Previous Page Next Page 
కాలాన్ని వెనక్కి తిప్పకు పేజి 46


                                                       శేష ప్రశ్న
    
    కొబ్బరికాయ , మామిడికాయ కలిపి పచ్చడి చేసుకుని తినాలని మరీ మరీ అనిపించసాగింది. ఆరోజు స్వప్నకి . ఆ మాట తలచుకోగానే నోరూరింది. తనకి మామిడికాయతో చేసిన పప్పు, పచ్చడి.....ఏదన్నా ప్రాణం. పుల్లపుల్లగా మామిడికాయ పప్పు వేడన్నంలో కలుపుకుని కమ్మని నెయ్యి కలుపుకుని మజ్జిగ మిరపకాయ కొరుక్కుని తింటుంటే - కొబ్బరి కోరి, పుల్ల మామిడికాయకోరి పచ్చడి చేసుకుని అన్నంలో కలుపుకుంటే , జిహ్వా  లేచొచ్చినట్లుంటుంది. కాస్త తీరిక దొరికిన ఈ ఆదివారం ఉదయం కొబ్బరికాయ, మామిడికాయ వేసి పచ్చడి చేసుకోవాలన్న కోరికని అదుపులో పెట్టుకోలేక అప్పటికప్పుడు చున్నీ పైన వేసుకుని చెప్పులేసుకుని ఇంటికి తాళం పెట్టి ఎదురుగా నాలుగడుగులు వేస్తె కనిపించే 'ప్రేష్' వెజిటబుల్స్ దొరికే దుకాణానికి వెళ్ళింది. చిన్న మామిడికాయ ఐదు రూపాయలట.! సరే, ఎంతయినా కావాల్సిందేగా. పది రూపాయలకి రెండు కాయలు. ఇవాళ పచ్చడి, ఇంకో రోజు పప్పుకి ఉంటుందని రెండు కొంది . కొబ్బరికాయ , పచ్చిమిర్చి,కొత్తిమీర కావలసినవి మరో రెండు కూరలు కొని ఇంటి ముఖం పట్టింది స్వప్న.
    ఈ ఉద్యోగం కాదు కానీ, ఓ వేళాపాళా లేని ఈ కంప్యూటర్ కంపెనీ ఉద్యోగాలతో, ఇంటికి రాగానే వంట కాదు కదా కాస్త టీ కలుపుకు తాగాలన్న ఓపిక ఉండనట్టు వంట్లో శక్తి అంతా ఎవరో లాగేసినట్టు అయిపోతుంది. వంట అంటే ఏడుపే వస్తుంది. ఆదివారం కూడా వర్క్ చెయ్యాల్సిన రోజులే ఎక్కువ. మిగిలిన సగం పూటలో తప్పనిసరిగా ఇంత పప్పు వారానికి సరిపడా ఉడకేసి, పెద్ద గిన్నెడు చారు, పులుసో, రెండు రకాల కూరలు చేసి డబ్బాల్లో పడేసి ఫ్రీజర్లో పడేసి, అదే వారం రోజులూ వేడి చేసుకుని తినడం - ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ధర్మమా అని తను స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చేలోగా అన్నం ఉడికేది. ఫ్రీజర్ లో గడ్డ కట్టినవన్నీ మళ్ళీ కుక్కర్లో వేడి చేసుకుని అవురావురామని తినడం - మధ్యాహ్నం ఆఫీసులో క్యాంటిన్ లో సబ్సీడీ రేటుకి ఇచ్చే భోజనం, ఉదయం ఇంత పాలు కార్న్ ప్లేక్స్- తేనే, రెండు బ్రెడ్ ముక్కలు, అరటి పండ్లు బ్రేక్ ఫాస్ట్ - రకరకాల టిఫిన్లు, రకరకాల కూరలు, పచ్చళ్ళు , ఎప్పుడో అమ్మతోటే పోయాయి. అని నిట్టుర్పు విడుస్తుంది. తల్లి గుర్తుకు వచ్చినప్పుడల్లా పాపం తల్లి ప్రాణం కనక వుండబట్టలేక ఆవిడ మధ్య మధ్య వచ్చి నెల రెండు నెలలుండి వెళ్ళేది. ఉన్నన్ని రోజులు రకరకాలు చేసి పెట్టేది. వెళ్ళే ముందు నాలుగు రకాల పచ్చళ్ళు, పొడులు, ఫ్రిజ్ లో అంతా నింపి