కొంచెం ఆగి, మళ్ళీ తనే "నువ్వు నా పెద్దకొడుకువి. త్వరలో నా చేతికి అందిరావాల్సిన వాడివి. నువ్వు ఏమాత్రం తప్పటడుగు వేసినా నా గుండె కళుక్కుమంటుంది. నీకు నేను కలిగించిన సౌకర్యాలు, నా చిన్నప్పుడు మా నాన్న ఒక్కటీ కలుగజెయ్యలేదు. అసలు నా ఊసే పట్టించుకోలేదు. ఎన్నో కష్టాలుపడి పైకి వచ్చాను. నేను సెల్ఫ్ మేన్ ని. నీకు ఏది కావాలంటే అది యిస్తున్నాను. ప్రత్యేకం ఓ గది ఏర్పాటుచేశాను. ఈ సదుపాయాలన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకోకపోతే...."
ఆయన కంఠం గాద్గదికమై వణికింది. "వెళ్ళు. వెళ్ళి చదువుకో"
మధుబాబు అక్కడినుంచి వచ్చేశాడు. అతని మనస్సు వికలమైపోయింది.
5
తన కేమైనా పేరుప్రఖ్యాతులు వచ్చాయా అని మధుబాబు ఆలోచిస్తూ వుండేవాడు. తాను విన్న ప్రకారం ఈ రాసేవాళ్ళకు సంఘంలో గౌరవం, ప్రతిష్ట లభిస్తూ వుండాలి. అలాంటివేమయినా అమురుతున్నాయా తనకు? కాలేజీలో తనగురించి తరుచు ప్రసక్తి వస్తూంటుందని చూచాయగా విన్నాడు. అయితే వాళ్ళెవరూ బయటపడి తనని పొగడటంకాని, అలాంటిదింకేమయినా చెయ్యటంకాని జరగలేదు.
విశ్వనాథంగారి స్నేహితులు తరచు చదువుతూండేవాళ్లు. తమ అభిప్రాయాలు సంభాషణాపరంగా ఆయనముందు వ్యక్తపరుస్తూ వుండేవాళ్ళు "ఏమిటయ్యా ఎప్పుడూ నీ బిజినెస్ గొడవేనా? కాస్త ప్రక్కకి కూడా దృష్టి మళ్ళించు. మీ అబ్బాయి బాగానే రాస్తున్నాడు" అనేవాళ్ళు. "ఇవాళ తప్పకుండా చదువుతాను" అనుకునేవాడాయన. ఆ రాత్రి కాస్త ప్రయత్నం చేశాడు. కాని ఒక్కపేజి అయినా పూర్తికాకుండానే అంతా గందరగోళంగా, ఏమిటోగా వుండేది. కాయితాలు మూసేసి పడుకుని నిద్రపోయేవాడు.
మధుబాబు క్లాసులో సత్యనారాయణ అని ఓ అబ్బాయి వున్నాడు. ఇంచుమించు మధుబాబు యీడే వుంటుంది. క్లాసులో ఓ మూల వంటరిగా కూర్చునే వాడు. ఎవరితోనూ ఎక్కువ మాట్టాడేవాడు కాదు.
ఓ రోజు సత్యనారాయణ మధుబాబు దగ్గరకొచ్చి"మా అన్నయ్యని కలుసుకుంటారా?" అన్నాడు.
మధుబాబు కొంచెం ఆశ్చర్యపడి "మీ అన్నయ్య ఎవరండీ?" అన్నాడు మృదువుగా.
"ఉమాపతి, కథలురాసే ఉమాపతి."
మధుబాబు చప్పున భుజాలెగరేశాడు. అప్పుడప్పుడూ పత్రికల్లో కనిపిస్తూ వుండే ఉమాపతి యితని అన్నా?
"అన్నయ్యకూడా లాస్ట్ ఇయర్ నుంచే రాయటం మొదలుపెట్టాడు. మీరు నా క్లాస్ మేటని చెప్పాను. మిమ్మల్ని కలుసుకుందామనుకుంటున్నాడు" అన్నాడు సత్యనారాయణ.
మధుబాబుకు చెప్పలేని ఆనందం కలిగింది. మొదటిసారిగా మరో రచయితని కలుసుకునే అవకాశం లభిస్తోంది. "తప్పకుండా. ఇవేళ సాయంత్రం మీ ఇంటికి వెడదామా?" అన్నాడు ఉత్సాహంగా.
సత్యన్నారాయణ "మా యింటికి ఇవాళ వద్దండీ. వర్షాలు పడటంమూలాన దారి సరిగ్గాలేదు. సాయంత్రం అయిదుగంటలకు మేమిద్దరం కలిసి మీ యింటికి వస్తాము" అన్నాడు.
"మా ఇళ్ళు తెలుసా మీకు?"
"ఆఁ గాంధీనగర్ లో వుంది. లైబ్రరీకి పోయే దారిలో రెండు మూడుసార్లు మీరు మేడమీద నిలబడి వుండగా లైబ్రరీకి పోతూ చూశాను."
