Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 50


    నరసింహాన్ని ఓ క్షణపాటు అనుమానం ఊగించి వేసింది.

    'వీడు నిజంగా అల్లుడు కాదుగదా- ఒకవేళ వీడు నింగా మురళి అయినట్లయితే ఇందాక మద్రాస్ వెళ్ళింది ఎవరూ ! వాడు హరికృష్ణా! నో ? అసాధ్యం ! వాడు ఏ పరిస్థితిలోనూ హరికృష్ణ ఆయ్యే  అవకాశం లేదు. అన్ని రకాల పరీక్షల్లోనూ వాడే తన మురళి అని తెలిసిపోయింది. మరి వీడూ తను మురళినంటాడేమిటి ? అతని బట్టలు, బూట్లు, పెన్ను అన్నీ పరీక్షగా చూశాడు నరసింహం. అన్నీ ఖచ్చితంగా అతను మురళియేనని చెప్తున్నాయ్. మెడలో తనువేసిన పులిగోరు కూడా ఉండనే ఉంది.

    హఠాత్తుగా  గుర్తుకొచ్చింది నరసింహానికి, అవును !

    ఆ పులిగోరు లోపల తను సంతకం చేసిన చిన్న కాగితం ఉంది. అది తీసి చూస్తే తెలిసిపోతుంది. ఆ రంగు కాగితం అంత తేలికగా లభించేది కాదు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేయటం కూడా అంత తేలికేం కాదు. ఓసారి అది చూస్తే ?

    "రంగా." పిలిచాడు నరసింహం.

    "ఏం సార్ !"

    "వాడి మెడలోని పులిగోరు తీసుకురా."

    రంగా పులిగోరు ఒక్కసారిగా గుంజి తీసుకొచ్చి నరసింహానికిచ్చాడు. నరసింహం వెంటనే దానిని తన గోటితో తెరిచి లోపల ఇరుక్కుపోయిన కాగితం ముక్కను జాగ్రత్తగా బయటకు లాగాడు. ఆ కాగితం మడతలు విప్పేసరికి తన సంతకం స్పష్టంగా కనిపించింది. ఏమాత్రం సందేహం లేదందులో ! అది తన సంతకమే ! అంటే__అంటే... వీడే తన మురళి ! మరి ఇందాక వచ్చి నానా హడావుడి చేసి మద్రాస్ వెళ్ళింది హరికృష్ణా ?

    నరసింహం ముఖం పాలిపోయింది !

    "ఇప్పుడయినా నమ్మకం కుదిరిందా ! నేను చెప్తుంటే ఎవారూ వినిపించుకోరు..." అన్నాడు మురళి. 

    "మురళి ! వాడు- ఆ హరికృష్ణగాడు- ఇంతకుముందే వచ్చి పెద్ద నాటక మాడాడురా, అన్ని తెలిసి కూడా నేను బోల్తా పడ్డాను-"

    "ఏం జరిగింది."

    "ఆ ఎస్. టి. సి వాళ్ళకోసం అయిదు రూపాయిల స్టాంప్ పేపర్ ఖాళీదానిమీద సంతకం పెట్టాను. అల్లుడనుకొని వాడికిచ్చేశాను ! కొంప మునిగింది."

    రాధ మొఖంలో కళ తప్పింది.

    "అంటే ?... ఇందాక వచ్చింది వారు కాదంటారా నాన్నా ?" కంపిస్తున్న స్వరంతో అడిగింది రాధ ఒక షాక్ తో ఉన్నదాన్లా.

    మురళి ఆమె దగ్గరకు నడిచి అనురాగంతో ఆమెవేపు చూశాడు.

    "రాధా ! అయిందేదో అయింది. మనం ఇంక ఇక్కడ వుండటం మంచిది కాదు. కొంతకాలం విదేశాల్లో ఎక్కడికయినా వెళ్ళి ఉందాం ! ఆ హరికృష్ణగాడితో మనం సరితూగలేం !"

