కారు అక్కడ ఆగేసరికి, ముందు కూర్చున్న ముగ్గురిలో ఆశ్చర్యం తొంగి చూసింది.
"దిగండి."
ముగ్గురూ ముందు నడుస్తూ వుండగా వెనుకే జానీ రెండు చేతులూ పాంటు జేబులో పెట్టుకుని వాళ్ళని అనుసరించాడు.
రాత్రి పదకొండు కావొస్తూంది. సలీంశంకర్ మూడో పెగ్ లో వున్నాడు. జానీని చూడగానే, ఆనందంతో నవ్వి 'తీసుకొచ్చారా..... గుడ్' అన్నాడు.
"సారీ శంకర్. వాళ్ళు తీసుకురాలేదు. నేనే వాళ్ళని తీసుకొచ్చాను".
శంకర్ కి దిగిపోయింది. 'బేవకూఫ్' అని అరిచాడు. రామూవైపు తిరిగి..... "అదేందిరా? దాన్ని తీసుకురాలేదా!"
జానీ ఆశ్చర్యంగా "ఏది శంకర్? దేన్నీ తీసుకు రమ్మని పంపించావ్? ఏదైనా కావల్సివస్తే నాకొక్క ఫోన్ కొడితే నేను తీసుకురానా? నా హొటల్ ముందు కార్లు ఆపు చేయటం దేనికి?" అన్నాడు.
"నాటకాలు ఆపు జానీ...... అసలు విషయానికి సూటిగా వద్దాం".
"ఏ విషయానికి-"
"సరిగ్గా అరగంటలో నువ్వు ఆ ఆడ కట్ మల్ ని మాకు అప్పగిస్తున్నావు. అంతే కాదు- జీపుకి కలిగిన నష్టానికి మరో లక్ష రేప్రోద్దున్నలోగా పంపిస్తున్నావు".
"ఆడ కట్ మల్ ఏమిటి? జీపేమిటి? మేమొచ్చింది కార్లో కదా! మీ గుండప్పే డ్రైవ్ చేసాడు కూడా".
"ఆ నాటకాలే వద్దన్నాను. జీపుమీద నీ వేలిముద్రలు గుర్తించాం".
"ఏ జీపు?"
"నువ్వు ఊరి బయట వదిలేసిన జీపు....."
"ఓ! అది మీదా? ఎవరు ఇలా వదిలేసింది అని నేనూ బిల్లూ లోపల ఏమైనా కాగితాలున్నాయేమోనని జీపంతా వెతికాం".
సలీంశంకర్ కోపంగా బల్లమీడున్న విస్కీ గ్లాసుని నేలమీదకు విసిరికొట్టాడు. అది భళ్ళున బ్రద్దలైంది. దాన్ని చూస్తూ జానీ తాపీగా, "శంకర్- ఈ వ్యాపారంలో నువ్వూ నేనూ చాలాకాలంగా వున్నాం. ఒకరి విషయాల్లో ఒకరు జోక్యం కలుగచేసుకోవడం లేదు. నాలాటి హొటల్ యజమాన్లూ, షాపులవాళ్ళూ చందాల రూపేణా నీకు నెలనెలా ఎంతో కొంత ముట్ట చెపుతున్నారని తెలుసు. నేను మాత్రం పైసా కూడా ఇవ్వటం లేదు నీకు. ఆ విషయంలో దాదాగిరి చెలాయించబోయి, కన్ను లొట్టబోయిన స్టేజికి వెళ్ళావు...... సలీం! నేను చెపుతున్నాను విను. నేను తల్చుకుంటే నీకన్నా పెద్ద గూండా అవగలను. వసంత్ దాదా ప్రాపకం సంపాదించి ఈ ఏరియాకి దళాధిపతి కాగలను. కానీ నాకు ఈ కుక్క బ్రతుకు ఇష్టం లేదు. నా స్వంత వ్యాపారం నాకుంది. అలా అని ఎవరైనా నా జోలికి వస్తే ఇప్పుడు నువ్వు బ్రద్దలు కొట్టావే, ఆ గ్లాసులా వాళ్ళ తల బ్రద్దలు కొట్టగలను. ఆ విషయం నీకు తెలుసు. మనం మునుపటిలాగే నా విషయం నేను చూసుకుంటాను. నీ విషయం నువ్వు చూసుకొనే స్టేజిలో వుందాం. నా హొటల్ ముందు కార్లు ఆగి వుండడం, అందులో గ్రద్దల్లాగా నీ మనుష్యులు పొంచి వుండడం నాకిష్టం లేదు".
