Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 44


    "నేనే-"

    "నేను దాదాని మాట్లాడుతున్నాను-"

    "ఊ-"

    "ఆ వుత్తరం చివరికి అనూష దగ్గిరకి చేరింది".

    అవతల్నుంచి శంకర్ ఒక బూతుమాట అని, "దాని దగ్గిరకి ఎలా వెళ్ళింది?" అని అడిగాడు.

    "అది నా దగ్గిరకొచ్చి ఒక బేరం పెట్టింది. నేను నీ గురించి వదిలేస్తే తను చూసుకుంటుందట? రెండోసారి?"

    "ఏదో మాట్లాడింది. నాకు సగం అర్థమయింది సగం కాలేదు. మొత్తం మీద నీ మీద పగబట్టినట్టుంది".

    అవతల్నుంచి శంకర్ నవ్వు. "చూద్దాం! హైద్రాబాద్ వస్తే ఇక్కడే ఫినిష్ చేస్తాను".

    "అంత సులభం కాదేమో..... ఆ విష్ణు శర్మగాడు వ్రాసినట్టే తను చచ్చిపొతే ఆ వుత్తరం బయటకొచ్చేలా ఏదో ఏర్పాటు చేసే వుంటుంది. అందుకే నేను తన  అగ్రిమెంటుకి వప్పుకున్నట్టు నటించాను. అనకి ఈ విధంగా కాస్త టైమ్ దొరుకుతుంది. కాస్త జాగ్రత్తగా...... హలో.... హల్లో...."

    అట్నుంచి చిన్న శబ్దం. మూడో లైనులో.....

    "హల్లో....హల్లో.....ఆపరేటర్-"

    "యస్ మిస్టర్ వసంత్ దాదా....." అదే తీయటి కంఠం.

    దాదా వులిక్కిపడ్డాడు. జీవితంలో హాలా తక్కువ సార్లు ఉలిక్కిపడ్డాడు. అందులో ఇది ఒకటి.

    "ఎవరూ-"

    "అనూషని! నువ్వు చాలా తెలివైనవాడివి దాదా. కానీ నా తెలివితేటలు కూడా ఒకసారి నిరూపిద్దామానుకున్నాను. ఇంకెప్పుడూ ఇలా అనాలోచితంగా ఫోన్ లు ఉపయోగించకు. నువ్వు మాట తప్పావు. కాబట్టి మన అగ్రిమెంటు కాన్సిల్ అయింది. బైదిబై నీ బ్రహ్మాస్త్రం ఈ టెలిఫోన్ ఆపరేటర్ పిచ్చుకల మీద ఉపయోగించకు. ఇక నీ కుడి భుజంతో మనసారా మాట్లాడుకో. గుడ్ బై..... "టిక్....టిక్....

    "హల్లో- దాదా- నేను శంకర్ ని..... ఏమిటి మధ్యలో ఎవరో లైన్లోకి వచ్చినట్టున్నారు- హల్లో... హ..ల్లో....."

    వసంత్ దాదా మాట్లాడలేదు. నెమ్మదిగా ఫోన్ పెట్టేసి నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకున్నాడు.


                                                            23

    "ఏం జరిగింది బయట? ఎక్కడికి వెళ్ళారింత సేపూ?" ఉత్పల జానీని అడిగింది.

    "ఎవరో ప్రత్యేక అతిథులు వచ్చారు. ఇంటివరకూ దిగబెట్టి వచ్చాను".

    "నాకెందుకో భయంగా వుంది"

    "ఎప్పుడూ భయపడుతూ బ్రతకటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నువ్వింకా మేల్కొని వున్నావని పైకి వచ్చాను. ఒంటిగంట కావొస్తుంది. పడుకో" వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ అన్నాడు. ఆమె కాస్త తటపటాయించి, "నేనూ మీతో పడుకుంటాను-" అంది.

