"రాధా ! నీకెన్నిసార్లు ! చెప్పాను, నన్ను చూడగానే- ఇది నేనే అయినట్లు నమ్మవద్దని ! ముందు ఇది నేనా లేక ఆ హరికృష్ణ తేల్చుకున్నాక గానీ దగ్గరకు రావొద్దని చెప్పానా?"
రాధ నాలిక్కరచుకుంది.
"సారీ ! మర్చిపోయానండీ ! ఏది, మీ కర్చీఫ్ చూపించండి-" మురళి జేబులోనుంచి కర్చీఫ్ తీసి ఆమెకిచ్చాడు. దానిమీద 'LOVE'అన్న అక్షరాలూ కొట్టొచ్చినట్లు కనిపించినయ్.
"హమ్మయ్యా__మీరేనన్న మాట ! బ్రతికించారు" అందామె.
"ఆ కర్చీఫ్ గొడవేమిటి ?" అడిగాడు నరసింహం అమోమయంగా. మనింటికి వచ్చింది నేనయింది, ఆ హరికృష్ణగాడయింది నిర్ధారించుకోడానికి రాధకో అయిడియా ఇచ్చా ! నేను ఇంటికి రాగానే ఆమె నా జేబులోనుంచి కర్చీఫ్ లాక్కుని పరీక్షిస్తుంది. దానిమీద LOVE అన్న అక్షరాలుంటేనే అది నేనయినట్లు లేకపోతే వెంబడే పోలీస్ కి ఫోన్ చేసి పట్టించేయాలి !"
నరసింహానికి సంతృప్తి కలిగింది.
"ఇన్ని కట్టుదిట్టాలు చేశాక ఇంక వాడెలా తప్పించుకుపోతాడో చూద్దాం !" అన్నాడు ఆనందంగా.
"వెళ్ళాను కానీ అర్జంటుగా మద్రాస్ వెళ్ళాల్సి వచ్చింది. త్వరగా నా బట్టలూ అవీ సూట్ కేస్ లో సర్దు."
"మద్రాసెందుకండీ ఇంత అర్జంట్ గా ?"
"ఫాక్టరీ పని మీద - ఇంకో రెండు గంటల్లో ఫ్లైట్ వుంది."
రాధ గదిలోకి నడిచింది. ఆమె వెనుకే తనూ నడిచాడు మురళి.
త్వరత్వరగా బట్టలు సర్దసాగిందామె.
నరసింహం చాలా పట్టుదలతో వున్నాడు. వాడు మురళి అని ఎంత నమ్మకం కలిగినాసరే - మెడలో పులిగోరు వుందో లేదో ఖచ్చితంగా తేల్చుకోవాలని నిర్ణయించుకుని ఓరకంట మురళివేపే చూస్తున్నాడు. మరి కాసేపటి తర్వాత వాళ్ళ మీదగ్గరిలో నుంచే కిలకిలమంటూ రాధ నవ్వులు వినిపించినయ్. దానితో పాటు శృతికలుపుతూ మురళి నవ్వు.
నరసింహం నెమ్మదిగా లేచి పడగ్గది దగ్గర కెళ్ళాడు. లోపల్నుంచీ మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయ్.
"అబ్బ ! ఏమిటిది - మరీ చిన్న పిల్లాడిలా."
"మళ్లీ రేపు రాత్రివరకూ నీ దర్శనం అవదుకదా మరి__"
ఒక్కరోజు కనిపించకపోతే వుండలేరా ?"
"ఉండలేను."
"దిసీజ్ టూ మచ్."
"అయినా సరే."
"అబ్బ- వదలండి- అవతల నాన్నగారున్నారు."
"ఉంటే ఏం ?"
"ఏమనుకుంటారు ? పట్టపగలే ఇలా బరితెగించారని..."
"ఏ వయసుకా ముచ్చటన్న రూల్ మీ నాన్నగారికి తెలుసులే."
"అయ్యో-వదలండి ! ప్లీజ్__"
"ష్-మాట్లాడకు."
నరసింహం నెమ్మదిగా ఓ కుర్చీ తెచ్చి కిటికీదగ్గర శబ్దం కాకుండా వేశాడు. తను దానిమీదెక్కి నెమ్మదిగా వెంటిలేటర్ లో నుంచి తొంగిచూచాడు.
చూడకూడని దృశ్యమే అయినా తనకోసం, తన అల్లుడు, కూతురి కోసం తప్పటంలేదు. రాధ మురళి మెడచుట్టూ చేతులువేసి, నాలుకతో అతడి పెదవుల్ని సుతారంగా స్పృశిస్తూంది.
మంచం పక్కనే వున్న డ్రెస్సింగ్ టేబిల్ మీద మురళి మెడలోని పులిగోరు మెరుస్తూ కనిపించింది.
నరసింహానికి నమ్మకం కలిగింది.
ఇంక సందేహం లేదు. వీడు తన మురళీయే. పులిగోరే అందుకు సాక్ష్యం. కుర్చీ దిగి వెళ్ళి సోఫాలో కూర్చుండిపోయాడు తను.
మరి కాసేపటి తర్వాత రాధ పడగ్గదిలో నుంచి చెదిరిన బట్టలతో, రేగిన జుట్టు సరిజేసుకుంటూ బయటకు రావటం ఓరకంట గమనించాడతను.
ఆ తరువాత కాసేపటికి మురళి డ్రస్ చేసుకుని వచ్చాడు.
"ఇక వెళ్తాను ! టైమయింది ఫ్లైట్ కి."
"కారు తీసుకెళ్ళు ఎయిర్ పోర్ట్ కి."
"వద్దులే- టాక్సీలో వెళ్తాను."
నౌఖరు సూట్ కేస్ తీసుకెళ్ళి టాక్సీలో వుంచాడు.
రాధ అతనితోపాటు గేటువరకూ నడచింది.
"రేపు రాత్రికల్లా తప్పక వచ్చేస్తారు కదూ ?"
"ఓ-యస్."
"మద్రాస్ వెళ్ళగానే ఫోన్ చేస్తారు కదూ ?"
"వెంటనే."
అతను టాక్సీలో కూర్చున్నాడు.
"మావయ్యా ! ఇవాళ రేపూ జాగ్రత్తగా వుండండి. నేను మద్రాస్ వెళ్ళిన విషయం తెలిసివాడు ఇంటికి రావడానికి ప్రయత్నించవచ్చు."