Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 46


    రంగా పరుగుతో లోపలికెళ్ళి అయిదు నిముషాల తర్వాత తిరిగివచ్చాడు. బ్లాక్ డోర్ తెరుచుకుని కార్లో కూర్చోగానే కారు స్టార్టు చేశాడు నరసింహం. మరో పావుగంటలో కారు హైవే వదలి ఓ మట్టి రోడ్డుమీద ప్రయాణంచేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆగింది.

    "ఏమిటి సార్ - ఇంత అర్జంటుగా తీసుకొచ్చారు ! మళ్ళీ ఏదయినా వ్యాపారం చేయాలా ?" ఆశగా అడిగాడు రంగా.

    "అవసరమయితే చేయాలి ! నిన్ను తీసుకొచ్చిన కారణం ఏమిటంటే ఆ రోజు శారదమ్మ కొడుకు విషయం కనుక్కోడానికి !" అన్నాడు సీరియస్ గా.

    రంగా మొఖంలో రంగులు మారాయ్.

    "అదా... అదేమయిందిప్పుడు ?" అతని గొంతులోని తత్తరపాటుని కనిపెట్టాడు నరసింహం.

    "నువ్ పాతి పెట్టిన ఆ కుర్రాడి శవం లేచి వచ్చిందిప్పుడు" అతని మొఖం వంకే పరీక్షగా చూస్తూ అన్నాడు.

    రంగాకు చెమటలు పట్టినయ్.

    "అదెలా సాధ్యం సార్ ! నా చేతుల్తో నేనే పాతి పెట్టాను శవాన్ని__"

    అతని మాటలు పూర్తి అవుతూనే బలంగా మొఖంమీద కొట్టాడు నరసింహం. రంగా హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు నివ్వెరపోయాడు. ఆ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మినయ్. కొద్ది క్షణాల వరకూ నోటమాట రాలేదు. అదే నరసింహం గాక ఇంకెవరన్నా అయితే అతడి రక్తం కళ్ళజూసేవాడే రంగా.

    "ఒరే రంగా ! నీ మాటల్లో ఏది అబద్ధమో, ఏది నిజమో చాలా తేలిగ్గా కనిపెట్టగలన్రా, నిజం చెప్పు! అసలేం జరిగింది ?"

    రంగా తల వంచుకున్నాడు.

    "వాడు పారిపోయాడు సార్"

    తన అనుమానం నిజమయేసరికి నరసింహం తృళ్ళిపడ్డాడు.

    "పారి పోయాడా ?"

    "అవున్సార్ - వాడు నీళ్ళల్లో దూకినప్పుడు మీరు పిస్టల్ కాల్చారు గానీ ఆ దెబ్బ వాడి చేతికి తగిలింది. చెరువు అవతలివేపున నేనలా కాపలా కాశాను వాడికోసం. మీరు నమ్మినట్లే - నేనూ - పిస్టల్ గుండు వాడి ఛాతీకో, పొట్టలోనే తగిలి ఉంటుందనుకొన్నాను. కానీ వాడు నీళ్ళలో నుంచి బయటకు రావటమే పరుగు అందుకున్నాడు. నా కాళ్ళల్లో శక్తి ఉన్నంత దూరం వెంబడించాను. వాడు రోడ్డుదిగి మామిడి తోటలో కెళ్ళేసరికి ఇంకా నేనేమీ చేయలేకపోయాను. టార్చ్ లైట్ తో తోటంతా వెదికి వెనక్కు వచ్చేశాను"

    "వచ్చి వాడి శవాన్ని పాతి పెట్టేశానని నాతో అబద్ధం చెప్పావ్" కోపంతో అన్నాడు నరసింహం.

    రంగా తలవంచుకున్నాడు.

    "అవున్సార్ ! డబ్బు కోసం కక్కుర్తిపడి..."