సలీంశంకర్ జవాబు చెప్పలేదు. వెనుక నుంచి రాము అన్నాడు. "నిన్నిక్కడ మేము చంపేస్తే...."
జానీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. "శంకర్!...." అన్నాడు. "మీ రామూకి ఇంకా గాంగ్ వార్ ల సంగతి బాగా తెలిసినట్టు లేదు. నేను చచ్చిన మరుక్షణం మీ వాళ్ళు నలుగురు చస్తారు. అందులో నువ్వు కూడా వుండొచ్చు. ఆ విషయం మీ వాడికి చెప్పు......"
శంకర్ లేచి జీనీ దగ్గిరకి వచ్చి కళ్ళలోకి సూటిగా చూశాడు.
"ఆ పిల్లని మాకప్పగించు జానీ" అన్నాడు క్లుప్తంగా.
"మీరు పిల్లా-పిల్లా అని ఎవరి గురించి అంటున్నారో నాకు అర్థం కావటం లేదు".
"సర్లే నువ్వెళ్ళు జానీ! నీ నుంచి నిజం ఎలా చెప్పించాలో మాకు తెలుసు".
"అది చెప్పటానికే నేనూ వచ్చాను. మీరు ఏవేవో అనుమానాలు పెంచుకుని నా టెరిటరీలోకి ప్రవేశిస్తే తరువాత పరిణామాలకి నేను బాధ్యుణ్ని కాదు".
శంకర్ నవ్వేడు. "నీకు టెరిటరీ అంటూ ఏమీ లేదు జానీ! టెరిటరీలు వుండేవి మాకు! కేవలం మా దయాదాక్షిణ్యాలమీద నువ్వు నీ వ్యాపారం చేసుకుంటున్నావు. నువ్వేమిటి, ఆ మాటకొస్తే ఈ మహానగరంలో ఎవరైనా మా ధర్మం మీదే బ్రతుకుతారు. ఒక చిన్న పిల్లని మేము పట్టుకోలేమనుకోక. ముందు చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్పాము".
"చెప్పడం నా ధర్మం కాబట్టి నేనూ చెపుతున్నాను సలీం- ఈ అర్థరాత్రి అనవసరంగా నువ్వూ టైమ్ వేస్ట్ చేసుకోక".
22
"హాయ్...... ప్లెజెంట్ సర్ ప్రైజ్" . ఢిల్లీ వచ్చిన చెల్లెలితో శ్రీకాంత్ అన్నాడు.
"ఆశ్చర్యం వరకూ కరెక్టే గానీ ఆనందకరమైన ఆశ్చర్యం మాత్రం కాదు" నవ్వుతూ అంది అనూష.
"ఏమిటి విశేషం- గమ్మత్తుగా మాట్లాడుతున్నావు?"
"ఈ డిపార్ట్ మెంటు కొంతమంది ప్రముఖుల్ని మత్తుగా బ్రతికిస్తూంటే మరికొంత మందిని గమ్మత్తుగా పరుగెత్తిస్తోంది. అది సరేగానీ అన్నయ్యా-ఈ వసంత్ దాదాగాడి గురించి కొంచెం చెప్పు".
ఢిల్లీ ఏరియా సర్కిల్ -3 డి.సి.పి. శ్రీకాంత్ ఉలిక్కిపడ్డాడు.
"ఎందుకు?" అని అడిగాడు అనుమానంగా.
"చెప్పు....."
"పేపర్లో చదువుతున్నావుగా, అందరికీ తెలిసిందే. అతడిది నా జ్యూరిస్ డిక్షనే.....మా డిపార్ట్ మెంట్ ని మూడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు. ముఖ్యంగా నన్ను....."