మధుబాబు సంతోషించి "సాయంత్రం తప్పకుండా రండి. ఎదురుచూస్తూ వుంటాను" అన్నాడు. సత్యనారాయణ వెళ్ళిపోయాడు.
ఉమాపతి రాసిన ప్రతిరచమా అతను చదువుతూనే వున్నాడు. అతను యీ రంగంలో తనకంటే కొంచెం ముందుగా ప్రవేశించాడు. కాని తను చేసినన్ని రచనలు అతను చేయలేదు. రాయటం ప్రారంభించి ఏడాది గడచినా అన్నీ కలిసి ఏడెనిమిదికంటే మించవు.
నాలుగున్నరకి కాలేజీనుంచి ఇంటికివచ్చి బట్టలు మార్చుకుని, అయిదయే సరికి కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. తను అతన్తో మాటలాడవలసిన విషయాలగురించి ఆలోచిస్తున్నాడు. చివరకు అయిదున్నర దాటుతూండగా వాళ్లిద్దరూ వచ్చారు. ఉమాపతి కొంచెం ఇంచుమించు అతని తమ్ముడిలాగే వున్నాడు. జుట్టు కొంతభాగం కళ్లమీదుగా ముందుకు పడుతోంది. పైజమా, లాల్చీ వేసుకున్నాడు. కళ్ళు నిశితమైన దృష్టితో, భావస్ఫోరకంగా వున్నాయి. చూడగానే రచయిత అనిపించేటట్లుగా వున్నాడు. మధుబాబుని చూస్తే ఎవ్వరూ రచయిత అనుకోవడానికి ఆస్కారం లేదు. అతను సన్నగా, ఎర్రగా, లేతగా వుంటాడు. అతని క్రాఫ్ ఉంగరాలుగాని, వంకెలుగాని తిరగలేదు. పైకి దువ్వుతాడు.
నమస్కారంచేసి ఇద్దర్నీ లోపలకు తీసుకుపోయి తనగదిలో కూర్చోబెట్టాడు.
"మిమ్మల్ని ఓ రకంగా నేను యెరుగుదును" అన్నాడు ఉమాపతి ఆసీను డయినాక.
"ఎలా?"
"మనం ఇద్దరం ఒకే స్కూల్లోనే చదివాం, ఫిప్త్ ఫారం చదివేరోజుల్లో ఇంకా డివిజన్స్ చెయ్యకముందు అందరకూ కలసి కామన్గా అటెండెన్స్ తీసుకుంటూ వుండేవాళ్లు. ఓసారి అటెండెన్స్ పిలిచేటప్పుడు పరధ్యానంగా వుండటంచూసి నేనే ఇచ్చేశాను రెస్పాన్స్" అని నవ్వాడు ఉమాపతి.
"అయితే మనమిద్దరం క్లాసుమెట్సుమా?" అన్నాడు మధుబాబు ఆశ్చర్యంగా.
"కొంతవరకూ కొంతకాలం ఇక్కడ చదివాక కలకత్తాలో మా పెదనాన్నగారి దగ్గరకు వెళ్లిపోయాను. స్కూల్ ఫైనల్ తప్పాను. ఇంక చదవబుద్ధి కాలేదు. చదువుకి తిలోదకాలిచ్చేశాను. మా తమ్ముడికీ నాకూ వయస్సులో ఏడాదికంటే తేడాలేదు. వాడు ప్రైవేట్ గా మెట్రిక్ కట్టి కాలేజీలో చేరాడు.
"మరి ప్రస్తుతం మీరేం చేస్తున్నారు?"
"ఉద్యోగంకోసం ప్రయత్నిస్తున్నాను."
మధుబాబు లోపల్నుంచి కాఫీలు తీసుకువచ్చాడు. కాఫీలు త్రాగుతూ వాళ్ళు మామూలు విషయాలు యధాలాపంగా మాటలాడుకున్నారు.
"మీరు చాలా కథలు రాశారనుకుంటాను" అన్నాడు ఉమాపతి మొదలు పెడ్తూ.
"ఔనండీ! ఓ పాతికవరకూ రాశాను. ఒక్క భారతి మినహాయించి, ఇంచుమించు అన్నిట్లోనూ అచ్చయినాయి."
"అంత త్వరగా ఎలా వ్రాయగలుగుతున్నారు?"
మధుబాబుకి అర్థంకాలేదు. "అంటే?"
"అంత యెక్కువగా యెట్లా ఉత్పత్తి చేయగలుగుతున్నారు? శ్రమ అనిపించటం లేదూ మీకు?"
ఈ మాట మధుబాబుకి చాలాకొత్తగా అనిపించింది. "శ్రమ అని యెప్పుడూ అనుకోలా. ఏదో ఇతివృత్తం తట్టడం, రాసి పంపించేయటం అంతే" అన్నాడు.
"మీరు ఒకసారి రాసింది మళ్ళీ ఫెయిర్ చేస్తారా?"
