'అదే, ఈసారి ఛాన్సు వదలకూదడనుకున్నా కానీ, తీరా ఇప్పుడు ఎలా మానేజ్ చెయ్యాలో అని భయంగా ఉంది. పిల్లాడి చదువు, చంటిపిల్ల......రెండు కాపురాలు, రానుపోను ఖర్చులు, నెలకోసారి మించి రాలేని దూరాభారం! శివరాం ఏమంటాడో?' కలత పడిన మనసుతో ఆరోజంతా ఆలోచనతో గడిచిపోయింది రేవతికి.
***
"ఇంకేం చాలా సరదా పడుతున్నావు కదా వెళ్ళాలని.....వెళ్లు! వెళ్లు! ఒంటరిగా ఉండే ముచ్చట తీర్చుకో ఈసారి!" కాగితం చూపి ఎగతాళిగా ఎత్తిపొడిచాడు శివరాం.
'ఎత్తిపొడుపులు మానండి! నేను పదిరోజుల్లో జాయినవ్వాలి! ఈలోగా మనం ప్లాన్ చేసుకోవాలి!"
"ప్లాన్ చేసుకోడానికేముంది? నీవు, పిల్లలు వెళ్ళండి. ఇక్కడ నా పాట్లేవో నేను పడతాను!" నిర్లిప్తంగా అన్నాడు.
"బాబుని తీసుకెళ్లను నేను. అక్కడ మంచి స్కూల్సు ఉండవు. ఇక్కడ ఎంత అవస్థ పడి, ఎన్ని రికమండేషన్స్ తో వాడికి మంచి స్కూల్లో సీటు వచ్చింది? ఐదారువేలు ఖర్చు పెట్టాం. మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇక్కడ సీటు దొరకదు! అందుచేత వాడిని మీ దగ్గరే ఉంచుకోండి! నేను పాపని తీసుకెళ్ళి నా అవస్థ నేను పడతాను! అక్కడ క్రెష్ అదీ ఉండదు బహుశా, ఇంట్లో ఉండే పనిమనిషిని చూసుకోవాలేమో! ముందెళ్ళి జాయినై పరిస్థితులు చూసి వస్తాను. మీరు నాలుగు రోజులు సెలవు పెడితే కావాల్సిన సామానూ అదీ తీసుకెళ్ళి సర్దుకుని వద్దాం! ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈసారి ట్రాన్సఫర్ తప్పదు, రెండు మూడేళ్ళు అవస్థ పడకా తప్పదు!" ఉదయం నుంచి అలోచించి ప్లాను చేసుకున్నాకే రేవతికి కాస్త నిబ్బరంగా ఉందిప్పుడు.
"ఏమిటీ బాబుని నేను పెట్టుకోవాలా? నావల్ల ఏమవుతుంది? వాడిని చూడడం నాకేం వస్తుంది? ఆశ్చర్యంగా అన్నాడు. "ఏదో నేను ఒక్కడినీ అయితే ఏ హోటల్లోనో ఏదో తింటాను . వాడిని పెట్టుకోవడం నా వల్ల కాదు. నీవు , పిల్లలు వెళ్ళండి. నా ఏర్పాట్లు నేను చేసుకుంటాను!"
"వల్ల కాకపోవడానికి ఏముంది? మరీ చంటి వాడు కాదు. ఐదేళ్ళున్నాయి. ఈపది రోజులు కాస్త కుక్కరు పెట్టుకోవడం నేర్చుకోండి పనిమనిషికి మరో వంద ఎక్కువిస్తాను అని చెప్తాను. కూర, తరిగి, వంటిల్లూ అదీ శుభ్రం చేయడం, బాబుకి నీళ్ళు పోయడం , ఉదయం మీ ఇద్దరికీ టిఫిను బాక్సులోకి చపాతీలు చేయమని చెప్తాను. లేదంటే బ్రెడ్ తీసుకెళ్ళండి. కుక్కరులో అన్నం, పప్పు వండుకుని , చారు , ఏ వేపుడు ముక్కలో చేసుకోండి! పచ్చళ్ళు, పొడులు చేసి ఫ్రిజ్ లో పెడతాను. మీరో, నేనో వచ్చినప్పుడల్లా కాస్త చేసి పెడుతుంటాను. శని, ఆదివారాలు మా అన్నయ్య, మీ అక్కయ్య ఉన్నారుగా! వెళ్తుండండి. నెలకి ఓసారి రెండు మూడు రోజులు సెలవు వచ్చినప్పుడు మనం వస్తుండచ్చు!" ఉదయం నుంచి అలోచించి పెట్టిన ప్లాను వివరించింది.
"ఇదంతా నా వల్ల కాదు. వాడిని పొద్దున్నే లేపడం, తయారుచేయడం, వంటావార్పు, ఇదంతా నావల్ల కాదు. వాడిని తీసుకెళ్ళి ఏ స్కూలుంటే దానిలో చేర్చు!" విసుగ్గా అన్నాడు.
'చూడండీ! వాడు నాకే కాదు మీకూ కొడుకే! పిల్లల బాధ్యత నా ఒక్కర్తీదే కాదు, మీది కూడా అని మరిచిపోకండి!" కోపంగా అంది.
"పిల్లల పెంపకం ఆడదాని బాధ్యత అన్నది నీవే మరిచిపోతున్నావు!"
