరింత తడిపేశాయి. మా వైపు నిస్సహాయంగా చూస్తున్నాడు. బహుశా మా మీద అతడికి నమ్మకం పోయి వుంటుందనుకుంటా.
    డాక్టర్ అతడి పక్కనే కూర్చున్నాడు. భద్రం కడుపుకి సరిగ్గా జానెడు దూరంలో అతడి మొహం వుంది.
    రగ్గు చివరి అంచుభద్రం శరీరం కిందుగా వుంది. దాన్ని లాగటానికి డాక్టర్ దాదాపు అయిదు నిముషాలు కష్టపడవలసి వచ్చింది. ఆ తరువాత అతడు రబ్బరుట్యూబు తీసుకున్నాడు. భద్రం చేతికి ఇంజక్షనిస్తూ కట్టిన ట్యూబు అది. నడుము దగ్గిర బయటికి లాగిన దుప్పటి క్రిందనుంచి ఈ ట్యూబ్ ని నెమ్మదిగా దోపి, కొద్ది కొద్దిగా పైకి తోయటం ప్రారంభించాడు డాక్టరు. అతి సున్నితంగా లోపలికి వెళుతున్న ట్యూబు సంగతి లోపలున్న పాముకి ఏ మాత్రం తెలియకుండా కొద్ది కొద్దిగా వదలసాగాడు. మెదడు ఆపరేషను చేస్తున్నంత ఏకాగ్రతతో డాక్టరు ఈ పని చేస్తూంటే వూపిరి బిగపట్టి చూడసాగాను.
    ఆ ట్యూబు లోపలికి వెళ్ళటానికి ఎంతసేపు పట్టిందో నాకు తెలీదు. దాదాపు అరగంట అయినా అయివుంటుంది. బయటి నుంచి ఆడవాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. అదృష్టవశాత్తూ కామాక్షమ్మగారు కామ్ గా వున్నారు.
    నా భయం ఒక్కటే! ఆచ్చాదన లేకుండా వున్న భద్రం శరీరంమీద కదులుతూన్న ట్యూబు కితకితలు పెడితే అతడు కదులుతాడేమోనని. కానీ  అతడెప్పుడో ఇలాంటివాటికి అతీతంగా బిర్రబిగుసుపోయాడు.
    ఈ లోపులో డాక్టరు వంగి కాగితం తీసుకున్నాడు. దాన్ని కిరసనాయిలు పోసుకునే గరాటులా తయారుచూసి, రబ్బరు గొట్టంలోకి దోపాడు. సీసాని ఆ గరాటులోకి వంచబోతూ నా వైపు చూచాడు. నేను ముందుకు వంగాను. నా చెవిలో సన్నటి స్వరంతో "క్లోరోఫాం చాలా చల్లగా వుంటుంది. కదలవద్దని అతడికి చెప్పు" అన్నాడు.
    నేను భద్రం దగ్గిరగా వెళ్ళి ఆ విషయం చెప్పాను.
    "తొందరగా- తొందరగా" అన్నాడు భద్రం హీనమైన స్వరంతో.
    డాక్టరు సీసాని వంచి కొద్దిగా క్లోరోఫాంని గరాటులోకి పోశాడు. అది ట్యూబుగుండా జారి దుప్పటిలోకి అదృశ్యమైపోయింది. మళ్ళీ కొద్దిగా పోశాడు. 
    గది అంతా క్లోరోఫాం వాసన వ్యాపించింది. ట్యూబ్ చివర్లనుంచి తెల్లటి పొగలు రాసాగినయ్. డాక్టరు మరోసారి సీసాని పూర్తిగా  గరాటులోకి పంపేశాడు.తరువాత సీసా నాకు అందించి, ట్యూబులోంచి అది పూర్తిగా కిందికి జారిపోయిందని నిశ్చయించుకున్నాక, ట్యూబుని బయటికి లాగాడు. అయితే ఎక్కిస్తున్నప్పుడు ఉన్నంత ఏకాగ్రత బయటికి లాగేటప్పుడు అవసరంలేదు. మామూలుగానే రెండు చేతులతో లాగేశాడు.
    అప్పుడు మేము కలలో కూడా వూహించనట్టు, కనురెప్పపాటుకాలంలో జరిగిందది. అప్పటివరకూ ఎంతో జాగ్రత్తగా, నిబ్బరంగా వ్యవహారాన్ని నడుపుకుంటూ వచ్చిన డాక్టరు కూడా బెదిరిపోయాడు.
    గదినిండా వ్యాపించిన క్లోరోఫాం వాసనకి మా వెనకే నిలబడి కుతూహలంతో చూస్తున్న కామాక్షమ్మగారు ఉన్నట్టుండి వెనక్కి విరుచుకు పడిపోవటంతో వచ్చిన శబ్దం అది.
