Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 49


    నరసింహం ఆనందంగా చూశాడా దృశ్యం. వాడే హరికృష్ణ !

    ఎలాంటి సందేహం లేదు. మురళి మద్రాస్ వెళ్ళిన విషయం తెలీసి సాలెగూటి కొచ్చాడు. ఈ రోజుతో వాడి నాటకానికి అర్జంటుగా తెర పడిపోతుంది.

    మెట్లు త్వరత్వరగా దిగి కిందకు వెళ్ళాడతను. నరసింహాన్ని కోపంగా చూశాడు మురళి.

    "ఈ ఘూర్ఖాని తీసి పారెయ్ మని చెప్తే వినవేం ? నేనెప్పుడు ఇంటికొచ్చినా పేచీగానే వుంది వీడితో-"

    ఘూర్ఖా నరసింహం రావటం చూసి మురళికి దారి ఇచ్చాడు.

    మురళి లోపలికొచ్చి హాల్లోనే కూలబడ్డాడు.

    "రాధా ! టీ తీసుకురా ! అర్జంట్!" అన్నాడతను.

    రాధ బయటికొచ్చి అతనిని చూసి నివ్వెరపోయింది.

    "అదేమిటి, మీరు మద్రాస్ వెళ్ళలేదా !" అంది ఆశ్చర్యంగా.

    ఆ మాటలు మురళికి చిరాకు కలిగించినయ్.

    "నేను మద్రాస్ వెళ్ళటం ఏమిటి ?"

    "మీరు మద్రాస్ వెళ్తానన్నారుగా ఇందాక ?"

    "నేనన్నానా ?"

    "అవునండీ ! అలా మాట్లాడతారేమిటి ? ఇంతకు ముందేగా సూట్ కేస్ తీసుకెళ్ళిందీ ?"

    మురళి ఆశ్చర్యంగా నరసింహం వేపు చూస్తూ లేచినుంచున్నాడు.

    "కొంపదీసి వాడు మళ్ళీ రాలేదుకదా ?"

    నరసింహం నవ్వాడు.

    "ఒరే హరికృష్ణా ! ఇంతకాలం జాగ్రత్తగా మానేజ్ చేశావ్. ఇప్పుడు మాత్రం పప్పులో కాలేశావ్. మా మురళి ఇందాకే మద్రాస్ వెళ్ళాడు. ఆ విషయం పాపం నీకు తెలిస్చావలేదు. లే - నీ ఆఖరిక్షణాలు దగ్గర పడ్డాయ్." అన్నాడు నరసింహం.

    "ఏమిటి నువ్ మాట్లాడేది ? నేను మురళిని మావయ్యా ! వాడు మళ్లీ మిమ్మల్ని మోసం చేశాడు."

    "నీ ఆటలు ఇంక సాగవని ఓసారి చెప్పాను కదా ! ఒరే రంగా-" అంటూ అరిచాడు నరసింహం. లోపలి గదిలో దాగున్న రంగా పరుగుతో వచ్చి మురళీని రెక్కలు విరిచి పట్టుకున్నాడు.

    "మావయ్యా ! ఏమిటి ఇది ? నేనే మురళినని చెప్తుంటే వినవేం ?" కోపంగా అరిచాడు మురళి.

    "ఒరే  హరికృష్ణా ! ఇంక నీ నాటకానికి తెరపడిందన్నాను కదా ! అంచేత నటించటం ఆపేయ్ ! నన్ను ఇంతవరకూ ఎవరూ ఫూల్ చేయలేదు. చేసిన వాడెవడూ తప్పించుకోనూ లేదు. లేకపోతే నీ భరతం పడతానికి కొంచెం టైమ్ ఎక్కువ పట్టింది..."

    "నీకు పిచ్చెక్కింది ! నేను మురళినేనని చెప్తున్నా వినిపించుకోవేం ? కావాలంటే మనద్దరికి గుర్తుగా ఈ పులిగోరు వేశావ్ గా నా మెళ్ళో - చూడు-" అంటూ తన మెడలోని పులిగోరు తీసి నరసింహానికి చూపించాడతను.

    నరసింహం మళ్ళీ నవ్వాడు.

    "ఒరేయ్- నువ్ చాలా తెలివిగలాడివని నేను వప్పుకుంటున్నా కదా ! అంచేత ఇంక నీ తెలివితేటల ప్రదర్శన ఆపెయ్__" అంటూ రంగాతో "ఒరే రంగా ! ఇంకా చూస్తావేమిట్రా... వీడికివ్వాల్సిన గౌరవ మర్యాద లిచ్చేయ్ !"

    రంగా పాంట్ జేబులోనుంచి కట్టి తీశాడు.

    "నేను ఆరోజు పొరబాటున వదిలి తప్పుచేశాన్రా ! ఇప్పుడు తప్పుని సరిజేసుకుంటాను- నువ్వు నా దగ్గర ఏ మాత్రం తెలివితేటలు చూపించకు" అంటూ అతని గుండెలమీద కత్తిమొన ఉంచాడు.

    మురళి పాలిపోయిన మొఖంతో రాధవేపు చూశాడు.

    రాధ పరుగుతో మురళి దగ్గరకు నడిచింది.

    "నాన్నా ఒకవేళ అతను- వారేనేమో- నాకు భయంగా ఉంది ! అప్పుడే అతన్నేమీ చేయకండి !" అంది కలవరపాటుతో.

    "నీకు అనుమానం అఖ్ఖర్లేదమ్మా వీడు మన మురళి మాత్రం కాదు - నాకు తెలుసు కదా !"

    "ఎలా తెలుసు మీకు ?"

    "మురళి ఇంతకుముందే కదా మద్రాస్ వెళ్ళాడు ?"

    "ఆ మాట నిజమే కానీ...నాకంతా అయోమయంగా ఉంది" పోనీ ఆయన వచ్చేవరకూ ఇతనిని బంధించి ఉంచితే..."

    "రాధా !" కోపంగా అరిచాడు మురళి.

    రాధ భయంగా  అతనివేపు  చూచింది. "ఏమిటి?" అంది బెరుగ్గా.

    "వాడెవడినో పట్టుకుని 'ఆయన' అంటున్నావా, నేనేమో 'అతను' అయిపోయానా ? నేను అసలు భర్తనో, నకిలీ మొగుడునో ఆ మాత్రం తెలీటంలేదా !"

    రాధ బెంబేలెత్తిపోయింది.

    "అయ్యో ! అచ్చం ఆయన గొంతులానే ఉంది నాన్నా !" అంటూ దీనంగా నరసింహం వేపు చూసిందామె.

    రంగా ఇంక ఆలస్యం చేయదల్చుకోలేదు.

    మురళి పొట్టమీద ఒక్క తన్ను తన్నాడు బలంగా. మురళి ఎగిరి కింద పడ్డాడు.

    "పదరా - కొడకా- బయటకు పద ! కార్లోకూర్చో-" కత్తి పట్టుకుని అతని దగ్గరకు నడిచాడు మళ్ళీ.

    మురళి పొట్ట చేత్తోపట్టుకుని బాధతో విలవిలలాడిపోసాగాడు.

    "మావయ్యా ! ఆ హరికృష్ణగాడు ఆడిన నాటకం తెలుసుకోలేక నన్నే చంపేయాలని చూస్తున్నావ్, నేను నిజంగా మురళినే."    

 Previous Page Next Page