    తలుపు దాటబోతున్నవాడల్లా ఆగి నవ్వి "మీతో అన్నది ఏకవచన గౌరవసూచకమా? బహువచన సంబోధనా?" అన్నాడు. ఆమె మొహం ఎర్రబడింది. ఆమె ఏదో అనబోతూ వుంటే, నవ్వి "మధ్య తలుపు తీసి వుంచుతాను. లైటు వేసి వుంచి, నిద్రపోవటానికి ప్రయత్నించు. మరీ అంతగా నిద్రపట్టకపొతే..... నా ....సారి మా-తో కలిసి పడుకొందుగాని" అని వెళ్ళిపోయాడు. అతడి మొహం మీద చిరునవ్వు అలాగే వుంది. ఆమె మొహంపై ఎరుపుదనం మాత్రం చాలా సేపటి వరకూ తగ్గలేదు. "ఛీ ఏమిటలా అన్నాను' అని అనుకుంది.

    "ఏమిటీ అంటోంది?" బిల్లూ అడిగాడు.

    "చిన్న పిల్ల. ఇంకా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదు".

    "చిన్నపిల్లా? ఇంకా నయం- పాలుతాగే పసిపిల్ల అనలేదు. ఆ  అమ్మాయి  స్ట్రక్చర్ చూశావా. సన్నటి నడుము మీద  నుంచి జలపాతం పైకి ఉబికినట్టు పైట....."

    "జలపాతం పైకి ఉబకటమేమిటి? నీకా అమ్మాయిని చూస్తుంటే భాష కూడా తప్పుతున్నట్టుంది".

    "లేదు బాస్. ఆ అమ్మాయి నన్ను అంకుల్ అనగానే నాకింకే భావమూ లేకుండా పోయింది. కానీ నీ విషయం లా కాదు. ఆ అమ్మాయి చూపు...."

    "ఊరుకో బిల్లూ. ఆ అమ్మాయి అలాటిది కాదు. శ్రోత్రియవంశంలో పుట్టి పెరిగిన అమ్మాయి. చాలా మంచిది".

    "ఆ అమ్మాయి గుణగణాల గురించి నేను మాట్లాడటం లేదు జానీ. వయసు గురించి, అదీ నువ్వు చిన్న పిల్ల అన్నావు కాబట్టి చెపుతున్నాను. నీలో మాన్లీనెస్ ని ఆమెలోని స్త్రీ గుర్తించింది. అంతవరకే. దీంట్లో గుణం ప్రసక్తేమీ లేదు".

    "గుడ్ నైట్".

    లోపలున్న ఉత్పల ఈ మాటలన్నీ విన్నది. ఈ మాటకి ఆమె ఈసారి సిగ్గుపడలేదు. బోర్లాపడుకుని రక్త ప్రసరణం ఆగిపోయేటంత గట్టిగా దిండుకి మొహం వత్తుకుంది. రెండు నిమిషాల తరువాత పక్కకి వత్తి గిల్లింది. కొంచెం సేపటికి మరింత పక్కకి..... ఆ తరువాత పది నిమిషాలకి లోపల చెయ్యి పెట్టి తీసేసినట్టు మనసులోంచి భయంపోగా నిద్రలోకి జారుకుంది.

    పక్క గదిలో బిల్లూ గురక వినపడుతూంది. జానీ మాత్రం నిద్రపోవటం లేదు. చురుకైన మెదడుతో శ్రమించే యువకుల్లాగే అతడూ ఎప్పుడూ గాఢనిద్రలోకి జారుకోడు.

    అంతలో ఇంటర్ కమ్ లోంచి రింగ్ వినపడింది.

    ఇరవై నాలుగ్గంటలూ రిసెప్షన్ దగ్గిర వుండే ఆపరేటర్, "సార్, మీ గురించి ఇన స్పెక్టర్ వచ్చారు" అంది ఫోన్లో.

    అతడు లేచి క్రిందికి వచ్చాడు. క్రింద అతడి కోసం చూస్తున్న ఇనస్పెక్టరు చెయ్యి ముందుకు సాచాడు. అతడి చేతిలో ఒక కాగితం వుంది.

    "మిస్టర్ జానీ, మీ ఇల్లు సెర్చి చేయాలి. ఇదిగో సెర్చి వారెంటు" అన్నాడు. జానీ మొహంలో ఏ మార్పూలేదు. "దేని గురించి" అన్నాడు కాగితం అందుకుంటూ.

    "మీ హొటల్లో మత్తు పదార్థాలున్నట్టు కంప్లెయింటు వుంది".

