"గుడ్" అన్నాడాయన. "........వీలైనంత త్వరలో అతడి మీద నీకున్న ఇష్టాన్ని ప్రకటించు. అనవసరమైన ఆలోచన్లు పెట్టుకొని మనసును పాడుచేసుకోకు, నువ్వు చెప్పినదాన్ని బట్టి యశ్వంత్ గాంభీర్యత, తెలివితేటలు, వాయుపుత్రలో చురుకూ హుషారు - ఈ రెండు వ్యతిరేక లక్షణాలూ నిన్ను డైలమాలో పడేస్తున్నాయి. నీకు సంబంధించినంత వరకూ యశ్వంత్ ఒక అయిపోయిన ఛాప్టరు. అతడి జ్ఞాపకాలు తిరిగి తీసుకొచ్చే ఏదయినా సరే దగ్గర చేరనివ్వకు. నీ కాబోయే భర్తని అతడితో ఎప్పుడూ పోల్చకు. అలాటి ఆలోచన ఏదైనావస్తే ఒకటి జ్ఞాపకం వుంచుకో.....ఒకవేళ నీ వివాహం యశ్వంత్ తో తిరిగి జరిగితే అప్పుడు వాయుపుత్రలోని లక్షణాలే బావున్నట్లు అనిపిస్తాయి."
"మైగాడ్. దారుణం."
"చూశావా, అందుకే అయిపోయిన దాన్ని వదిలెయ్యమన్నాను. అదృష్టవశాత్తు యశ్వంత్ నీకు భవిష్యత్తులో తారసపడే ఛాన్సు కూడా లేదు. అతడు కూడా వేరే వివాహం చేసుకుని వుంటే అసలు గొడవే లేదు."
అనుమానాలు కాస్త క్లియరయినట్లు అనూహ్య లేచి "మీరు చెప్పినట్లు చేయడానికి ప్రయత్నిస్తాను" అంది.
"బెస్టాఫ్ లక్. నేను చెప్పింది మాత్రం గుర్తుంచుకో. యశ్వంత్ ఆలోచన్లు నీలో లేనంత కాలమూ వాయుపుత్రతో నీ జీవితం సుఖప్రదమవుతుంది. వీలైతే మామూలుకన్నా ఎక్కువ కాలం మీరిద్దరూ హనీమూన్ లో గడపండి. అది మరింత మేలు చేస్తుంది."
ఆ గదిలో ప్రవేశించిన అంతసేపటికి అనూహ్య మొట్ట మొదటిసారి నవ్వింది. "బహుశా ఎవరూ గడపని హనీమూన్ మేము గడపబోతున్నాము డాక్టర్. భూమికి కొన్ని లక్షలమైళ్ళ దూరంలో స్పేస్ సిటీకి వెళ్ళే రాకెట్ లో మేమిద్దరమే."
ఆయన కూడా నవ్వేడు.
"వెరీగుడ్. దాదాపు కాంతివేగంతో సమానంగా ప్రయాణం చేస్తావు కాబట్టి ఆ సమయంలో నీ మనసులోకి అంతదూరంలో కూడా యశ్వంత్ ఆలోచన్లు వచ్చి వేధించవని ఆశిస్తాను" చేయి చాచి ఆయన అన్నాడు.
షేక్ హాండిచ్చి ఆమె బయటకు వచ్చేసింది.
ఆ సాయంత్రమే ఆమె వాయుపుత్రకి తన అభిప్రాయం తెలపాలనుకుంది. స్పేస్ సిటీ ప్రయాణానికి ఇంకా రెండురోజులు మాత్రమే టైముంది.
తమ వివాహాన్ని కాదనే వారెవరూ లేరు కాబట్టి ఆ మాత్రం టైమ్ చాలు.
4
నిఖిల్, యశ్వంత్ లు ప్రయాణం చేస్తున్న హెవీ ప్లేన్ అరగంటలో క్రిందికి దిగింది. నిఖిల్ వాచీని చూసుకుంటూ "ఆర్కిటిక్ నుంచి భారతదేశానికి అరగంటలో....మంచివేగం" అన్నాడు నవ్వుతూ. "చాలాకాలం తర్వాత మీరు మళ్ళీ ఇటువైపు వస్తున్నారు కదూ!"
