"ఇవాళ్టి నుంచీ మరో నెలరోజులవరకూ నాకు జ్వరం వస్తుంది సార్ ! అంచేత డ్యూటీకి రాలేను-"
సూపర్ వైజర్ అనుమానంగా చూసాడతని వేపు.
"మళ్లీ ఏదో వెధవపని చేస్తున్నావ్ కదూ ?"
రంగా నవ్వాడు. "వెధవపని కాదు సార్ ! సీజనల్ బిజినెస్-"
* * *
నరసింహం చేతిలో ఓ పాకెట్ తీసుకుని మురళి గదిలోకొచ్చాడు.
మురళి ఫ్యాక్టరీ కెళ్ళడానికి రడీ అవుతున్నాడప్పుడే.
"మురళీ ఇదిగో - ఇవాళ్టి నుంచీ ఈ పులిగోరు మెడలో వేసుకో-" అంటూ పాకెట్ విప్పి ఓ పులిగోరు అతనికిచ్చాడు.
"పులిగోరెందుకు మావయ్యా-"
"ఆ డూప్లికేట్ గాడిని పట్టుకోవడానికి అనుమానం వచ్చినప్పుడు సోదాచేస్తే పులిగోరు వున్నదీ లేనిదీ తెలిసిపోతుంది. అప్పుడు వాడెలా తప్పించుకుంటాడో చూద్దాం!!"
"మంచి ప్లాన్ మావయ్యా !" ఉత్సాహంగా అన్నాడు మురళి.
"ఈ దెబ్బతో వాడి ఆటకట్టు-"
"నీ మెడలో పులిగోరు వేసుకున్న విషయం అమ్మాయికి కూడా తెలీయనీయవద్దు !"
"సరే !" అంటూ దాన్ని మెళ్ళో వేసుకున్నాడు. ఎందుకో నరసింహానికి అనుమానం వచ్చి "ఏదీ నీతల చూపించు" అన్నాడు.
మురళి ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు.
ఎందుకో చెప్పకుండా "కావాలి పనుంది" అంటూ తలవంచి చూశాడు, తలమీద గాయం వుంది, హరికృష్ణ బాత్ రూంలో పడేసేముందు కొట్టింది. మురళి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాక, మేడమీద కూర్చుని బైనాక్యులర్స్ తో గేటువేపే చూడసాగాడు. ఆ డూప్లికేట్ ఏ క్షణంలోనయినా మళ్లీ ఏదో ఒక ట్రిక్ చేస్తాడు.
ఈసారి ఎలాగయినా వాడిని పట్టుకునేది ఖాయం. ఎందుకంటే ఈ పులిగోరు సంగతి వాడికి తెలీదు. కేవలం తనకూ మురళికి మాత్రమే తెలుసు. అదీగాక తను ఇంకో అద్భుతమయిన ఉపాయం కూడా పన్నాడు. ఈ విషయం మురళికి కూడా తెలీదు. అదేమిటంటే...
ఆ పులిగోరు లోపల తను సంతకం చేసిన ఓ చిన్న కాగితం వుంచాడు.
ఒకవేళ ఆ హరికృష్ణగాడు ఓ పులిగోరు తగిలించుకొచ్చినా లోపల తన సంతకం చేసిన కాగితం విషయం మాత్రం తెలీదు. అక్కడ దొరికిపోక తప్పదు.
మరో గంటసేపు గడిచింది. గేటు బయట 'టాక్సీ' ఆగటం చూసేసరికి నరసింహం నిటారుగా లేచి నిలబడ్డాడు. తన ఎదుర్చూస్తున్న అవకాశం వచ్చింది. వీడు మురళీయో, హరికృష్ణో ఇప్పుడే తేల్చుకోవాలి ! అదీ వాడికేమీ అనుమానం రాకుండా.
కొద్దిసేపు యధావిధిగా ఘూర్ఖావాడితో వాదన జరిగాక చివరకు ఘూర్ఖా అతనిని లోపలకు వదిలాడు.
నరసింహం మేడదిగి మురళీకి ఎదురు వెళ్ళాడు. నరసింహం మురళిని పరీక్షగా చూశాడు. అదే చారల షర్టు- అదే బ్లూపాంట్ - మురళి ఉదయం వేసుకెళ్ళిన డ్రస్ అదే కనుక మొదటి పరీక్షలో వాడే నెగ్గినట్లు లెక్క. కాళ్ళకున్న బూట్ల వంక చూశాడు నరసింహం.
నార్త్ స్టార్ బూట్లు కొత్తవి. అంతకు ముందురోజే కొన్నట్లు తెలిసిపోతోంది. మురళి వాటిని నిన్నే కొన్నాడు. ఈ టెస్ట్ లోనూ వాడు మురళీయేనని ధృవపడింది. అలాగే జేబులోని పెన్ వంక చూశాడు నరసింహం ! గోల్డ్ కాప్ పెన్ కనబడుతూనే వుంది. ఇక్కడా అనుమానం లేదు. అయినా తను వీటితో సంతృప్తి పడదల్చుకోలేదు. పులిగోరు చూడాలి. ఒకవేళ వీడు హరికృష్ణ అయితే ఆ గొలుసు ఆఫీసులో జారిపోయిందని చెపుతాడేమో ! అసలీ గొలుసు విషయం వీడికి తెలుసా లేదా అన్నది జాగ్రత్తగా మాటల్లో బయటికి లాగాలి. దానికి ముందు వీడికి తెలియకుండా వీడి "మెడలో గొలుసు వుందా లేదా" అన్నది తెలుసుకోవాలి. ఈ లోపులో మురళి, నరసింహాన్ని చూస్తూ "మద్రాస్ నుంచి ఫోన్ వచ్చింది! స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు అర్జంటుగా రమ్మంటున్నారు. షిప్ లో ఆయిల్ వచ్చిందట !" అన్నాడు మురళీ.
"ఎవర్ని పంపిస్తున్నావ్ ?" అడిగాడు నరసింహం.
"ఈసారి నేనే వేల్దామనుకుంటున్నాను. ఆ ఎస్.టి.సి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక కాంప్లికేషన్స్ తెస్తున్నారు. నేను వెళ్ళి లంచాలు వగైరా లేమయినా వుంటే ఎడ్జస్ట్ చేసి వస్తాను. ఆ తరువాత అంతా గమ్మత్తుగా జరిగిపోతుంది..."
నరసింహానికి లోలోపల ఆనందం కలిగింది. మురళి తన బిజినెస్ లో ప్రవేశించిన తర్వాత ఫలితాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయ్. లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయ్. వాడంత తెలివితేటలు గలవాడవుతాడని ఎప్పుడూ అనుకోలేదు.
"ఎప్పుడు వెళ్తున్నావ్ ?" అడిగాడు నరసింహం.
"ఫ్లైట్ కి ఇంకా రెండు గంటల టైముంది ! అన్నట్లు మీరు ఈ రెండు రోజులూ చాలా జాగ్రత్తగా వుండాలి. వాడు నేను ఊళ్ళో లేనన్న విషయం తెలుసుకుని ఇంటికి వచ్చే అవకాశం వుంది. రేపు సాయంత్రం లోపల నాలాగా ఎవరొచ్చినా జాగ్రత్తగా చెక్ చేయండి ! వాడి మెడలో పులిగోరు వుంటేనే లోపలకు రానీయండి. అదే గుర్తు మనకు__"
"ఈసారి వాడు వస్తే మాత్రం వాడికది అంతమే ! అలాంటి ఏర్పాట్లు చేశాను."
రాధ హాల్లోకొచ్చి వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్యపోయింది.