    జానీ, చేతిలో కాగితం విప్పి చూస్తూ "ఎవరిచ్చారు ఈ వారెంటు? సలీంశంకరా?" అని అడిగాడు.

    "మీరెక్కువ మాట్లాడితే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ క్రింద అరెస్ట్ చేయవలసి వస్తుంది. మర్యాదగా పక్కకి తప్పుకోండి".

    జానీ పక్కకి తప్పుకున్నాడు. ఇన్ స్పెక్టర్ మెట్లెక్కటం మొదలు పెట్టాడు. ఈ లోపులో బిల్హణుడు ఎదురుగా మెట్లు దిగుతూ వచ్చాడు. ఇన్ స్పెక్టర్ ని చూసి ఆగాడు.

    సెర్చివారెంటు తెచ్చాను బిల్లూ. ఇల్లంతా వెతకటానికి"- ఇన్ స్పెక్టర్ కంఠంలో అదోలాటి వెటకారం తొంగిచూసింది. బిల్లూ అర్థంకానట్టు జానీ వైపు చూశాడు. జానీ చేతిలోని సెర్చివారెంటుని పూర్తిగా చదవటం అప్పుడే పూర్తిచేశాడు.

    "ఇన్ స్పెక్టర్....."

    పైకి వెళుతూన్న ఇన్ స్పెక్టర్ ఆగి దగ్గరకొచ్చాడు.

    "మా హొటల్లో మత్తు పదార్థాలు వున్నాయనే కదా ఈ సెర్చివారెంటు".

    "అవును".

    "ఎవరిచ్చారు దీన్ని?"

    "అదికూడా అందులోనే వుంది జానీ".

    "ఒకవేళ నేను దీన్ని అంగీకరించక మీ పనికి వప్పుకోకపోతే?"

    "ఇంత పెద్ద హొటల్ నడుపుతున్నావు. సెక్షన్ 41 - ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్  కోడ్ తెలియదనుకోను నీకు....."

    జానీ ఆ వారెంటు కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చింపేసేడు. చూస్తున్న బిల్లూ అతడి చర్యకి ఆశ్చర్యపోయాడు. ఆ ముక్కల్ని బాస్కెట్ లో పడేస్తూ "ఓ.కె. ఇన్ స్పెక్టర్. నన్ను అరెస్టు చేయండి" అన్నాడు. ఇన్ స్పెక్టర్ తెల్లమొహం వేశాడు. జానీ సోఫాలో కూర్చుంటూ, భిల్లూ! ఇన్ స్పెక్టర్ కి ఒక  ఒక స్ట్రాంగ్ డ్రింకు కలిపివ్వు-" అన్నాడు.

    ఇన్ స్పెక్టర్ అప్రయత్నంగా కుర్చీలో కూర్చున్నాడు.

    "ఇన్ స్పెక్టర్- మీ స్టేషన్ కి వారంవారం హఫ్తా పంపించటంలో నేనేమైనా ఆలస్యం చేశానా?"

    "లేదే-"

    "మీకూ నాకూ ఏవిధమైన శతృత్వమూ లేదుకదా".

    "లేదు జానీ, కానీ నన్ను పూర్తిగా అర్థం చేసుకో! పైనుంచి వచ్చిన ఆర్డరిది".

    "టోపీ కాస్త తీస్తే, నీ చెవిలో పువ్వు ఏదైనా వుందేమో చూస్తాను. కనీసం నా చెవిలో అలాటిది ఏదీ లేదని నీకు తెలిసే వుండాలి ఈ పాటికి".

    "జానీ-"

    "సెర్చివారెంటు జాగ్రత్తగా తయారుచేశారు. చివరికి స్టాంపుతో సహా..... కానీ కాస్త పరిశీలనగా చూస్తే అది మీ ఇద్దరూ, అంటే సలీంశంకరూ, నువ్వూ కలిపి తయారు చేసింది అని సులభంగా తెలిసిపోతుంది. అవునా".

    ఇన్ స్పెక్టర్  మాట్లాడలేదు.

