నవోదయం
మునిసిపాలిటీ వాళ్ళు రోడ్డు మీద ఊరకుక్కల్ని పట్టుకుని వ్యానులో పడేసి తీసుకొచ్చినట్టు, ఓ డజను మంది ఆడవాళ్ళని పోలీసు వ్యానులో కూలేసి కోర్టుకి హాజరుపరచడానికి తీసుకొచ్చారు పోలీసులు బిలబిల్లాడుతూ డజను మంది అమ్మాయిలు.....అమ్మాయిలనాలో , ఆడవాళ్ళనాలో.....
పదమూడేళ్ళనించి నలబై ఏళ్ళవరకు వున్న వాళ్ళంతా వ్యాను దిగారు. పోలీసులు పట్టుకుని వ్యానులో తెచ్చిన ఆడవాళ్ళంతా దీనంగా, తప్పు చేసి తలలు దించుకున్న ఆడవాళ్ళలా ఏం లేరు. వాళ్ళంతా నవ్వుకుంటూ , పరాచికాలాడుకుంటూ ఏ విహారయాత్రకో సరదాగా వచ్చిన వాళ్ళలా వున్నారు. మాకిదంతా అలవాటే అన్నట్టు, సిగ్గు , బిడియం మా శరీరాల్లోంచి ఎప్పుడో తప్పుకున్నాయి. తప్పు , పానం, నీతి నియమాలన్నలాంటి మాటలన్నీ మా మనసుల్లోంచి ఎప్పుడో తుడిచేశాం. బాధలు, శిక్షలు, కేసులు, కోర్టులు జరిమానాలు, వాళ్ళ నిజ జీవితంలో కాలకృత్యలంత సహజంగాకాలకయిమిడి పోయి అన్నట్టు నిర్వికారంగా వున్నారు. అవమానం, బాధ, ఆకలి కంటే ఎక్కువ కాదు సుమా అని వాళ్ళ అవతారాలు చెప్తున్నాయి. వాళ్ళంతా కడుపులో చల్లా కదలకుండా కాపురాలు చేసుకునే యిల్లాళ్ళు కారని మొహాలు చూసీ చూడగానే ఎవరన్నా చెప్పవచ్చు. అలా అని పోనీ మగాడ్ని ఆకర్షించే అందచందాలున్న వాళ్ళంతా కంటే కారు. వాళ్ళ మొహాలు వడిలిన వంకాయల్లా వున్నాయి. వాళ్ళ శరీరాలు ఎండిన బీరకాయల్లా గరుకుగా మొరటుగా వున్నాయి. వాళ్ళ కనుగుడ్లు జీవం లేని గాజుగుడ్డలా వున్నాయి. వాళ్ళ పళ్ళు జరదాతో గారకట్టి కిళ్ళీ ఉమ్ములు వుమ్మగా రంగు మారిన రాళ్ళలా వున్నాయి. వాళ్ళ పాదాలు చేతులు నాచుపట్టి రంగుమారి గతుకులు పడ్డ నాపరాళ్ళలా వున్నాయి. వాళ్ళ ఒంటిని స్టీలు సామాన్లవాడు పది రూపాయల కమ్మిన చవకరకం నైలెక్స్ చీరలున్నాయి. వాళ్ళ జడల్లో వారిలాగే వాసనలేని ఎండిన పూలున్నాయి. వాళ్ళందరి ముందూ ఎవరూ చెప్పకపోయినా నాయకురాలు అన్నట్టు భారీగా, బందోబస్తుగా వున్న ఆమె ఉంది. ఆమె శరీరాన్నించి కండలు వేలాడుతున్నాయి. వీళ్ళ తిండిలో సగం వాటా తనదేనన్నట్టు భారీ కాయంతో ఊరకుక్కల ముందు బలిసిన అల్సేషియన్ లా వుంది. వాళ్ళని అదిలిస్తూ ఆదమాయిస్తూ తను ముందుండి తన వెనక సైనికుల్ని నడిపించే సైనికాధికారిలా ముందు నడుస్తుంది. నన్నట్టు కెళ్ళి స్టేషనులో పెడతారా, కోర్టు కట్టుకోస్తారా, నా సంగతి తెలిసి యింత సాహసం చేస్తారా, మీ పని పడతా, మినిష్టరు గారి బావమరిది అండవున్న లాడ్జి పోరల్ని అట్టుకోస్తావా? మీ అందరికీ శంకరగిరి మాన్యాలు పట్టేరోజు దగ్గర పడింది. అందుకే ఈ పెద్దబుద్దులు!' పోలీసులే దొంగలు , తనే ఓ పోలీసాఫీసరన్నట్టు దర్జాగా, ఠీవిగా తలేగరేసి నడుస్తుంది.
