జయమ్మ లబోదిబోమంది. తన నెత్తి బాదుకుంది. పక్కనున్న కూతురి నెత్తి బాది 'ఎంత గుడిసేటి ముండవే , ఎవడితో తొంగున్నావ్ నంజా చెప్పవే. ఎప్పుడిదంతా జరిగిందే. ఆరు నెలల ముందు జరిగిందంటే , యిన్నాళ్ళు నాకాడ ఈ రహస్యం దాచావా? అమ్మో గుండెలు తీసిన బంటువే!'
తల్లి తిట్లని, కొట్టిన దెబ్బల్ని , డాక్టరు కడుపు అన్నమాటకి బెంబేలు పడి బెదిరిపోయి 'నాకేం తెలీదే అమ్మా , నాకేం తెలీదే' అంది ఏడుస్తూ.
'నోర్మూయ్....అబద్దాలాడావంటే చంపేస్తా.....ఎవడితో తోంగున్నావే....ఎవడన్నా నిన్ను ఏదన్నా చేశాడా....చెప్పు?" మళ్ళీ బాదింది.
'జయమ్మా అగు నేనడుగుతానుండు. అట్లా కొట్టకు.' డాక్టరు వారించింది. 'చూడు రేణుకా, ఆర్నెల్లకి ముందు ఏ మగాడన్నా నీ వంటి మీద చెయ్యేసాడా , ఏమన్నా చేశాడా. సిగ్గుపడవద్దు, భయపడవద్దు చెప్పు."
రేణుక బెదురుగా చూసింది.
'మావయ్యా....మామయ్యా....' భయంగా తల్లి వంక చూస్తూ అంది.
'ఎవడూ శీనుగాడా ఆడి జిమ్మడ....'
'నీవుండు జయమ్మా. చెప్పనీ ఆ అమ్మాయిని చెప్పు రేణుకా, ఏం చేశాడు'
'ఆర్నెల్లనాడు మిలట్రీ నించి వచ్చిండు.....అమ్మ నేదు ఆరోజు యింట్లో. తమ్ముడు బైటాడుకుంటున్నాడు.
మామయ్యా నన్ను కౌగలించుకుంటుంటే నాకు వంద రూపాయలు యిచ్చి పూసలు, గాజులు అవీ కొనుక్కోమన్నాడు.'
'అంతేనా, యింకేం చేశాడు?'
'నేను వద్దంటున్నా పరవాలేదు. ఎవరికీ చెప్పకు ఏం చెయ్యను, ఏం పరవాలేదు. నీవంటే నాకిష్టం. ఎంతో బాగున్నావు. అంటూ తెగ ముద్దులు పెట్టుకున్నాడు. నా వొళ్ళంతా తడిమాడు. ఏదేదో చేశాడు. మంచం మీద పడుకోబెట్టాడు. నేను లేచి పోతుంటే గట్టిగా పట్టేసుకున్నాడు. నా కళ్ళు మూసేశాడు. అక్కడ చెయ్యేసిండు' రొమ్ములు చూపించింది.
'ఇంకా ఏం చేశాడు చెప్పు '
రేణు సిగ్గుపడుతూ ..... బెక్కుతూ.....చిన్నగా ఏడుస్తూ చెప్పుకొచ్చింది. 'నన్నేవరికి చెప్పద్దన్నాడు. అమ్మకి చెపితే తిడుతుందన్నాడు. నాకేం నే వెళ్ళిపోతాను , నిన్ను తిడ్తుంది పెద్దవాళ్ళకి చెప్పకూడదన్నాడు. నేను డబ్బులు సంపాదించుకువస్తా. పెళ్ళి చేసుకుందాం అన్నాడు.'
'మరి నీవు గట్టిగా అరవాల్సింది విడిపించుకుని లేచి వెళ్ళిపోవాలి గాని వూరుకుంటారా అని.'
'వద్దన్నానండి దండం పెట్టానండి ఏం పరవాలేదు. ఎవరికీ చెప్పకూ అంటూ ఏదేదో చేశాడండి.'
డాక్టర్లు యిద్దరూ మొహాలు చూసుకున్నారు. 'చూడు జయమ్మా. యిప్పుడింక చేసేదేం లేదు. నీ తమ్ముడ్ని పిలిపించి నయానో భయానోన వప్పించి పెళ్ళి చెయ్యండి. లేదంటే యింకో ఊరెక్కడి కన్నా తీసుకెళ్ళి పురుడు పోయించి పరువు కాపాడుకోండి."
'ఆడి జిమ్మడ. ఆ సచ్చినాడు ఎక్కడున్నాడో , ఎడ్రసు కూడా లేదు మా దగ్గర. నేనేం చేయను దేముడో, మీ అయ్యకి తెలిస్తే నిన్నూ నన్నూ సంపుతాడే ముందుకానా!" ఏడుస్తూ తిట్లని లంకించుకుంది.
