విద్య ఒక్కక్షణం ఆలోచించి "సరే...... అలాగే రాయమంటాను నాన్నగారిని" అంది లేస్తూ.
.......................
మరో వారం తరువాత మరో ఉత్తరం పట్టుకొని వచ్చింది విద్య. ఈసారి ఉత్తరం మరింత ఘాటుగా వచ్చింది. అదీ టైపు చేయబడిందే! 'మీ అమ్మాయికి చదవాలని వుంటే ప్రైవేటుగా చదవచ్చు. కాపురం వదులుకుని చదవడానికి మా అబ్బాయి ఇష్టపడటం లేదు. కాబట్టి అమ్మాయిని వెంటనే పంపవలసింది. ఈసారి వారం రోజుల్లోగా రాకపోతే మా కుమారుడితో ఏ సంబంధం వుండదని అర్థం చేసుకోగలరు!'
"ఈసారి ఏం చెయ్యమంటారు ఆంటీ? సారీ..... నా సంగతులతో మిమ్మల్ని విసిగిస్తున్నానేమో! మీరు ఈ విషయంలో ఎలాగూ ఇన్ వాల్ అయ్యారు గనకనా అడయిజర్ మీరే!" ఈ సారి తేలిగ్గా నవ్వుతూ అంది విద్య. "ఆంటీ 'టైమ్ ఈజ్ ది ఓన్లీ హీలర్'అన్నది ఎంత నిజం. దెబ్బ మీద దెబ్బ పడితే కొన్నాళ్ళకి మొద్దుబారి నొప్పి తెలీనట్టు గత రెండునెలలుగా ఆలోచించి ఆలోచించి, విని విని, బాధ పడి పడి ఈసారెందుకో ఏదో విరక్తి, వైరాగ్యం వచ్చాయి నాలో. ఏదో నిర్లక్ష్యం, ఏం జరిగితే అదే జరుగుతుందిలే అన్న నిర్లిప్త ధోరణి వచ్చేసింది."
"అదిసరే, మీ ఆయనకి ఉత్తరం రాశావా? ఆయన దగ్గర నుంచి ఏం జవాబు లేదా?" నిర్మల అడిగింది.
"ఊహు - ఏం రాలేదు...... ఆ మహానుభావుడికి ఉత్తరం రాయాలంటే తండ్రిగారు పర్మిషన్ ఇవ్వలేదేమో! పితృవాక్య పరిపాలకుడు గదా!" విద్య హేళనగా అంది.
"సరే..... ఈ ఉత్తరానికి జవాబివ్వకుండా ఊరుకోండి. ఇంతకీ మీ ఆయన ఫారన్ ఎప్పుడు వెళ్ళేది ఏమన్నా తెలిసిందా?"
"ఊహు ..... ఆయన ఒరిజినల్ ప్లాన్ ప్రకారం ఈ నెల ఇరవైన వెళ్ళాలి."
"నీవొక పని చెయ్యి. ఏం తెలీనట్టు 'మీరెప్పుడు వెళ్తున్నారో రాస్తే బొంబాయి వచ్చి మీకు సెండాఫ్ ఇవ్వాలని వుంది. ప్లీజ్..... రాయండి' అని రాయి..... చూద్దాం ఏం అంటాడో!"
"అమ్మో..... ఇప్పుడెళితే నన్ను పీక పిసికి చంపేస్తాడేమో ఆ కోపంతో..... మళ్ళీ ఇక్కడికి పంపించకపోతే..... బాబోయ్, నేవెళ్లను." భయంగా అంది.
"డోంట్ బి సిల్లీ విద్యా...... ముందసలు అతన్ని ఉత్తరం రాయనీ. రాస్తే ఒకపూట బొంబాయి గనక వెళ్ళొచ్చావంటే ఇంకో ఆరునెలలు తోసేయవచ్చు, అతను తిరిగి వచ్చేవరకు."
విద్య అయిష్టంగా మొహం పెట్టింది.
నిర్మల అది చూసి నవ్వింది. "ఏమిటిలా ఆముదం తాగినట్టు మొహం పెట్టావు? బీ స్పోర్టీవ్ విద్యా...... ఇంత చిన్న చిన్న సర్దుబాట్లు, త్యాగాలు చేయలేకపోతే జీవితం ఇంకొకరితో ఎలా పంచుకుంటావు? ఇంకో ఏభై ఏళ్ళ జీవితాన్ని ఇంకొకరితో పంచుకోవాలంటే ఎన్ని త్యాగాలు, ఎన్ని ఎడ్జెస్ట్ మెంటులు కావాలో తెలుసా. నామాట విని అతనికి రాయి. ఏ మొగుడన్నా దేశం వదిలి ఆరునెలలు వెళుతున్నప్పుడు, పెళ్ళాంపట్ల ప్రేమలేకపోయినా ఆడదాని పొందు కోరన్నా భార్యకావాలనుకుంటాడు. అందులో రెండు నెలలనుంచి నీకు దూరంగా ఉన్నాడు. కనక కాస్త కరగచ్చు అతను."