    నరసింహం అతని మాటలు వినడం లేదిప్పుడు. అతని ఆలోచనలన్నీ హరికృష్ణ మీదే ఉన్నాయ్. వాడు ఎక్కడో పెరిగి పెద్దయి ఇప్పుడు తనమీద ప్రతీకారం తీర్చుకోడానికి వచ్చాడు. ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడిక వాడిని ఎదుర్కోవటమే తనకున్న ఛాయిస్ ! అప్పుడు రంగా పొరబాటు వల్ల పోయిన అవకాశం ఇప్పుడు మళ్లీ వచ్చింది. ఈసారి ఎలాంటి పొరబాటూ జరగకూడదు. వీలయినంత త్వరలో పైలోకానికి పంపాలి.      

    "ఒరే రంగా ! నువ్ చేసిన మోసానికి నిన్నిప్పుడు కాల్చి చంపేవాడిని ! కానీ చంపడంలేదు. ఎందుకో తెలుసా ?"

    రంగా ఏమీ మాట్లాడలేదు.

    "అప్పుడు వేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటావేమోనని. ఈసారి కూడా వాడిని చంపలేకపోతే నీకు భూమిమీద గింజలు చెల్లాయనుకో !" రంగా పెదాలమీద చిరునవ్వు వెలిసింది.

    "ఈసారి నిజంగా వాడి శవాన్ని మీకప్పజెప్తాన్సార్ !"

    "సరే- రేపట్నుంచే పని ప్రారంభించు ! ముందు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అన్నీ రహస్యంగా తెలుసుకో ! ఆ తరువాత వాడి అంతం చూద్దాం !"

    "అలాగే సార్-"

    ఇద్దరూ కార్లో కూర్చున్నారు. కారు మళ్లీ బిస్కెట్ ఫ్యాక్టరీకి చేరుకుంది. రంగా కారుదిగి నిలబడి నరసింహాన్ని చూసి తల గోక్కున్నాడు. నరసింహానికి అర్ధమయింది.

    "ప్రస్తుతానికి అయిదొందలు తీసుకో ! పని పూర్తయాకే మిగతా మొత్తం ! సరేనా !"

    "సరే సార్" - అంటూ నరసింహం అందించిన డబ్బు జేబులో పెట్టుకున్నాడు.

    నరసింహం కారు వెళ్ళిపోయింది.

    రంగా కారువంకే చూస్తూ నిలబడ్డాడు.

    అతని పెదాలమీద చిరునవ్వు వెలిసింది.

    నిజం చెప్పాలంటే ఆ రోజు హరికృష్ణ ఆ నీళ్ళల్లో చచ్చాడో, బ్రతికాడో తనకే తెలీదు. కాసేపు చెరువు గట్టుమీదే కూర్చుని ఎంతసేపటికీ వాడు బయటకి రాకపోయేసరికి తన దారిన తను వెళ్ళిపోయాడు. నరసింహం దగ్గరకెళ్ళి వాడి శవాన్ని తను గాలించి పట్టుకుని పాతిపెట్టేసినట్లు అబద్ధంచెప్పి పాతికవేల రూపాయలు తీసుకున్నాడు. వాడు బ్రతికే వున్నాడని ఇప్పుడు నరసింహం తనను దబాయించేసరికి - అర్జంటుగా ఇంకో కట్టుకథ అల్లి - ఆ రోజు వాడు తప్పించుకు పారిపోయినట్లు చెప్పేశాడు. ఇలాంటి వ్యాపారాల్లో ఈ మాత్రం కధలల్లటం తప్పుకాదు. ఇప్పుడు మరో పాతికవేలు సంపాదించే అవకాసం లభిస్తోంది. ఒకే మనిషిని రెండుసార్లు పాతిపెట్టి డబ్బు సంపాదించే అవకాశం నిజంగా అపూర్వం. ఆనందంగా తన సూపర్ వైజర్ దగ్గరకు నడిచాడు తను.  

 Previous Page Next Page