వెళ్ళేది. ఇక్కడ నా దగ్గరే ఉండవచ్చు కదా. అమ్మా ఇటు కాక అటు కాక ఈ తిరుగుడెందుకు? అక్కడ ఇల్లు అద్దెకిచ్చేసి వచ్చేస్తే అందరం కలిసే వుండొచ్చుగా అనేది. వద్దులే తల్లీ! ఎంత కూతురువైనా నా ఇంట్లో స్వాతంత్యం నాకుండాలి. మీ నాన్నగారూ ఒప్పుకోరు. ఆయనిక్కడ ఇమడలేరు. నీ ఆఫీసులు, టైమింగు లు , ఓ రాత్రనక పగలనక నీ రాకపోకలు ఇవన్నీ చూస్తూ వూరుకోరు. ఏదన్నా అంటే నీవు కస్సుమంటావు. ఆయనేమో.....నీవింటికి వచ్చేవరకు నిద్రన్నా పోకుండా అలా కూర్చుంటారు. మాకీ వయసులో ప్రశాంతత కావాలి. ఈ టెన్షన్లు వద్దులే , నీ ఇల్లు నీ ఇష్టం వచ్చినట్లుండాలి అని నీకనిపిస్తుంది. ఈ వయసులో నీకు అన్నీ చెప్పి అడిగి చెయ్యాలంటే నాకూ కష్టమే. ఎవరింట్లో వాళ్ళకుంటేనే మంచిదిలే అనేది. ఎందుకు నేనేం నన్ను ఇలా వుండాలి , అలా వుండాలన్నానా ....నీకు ఫ్రీడమ్ లేకపోవడానికి నేనేం అడ్డుకున్నానా....నొచ్చుకుని వాదనకు దిగేది. నీవన్నా అనకపోయినా స్వతంత్రించి ఏదన్నా చెయ్యాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది.
    "అది కాదులే కూతురి డబ్బు తినకూడదని మీ అభిప్రాయం. ఎన్నాళ్ళయినా కూతురు కొడుకు తేడాలు మానరు మనవాళ్ళు. అందుకే తిండి ఖర్చంతా నీవే పెడ్తావు. కూరలు, పళ్ళు అన్నీ కొంటావు. నేనిచ్చిన డబ్బు ఖర్చు పెట్టకుండా.....అబ్బే అది కాదె ..... చూడు ఆడపిల్ల అయినా , మగపిల్లాడు అయినా ఈరోజుల్లో మాకూ ఎవరి దగ్గరా వుండకుండా స్వతంత్యంగా మా ఇంట్లో మేం పడుండాలనిపిస్తుంది. ఏదో దేముడి దయవల్ల పిల్లల ముందు చేయి చాపకుండా గడిచిపోతున్నప్పుడు ఎందుకు వుండడం చూడాలనిపించినప్పుడు వచ్చి పోతున్నాం గదా! తల్లీ కూతురు ఇద్దరూ మధ్య మధ్య వాదించుకునే వారు ఈ విషయంలో.
    తల్లి పోయేవరకు తన చింతతోనే పోయింది. ఒంటరిదయిందన్న దిగులు. పైకి చెప్పకపోయినా లోలోపల చాలా అశాంతి. ఆమెను తినేసేది. 'నాగురించి నీవేం బాధపదనక్కర లేదు. సంపాదించుకుంటున్నాను, హాయిగా స్వతంత్యంగా వున్నాను, నాకు లేని బాధ నీకెందుకు' అనేది ఆవిడ బయటికి చెప్పుకున్నప్పుడు.
    'నాకెందుకు బాధో . అది నీవూ ఓ తల్లివయితే గానీ అర్ధం కాదులే" అని ఆ అదృష్టం నీకీ జన్మకి లేదేమోలే" అని గొణిగేది రుక్మిణి.
    'అమ్మా.....పిచ్చి మాటలు చెప్పకు, ఆడదానికి మాతృత్వమే వరం' అని పాతమాటలు పాడకు. "నేనున్నాను అని నీకు భరోసా ఇచ్చే మనుషుండాలి ప్రతివారికి అది లేకుండా చేసుకున్నవనే బాధ, మొగుడు లేకపోయినా కడుపున పుట్టిన నీవాళ్ళంటూ నీకు లేకుండా అయింది.
    "స్టాపిట్ మమ్మీ! బోరు కొట్టించకు' లోలోపల అంతరాళంలో ఎక్కడో తల్లి మాటల్లో నిజం ఉందేమోననిపించే స్పందన కలిగినా, పైకి ఒప్పుకోవడానికి అహం అడ్డు వచ్చేది.