కోర్టులో ఇలాంటి సీనులన్నీ మామూలేనన్నట్టు ఎవరూ తలలు తిప్పి చూడలేదు. జరిగే తంతు నల్ల కోట్లేసుకున్న లాయర్లకే కాదు, జనానికి తెలుసు! పట్టుకొచ్చి జరిమానా వేస్తారు. నీతులు చెప్పి మళ్ళీ ఇలాంటి పనులు చేయ్యద్దంటారు జడ్జిగారు. జరిమానా యజమానురాలు కట్టేస్తుంది. జడ్జి మహాఘటికుడయితే ఓ నెలరోజులు సెల్లో పెడేసే శిక్ష వేస్తాడు. దానికి ముందే బెయిలు ఏ చోటానాయకుడో, ఏ గ్యాంగు లీడరో , ఏ రౌడీషీటరో వచ్చి విడిపించేస్తారు. అసలు సాధారణంగా పోలీసులు వాళ్ళ మామూళ్ళు వాళ్ళకు ముడ్తున్నన్ని రోజులూ ఇలాంటి కేసుల జోలికి పోరు. ఎప్పుడో ఏ నీతి, నిజాయితీ నిక్కచ్చి ఆఫీసర్ వస్తే రెయిడ్ జరుగుతుంది. కాదంటే ఏ పేపరులోనో ఫలానా లాడ్జీల్లో ఇలాంటి అవినీతి దంధాలు జరుగుతున్నాయని ఏ రిపోర్టరో ఆరాతీసి పేపర్లో రాస్తే వాళ్ళెంత స్ట్రిక్ట్, నిజాయితీయో చూపించడానికి యిలాంటి కేసులు పట్టుకుంటారు. నిన్న పేపర్లో ఫలానా మినిస్టరు బావమరిది లాడ్జిలో బాహాటంగా యీ పనులు జరిపిస్తున్నాడంటూ వార్త రావడంతో, పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. ఆ రిపోర్టరుని , ఆ పేపరుని కోపంతో ఏం చెయ్యలేక వాళ్ళ ప్రతాపం ఆడవాళ్ళ మీద చూపించి, నాలుగు తన్ని లాక్కొచ్చి, సెల్లో పడేసి పొద్దుట కోర్టులో హాజరు పరిచారు.
ఆరోజు జడ్జి విశాలాక్షి ఆవిడ చాలా నిజాయితీగా, నిర్భయంగా తీర్పులు చెప్తుందని పేరుంది. జడ్జిగా మంచి పేరుంది. కర్మ కాలి యీవిడ పాలపడ్దాం అనుకుంది నాయకురాలు నాగులమ్మ. తిట్టవలసిన తిట్లు, పెట్టవలసిన గడ్డి అంతా నాగులమ్మకే పెట్టింది జడ్జి. ఆవిడకి తెలుసు యీ ఆడవాళ్ళంతా గతిలేక ఆమె పంచన చేరిన రకం అని. పేరు పేరున అందరికి ఈ నీచమైన బతుకు వదలి కాయకష్టం చేసుకుని గౌరవంగా బతకమని హితవు చెప్పుతూ జరిమానా విధించింది జడ్జి విశాలాక్షి.
'నాకు జరిమానా వద్దు జడ్జిగారూ, జైల్లో పెట్టించండి, మీ కాళ్ళకి దండం పెడతాను' అందులోంచి ఓ అమ్మాయి అరిచింది. 'జడ్జి గారూ మీకు పుణ్యం వుంటుంది. నాకు జైలు శిక్ష వేయండి. ఈ జరిమానా కట్టిన నష్టాన్ని పూడ్చుకుందుకు మా అంటీ మరో యిద్దర్నీ రోజుకి ఎక్కువ పంపిస్తుంది మా దగ్గరికి. ఆ శిక్ష కంటే జైలు శిక్ష నయం నాకు జరిమానా వద్దు జడ్జిగారు దండం పెడుతూ ఏడుస్తూ అంది.
