మరెందుకు చేస్తున్నాడిదంతా!
అధికార దాహం!....సుప్రిమసీ..... బాల్యం తన మీద చూపిన అత్యాచారాల ప్రభావం అతడిని లా మార్చింది. అతడి కళ్ళ వెనుక నీడల్లో వున్న కసి, సాడిజం కేవలం కొంతమంది మాత్రమే గుర్తించగలరు.
క్రమంగా మనుష్యులు పల్చబడటం ఆమె గమనించింది. దాదా అనుచరులు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. అతడు కూడా లోపలికి వెళ్ళటానికి లేచాడు.
అప్పుడు వెళ్ళింది అతడి దగ్గరికి.
సాధారణంగా ఆ టైమ్ లో తన దగ్గిరకి వచ్చే మనుష్యుల కన్నా కాస్త పెద్ద స్థాయిలో వున్న ఆ అమ్మాయిని చూసి దాదా 'ఎవరన్నట్టు' చూశాడు.
"నేను నీతో కొంచెం మాట్లాడాలి".
ఆ ఏకవచన సంబోధనకి దాదా భృకుటి ముడివడింది. పక్కనున్న అనుచరుడు అడుగు ముందుకు వేయబోయి, దాదా చూపుతో తమాయించుకున్నాడు. క్షణాల్లో దాదా సర్దుకున్నాడు.
"ప్రతిరోజూ ప్రొద్దున్నే నీ నుంచి ఏదో ఒకటి కోరటానికి వచ్చే జనంలో ఒకరిని కాను. అందువల్ల నువ్వీ సింహాసనం మీద కూర్చొని మాట్లాడక్కర్లేదు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా?"
అతడేదో అనబోయి, మనసు మార్చుకున్నట్టు "సరే...రా" అంటూ లోపలికి నడిచాడు. లోపలగది మరింత సింపిల్ గా వుంది. టేబిల్ మీద ఒక ఫోన్ వుంది. దేశాన్ని శాసించే ఫోన్ అదికాదని ఆమెకు తెలుసు. పోలీసులు దాన్నెప్పుడో ట్రాప్ చేసి వుంటారని అతడికి తెలియకుండా వుండదు.
ఇద్దరూ టేబిల్ కి చెరో వైపున కూర్చున్నారు.
"అరె! కోయీ ఆయేతో ఏక్ దో మినిట్తక్ అందర్ మత్ భేజో....." అని అరిచాడు దాదా బయటి వాళ్ళతో తరువాత ఆమె వైపు తిరిగి.....
"ఊ చెప్పు. ఎవరు నువ్వు?" అని అడిగాడు.
"అనూష-"
టపటపా కొట్టుకున్న కనురెప్పల కదిలికలను బట్టి తన పేరు అతనిలో సంచలనాన్ని లేపిందని ఆమె గ్రహించింది. అయితే అది రెండు మూడు కనురెప్పపాటు కాలాలు మాత్రమే. అతడు సర్దుకుని "ఓహొ నువ్వేనా" అన్నాడు క్లుప్తంగా.
"అవున్నేనే".
"చెప్పమ్మా! నీకు నేనేం చేయగలను?" హిందీలో వినయంగా అడిగాడు. అతడి డిప్లమసీ (లౌక్యం)లో వున్న నమ్రతకి ఆమె విస్మయం చెందింది. కాని వెంటనే విషయానికొస్తూ "దాదా! నీకూ నాకూ ఏ శతృత్వమూ లేదు. దేశాన్ని నువ్వు ఎలా దోచుకుంటూన్నావో తెలిసిన కొద్దిమంది పౌరుల్లో నేనూ ఒకదాన్ని. దాన్ని వెల్లడిస్తూ నేనొక వ్యాసం వ్రాశాను. అది నీకు అపరిమితమైన నష్టాన్ని కలుగచేసింది. దానికి ప్రతీకారంగా చాలా స్వీట్ గా నా మీద రివెంజి తీసుకున్నావు. అభినందనలు. ఈ దేశంలో ఒక మనిషిగా నీ చర్యల్ని ఎప్పటికప్పుడు ఖండించే హక్కు నాకుంది. అలాగే నన్ను సాధించే హక్కు నీకూ వుంది. పొతే ఇప్పుడు నేనొచ్చింది మన మధ్య వున్న వైరం గురించి కాదు. ఎందుకంటే అది వ్యక్తులకి సంబంధించినది కాదు. పంథాలకీ, వ్యక్తిత్వాలకీ సంబంధించింది...."