"అవును. నాలుగు సంవత్సరాల తరువాత"
కొంచెం నిశ్శబ్దం తరువాత నిఖిల్ అడిగాడు. "మీ రెందుకో మూడీగా వున్నారు."
యశ్వంత్ మాట్లాడలేదు. నగర వీధులగుండా వాహనం ప్రయాణం సాగిస్తోంది.
ఇవే రోడ్లమీద కొన్ని సంవత్సరాల క్రితం తన భార్యతో తిరిగాడు. భార్య వదిలిపెట్టాక ఇవే రోడ్లమీద ఒంటరి రాత్రులు ఏకాంతపు విషాదంలో గడిపాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి.
"నిఖిల్"
"యస్ సార్"
"నువ్వెప్పుడైనా ఎవర్నైనా ప్రేమించావా?"
నిఖిల్ విస్మయంతో అతడివైపు చూశాడు.
ఎప్పుడూ సీరియస్ గా ఆస్ట్రోఫిజిక్స్ తప్ప మరేమీ ఆలోచించని, మాట్లాడని యశ్వంత్ నోటివెంట ఆ ప్రశ్న రావటం....
"నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు నువ్వు."
నిఖిల్ కాస్త సిగ్గుతో తలూపాడు. ఈ లోపులో వారు సైన్స్ సిటీ చేరుకున్నారు. వాళ్ళు హాల్లోకి వెళ్ళగానే- "మీరేనా యశ్వంత్ అంటే?" వేదప్రియ అడిగింది. యశ్వంత్ తలూపాడు. "మీ కోసం సతీష్ చంద్ర చూస్తున్నారు."
అతడు తలూపి లోపలకు ప్రవేశించాడు.
* * *
ఎన్నెస్సారై డైరెక్టరు సతీష్ చంద్ర, యశ్వంత్ ని చూడగానే చేయిచాచి, "హల్లో యశ్వంత్ అన్నాడు. "మాట్లాడుకోవటమే గానీ చూసి చాలా కాలమైంది.
అతడు నవ్వి వూరుకున్నాడు.
ఇద్దరూ కూర్చున్నాక సతీష్ చంద్ర డ్రాయర్ లోంచి ఒక పొడవాటి కాగితం చుట్ట తీశాడు. గుండె కొట్టుకోవటాన్ని చిత్రంచే రోలర్ కాగితంలా వుందది.
దాన్ని అందుకుంటూ "ఏమిటిది" అని అడిగాడు.
"5000 A రీజన్ నుంచి ప్రాజెక్ట్ సైక్లోప్స్ అందించిన తరంగపు సంకేతం దీన్ని కంప్యూటర్ కాగితంమీద ఈ విధంగా ముద్రించి ఇచ్చింది. బ్రిటన్ క్షణాలమీద దీన్ని అన్ని దేశాలకీ అందజేసింది. విశ్వాంతరాళాల్లో వున్న బుద్ధజీవులకు మన ఉనికి తెల్పటం కోసం చేసే ప్రయత్నం ఫలించింది యశ్వంత్! సుదూర తీరాల్నుంచి ఎవరో మనకి తిరిగి జవాబు పంపించారు."
యాశ్వంత్ వినటంలేదు. అతడి చేతులమధ్య కాగితం వణుకుతోంది. ఆ ఆస్ట్రోఫిజిసిస్ట్ మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. ఆ కాగితంలో వున్నది ఏమిటో తెలీదు. అదికాదు ముఖ్యం. ఎవరో ఎక్కడో వున్నారు. మన సంకేతాలు అందుకొని తిరిగి ప్రతిస్పందించారు. అది చాలు.
అతడు తన చేతిలో కాగితంవైపు చూశాడు మళ్ళీ.
కొన్ని మిలియను సంవత్సరాల తరువాత కొన్ని కోట్ల మైళ్ళదూరం ఒక జీవి - మరొక జీవికి వ్రాసిన ప్రప్రధమ లేఖ.
అతడి పెదవుల మీద చిర్నవ్వు ఉదయించింది. ఈ కమ్యూనికేషన్ సాంకేతిక రంగంలో ఇది అపురూపమైన విజయం.