"దీన్ని నువ్వు కంఠతా పట్టినట్టున్నావు. చాలా రోజుల క్రితం నేను ఫోన్ చేసినప్పుడు కూడా అక్షరం పొల్లుపోకుండా ఇవే మాటలు చెప్పావు".
"అసలు విషయం ఏమిటో చెప్పు చెల్లాయ్".
అనూష ముందుకు వంగి తాపీగా అంది.
"పంచాంగం చూసి రేపు ప్రొద్దున్న రాహుకాలం ఎప్పుడుందో చెప్పు అన్నాయ్! రేపు ప్రత్యూష సమయంలో నేను వసంత్ దాదాని కల్సుకోబోతున్నాను. ఫరె ఫైనల్ షోడౌన్"
శ్రీకాంత్ చేతిలో గ్లాసు జారిపడింది.
"నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థం అవుతూ వుందా?"
"అర్థం అవుతుంది! కానీ జరిగింది పూర్తిగా నేను మాట్లాడితే మాత్రం నీకు మతి పోతుంది. నీకు తెలుసా, నేను ఒకరోజు రాత్రంతా లాకప్ లో వున్నానని, తరువాత బెయిల్ మీద విడుదల అయ్యాననీ....."
శ్రీకాంత్ స్థాణువయ్యాడు. "ఏమిటి నువ్వనేది? నిజమా.....ఎందుకు? ఏం జరిగింది? ఎవరి వల్ల.....?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
"సలీంశంకర్ వల్ల......" ఆమె స్వరం చాలా మామూలుగా వుంది.
శ్రీకాంత్ మొహంలో రక్తం ఇంకిపోయింది. "స.....సలీంశంకరా........అతడికి నీతో ఏమిటి విరోధం?" అన్నాడు. అనూష మాట్లాడలేదు. శ్రీకాంత్ దగ్గరగా వచ్చి, "వాళ్ళంతా రక్తం తాగేవాళ్ళు. నాకు భయంగా వుంది. అనూ.......అసలేమైంది? చెప్పవూ" అని అడిగాడు.
అనూష నవ్వింది. "రక్తం తాగేవాడిని చూసి పోలీసు ఉన్నతాధికారి భయపడటం చిత్రంగా లేదూ".
"జోకులాపు. విషయం చెప్పు".
"విషయం ఏమీ లేదు. రేపు నేను వసంత్ దాదాతో శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నాను. కొన్ని విషయాలు ముఖాముఖీ తేల్చుకోవాలి. అతడిని కలుసుకోవాలీ అంటే ముందు అపాయింట్ మెంట్ తీసుకోవాలా అక్కర్లేదా, ఆ ఒక్క విషయం చెప్పు"
"ఏమిటి అనూషా ఇదంతా?"
"నా ప్రశ్నకి సమాధానం చెప్పు".
"......సమాజంలో వసంత్ దాదా చాలా మర్యాదస్థుడు రాబిన్ హుడ్ లాంటివాడు. ప్రొద్దున్న ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ఢిల్లీ ప్రాంతపు వేర్వేరు లొకాలిటీల్లో వున్న బీదవాళ్ళంతా అతడి ఇంటి ముందు చేరి తమ తమ కష్టాలు చెప్పుకుంటారు. అతడిని అరెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్ మెంట్ కి కష్టమవటానికి అదొకటి కారణం. వాళ్ళ సానుభూతి ఇతడికి చాలా వుంది. వాళ్ళకి తెలియని దేమిటంటే అతడు సంపాదించిన దాంట్లో కేవలం నూటికి ఒక శాతం మాత్రమే అతడు వాళ్ళకోసం ఖర్చు పెడుతున్నాడు. కనీసం అలా నటిస్తున్నాడు. ఆ ముసుగులో దేశ సౌభాగ్యం సాలుకి కొన్ని కోట్లు దొంగతనంగా కొట్టేస్తున్నాడు".
"బీదవాళ్ళకి అది అనవసరం. దేశంలోకి వంద టన్నుల గంజాయి దిగుమతి అవుతే వాళ్ళకి నష్టం లేదు. వాళ్ళకి కావల్సింది- తమకి ఇమ్మీడియట్ గా అందే సహాయం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, మనదేశంలో చదువుకున్న వాళ్లు కూడా ఈ ప్రమాదాన్ని గుర్తించకపోవటం..... ఈ విషయాలకేం గానీ, రేప్రోద్దున్న అతడి ఇంటికి వెళ్ళబోతున్నాను".