"చెయ్యను. నిజం చెప్పాలంటే రాసింది చదువుకొనటానిక్కూడా నాకు ఓపిక వుండదు. అచ్చులో వస్తే చదువుకొనటమే."
ఉమాపతి యీ మాటలకు బాగా ఆశ్చర్యపడినట్లు కనిపించాడు. "ఓ కథ రాసేముందు మనసులో తర్జనభర్జన, విమర్శమ్ యోగ్యత ఇవన్నీ ఆలోచించుకోరా?" అన్నాడు కొంచెం ఆగి.
"ఉహుఁ" అన్నాడు మధుబాబు.
"అసలు మీ ఆశయం ఏమిటి?' అన్నాడు ఆ రచయిత వున్నట్టుండి.
మధుబాబు ఉలిక్కిపడ్డాడు. ప్రశ్న తూణీరంలా వచ్చింది. సరికొత్తది. యిదివరకు ఎన్నడూ విని యెరుగనిది. ఏమిటి తన ఆశయం? ఏముంది? అయోమయంగా చూశాడు పృచ్చకునివంక.
"చెప్పండి" అన్నట్లు అతను గ్రుచ్చి గ్రుచ్చి చూశాడు.
మధుబాబు గబగబ ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు తాను రాసిన కథలన్నీ మననం చేసుకుంటున్నాడు.
"ఇంతవరకూ పాతిక కథలు రాశారు. అన్నిట్లోనూ ఏదో చెప్పాలని ప్రయత్నించారు. కొత్త కొత్త పాత్రల్ని సృష్టించారు. కొంతవరకు మీ అభిప్రాయాల్ని నేను వూహించగలను. కానీ కలిశారు కాబట్టి ముఖతః వినాలని వుంది. ఏమిటి కలం చేపట్టటంలో మీ ఆశయం?"
అబ్బ! పెద్ద పెద్ద డైలాగులు దొర్లుతున్నాయి. కాని ఏమి సమాధానం చెబుతాడు తాను! తనకేమీ ఆశయం లేదు. ఆశయం కోసం యింతవరకూ రాయలేదు. కథను మొదటి అక్షరంనుంచీ చివరి అక్షరం వరకూ ఏవో పాత్రలతో వూహించి రాశాడు అంతే.
"మీ రచనల ద్వారా సమాజానికి మీరివ్వదలచుకున్న సందేశమేమిటి?"
అయ్యబాబోయ్! ఏమిటీ ప్రయోగాలు తనమీద? సమాజాన్ని సంస్కరించాల్సిన బాధ్యతతనకు ఉందా? దానికి ఓ సందేశాన్ని వినిపించవలసిన అవసరం తనకు కలదా? ఐతే రాయటానికి ఓ ప్రయోజనం, లక్ష్యసిద్ధీ వుండాలన్న మాట.
"నాకేమీ ఆశయాలు లేవండీ" అన్నాడు నవ్వటానికి ప్రయత్నిస్తూ.
జవాబు విని ఉమాపతి విస్తుపోయాడు. అతనికీ ధోరణి విచిత్రంగా కన్పించింది. ఇలా అన్నాడు."ప్రపంచానికి ఎలుగెత్తి చెప్పదల్చుకున్నది లేనినాడు కాయితాన్ని ఖరాబు చేయటం శుష్క దండుగ. అసలు ఏదో దుగ్ధ, తీరని తపన మనసులో జనించి, ఆ తాపాన్ని తీర్చుకోవటానికి కలం పడితేనే అతడు నిజమైన రచయిత. ఆశయంలేనివాడంటూ ఎవడూ వుండడు. ఐతే కొందరికి నిర్దుష్టమైన అభిప్రాయాలుండవు. వయసూ అనుభవం ఆ నిర్దుష్టత కలిగిస్తవి.
"మరి నాకు లేదండి" అన్నాడు మధుబాబు నీరసం గ్రమ్మినట్లు.
ఉమాపతి మందహాసం చేశాడు. "మీ రచనలు చదివితే అట్లా అనిపించదే. వాటిలో అభూతకల్పనలు ఏవీ వుండటంలేదు. మనచుట్టూ రగులుతోన్న సమస్యల్నే చిత్రిస్తున్నారు. మిమ్మల్ని గురించి మీకు సరైనా అభిప్రాయంలేదు. మీలో అవ్యక్తమైన ఆరాటం వుంది" అన్నాడు.
మధుబాబుకు అబద్ధం చెప్పాలనిపించలేదు. "రెండు చేతులూ రాయాలన్న ఆరాటం తప్ప ప్రపంచాన్ని గురించి మరోధ్యాస లేదు. నేను కావాలని యింత వరకూ ఏ సమస్యనూ తీసుకోలేదు. ఆదర్శాలు విరాజిమ్మాలనీ ప్రయత్నించలేదు. నా ఆనందంకోసం, తృప్తికోసం రాసుకున్నానంతే" అన్నాడు.