కానీ ఆ కాగితంమీద వున్న సంకేతానికి అర్థం తెలిస్తే అతడి పెదవుల మీద ఆ నవ్వు వేలిసేది కాదు. అతడి పెదవుల మీదే కాదు - ప్రపంచంలో ఏ వ్యక్తి మొహంలోనూ....
"ఇది నిజంగా మాయాస్* పంపిన సంకేతమేనా? అనేది మనం ముందు నిశ్చయించుకోవాలి....." అన్నాడు డైరెక్టర్.
"మీరన్నట్టు - ఇదంతా కేవలం మన భ్రమా, ఊహ అయితే ఏమో చెప్పలేం గానీ, నిజమైన సంకేతాలయిన పక్షంలో ఈ గ్రహాంతర జీవులు యాభైవేల సంవత్సరాల క్రితమే భూమ్మీదకు వచ్చారని దాఖలాలున్నాయి. ఇందులోనిజమెంతో
_________________________________________________________________
*మాటిమాటికీ "గ్రహాంతర వాసులు" అని ఉపయోగించటం చదవటానికి కష్టం. చాలామంది రచయితలు ఈ గ్రహాంతర వాసుల్ని 'మాయాస్' అని పిలుస్తున్నారు. ఈ నవలలో కూడా ముందు ముందు అదే ఉపయోగించటం జరుగుతుంది.
_________________________________________________________________
తెలీదు. చైనాలో హునాన్ రాష్ట్రంలో ఒక దీవిమీద వున్న కొండరాళ్ళ మీద కొన్ని అంతరిక్ష నౌకల బొమ్మలు చెక్కబడి వున్నాయి. ఇవి 47 వేల సంవత్సరాల క్రితంవి! ఈ కొండమీదే పిరమిడ్ల చిత్రాలు కూడా వున్నాయి. అంటే 50,000 సంవత్సరాలక్రితమే మనిషికి వీటి సంగతి తెలిపైనా వుండాలి లేదా పరలోకవాసులు వీటిని చిత్రించైనా వుండాలి.' అతడి మాటలు ఇంకా పూర్తికాలేదు. వేదప్రియ లోపలికి వచ్చింది. ఆమె అందించిన కాగితం చదివి డైరెక్టర్ అయోమయంగా చూశాడు.
"ఏం జరిగింది?"
"మన అంతరిక్ష నగరం నుంచి సంకేతాలు ఆగిపోయాయి."
"మన వాళ్ళున్న స్పేస్ సిటీ నుంచి ఏ విధమైన సమాచారమూ రావటం లేదట-" అంటూ హడావుడిగా లేచి అంతరిక్ష పరిశోధనా సంస్థ భవంతివైపు పరుగెత్తాడు. యశ్వంత్ కూడా అతడిని అనుసరించాడు.
దాదాపు వంద సంవత్సరాలక్రితం, భూమికి మూడున్నర లక్షల మైళ్ళ దూరంలో నిర్మింపబడింది అంతరిక్ష నగరం! అక్కడ సైంటిస్థులు నిరంతరం పరిశోధనలు చేస్తూన్నే వుంటారు. అంతరిక్షంలోకి పంపబడే రాకెట్లును భూమిమీద నుంచే పంపేవారట. "భూమి ఆకర్షణ శక్తినుంచి, ఆ కక్షలోంచి బయట పడటానికి ఎంతో ఇంధనం ఖర్చయ్యేది. అంతరిక్ష నగరం (స్పేస్ సిటీ) వచ్చాక ఈ ఖర్చు తప్పింది" అనూహ్య, వాయుపుత్ర వెళ్తూంది ఏఎ సిటీకే!
డైరెక్టర్ యశ్వంత్ తో కలిసి ఆ భవంతిలోకి వెళ్ళేసరికి అక్కడ వాయుపుత్ర వున్నాడు.
"ఎన్నిసార్లు అడిగినా మనవాళ్ళ దగ్గర్నించి జవాబు రావడంలేదు సర్? దాదాపు అరగంట నుంచి ప్రయత్నం చేస్తున్నాను" అన్నాడు వాయుపుత్ర నుదుటిమీద పట్టిన చెమట తుడుచుకుంటూ. డైరెక్టర్ వెనుక నిల్చుని వున్న యశ్వంత్, వెనుకనుంచే, "వేవ్ లెంగ్త్ మార్చి చూడండి" అని సలహా యిచ్చారు.