కోర్టు హలో ఓ క్షణం నిశ్శబ్దం . ఆవెంటనే కలకలం. 'ఆర్డర్, ఆర్డర్' అంది జడ్జి తేరుకుని ఆశ్చర్యంగా ఆ అమ్మాయి వంక చూసింది. 'నీవేదన్నా చెప్పదలిస్తే అక్కడ నిల్చుని చెప్పు' అందావిడ.
ఆ అమ్మాయి బెదిరిన లేడి కూనలా చూస్తూ బొనేక్కింది. మళ్ళీ దండం పెట్టింది. మళ్ళీ జైల్లో పెట్టించమని వేడుకుంటూ ఏడుస్తూ చేతులు జోడించింది. ఆ అమ్మాయి అక్కడున్న అందరి కంటే కాస్త బిన్నంగా వుంది. పూర్తిగా వడలని, ఎండని, ముదరని గిడసబారని వంకాయిలా వుంది. కాస్తో, కూస్తో యింకా ఆ మొహంలో జీవం వుంది. బతుకు మీద ఆశ,తీసి యింకా ఆ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. నేలరాలిపడినా యింకా పూర్తిగా పాదాల కింద పడి నలగని పువ్వలా వుంది.
'నీకెందుకు జైలుశిక్ష కావాలంటున్నావు. జైలుశిక్ష సరదాగా వుందా?' జడ్జి కాస్త అనుమానంగా చూస్తూ అడిగింది.
'బయట ఈ కుళ్ళు బతుకు కంటే జైలేనయం జడ్జిగారూ. మీకు కట్టిన జరిమానా నష్టం వసూలయే వరకూ మరిద్దరి ముగ్గురికి మేం వొళ్ళప్పగించాలి. కుళ్ళు వెధవలు, చెమట కంపు, గబ్బుకంపు, పాచికంపు, తాగుడు కంపు, వెధవలు. వొళ్ళంతా రోగాలంటించుకున్న వెధవలు. చేతిలో పాతిక రూపాయలు పట్టుకు వచ్చిన ప్రతి వెధవకీ మేం వొళ్ళప్పగించాలి. దున్నపోతుల్లా వొళ్ళంతా కుమ్మే వెధవల్ని మోహన నవ్వు పులుముకుని వొళ్ళు పుండయినా భరించాలి. ఆ నరకం కంటే జైలు నయం. యింత తిండి పడేస్తారు. ఏదో రకం చాకిరీ చేస్తే రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవచ్చు నిశ్చింతగా ఆవేశంగా గబగబా ఎవరో తరుముకొస్తున్నట్టు పాఠం అప్పజెప్పినట్లుంది.
'మరి అంత యిష్టం లేనిదానివి అక్కడెందుకుండడం , బయటికి వచ్చి ఏదో కష్టం చేసుకుని బతకరాదా?'
'ఆ నరకంలోంచి బయటపడడమా.....ఓసారి కన్నుగప్పి పారిపోతే గూండాల చేత పట్టించి, కొట్టించి రెండు రోజులు తిండి పెట్టకుండా గదిలో తాళం పెట్టింది . నన్ను డబ్బిచ్చి కొంది కదా అంత తేలిగ్గా వదుల్తుందా?
జడ్జి కోపంగా నాగులమ్మ వంక చూసింది. 'ఏమిటి ఆ అమ్మాయి చెప్పింది నిజమేనా?' హుంకరించింది.
'దొంగముండండి ....అన్నీ అబద్దాలండీ. దిక్కూ మొక్కూ లేని లంజల్ని చేరదీసి తిండేట్టె తినమరిగి వొళ్ళు కొవ్వెక్కి యిప్పుడిట్లా అంటారండి లంజముండలు.
'ఆర్డర్....ఆర్డర్.....యిది కోర్టు. నీ యిష్టం వచ్చినట్టు అసభ్యంగా అమర్యదగా మాట్లాడావంటే...' తిరస్కారంగా చూస్తూ అంది జడ్జి.