    నరసింహం ఉలిక్కిపడ్డాడు.

    "ఆ దుర్మార్దుడికి బుద్ధి చెప్పాలిగానీ- విదేశాలకు పారిపోయి దాక్కుంటావా?" పౌరుషంగా మురళినడిగాడు.

    "అవును ! ఇంక నేను వాడితో విసిగిపోయాను. వాడితో చెలగాటమాడితే నా ప్రాణానికే ముప్పు వచ్చేట్లుంది."

    "వాడేం చేస్తాడు నిన్ను ? నీ దగ్గర పిస్టల్ వుంటుంది కదా ఎప్పుడూ ?"

    "వాడు డైరక్టుగా నామీదకు రాడు నీతోనే- నన్ను చంపించివేస్తాడు-"

    "ఏడ్చావ్ ! నేనంత తెలివితక్కువ వెధవనుకున్నావా ?"

    "ఇంతకుముందు నువ్ చేయబోయిందేమిటి ? పులిగోరు లోపల కాగితంతీసి చూడమన్నాకూడా వినకుండా- నన్ను చంపిపారేయమని రంగాతో చెప్పావ్ ! ఇంకాసేపు ఆలస్యమయితే నేనీపాటికి పరలోకం చేరుకుని ఉండే వాడిని కదా !"

    "ఇంకోసారిలాంటి పొరపాటు జరగదు- మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రవర్తించానీసారి.!"

    "వద్దు ! నాకీ ఆస్తీ వద్దూ ! ఈ ఊరూ వద్దు! నేనూ రాధా వెళ్ళిపోతున్నాం!..."

    అంతవరకూ దుఃఖం బిగపట్టుకుని నిలబడ్డ రాధ హఠాత్తుగా రెండు చేతుల్లో మొఖం దాచుకుని బిగ్గరగా విలపించసాగింది.

    మురళి దిగ్భ్రాంతి చెందాడు.

    "చూశావా మావయ్యా ! మధ్యలో రాధ ఎంతగా నలిగిపోతుందో ? ఎప్పటికప్పుడు తన దగ్గరున్నది నేనో, వాడో తెలీక - తెలుసుకునే దారిలేక తల్లడిల్లిపోతుంది. నేను తన భుజం మీద చేయివేస్తేచాలు తృళ్ళి పడుతోంది. నేను ముద్దుపెట్టుకోబోతే చాలు మీరు మీరేనని గుర్తేమిటి -ఏదయినా ఋజువు చూపించమంటోంది. ప్రతిసారి నేను తలమీద దెబ్బ, వీపుమీద దెబ్బా, పుట్టుమచ్చా, కర్చీఫ్ మీద తను స్వయంగా కుట్టిన 'లవ్' అనే అక్షరాలు - ఇలా ఎన్నో ఋజువులుగా చూపిస్తే గానీ సంసారసుఖం అనుభవించే రాత లేకుండా పోయింది. నీకు నేనెప్పుడూ చెప్పలేదు ! మేమిద్దరం సంసారం సుఖం అనుభవించి నెలరోజులు దాటిపోయింది ! ఆ హరికృష్ణగాడు నేను లేనప్పుడు వచ్చి రాధతో సరసాలవరకే సరిపెట్టుకుంటున్నాడు గనుక బతికి బయటపడుతున్నాం ! వాడికి మతి చలించి, మోజు పెరిగితే - రాధ శీలం అపహరించినా మనం ఏం చేయగలం ? అందుకే ఇంక ఇక్కడ వుండదల్చుకోలేదు. ఈ దేశం వదిలి ఎక్కడో చోట సుఖంగా బ్రతుకుతాం !"

    ఆ మాటలతో నరసింహం మొఖం మాడిపోయింది.

    అంతకుముందు హరికృష్ణ రాధతోపాటు పడగ్గదిలో జరిపిన శృంగారం కళ్ళముందు మెదిలింది సోఫాలో కూలబడిపోయాడు.

 Previous Page Next Page