ఎవరో ఆగంతకుడు తెలియని జ్ఞానంతో అప్పనంగాసలహా ఇచ్చినందుకు వాయుపుత్ర మరో సమయంలో అయితే మాటకిమాట సమాధానం చెప్పేవాడే కానీ ఎదురుగా డైరెక్టర్ వుండటంతో బలవంతంగా తనని తను నిబ్బరించుకుని, "అంతరిక్షంలోకి ఏ వేవ్ లెంగ్త్ లో పంపినా ఒకటే" అన్నాడు- ఇంత చిన్న విషయం తెలియని మీరు అసలు ఈ అంతరిక్ష పరిశోధనా సంస్థలోపలి గదుల్లోకి ఎలా రాగలిగారు అని ధ్వనించేలా......
యశ్వంత్ మాత్రం తన స్వభావసిద్ధమైన గాంభీర్యంతో "ఐస్ టోప్- ద్వారా అయితే, దానికీ మామూలు 'లెంగ్త్' కీ తేడా వుంటుంది కదా" అన్నాడు.
వాయుపుత్ర అదిరిపడ్డాడు. కేవలం పదిరోజులు క్రితమే కనుక్కోబడ్డ కొత్త మార్గం! చాలా మంచి ప్రఖ్యాత శాస్త్రజ్ఞులకే ఇంకా దీని వివరాలు చేరలేదు. అప్పుడే ఈ ఆగంతకుడికి ఆ విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు.
ఈలోపు డైరెక్టర్, "అన్నట్టు మీ ఇద్దరికీ పరిచయం చేయటం మర్చిపోయాను కదూ.....ఈయన యశ్వంత్ ఆస్ట్రోఫిజిసిస్ట్" అని వాయుపుత్రతో అన్నాడు వాయుపుత్ర దిగ్భ్రమతో అతడివైపు చూశాడు.
భారతదేశపు అత్యుత్తమ శాస్త్రజ్ఞుడు ఇలా మామూలుగా తన గదిలోకి వచ్చి మాట్లాడతాడని అతడు కలలో కూడా ఊహించలేదు. తను మాట్లాడిన మాటలకి సిగ్గుపడుతున్నట్టు "ఐయామ్ సారీ" అన్నాడు "......ఎవరో అనుకున్నాను."
"దానిదేముంది. అసలు పరాయివ్యక్తికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు" యశ్వంత్ నవ్వేడు. "ఇంతకీ ఐసోటోప్-5 ప్రయత్నించారా?"
వాయుపుత్ర చకచకా ఆ మార్గంలో ప్రయత్నం చేశాడు. ఇరవై నిముషాల తరువాత అట్నుంచి ఏ సమాధానమూ ఎఆక నిస్సహాయంగా వారివైపు చూశాడు.
ఈ లోపులో హాట్ లైన్ మీద అమెరికా, రష్యా, ఫ్రాన్స్ జపాన్ దేశాల మధ్య కూడా ఈ వార్త పరస్పరం తెలిసిపోయింది. అన్ని దేశాలవారు ఆందోళన చెందసాగారు. మార్గమధ్యంలో ఈ వార్తా ప్రసారానికి ఏదైనా ఆటంకం కలిగిందేమో అని అందరూ అనుకున్నారు.
"ఇలాంటి సాంకేతికపరమైన లోపం కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది కదూ."
"అలాటిదేమీలేదే-" డైరెక్టర్ అన్నాడు. యశ్వంత్ ఆయన వైపు అపనమ్మకంగా చూస్తూ "ఒకసారి మన పాత రికార్డులు తీసి చూద్దామా?" అన్నాడు.
ముగ్గురూ తిరిగి కార్యాలయంవైపు వచ్చారు. అన్ని భవంతులూఒకే ఆవరణలో వున్నాయి. నడుస్తూ వుంటే వాయుపుత్ర "మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా వుంది. అసలు ఊహించలేదు" అన్నాడు.
యశ్వంత్ నవ్వి వూరుకున్నాడు.
వాయుపుత్ర అన్నాడు- "ఇంకో రెండు రోజుల్లో మేము ఆ స్పేస్ సిటీకి ప్రయాణం అవుతున్నాము. ఇప్పుడే ఇలా జరగాలా?"