"అమ్మా నువ్వు ఇంగ్లీషులో చాలా చక్కగా మాట్లాడుతున్నావు. కానీ నాకు నువ్వంత వేగంగా మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు. కావటం లేదు".
"ఆ హిపోక్రసీయే వద్దన్నాను దాదా! అనువాదకులు లేకుండా నువ్వు అమెరికన్ ప్రెసిడెంట్ తోనయినా మాట్లాడగలవని నాకు తెలుసు. అసలు విషయానికి వస్తే- సలీంశంకర్ కీ నాకూ మధ్య నున్న వైరం గురించి నీకు తెలుసు. మా ఇద్దరిలో ఇప్పుడు ఎవరో ఒకరే బ్రతకబోతున్నారు. నేను నీ దగ్గరికి ఇప్పుడొచ్చింది ఎందుకంటే, మాఇద్దరి మధ్య గొడవలో నువ్వు కలగచేసుకోకుండా వండటం నీకు ఇష్టమో కాదో తెలుసుకోవటానికి! సలీంశంకర్ వెనుక నీ ప్రొటెక్షన్ లేకపోతే అతడు నీటి బయటున్న మొసలి లాటి వాడు".
"నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు. అమ్మా! నాకు చాలా పనులున్నాయి. హిందూ- సిక్కు ఐక్యత సమాఖ్య మీటింగుకి వెళ్ళాలి" అంటూ లేచాడు. ఆమె కూడా లేచి "దగ్గర్లో ఏదైనా ప్రెస్ వుందా దాదా?" అని అడిగింది అభ్యర్థిస్తున్నట్టు.
"దేనికి"
"ఉత్పల అని, అఫ్ కోర్స్ నీకేం తెలీదన్నావనుకో, మా వూళ్ళో సలీంశంకర్ అని ఒక గూండా వున్నాడు. అతడి గురించి ఆమె దగ్గర దొరికిన ఉత్తరాన్ని ఒక వెయ్యి కాపీలు ప్రింటు చేయించి, పేపర్లకీ ప్రెస్ కీ ఇవ్వాలి. అందుకోసం....."
వసంత్ దాదాలో ఆ క్షణం కనపడిన సంచలనాన్ని ఆమె ఆ తరువాత ఎప్పుడూ మర్చిపోలేదు. అంత పెద్ద మాఫియా లీడరూ క్షణం పాటూ కలవరపడ్డాడు.
"వెళ్ళొస్తాను దాదా. క్షమించు, ఏమీ తెలియని నిన్ను అనవసరంగా ఏవేవో అనుమానాల్తో వేధించి టైమ్ వేస్ట్ చేశాను".
"ఆగు"
అనూష ఆగింది.
"అలా కూర్చో"
ఆమె కూర్చుంది.
"ఆ వుత్తరం నీ దగ్గరికి ఎలా వచ్చింది?"
"మీరేం మాట్లాడుతున్నారో నాకర్థం కావటం లేదు! నాకు చాలా పన్లున్నాయి. అహింస- తత్వబోధన మీటింగుకి వెళ్ళాలి" అంది అనూష.
"హిపోక్రసీ వద్దు. అసలు విషయానికి వద్దాం. చెప్పు ఆ వుత్తరం నీకెలా దొరికింది?"
