Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 44

    దీన్ని బట్టి చూస్తే 'పెళ్ళి' అన్న రెండు అక్షరాలకి జీవితంలో చాలా ప్రాముఖ్యం ఉండటమే మంచిదని ఆలోచిస్తున్నట్టు అన్పిస్తుంది. మనదేశంలోనూ విడిపోయిన భార్యాభర్తల్ని చూస్తే వాళ్ళు ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నట్టు కనిపిస్తోంది. వీటన్నింటిని చూస్తే మేరీడ్ లైఫ్ లో ఏవో కొన్ని కష్టాలున్నా ఆ లైఫ్ లో సెక్యూరిటీ ఉందని ఆ వైపే మొగ్గుతున్నారేమో అందరూ. లేకపోతే రోజూ ఇన్ని వేలమంది, ఇన్ని లక్షలమంది ఈ బంధాన్ని తగిలించుకుని, కష్టమైనా సుఖమైనా ఆ జీవితాన్నే ఎందుకు కొనసాగిస్తున్నారంటావు?    
    వంటరి జీవితంలో భవిష్యత్తు అంధకారం కనక, ఏ మొగుడో మొగుడు, కొంతయినా బతకాలన్న యావ వుంటుంది ఆ బతుకులో అన్న ఆశతోనే ఇన్నివేలమంది తిట్టుకుంటూనే, కొట్టుకుంటూనే కాపురాలు చేస్తున్నారేమోననిపిస్తుందినాకు. నీకు ఇంతగా ఎందుకు చెప్పానంటే మంచి చెడ్డలు ఆలోచించే వయసుంది నీకు. నా కథ విన్నాక ఏది మంచో ఏది చెడో నీవాలోచించగలవన్న నమ్మకంతో ఇంతగా చెపుతున్నాను. ఆ పైన నీ ఇష్టం విద్యా!" అంది నిర్మల భారంగా నిట్టూర్చి.    
    విద్య చాలాసేపు మాట్లాడలేదు. ఆలోచనల్లో పడ్డట్టు ఉండిపోయింది.
    "మరి నేను వెడతాను విద్యా! చాలా సేపయింది వచ్చి. బాగా ఆలోచించుకో.... తొందరపడకు" అంటూ భుజం తట్టి లేచింది నిర్మల.    
    "సరే ఆంటీ..... మీరన్నట్టు ఈ చదువు ఆపను. తర్వాత మీరు చెప్పినట్టే అతనికి ఒక ఛాన్సు ఇస్తాను. అప్పటికీ మారకపోతే అతని ఖర్మో, నా ఖర్మో తేలుతుందిగా!" అంది విద్య అదోలా నవ్వి.    
    "జీవితం నడిచే రైలుబండి అయితేనే మనిషి మనుగడకి అర్థం వుంటుంది విద్యా! జీవితం చేజారిపోతే ఆ తరువాత అంతకుమించిన శిక్ష మరొకటి వుండదు" అంది నిర్మల భారంగా.
    మరోవారం తరువాత ఓ ఉత్తరం పట్టుకుని వచ్చింది విద్య. "ఏమిటి విద్యా..... మీ ఆయన ఉత్తరమా? వస్తావా లేదా అని అల్టి మేటమ్ ఇచ్చారా.....?" విద్య చేతిలో ఉత్తరం చూసి నవ్వుతూ అంది నిర్మల.
    "ఆ..... అల్టిమేటం లాంటిదే...... ఇచ్చింది ఆయనకాదు - ఆయనగారి తండ్రి. మీ అమ్మాయి వెళ్ళి రెండునెలలయింది. ఆ అమ్మాయి కాపురం కావాలనుకుంటే వెంటనే పంపే ఏర్పాటు చెయ్యండి అని రాశారు. ఇదిగో - చదివి చూడండి" అంది విద్య అదోరకం విరక్తి నిస్పృహ, చిరాకు నిండిన గొంతుతో.
    విద్య మొహంలో భావం అర్థం చేసుకుంది నిర్మల.
    కవర్..... టైపు చేసిన ఉత్తరం. అంటే ముందుజాగ్రత్తతో కాపీ వుంచుకున్నారన్నమాట అనుకొంది నిర్మల. విద్య తండ్రికీ వియ్యంకుడు రాసిన ఉత్తరం అది బిజినెస్ టైప్ లో, డియర్ మిస్టర్ అన్న సంబోధనతో - 'మీ అమ్మాయి మా అబ్బాయి దగ్గర నుంచి చెప్పకుండా చెయ్యకుండా వచ్చేసి రెండు నెలలు అవుతూంది. మీ అమ్మాయికి భర్త, కాపురం కావాలనుకుంటే పదిరోజుల్లోగా రావాలి. కాని పరిస్థితుల్లో ఆ అమ్మాయికి కాపురం అక్కరలేదన్నది మాకు స్పష్టం అవుతోంది. ఆ తరువాత జరిగేదానికి మేమెంత మాత్రం బాధ్యులం కాదని ఇందుమూలంగా తెలియపరుస్తున్నాం' అన్న నాలుగు లైన్ల ఉత్తరం అది. ఉత్తరం మడతపెట్టి నిర్మల నిట్టూర్చింది....." అయితే మీ వాళ్ళు ఏం అంటున్నారు దీని గురించి?"
    "ఏం అంటారు? నాన్నగారు ఏం చెయ్యాలో తోచక తల పట్టుకున్నారు. అమ్మ మాత్రం 'అయ్యయ్యో మీరోసారి వెళ్ళి మాట్లాడిరండి. రెండు మూడు నెలల్లో పరీక్షలయ్యాక, వాళ్ళబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాక వస్తుందని చెప్పండి. మెల్లగా నచ్చ చెప్పండి' అంటోంది.    చిన్నన్నయ్య అయితే ఏం అక్కరలేదు. ఏం..... వాడి బాబుచేత ఎందుకు రాయించడం. పెళ్ళాం కావలిస్తే వాడే రాయొచ్చుగా? దీన్నిబట్టి తెలియడం లేదా వాడెలాంటి వాడో అంటూ ఎగిరాడు."  