"ఎందుకో చెప్పవా?"
"ఊహూ! అసలీ విషయం కూడా నీకు చెప్పకూడదు. కానీ రేపు నాకేదైనా ప్రమాదం జరిగితే నీకు అతడిని అరెస్ట్ చేయటానికి ఒక సాక్ష్యం వుంటుంది కదా! అఫ్ కోర్స్, అటువంటి అజాగ్రత్త పనులు ఏవీ దాదా తలపెట్టడనుకో..... నా వుద్దేశ్యం ప్రకారం ఈ పాటికే నేను నీకు చెల్లెల్ని అన్న విషయం అతడికి తెలిసి వుంటుంది. సో......రేప్రోద్దున్న ఎనిమిదింటికి-"
ఇక తనెంత చెప్పినా ఆమె వినడాని అతడికి తెలుసు. చివరగా, "నా వేన్లో పంపిస్తాను. నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలోకి ప్రవేశిస్తున్నట్టు వుంది. దూరంగా కాపలా వుంచటం కూడా మంచిదని నాకు తోస్తూంది" అన్నాడు.
అనూష మళ్ళీ నవ్వి "ఈ ప్రపంచంలోకెల్లా పెద్ద జోకు మీ పోలీసు వ్యాను! దొంగలకు సూచన్లు ఇస్తున్నట్టు ముందుగానే పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చే ఆ వ్యానుని సినిమాల్లో ఎప్పుడు చూసినా నాకు నవ్వొస్తుంది" అంది.
"దొంగలను పట్టుకోవటానికి వెళ్ళేటప్పుడు మేము సైరన్ మ్రోగించం" ఉక్రోషంగా అన్నాడు శ్రీకాంత్.
"ఊరికే అన్నాన్లే అన్నయ్యా. రేపు నాతో పాటూ ఎవరూ అక్కర్లేదు".
శ్రీకాంత్ వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ, "నువ్వూ స్వతహాగా ఆలోచించగల దానివనీ, ఎవరు చెప్పినా విననంత మొండి పట్టుదల కలదానివని తెలుసు. అయినా మరోసారి ఆలోచించు" అన్నాడు చివరి మాటగా.
"దానికేంగానీ, నువ్వు నీ భాషని సంస్కరించుకోవటం కాస్త మంచిది. "నూటికి ఒక శాతం" - అన్న పదం తెలుగులో లేదు. 'నూటికి ఒక భాగం' అనో, 'ఒక శాతం' అనో అనాలి. రేప్రోద్దున్న ఈ ఢిల్లీ కమిషనర్ అయ్యాక కూడా ఏ కాన్ఫరెన్సులోనో అలా వాడితే బాగోదు. కాస్త జ్ఞాపకం పెట్టుకో".
* * *
ఆమె దూరంగా ఆగి ఆ ఇంటి వైపు చూసింది.
చాలా చిన్న ఇల్లు. ఎత్తు అరుగులున్నాయి. ఢిల్లీ సర్కిల్ -3లో, మధ్యతరగతి, క్రింది తరగతి మనుష్యులు నివసించే ప్రాంతంలో, చాలా సామాన్యమైన ఆ ఇంటి అరుగు మీద కూర్చున్న ఆ వ్యక్తి నెలసరి ఆదాయం ఎనభై లక్షలు దాకా వుంటుందని అంటే ఎవరూ నమ్మరు. నమ్మలేరు.
అతడు సాదరంగా ఒక ముసలమ్మతో మాట్లాడుతున్నాడు. మున్సిపాలిటి అధికారులు తననెలా బాధ పెడుతున్నదీ ఆమె చెపుతోంటే సానుభూతితో వింటున్నాడు. ప్రపంచంలోని కరుణ, ఆదరం అంతా అతడి మొహంలో కనపడుతూ వుంది. ప్రపంచంలో అతి క్రూరులైన కొద్ది మందిలో అతనొకడని చూసిన వారెవరూ అనుకోరు. వ్యసనాలు లేవు. సింపిల్ లివింగ్.