అప్పటి వరకూ అతడి మొహం మీద కదలాడుతూ వచ్చిన దయా దాక్షిణ్యాల ముసుగు ఇప్పుడు లేదు. దాని స్థానే క్రౌర్యం, లిటిగేషను తాలుకు అసలు స్వరూపం కనపడుతూ వుంది. అనూష అతడినే చూస్తూ అంది-
"నీ అనుచరులు- ముఖ్యంగా గణేష్ దళం నువ్వనుకున్నంత తెలివైనది కాదు దాదా. పోలీస్ స్టేషన్ లో అన్ని నిజాలూ చెప్పిన ఉత్పల, తన దగ్గర ఆ వుత్తరం లేదన్న విషయం కూడా నిజమే చెప్పింది. ఆ వార్త ఆ ఇన్ స్పెక్టర్ మీ వరకూ తీసుకురావటంలో నిర్లక్ష్యం చేసాడు. ఆస్పత్రిలో హత్యజరిగిన సమయానికి ఉత్పలా శ్రీనివాసరావు కలిసే వున్నారు. ఉత్పల దగ్గర లేకపోతే ఆ వుత్తరం శ్రీనివాసరావు ఇంట్లో వుంటుందన్న ఆలోచన మీ వాళ్ళెవరికీ రాకపోవటం దురదృష్టం. ఆ వుత్తరాన్ని శ్రీనివాసరావ్ ఇంట్లో పట్టుకున్నాను".
"ఆ వుత్తరంలో విషయాలన్నీ తాటికాయంత అక్షరాల్లో పేపర్లో వేసినా నాకేం నష్టం లేదు. ఏదీ బుజువు కాదు" బింకంగా అన్నాడు దాదా.
"ఆ విషయం నాకు తెలుసు. కానీ నీ పరిస్థితి చాలా ఇరకాటంలో పడుతుంది. నీ సీక్రెట్ స్థావరాలన్నీ మార్చుకోవాలి..... నీ ముఖ్య అనుచరుల లిస్టు బయటికొచ్చిందంటే వాళ్ళకీ నీకూ చాలా ఇబ్బంది. ఇంతకు ముందులా మీరు బహాటంగా కలుసుకోలేరు. పోలీసుల దృష్టి మీ అందరి మీద వలలా పరుచుకుంటుంది. నీ గొడవన్ల అడ్రసులు ఆ వుత్తరంలో వున్నాయి. రాత్రికి రాత్రి వాటి సరుకుల్ని వేరే రహస్యమైన చోటికి మార్చటం అంత సులభం కాదు. అన్నిటి కన్నా ముఖ్యంగా వేర్వేరు దేశాల మాఫియాతో నీకున్న సంబంధాలు అందులో హింట్స్ గా ఇవ్వబడ్డాయి. విష్ణుశర్మకి వీటి సంగతి అంతగా తెలీదు. కానీ కాస్త తెలివైన సి.బి.ఐ. ఆఫీసరెవరైనా వాటిని చాలా సులభంగా డి-కోడ్ చేయగలడు".
"ఆ బాడ్ ఖోవ్- విష్ణుశర్మగాడు.. వాడికిన్ని విషయాలు ఎలా తెలిశాయి?" తనలో తనే గొణుక్కుంటున్నట్టు అన్నాడు.
"చావు ధైర్యం మనిషికి తెలివితేటలిస్తుందేమో బహుశ! ఆ విషయం ఇప్పుడెందుకు గానీ, చెప్పు దాదా- నా అగ్రిమెంటు నీకిష్టమేనా?"
"ఏమిటది?"
"ఈ వుత్తరం నేను బయట పెట్టను. నాకూ సలీం శంకర్ కి మధ్య వైరంలో నువ్వు కల్పించుకోకూడదు".
"కల్పించుకోకూడదు- అంటే?"
"రాజకీయాల్లో, ప్రభుత్వంలో నీకున్న పలుకుబడిని, శంకర్ ని మధ్య వైరంలో నువ్వు కల్పించుకోకూడదు".
"ఒక వేళ ఉపయోగించినా ఆ విషయం నీకెలా తెలుస్తుంది? సలీంశంకర్ ని నువ్వు ఎలా అరెస్ట్ చేయిస్తావు? అలా అరెస్ట్ చేయించిన తరువాత మళ్ళీ ఆ వుత్తరాన్ని బయట పెట్టవని నమ్మకం ఏమిటి?"
"కోట్లతో చీకటి వ్యాపారం చేసేవాడివి..... పెద్ద మనుషుల ఒప్పందం గురించి నీకు తెలియనిదేముంది? ఇక శంకర్ ని నేనెలా ఎదుర్కొంటానన్నది నీ కనవసరం. అది మా ఇద్దరి మధ్యా గొడవ......"