'అది ఆడది సంపాదించని రోజుల నాటి మాట! ఇల్లు సంసారం, వంట, పిల్లలు ....ఇవన్నీ ఆడదాని బాధ్యత అనుకునే పాతరోజులు నాటి మాట! అప్పుడు సంపాదించడం కేవలం మగాడి బాధ్యతగా ఉండేది. ఇప్పుడు ఆడదీ సంపాదిస్తూ మగవాడి బాధ్యత సగం పంచుకున్నప్పుడు ఆడదాని బాధ్యత సగం మగవాడు తీసుకోవాలి!" తీక్షణంగా అంది.
శివరాం ముఖంలో రంగులు మారాయి. మాటల కోసం తడుముకున్నాడు.
'చూడండి! వాడికి మంచి స్కూల్లో మనం కావాలన్నప్పుడల్లా దొరకదు. వాడి భవిష్యత్తు ఆలోచించాలి మనం. అంతేకాక ఒంటరిగా ఇద్దరినీ చూసుకోవడం నాకూ కష్టం. వాడిని వదలి వెళ్ళడం నాకూ కష్టమే. కాని వాడి భవిష్యత్తు కోసం త్యాగం చెయ్యాలి, అందుచేత మళ్ళీ నాకు ట్రాన్సఫర్ అయ్యేవరకు రెండు మూడేళ్ళు కష్టపడాలి మనం. అలా కుదరదు అంటే, ఉద్యోగం మానేయమంటే మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను. ఇల్లు ఎలా నడిపేది మీ బాధ్యత!" నిష్కర్షగా అంది.
"పెద్ద బెదిరించకు ఉద్యోగం మానేస్తానంటూ. ఇంట్లో సుఖాల్ కోసం, నీ ఖర్చుల కోసం చేస్తున్నావు కానీ నా కోసం కాదు . మీ ఆడవాళ్ళకి ఆర్ధిక స్వాతంత్ర్యాలు కావాలని చేస్తున్నారు?' హేళనగా అన్నాడు.
"బెదిరింపు ఎందుకు? మీరు ఊ అంటే ఈ క్షణమే వదిలేస్తాను! అంతేకానీ భార్య ఉద్యోగం చెయ్యాలి కానీ ట్రాన్సఫర్లుండకూడదు , ఉన్న ఊర్లో అయితేనే ప్రమోషన్లు తీసుకోవాలని,....ఇన్ని షరతులతో ఉద్యోగాలు కుదరవు. మీకోసం ఇంట్లో ఇబ్బందుల కోసం మా ప్రమోషన్లు వదులుకుని మా జూనియర్లు మా కళ్ళ ముందే ఆఫీసర్లయితే వాళ్ళ ముందు తల దించుకుని నిలుచోవాలి. మీరు మా కోసం ప్రమోషన్లు వదులుకుంటారా? ఏం, బాబు చంతివాడుగా ఉన్నప్పుడు ప్రమోషన్ మీద కాకినాడ ట్రాన్సఫర్ అయితే నాకిబ్బంది అని వదులుకున్నారా? మూడేళ్ళు వంటరిగా బాబుని పెట్టుకుని ఉండలేదు నేను. మీకు భార్యలు ఉద్యోగాలు చెయ్యాలి, సంపాదించాలి . అవి మీకు "మీ వేనీళ్ళకి చన్నీళ్ళలా మాత్రమే కనిపిస్తాయి. ఆడది మీతో సమంగా సంపాదించినా అది మీ కంటికి అనదు. మీవే ఉద్యోగాలు! మీకంటే మేం పెద్ద ఉద్యోగాలలో ఉండకూడదు. ట్రాన్స్ ఫర్లుండకూడదు. మీకు ఇబ్బందులు లేకుండా మా అవకాశాలు వదులుకుని ఉద్యోగం చేస్తూ, వంటా, వార్పూ , పిల్లలు చూసుకుంటూ ఇంటి బాధ్యత మాదేన్నట్లు ప్రవర్తిస్తారు. పిల్లలకి రోగాలోచ్చినా, బంధువులొచ్చినా , ఏం వచ్చినా మేమే సెలవు పెట్టాలి. ఆఫీసర్ల చేత మాటలు పడాలి. మాదీ మీ లాంటి ఉద్యోగమే! ఇప్పటికైనా ఆడదాని సంపాదన కేవలం వేన్నీళ్ళకు చన్నీళ్ళలా చూడడం మానుకోండి! వేన్నీళ్ళ లోనే చన్నీళ్ళు కలపనక్కర లేదు. చన్నీళ్ళలోనూ వేన్నీళ్ళు కలపవచ్చన్నది అర్ధం చేసుకుంటే బాగుంటుంది! కలపకపోయినా ఉత్తి చన్నీళ్ళు ఆరోగ్యానికి మంచిదన్నది తెలుసుకోండి!' 'చాలా ఆవేశంగా మొదలుపెట్టి వ్యంగ్యంగా ముగించింది. 'అంచేత నేను ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అవుతాను! బాబు విషయం ఏం చేస్తారో ; ఎలా మానేజ్ చేసుకుంటారో అది మీ ప్రాబ్లం!' నిర్లక్ష్యంగా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది రేవతి.