    విద్య మొహం వాడి వుంది. ఈ గొడవలతో ఆ అమ్మాయి మనసెంత నలిగిపోతూందో నిర్మల అర్థం చేసుకుంది. "నీ వేమంటావు విద్యా! నీ అభిప్రాయం ఏమిటి?" సౌమ్యంగా అంది.
    విద్య దూకుడుగా తలెత్తింది.... "ఐయామ్ ఫీలింగ్ డిజ్ గస్టెడ్ విత్ ఆల్ దిస్, ఐ యామ్ ఫీలింగ్ మిజరబుల్..... ఈ వెధవ పెళ్ళి - ఈ వెధవ మొగుడు నాకొద్దు అని అనాలని, అరవాలని వుంది. వారంరోజుల ముందయితే అనడానికి అరక్షణం ఆలోచించేదాన్ని కాదు. కాని మీరు చెప్పింది విన్నాక ఏం చెయ్యాలో తోచక నాకు పిచ్చెక్కిపోతూంది ఆలోచనలతో. ఆంటీ...... అనవసరంగా మీరు నాకెందుకు మీ కథ చెప్పారు? నాకెందుకు పిరికి మందు పోశారు?" విద్య మొహం ఎర్రబడింది. కళ్లల్లో నీరు చిన్నపిల్లలా చేతులలో మొహం దాచుకుంది బాధతో, విరక్తితో.     
    "విద్యా..... ఇటు చూడు, నీవు నిజంగా అలా ఫీలవుతూంటే, ఈ సంబంధం తెంపుకోవాలంటే ఏ ఉత్తరం రాయకుండా వుంటే చాలు..... దానంతట అదే తెగిపోతుంది. ఆ తెగిపోవడం పూర్తిగా తెగిపోతే సంతోషమే. అటు ఇటు కాకుండా ఇటో ముక్క అటో ముక్క పూర్తిగా తెగకుండా మధ్యలో తాడు సగం తెగి వుండిపోతేనే చిక్కు. అతన్ని పట్టుకుని వేలాడలేక, వదలలేక త్రిశంకు స్వర్గంలో వేలాడినట్లవుతుంది నీ బతుకు అని అంతగా చెప్పాను నీకు. నీకు మనస్ఫూర్తిగా ఈ కాపురం మీద ఇంటరెస్ట్ లేకపోతే వెంటనే అతనికి రాసి పంతాలు, పట్టింపులు పెరి, జారుముడి పీటముడిగా బిగుసుకుపోయేలోగా సౌమ్యంగా కోర్టు ద్వారా విడిపోవడానికి ప్రయత్నించు. జవాబు రాయకుండా అవతలి వారిని రెచ్చగొడితే జరిగే ఫలితం నీకు తెలుసు. అంతలో నేనేదో చెప్పానని నీవు బాధపడి బుర్ర బద్దలు కొట్టుకోనక్కరలేదు. నీవు నాకు కావల్సినదానివని అలా జరగచ్చు, నీ భవిష్యత్తు జాగ్రత్త అని సూచించాను. నా కథలాగే నీ కథ జరగాలని లేదు. నీవు అదృష్టవంతురాలివయితే ఈ సంబంధం తెగతెంపులు చేసుకున్నాక ఇంకో సహృదయుడు దొరుకుతాడేమో ప్రయత్నించి చూడు. ఈ జూదంలో గెలుపు, ఓటమి రెండూ వుంటాయనుకుని ప్రయత్నించు." నిర్మల కాస్త నిష్ఠూరంగా అంది.
    ఆమె కంఠంలో తీవ్రత గుర్తించి విద్య కళ్ళు తుడుచుకుని తలెత్తి నిర్మల వంక చూసింది. "సారీ ఆంటీ...... నాకు ఈ గొడవలతో పిచ్చెక్కిపోతూంది. ఆ కోపంలో ఏదో అన్నాను. మీరు చెప్పిన కథ అంతా మా వాళ్ళకి చెప్పాను. అందుకే తొందరపడి ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అంతకు ముందయితే నాన్న అరక్షణం ఆలోచించకుండా జవాబు చెప్పేవారు. మీరు చెప్పండి ఆంటీ, ఇప్పుడేం చెయ్యమంటారు? ఉత్తరానికి జవాబివ్వాలా వద్దా..... ఇస్తే ఏమని ఇవ్వాలి? మీ సలహా అడిగి రమ్మన్నారు అమ్మా నాన్న."  
    "నన్నడిగితే మీ నాన్నగారు ఆ ఉత్తరాన్ని సీరియస్ గా తీసుకోనట్టు, 'అమ్మాయికి పరీక్షలింక మూడునెలలున్నాయి. ఎలాగైనా ఎమ్మే కంప్లీట్ చెయ్యాలని పట్టుదలగా వుంది. పరీక్షలయ్యాక వస్తుంది." అంటూ మీరూ జవాబు నాలుగు లైన్లతో రాయండి. అంతకంటే ఇంకేదీ ఎత్తొద్దు. అతని పేర నీవూ అలాగే నాలుగు లైన్లతో రాసి పడేసి అతనితో కాంటాక్టు తెంపుకున్నట్టు వుండకుండా నెలకో రెండు నెలలకో ఓ ఉత్తరం రాస్తుండు...... ఇది నా సలహా."

 Previous Page Next Page