"నేనీ ఒప్పందానికి వప్పుకుంటే నీకూ నాకూ మధ్య ఏ గొడవా లేనట్టేనా?"
"ఈ దేశపు పౌరురాలిగా, కాస్తో కూస్తో దేశభక్తి వున్నదానిగా నేను నీకు ఎప్పుడూ శత్రువునే దాదా! పొతే నిన్నెదుర్కోవటం, కటకటాల వెనక్కి తోయటం పోలీసుల బాధ్యత. వాళ్ళెలా తమ బాధ్యత నెరవేరుస్తారన్నది వాళ్ళిష్టం. ఈ వుత్తరం కారణంగా తప్ప- మరే విధంగా నువ్వు నాకు దొరికినా వదిలి పెట్టను. నేనే కాదు- కాస్త పౌరధర్మం తెలిసిన ఏ మనిషి వదిలిపెట్టడనుకొంటాను. నేను చెప్పొచ్చే దేమిటంటే- మా విషయానికి సంబంధించినంతవరకు మమ్మల్ని వదిలిపెట్టు. ఉత్తరానికి సంబంధించినంతవరకూ నేను నిన్ను వదిలి పెడతాను. ఈ విషయం మనిద్దరి మధ్యే వుండాలి".
"నేను ఇక్కడ్నించి నిన్ను వెళ్ళనివ్వకుందా బంధిస్తే?"
అనూష కుర్చీలోంచి లేస్తూ నవ్వింది- "మరీ ఇంగ్లీషు నవలా పరిజ్ఞానాన్ని ఉపయోగించక దాదా! ఆ పని చేయటానికి నీ లాటి మేధావి అవసరం లేదు.
తెలుగుదేశపు రచయితలు చాలు".
"నీ అగ్రిమెంటు నాకు సమ్మతమే-"
* * *
అనూష వెళ్ళాక దాదా అలాగే చాలా సేపు కూర్చున్నాడు. మీటింగుకి వెళ్ళటం కోసం పిలవటానికి లోపలికి వచ్చిన అనుచరుడిని వెళ్ళిపొమ్మని అని, మరి కొంచెం సేపు అలాగే కూర్చొని, ఒక నిర్ణయానికి వచ్చినట్టు వెళ్ళి కారులో కూర్చున్నాడు.
"మీటింగ్ కా సాబ్?" డ్రైవర్ అడిగాడు.
"కాదు. చోటి గల్లీకి పోనీ".
కారు అరగంట సేపు ప్రయాణం చేసి చిన్న సందులో ప్రవేశించి దూరంగా ఆగింది. అక్కణ్ణుంచి అయిదు నిమిషాలు కాలి నడకన నడిచి ముందు అరుగు మీద వసారా కూలిపోయినట్టు వున్న ఒక ఇంటిలో ప్రవేశించాడు దాదా. లోపల యాభై అరవై దాకా ఫోన్లున్నాయి. మాట్కా (బ్రాకెట్) నెంబర్లు వివిధ ప్రాంతాలకి చెప్పే ఫోన్లు అవి. వాటిలో కలిసిపోయి మామూలు ఫోన్ లు కూడా వున్నాయి. వాటిలో ఒకటి తీసి నెంబర్ డయిల్ చేశాడు. దానికి ఎస్. టి. డి. లేదు.
"ట్రంక్ బుకింగ్ ప్లీజ్"
"యస్సర్-" అవతల్నించి తియ్యటి కంఠం వినిపించింది.
"లైట్ నింగ్ కాల్ టు హైద్రాబాద్ ప్లీజ్-"
"నెంబర్ సర్-" కంఠం తియ్యగా వినిపించింది.
దాదా నెంబర్ చెప్పాడు. తన నెంబరు, తనకి కావల్సిన నెంబరు.
"ఒక నిమిషంలో మళ్ళీ మీకు తిరిగి చేస్తాను సర్" తియ్యగా అని డిస్ కనెక్ట్ చేసింది ఆపరేటర్.
వసంత్ దాదా ఫోన్ వెపే చూస్తూ కూర్చున్నాడు. నిమిషం తరువాత ఫోన్.