    'ఏమిటో జీవితం అంతా కుక్కలు చింపిన విస్తరిలా చేసుకున్నావు' పైకి అనే ధైర్యం లేక గొణిగేది ఆవిడ వినిపించి వినిపించనట్టు స్వప్న కోపంగా చూసేది. "అవును, మనసులు కలవని మొగుళ్ళతో తిట్టుకుంటూ, కొట్టుకుంటూ ఏడ్చుకుంటూ కాపురం చేసుకుంటుంటే చాలా ఆనందంగా వుండేది నీకు. నేను హాయిగా, సుఖంగా స్వతంత్యంగా వుంటే బాధలు పడిపోతున్నట్టు నీవు నా కోసం దిగులు పడిపోతావు.' సుఖం, స్వతంత్యం .... రాత్రనక, పగలనక గొడ్డుచాకిరి చేస్తూ కడుపు నిండా కావలసినది వండుకుని తినే టైము లేక, ఓ సినిమా లేదు, ఓ టి.వి , ఓ పుస్తకం లేదు. ఐ సరదా లేదు, పని.....పని.....అంటూ వాళ్ళిచ్చే జీతం డబ్బులకి మిమ్మల్ని పిప్పి చేస్తుంటే అదే జీవితం అయిపోయి ఓ మిషనులా తయారయి అన్ని అనుభూతులకి దూరమవడమే హాయి,మ స్వతంత్యం , సుఖం'- వెటకారం గా అంది రుక్మిణి. స్వప్న అంతకంటే వెటకారంగా -' అవును' వంటలు పిండివంటలు వండుకుంటూ వంటింట్లో పడుంది, వుచ్చగుద్దలు, పీతిగుడ్డలు వుతుక్కుంటూ పిల్లలు, మొగుళ్ళకి చాకిరీ చేస్తూ అదే జీవితం , సుఖం అనుకోవాలి మీలాగ, అపుడు నీకు తృప్తిగా వుండేది.'
    'అవును మేం చాకిరి అయినవాళ్ళకి , కట్టుకున్న వాళ్ళకి, కన్న పిల్లలకి చేసేవారం. ఇప్పుడు మీరు ఉద్యోగం పేరిట ముక్కూ, మొహం తెలియని వాళ్లకి చేస్తున్నారు. అంతేతేడా. అది వంటింటి చాకిరి, ఇది ఇంకోరి దగ్గర చాకిరి.'
    'చాల్లే అమ్మా.....నీతో వాదించలెం. మేం చదువుకుని ఉద్యోగాలు చెసి డబ్బు సంపాదించడం, మీరు ఇంట్లో చేసే చాకిరికి పోలిక తెచ్చే నీతో మాట్లాడలేం. ఓ రూపాయి కావాలన్నా మొగుణ్ణి అడగాల్సిన బతుకు బతికిన క్రితం తరం ఆడవాళ్ళతో మమ్మల్ని పోల్చకు. మేం స్వతంత్యంగా మా కాళ్ళ మీద మేం నిలబడి ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటుంటే ....దానికీ , పాతకాలం ఆడవాళ్ళ బతుకులకీ పోలిక తెస్తున్నావు.' కోపంగా అంటూ ఉడుక్కుంటూ అనేది స్వప్న.
    'ఏమో తల్లీ... ఏం స్వతంత్రమో నాకర్ధం కాదు. మొగుడంటే ఒక్క మాట పడని మీరు ఇప్పుడు కుక్కిన పేనుల్లా మీ బాస్ గారి ఆజ్ఞలను పాటిస్తూ.....రాత్రనక, పగలనక శెలవు పూట కూడా రాననే ధైర్యం లేకుండా చేసే ఈ చాకిరినీ మరి ఏమంటారో నాకు తెలియదు. మొగుడు చిన్నమాట అన్నా, చిన్న పని పురమాయించినా మేం నీ నౌకరులమా....అనే మీరు ఇప్పుడు ఈ నౌకరీలు ఎలా తలవంచుకు చేస్తున్నారో - ఆ పౌరుషాలు, ఆ ఆత్మాభిమానాలు , ఆ వ్యక్తిత్వాలు మరి అన్నీ ఏమవుతున్నాయో' రుక్మిణి గొంతులో హేళన . తల్లి మాటల్లో నిజాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంటే, ఎలా ఆవిడ్ని నమించాలో అర్ధం కాని విసుగుతో -'నీకో దణ్ణం అమ్మా ...నిన్నెవరూ కన్విన్స్ చేయలేరులే. వదిలేయ్ ఆ టాపిక్' అనేది విరక్తిగా.

 Previous Page Next Page