    డాక్టరు చేతిలోంచి రబ్బరు ట్యూబు జారిపోయింది. నేను కూడా చటుక్కున వెనుదిరిగాను. భద్రం భార్య అయితే, భర్త పరిస్థితి కన్నా ఈవిడ పరిస్థితి చూసి మరింత బెంబేలెత్తి పోయినట్టు ఆవిడ మొహమే చెబుతూంది.
    డాక్టర్ తలతిప్పి భద్రం కడుపువైపు చూశాడు. అక్కడ కదలిక లేదు. నా చెవిలో నెమ్మదిగా..... "మనం అదృష్టవంతులం...." అన్నాడు. తలూపాను నేను డాక్టర్ లేచి గ్లాసులో నీళ్ళు తీసుకుని కామాక్షమ్మగారి మొహంమీద కొట్టాడు. ఆవిడ కళ్ళు చిట్లిస్తూ, రెప్పలు తెరిచింది. కేవలం సైకలాజికల్ గా ఫీలయ్యి పడిపోయిందే తప్ప, నిజంగా క్లోరోఫాం వాసనకి కాదని అర్థమైంది. ఈ విషయం సరిగ్గా గ్రహించిన డాక్టర్ మీద అప్రయత్నంగా గౌరవం పెరిగింది నాకు.
    డాక్టరు అలసట నిండిన కంఠంతో నెమ్మదిగా- "మనం ఓ పదిహేను నిముషాలు టైం ఇవ్వాలి దీనికి" అన్నాడు. "బహుశా మన మందు ఎఫెక్టు వెంటనే ప్రారంభం అయివుండొచ్చు. అయినా......" అని ఇంకా ఏదో చెప్పబోతుంటే భద్రం- "ఇంపాజిబుల్..." అని అరిచాడు. "ఇంకో క్షణం కూడా నేను ఇలా ఉండలేను. పాము కరిచినా సరే....." అని ఇంకా ఏదో అనబోతూ డాక్టర్ మొహంలోకి చూసి మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో, మాటలు ఆపుచేశాడు.
    ఆ పదిహేను నిముషాలూ గదిలో గడియారం టిక్ టిక్ చప్పుడు తప్ప మరేమీ వినబడలేదు. భద్రం పరిస్థితి మాత్రం దారుణంగా వుంది. నావైపూ, డాక్టర్ వైపూ, తన కడుపువైపూ చూడసాగాడు. ఈసారి కొద్దిగా ఫ్రీగా ఊపిరి పీల్చసాగాడు. ఛాతీతోపాటూ కడుపుమీద ముడత కూడా కదలసాగింది. గదిలో వ్యాపించిన క్లోరోఫాం వాసన దుర్భరంగా ఉంది. అసలు భ్ద్రానికే క్లోరోఫాం వాసన చూపించవచ్చనే ఆలోచన రానందుకు నన్ను నేను తిట్టుకున్నాను.

    గన్ షాట్ గా ఏదో దారుణం జరగబోతూ వుందని నా మనసు చెబుతూంది. అయితే అదేమిటో తెలియటంలేదు. షాపువాడు నోటినిండా గాలి తీసుకుని వూదుతూ వుంటే ఉబ్బే బెలూన్ ని కళ్ళప్పగించి చూస్తూ, ఏ క్షణం అది పగిలిపోతుందో అని భయపడే పిల్లాడిలా వుంది నా పరిస్థితి.
    ఎట్టకేలకు డాక్టరు తలపంకించి- "ఇక ప్రారంభిద్దామా....." అన్నట్లు నావైపు చూసి రహస్యంగా, "మీరటు వెళ్లండి.  చెరో  వైపు పట్టుకుని రగ్గుని కొద్దికొద్దిగా ముడుచుకుంటూ వెనక్కి తీసుకొద్దాం......" అన్నాడు.
    నేను తలూపి మంచానికి అటువైపు వెళ్ళాను.
    "కదలకు, భద్రం - జాగ్రత్త" అన్జెప్పి నేను అటువైపు వెళ్లాను. నేనూ డాక్టరూ చెరోవైపూ మంచానికి వీలయినంత దూరంగా నిలబడి, బాగా ముందుకు వంగి, చేతులు ముందుకుచాచి, వణికే వేళ్ళతో రగ్గును కొద్దికొద్దిగా వెనక్కి మడవసాగాం. క్లోరోఫాం వాసన ఘాటుగా రాసాగింది. ఇద్దరం వూపిరి బిగపట్టాం. అయితే అది క్లోరోఫాం వాసన  ఘాటుగా రాసాగింది. ఇద్దరం వూపిరి బిగపట్టాం. అయితే అది క్లోరోఫాం భయానికి కాదు. టెన్షన్ వల్ల!