"ఆయన జవాబు రాకపోతే.....?"
నిర్మల ఒక్కక్షణం ఆలోచించి "నీకక్కడ తెల్సిన వాళ్ళెవరూ లేరా? నీ ఫ్రెండ్స్, బంధువులు, ఇన్ ఫర్ మేషన్ ఇవ్వగలిగినవారు ఎవరూ లేరా?"
విద్య ఒక్క క్షణం ఆలోచించి, మాకు దూరపు బంధువు అయిన ఆంటీ వున్నారు. ఆసలు ఈ సంబంధం చెప్పినది ఆవిడే. వాళ్ళ ఇంటికి ఆయన తరచూ వెళ్ళేవారుట పెళ్ళికి ముందు. పెళ్ళి అయ్యాక ఈయన వరస చూసి ఆవిడ నా తరపున మాట్లాడి ఆయన్ని మందలించిందని, ఆయన వాళ్ళింటికి వెళ్ళడం మానేశారు. ఆవిడ పాపం, తానా సంబంధం సజస్ట్ చేసినందుకు బాధపడి, మా మారీడ్ లైఫ్ ముందు నుంచి అలా అయిందని నొచ్చుకునేది. నేవెళ్ళేముందు ఆవిడకి చెప్పి వచ్చాను. 'సారీ అమ్మా, అతనిలాంటి మూర్ఖుడు అనుకోలేదు. ఏదో మంచి చదువు, ఉద్యోగం వుందని, డబ్బు, ఆస్తి వున్నవాళ్ళు అని సజస్ట్ చేశాం, అని ఎంతో బాధపడింది."
"ఆవిడకి నీవు వెంటనే ఉత్తరం రాయి, ఫోనుంటే కాంటాక్టు చెయ్యి..... అతనెప్పుడు వెడుతున్నది, బొంబాయి ఎప్పుడు చేరేది, ఏ ఫ్లైట్లో వెడుతున్నది, అక్కడ ఏ హోటల్లో వుండేది - అన్నీ కూపీలాగి నీకు రాయమని రిక్వెస్టు చెయ్యి. ఆవిడ అర్థం చేసుకుంటుందిలే. నీ సంగతి అంతా తెల్సిన ఆవిడ కనక నీ పని సుళువు అవుతుంది. వెంటనే ఫోను చెయ్యి. విద్యా....... సందేహించకు. ఒక్కరోజు అతన్ని కలియడంతో నీ భవిష్యత్తులో విచారించే రోజు రాకపోవచ్చు."
"విచారించాల్సినరోజు రావచ్చుగదా - పోయినదాన్ని మళ్ళీ కలుపుకుంటే జన్మంతా ఏడుస్తూ నన్ను తిట్టుకోవలసి రావచ్చేమో..... సారీ! కోప్పడకండి ఆంటీ! ఫోను చేస్తాను ఇవాళ..... చూద్దాం ఈ ఛాన్సు ఇచ్చి" అంది విద్య నవ్వి.
బొంబాయి ఎయిర్ పోర్టులో అడుగు పెట్టిన ప్రభాకర్ గుమ్మం దగ్గర నిలబడి చెయ్యి ఊపిన విద్యని చూసి తెల్లబోయాడు. అతనెప్పుడూ కలలో కూడా ఎదురు చూడలేని విద్యని అక్కడ చూడగలనని.
'విద్య ఇక్కడెందుకు ఉంది? ఎందుకు వచ్చింది? ఎవరికోసం వుంది తనకోసం అయితే తనీ ఫ్లైట్లో వెళ్తున్నట్టు ఎలా తెలుసు?' అరక్షణంలో అతనిలో లక్ష ప్రశ్నలు తలెత్తాయి. అతనికి తెలియకుండానే విద్యని చూడగానే ఒక్క సెకను అతని మొహంలో వెలుగు వచ్చింది. ఆశ్చర్యానందాలు అరక్షణం అతని మొహంలో కదలాడాయి. అది విద్య దృష్టిని దాటిపోలేదు.
విద్య ప్రభాకర్ ని చూసి రెండడుగులు ముందుకువేసి 'హలో' అంది నవ్వి.
ప్రభాకర్ మొహం టచ్ మినాట్ ని ముట్టుకోగానే ముడుచుకుపోయినట్టు ముడుచుకుపోయింది. విద్య వైపు తీవ్రంగా చూసి తనని కాదన్నట్టు మొహం ముడుచుకుని చకచక అడుగులు వేసి లగేజ్ కౌంటర్ వైపు వెళ్ళాడు.