    "ఇన్ స్పెక్టర్! సలీం మీకు బాగా ముట్టచెపుతూ వుండొచ్చు గాక! కానీ అతడికి వున్న దొంగ వ్యాపారాల్తో పోల్చుకుంటే అతడు మీకు ఇచ్చేది చాలా తక్కువ. ఆ రకంగా చూస్తే- నా వ్యాపారం చిన్నదైనా నేనూ మీకు హఫ్తా ఇస్తూనే వున్నాను. దానికి ప్రతిఫలంగా మాత్రం ఇటువంటి పని నీ నుంచి నేను ఆశించలేదు. ఇంకో రకంగా చెప్పాలంటే మా ఇద్దరికన్నా పెద్ద మాదచ్చోద్ వి నువ్వు. మా ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుంటూ మా మధ్య గొడవల్లో పాలుపంచుకుంటున్నావు".

    "డ్రస్ లో వున్నాను. కాస్త గౌరవంగా మాట్లాడు".

    "బ్రోకర్లకీ డాఫర్లకీ బట్టలవల్ల గౌరవం రాదు ఇన్ స్పెక్టర్! నన్ను మరింత ఆవేశపెట్టి మరిన్ని నిజాలు చెప్పించకు నాతో! మీ పోలీసు వ్యవస్థమీద  ఎవరికైనా ఏ మాత్రమైనా కాస్త గౌరవం వుంటే అది పోతుంది. పొతే సలీంశంకర్ కి నా మాటగా  చెప్పు.....ఇలాటి చచ్చు ఆలోచన్లు మానుకోమని! నీక్కూడా అదే సలహా  వర్తిస్తుంది...... మా ఇద్దరి మధ్యా నువ్వు కలగచేసుకోకు".

    "నీ సలహాకి థాంక్స్! నా సలహా ఏమిటంటే సలీంశంకర్ తో గొడవ పెట్టుకో వద్దని!"

    "థాంక్స్"

    "ఇక్కడితో ఇది అయిపొయిందనుకోకు. సలీంశంకర్ నా ద్వారా కాకపోయినా మా డి.ఎస్.పి.తో నైనా నీ ఇల్లు వెతికించగలడు".

    "బాగా గుర్తుచేశావు. మీ డి.ఎస్.పి.కి చెప్పు. మొన్న పార్టీకి వచ్చినందుకు థాంక్స్ అని. ఆ వీడియో ఫిల్మ్ బాగా వచ్చింది. రికార్డింగ్ కూడా బాగా జరిగింది. మా క్యాబరే డాన్సర్ అతడి అసభ్య ప్రవర్తన పట్ల కంప్లెయింట్ ఇద్దామనుకుంది. నేనే వద్దని వారించాను. దాని గురించి దిగులేం పెట్టుకోవద్దని చెప్పు".

    "ఇన్ స్పెక్టర్ మొహం మరింత పాలిపోయింది. "ఆ.....ఆ....పార్టీలో నేనుకూడా వున్నాను....." అన్నాడు హీనమైన కంఠంతో.

    "అబ్బే ఆ రూమ్ లో లేవు కదా. ఏదున్నా లేక పొయినా మీ డిపార్ట్ మెంట్ లో పై అధికారి పేరు చెప్పగానే మీ బట్టలు చెమటతో తడిసిపోతాయి. పై అధికారుల గ్రూపు ఒక రూమ్ లోనూ, మీ గ్రూపంతా వేరే రూమ్ లోనూ, హెడ్ కాని స్టేబుల్ లెవల్ నుంచీ క్రిందంతా బయట తోటలోనూ కూర్చున్నట్టు జ్ఞాపకం. అక్కదేగా మీ వాళ్ళిద్దరు వాంతులు చేసుకుని పడిపోయింది".

    "ఇప్పుడా విషయాలన్నీ ఎందుకులే జానీ. ఆ రికార్డయిన క్యాసెట్టు ఇచ్చెయ్యి. మా డి.ఎస్. పి. గారు సంతోషిస్తారు".

    "వద్దులే. ఎప్పుడైనా మా ఇంటికి నీలా అతిథిగా వస్తే చూపించటానికి వీలుగా వుంటుంది. నా దగ్గిరే వుండనీ. రేపు ఆయనో సెర్చివారెంటు పట్టుకొస్తే ఎలాగూ ఇవ్వాలిగా".

    "ఇంక ఆయన రాడు". 

 Previous Page Next Page