'చూడు జయమ్మా , కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్తుంది. చిన్నపిల్ల తెలీని వయసు. మగాడి నించి వచ్చే ముప్పు తెలీని అమ్మాయి. మామయ్య అని, వంద రూపాయలకి, పూసలకి, గాజులకి లొంగింది. మీతో చెబ్తే తిడ్తారని ఊరుకుంది. అందుకే ఆడపిల్లలకి కాస్త జ్ఞానం వచ్చిందగ్గర నించి తల్లులు చెప్పాలి జాగ్రత్తలు. మగాడ్ని దగ్గరికి రానీయరాదని , వంటరిగా చిక్కరాదని , ఏం చేసినా అరవాలని, మగాడి మంచి మాటలకి లొంగరాదనీ , యిప్పడింక దాన్నేంత కొట్టినా ఏం ప్రయోజనం? వెళ్ళు నీ మొగుడికి చెప్పి నీ తమ్ముడిని రప్పించే ప్రయత్నం చెయ్యండి."
ఏడ్చుకుంటూ తల్లీ, కూతురూ వెళ్ళారు.'తరువాత?' అంది జడ్జి కుతూహలంగా చూసి అంది.
'తరువాత?' అంది జడ్జి కుతూహలంగా చూసి అంది.
రేణుక అదోలా నవ్వింది. 'తరువాత ఏం చెప్పాలి డాక్టరు గారూ. మామయ్య దొరకలేదు. నెలలు నిండు కొస్తుంటే హైదరాబాద్ పెద్దమ్మ వాళ్ళింటికి పంపించారు. నా మెడలో పసుపుతాడు కట్టి పెళ్ళి అయింది మొగుడు సైన్యంలో వున్నాడన్నారు. పిల్ల పుట్టింది. చచ్చిందన్నారు. వుందో, ఊడిందో ఎవరే చేశారో నాకు తెలియదు. తేల్చుకోవాలనిపించని వయసు. మరో ఆరునెలల్లో ఎవడినో వెతికి మూడు ముళ్ళూ వేయించి చేతులు దులుపుకున్నారు. హైదరాబాదు కాపురం వాడు ఆటోరిక్ష తోలతాడు. తాగుబోతు ఎదవ. తెచ్చిన డబ్బులు తాగి తందనాలాడి కాల్చుకుతిన్నాడు. తిండికి డబ్బీయడు. తాగొచ్చి నా వొంటిని చిత్రహంసలు పెట్టి ఆడుకుని ఆనందించేవాడు. పదమూడేళ్ళదాన్ని, శృంగారం చట్టుబండలు ఏ తెలుస్తాయి. వాడు చెప్పినట్టు చెయ్యకపోతే చితకదన్నేడు. సిగరెట్టు వాతలు పెట్టేవాడు. వాడికి నేను పెద్దమ్మ యింట్లో వుండి పిల్లని కన్నది చూసిన వాళ్లేవరో చెప్పారు. మోసం చేశామని యింకా బాధలు పెట్టాడు. తింటున్న అన్నంలో నీళ్ళు పోసేవాడు. కడుపోస్తే కడుపు మీద తన్నాడు. కడుపు పోయింది. ఏడాది ఆ నరకం అనుభవించాక పక్కింటికి చుట్టపుచూపుగా వచ్చిన కుర్రాడు జాలి చూపిస్తే నమ్మాను. పెనం మీద నించి పొయ్యిలో పడ్తున్ననన్నది తెలీని వయసు. ఆ కష్టాలు తప్పితే చాలనుకున్నాను. తల్లీ, తండ్రి చచ్చారో, బ్రతికారో పట్టించుకోలేదు. చిన్నపాటి ఆలంబన దొరకగానే మరో ఆలోచన లేకుండా అతనితో వెళ్ళిపోయాను. ఓ రెండు నెలలు నిజంగానే ప్రేమ, అనురాగం ఎలా వుంటాయో చవి చూశాను. పెళ్ళి లేని బంధం, మూన్నాళ్ళ ముచ్చటే అయింది. మోజు తీరింది. బరువయ్యాను. వదుల్చుకునే దారులు వెతికి , పెళ్ళి కుదిరింది, పెద్దవాళ్ళు ఒప్పుకోరు నిన్ను అంటూ వదిలిపోయాడు. ఏడుస్తున్న నన్ను ఓ ముసలమ్మ ఒక యింట్లో పనికి కుదిరిచ్చింది. గొప్పింటివాళ్ళు పనిపాట పిల్లల్ని చూసుకుంటూ హాయిగా గడిచిపోయాయి రోజులు. మగాడి పోరు లేదు హాయిగా నీడపట్టున కడుపు నిండా తిండి దొరికింది అనుకున్న అనందం మూడు రోజుల ముచ్చటే అయింది. అమ్మగారు లేని సమయం చూసి అయ్యగారు నన్ను వాటేసుకున్నారు. చూడకూడని అమ్మగారి కంటబడనే బడింది దృశ్యం. అనాల్సిన అయ్యగారిని ఏమనకుండా నన్ను తిట్టితరిమేసిందది. మళ్ళీ బతుకు రోడ్డెక్కింది. రోడ్డున పడిన వంటరి ఆడదాని జీవితం నలుగురి చేతుల్లో నలిగి ఆఖరికి యీ పడుపు వృత్తిలోకి దింపింది. ఎవరో రెండు వేలకి అమ్మిపోయాడు ఈమెకి. అప్పటి నుంచి ఎంతమంది చేతుల్లో నలిగానో లెక్క నాకే తెలియదు. రెండుసార్లు పారిపోవాలని ప్రయత్నించితే గూండాలతో పట్టించి కొట్టి, తిండి పెట్టకుండా గదిలో తాళం పెట్టింది. దాంతో ఆ ప్రయత్నం మానాను.. బయటి కెళ్ళినా యింతకంటే మంచి జీవితం నాలాంటి వారికీ దొరకదని అర్ధం అయ్యాక ఈ నరకంలోనే బతకడం నేర్చుకున్నాను. జడ్జిగారూ, నేనేకాదు యిక్కడున్న ప్రతి ఆడపిల్ల వెనక యిలాంటి కధలే వుంటాయి. బలవంతంగా యీ జీవితంలోకి నెట్టబడి, బయటపడలేక బతుకీడ్చేవారె అందరూ. మీకు దండం పెడతా, మమ్మల్ని జైల్లో పెట్టండి, విడుదలయ్యాక మాలాంటి వారిని ఆడుకునే వారెవరన్నా వుంటే వారిదరి చేర్చండి! ' కన్నీరు కారుతుండగా అంది రేణుక.