    పాము ముడతవరకూ వచ్చింది రగ్గు. డాక్టరూ, నేనూ ఒకర్నొకరం భయంభయంగా చూసుకున్నాం..... ఇక గడవబోయే అయిదు క్షనాలూ భద్రం జీవితాన్ని నిర్ణయిస్తాయి. భద్రం ఛాతీ కనబడుతూంది ఇప్పుడు. రగ్గు  కొద్ది కొద్దిగా వెనక్కి వెళుతూంటే.... చెమటతో తడిసిన అతడి రొమ్ములమీద జుట్టు తడికి మెరుస్తూ బయటపడుతూంది. చాలా విశాలమైన ఛాతి అతడిది. స్థూలకాయమైనా ఈ వయసులో కూడా ప్రొద్దున్నే లేచి ఎక్సర్ సైజు చేస్తాడు. కాలేజీలో చదువుకునే  రోజుల్లో వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడట. అతడి ఛాతీమీద  విశ్రాంతి తీసుకునే అదృష్టం ఆ రోజుల్లో చాలామంది కాలేజీ అమ్మాయిలకి దొరికిందట. అతడే చెప్పేవాడు. పెళ్ళయిన తరువాత మానేసేడట. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చలి రాత్రి ఈ పాముకి ఆ అదృష్టం లభించింది....
    చూపుడువేలూ, మధ్యవేలూ కలిపి బొటనవేలుతో రగ్గుని కొద్దిగా గాలిలో పైకెత్తి ముడత దగ్గర మడిచాం.
    తెల్లగా కనబడింది. అయితే అది భద్రం పైజామా తాలూకు తాడు. మేం మరింత జాగ్రత్తగా రగ్గు వెనక్కి జరపసాగాం. కాళ్ళమీదుగా రగ్గు వెనక్కి వచ్చేసరికి మేం అప్రయత్నంగానే కొద్ది వేగంతో లాగం. అతడి కాళ్లు కనబడుతూ వుండగా, రగ్గు మంచంమీద నుంచి క్రిందికి జారిపోయింది.
    "కదలకండి" అన్నాడు డాక్టరు. "చాలా జాగ్రత్తగా చూడాలి ఇప్పుడే" అంటూ వంగి, భద్రం నడుము దగ్గిరా, ఛాతీ క్రిందా చూడసాగాడు. భద్రానికి ముందు అర్థం కాలేడనుకుంటా. కొంచెం తలెత్తి నగ్నంగా  వున్న ఛాతీవైపు చూసుకుని, పూర్తిగా మేము దుప్పటిలాగేసిన సంగతి అప్పుడు గ్రహించాడు.
    వెంటనే అతను కదిలాడు. అప్పటివరకూ దాదాపు రెండు గంటల్నుంచీ నిశ్చలంగా పడుకుని ఉన్నవాడల్లా ఒక్కసారి పక్కమీదనుంచి క్రిందకి గెంతి, కాలు నేలకు ఆనీ ఆనకముందే రెండుకాళ్ళూ ఒకదాని తరువాత మరొకటి గాలిలోకి విసురుగా విదిలించాడు. అతడిని పాము ఎక్కడ కుట్టిందో నాకు అర్థం కాలేదు. అతడి భార్య కేకవేసి ముందుకు వచ్చింది. డాక్టరు ఒక్కఉదుటున బాగ్ దగ్గిరకు చెయ్యి పోనిచ్చాడు. అంతలో భద్రం కాళ్ళు  విదిలించటం ఆపి, నిశ్చలంగా నిలబడి మావైపు చూస్తూ....
    "అదిలేదు" అన్నాడు ఒక్క మాటలో.
    ఒక్కసారిగా మా అందరి కళ్ళూ పక్కమీదకీ, అక్కణ్ణుంచి నేలమీదకూ, గది మారుమూలలకీ పాకినయ్.
    భద్రం తువ్వాల్తో మొహాన్నీ, ఒంటినీ తుడుచుకుంటున్నాడు.
    "అసలు పామూ గీమూ ఏదీ వుండి వుండదు. మీ ఆయన ఏ తాడునో చూసి పాము అనుకొని వుంటారు" అన్న స్వరం వినిపించి మేము అటు తిరిగాం. కామాక్షమ్మ భద్రం భార్యతో చెబుతూంది.
    భద్రం మొహం ఎర్రగా మారింది. నేను అర్థం చేసుకోగలను. ఇది  నిశ్చయంగా అతడి అహాన్ని దెబ్బతీసేమాటే. ఎందుకంటే అది పాముగానీ, తాడుగానీ ఏదైతేనేం అంతసేపు దాన్ని కడుపుమీద ఉంచుకుని అలా కదలకుండా పడుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకెవరైనా అయితే మొదటి క్షణమే గుండె ఆగిపోయేది.
    భద్రం ఆమెవైపుచూసి, "పాము నా భుజంమీద నుంచి వెళుతూండగా చూసేను" అన్నాడు కటువుగా.
    "ఏదయినా అదృష్టం బావుంది" అంది భద్రం భార్య మంగళసూత్రం కళ్ళకద్దుకొంటూ.

 Previous Page Next Page