పట్టుమని పదహారేళ్ళు లేని ఆ పిల్ల కధ జడ్జిని కదిలించింది. ఆలోచనలో పడింది.
జడ్జిమెంటు రాసింది. జరిగిన దానిలో రేణుక తప్పులేదని, నాగులమ్మ తప్పిదానికి ఆమెని శిక్షించక్కరలేదనీ రాసింది. ఆ అమ్మాయికి పునరావాసం కల్పించే బాధ్యత తనే తీసుకున్నట్టు పోలీసులకి చెప్పింది.
***
జడ్జిగారింటి ముందు కారాగింది. రేణుకని వెంట బెట్టుకుని పెరటి వైపు దారితీసింది. విశాలాక్షి . అంతకు ముందు రోజు రేణుకని ఓ నర్సింగు హోముకు తీసుకెళ్ళి అక్కడ డాక్టరు చేత ఆమెకి అన్ని రకాల పరీక్షలు, టెస్టులు చేయించి ఏ రోగాలు లేవని నిర్ధారణ చేసుకుంది.
"రేణుకా , చూడు ఈ బాత్ రూములో నూనె, పిండి, కుంకుళ్ళు వున్నాయి. నీవు పాతజీవితాన్ని మర్చిపోవడానికి ముందు నిన్ను నీవు శారీరకంగా, మానసికంగా ప్రక్షాళన చేసుకో. ఇన్నాళ్ళుగా నీ వొంటిని అంటిన మాలిన్యాన్ని నలుగు పెట్టుకుని, తలారా స్నానం చేసి కడుక్కో ఇదిగో ఈ కొత్త బట్టలు తొడుక్కో నీ పాత జీవితానికి గుర్తుగా విడిచిన బట్టలు ఈ బయట పడేసి అగ్గిపుల్ల వెలిగించు, స్నానం అయ్యాక యీ బాల్చీలో తులసాకులు , వేపాకులు , పసుపు వేసిన నీళ్ళతో మరోసారి స్నానం చేసి ప్రక్షాళన చేసుకో. యిదిగో యీ తులశమ్మ దగ్గిర స్నానం చేశాక దీపం వెలిగించి మనసు ప్రక్షాళన చేసుకొని, లోపలికిరా. ఈరోజు నుంచి నీ పాత జీవితం మరిచిపో. చదువుకో, లేదంటే ఏదన్నా పని నేర్చుకో. నీ కాళ్ళ మీద నీవు నిలబడే అర్హత సంపాదించుకోడానికి సాయం చేస్తా. యీ ఇంట్లో నేను ఒక్కర్తినే వుంటాను . ఇది నీ ఇల్లు అనుకో. ఈనాటి నుంచి నీ బాధ్యత నాది!' అంది విశాలాక్షి అభిమానంగా.
స్నానం చేసి కొత్త కాంతితో .....వొంటి కేకాక మనసుకు పట్టిన మకిలి పోయిన భావనతో విశాలక్ష్మి చెప్పినట్టుగా కుడికాలు ముందు పెట్టి లోపలికి అడుగుపెట్టింది. ఓ పవిత్ర దేవాలయంలోకి అడుగుపెట్టిన భావన.
భగవంతుని ముందు మోకరిల్లినట్లు విశాలక్ష్మి పాదాలకి తల ఆనించింది.
ఓ మంచిపని చేసేందుకు శ్రీకారం చుట్టిన అనుభూతితో మనసు నిండిపోగా బుజాలు పట్టుకు లేవదీసింది విశాలాక్షి.
ఎన్నాళ్ళుగానో చీకటిలో మగ్గిన మనిషికి చిన్నపాటి వెలుగు యిచ్చే అనుభూతి అమెది ఆ క్షణాన.
***