"ఈ ప్రశ్న నిన్ను చాలా సేపట్నుంచి వేధిస్తున్నట్టు వుందే" నవ్వుతూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
"కొన్ని విషయాలకి పెద్దగా రీజన్స్ వుండవు ఉత్పలా....! ఒకమ్మాయి వుంది. చాలా పొగరు. దానిని ఒకప్పుడు నేను తగ్గించాలనుకొన్నాను. ఆవిడ వాదనలూ, పంతమూ చాలా సూపర్ ప్లూయిస్ గా కనపడేవి నాకు! కానీ ఎంతో పెద్ద కష్టంలో కూడా ఆ అమ్మాయి అంతే నిబ్బరంగా ప్రవర్తించటం నాకు ఊహించనంత ఆశ్చర్యాన్ని కలగచేసింది. పోగరుకీ ఆత్మ విశ్వాసానికి తేడా చాలా చిన్నది. నువ్వున్నప్పుడు వచ్చిందే, ఆ వుత్తరం ఆమె వ్రాసిందే. ఒక రకంగా ఆ వుత్తరమే దీనికి కారణం. ప్రతి దానికి ఏదో ఒక చోట ఒక 'ప్రారంభం' కావాలి. ఈ ప్రారంభానికి అది నాంది. ఆమె చేసింది".
స్త్రీ సహజమైన ఆసక్తితో "ఎవరా అమ్మాయి" అని ప్రశ్నించింది ఉత్పల.
"ఆమె పేరు అనూష"
ఒక బలమైన గాలికెరటం తనని వూపేసినట్టు ఫీలయి, "ఎవరూ" అని అడిగింది. తను తప్పు విన్నదేమో అని.
"అనూష అని.... స్టాక్ హొం జనరల్ మేనేజర్! తను నీకు తెలుసా?"
తెలుసన్నట్టు తలూపి "మీకు బాగా తెలుసా?" అని అడిగింది.
"ఈ మధ్యే....." క్లుప్తంగా, అంతకన్నా వివరణ ఏమివ్వాలో తెలియనట్టు అన్నాడు. అతడి మొహంలో అనూష పేరు వల్ల వచ్చిన అదోరకమైన ఉద్విగ్నతని ఆమె గమనించలేదు. కొత్త ప్రదేశానికి వచ్చిన అమ్మాయిలో జంకు పోగొట్టాలనే ఉద్దేశ్యంతో అతడు సంభాషణ కొనసాగిస్తున్నాడే తప్ప అతడి మనసంతా అనూష ఆలోచనతో నిండివుంది. ఎక్కడికి వెళ్ళి వుంటుంది ఆమె? ఉత్తరం వ్రాసి ఎటు వెళ్ళి పోయింది?
అతడి మనసులో ఏ మూలో ఆమె తన సమస్యని ఉత్తరం ద్వారా కాకుండా స్వయంగా వచ్చి తనతో చర్చించి వుంటే బావుణ్ణు అన్న భావం వుంది. అతడి మేల్ ఇగోకి తగిలిన దెబ్బకన్నా ఆమె ఏమై వుంటుందన్న ఆందోళన ఎక్కువగా వుంది.
ఉత్పల కదలటంతో అతడు ఆలోచనలోంచి తెప్పరిల్లి, "నేనిలా కూర్చొని తాగటం నీకు అభ్యంతరంగా వుంటే చెప్పు" అన్నాడు.
ఆమె తొందర తొందరగా "లేదు, లేదు" అని మళ్ళీ తనే కొంచెం సేపు ఆగి, "నిజానికి ఒక తాగిన మనిషితో మాట్లాడడం జీవితంలో ఇదే మొదటిసారి నాకు మేం అనుకునే వాళ్ళం- తాగిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనీ, కొందరైతే ఏడుసారనీ......"
"మీరనుకున్నదాన్లో తప్పులేదు. మనసుతో మంచి సంబంధాలు లేని వాళ్ళు, జీవితంలో సంతృప్తిలేని వాళ్ళు, తమ జీవన విధానం పట్ల గిల్టీగా ఫీలయ్యే వాళ్ళు మామూలు టైమ్ లో మామూలుగా వుండి, కాస్త తాగగానే బాలెన్స్ తప్పుతారు. కొంతమంది ఏడుస్తారు. కొంతమంది తమ గురించి తాము గొప్పగా చెప్పుకుంటారు. తాగగానే వాళ్ళ సంభాషణలో "నేను", "నాకు" అన్న పదాలు ఎక్కువ వినబడతాయి. ఇలా మనుష్యులు రకరకాలు. మనసుతో మంచి సంబంధం వున్నవాడు ఎంత తాగినా మామూలుగానే వుంటాడు" అన్నాడు.
అతడి వివరణకీ, వాడిన భాషకీ ఆమె చకితురాలై, "మీరేం చదువుకున్నారు" అని అడిగింది. అతడు నవ్వేడు.
"అది అప్రస్తుతం" అని, తను అన్న మాటల్లో తప్పు అర్థమైనట్టు అతడు నవ్వుతూనే, "చదువుకునీ ఈ గన్ ఫైట్స్ ఏమిటంటావా? ఇదంతా మా బ్రతుకులో ఒక భాగం! ఈ హొటల్ నాదే. క్యాబరే వుంది. అక్కడి వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వెనుక వున్న చిన్న గాంబ్లింగ్ క్లబ్ కి మాత్రం పర్మిషన్ లేదు. కొంత తప్పు చెయ్యటానికి ప్రబుత్వం వప్పుకుంటే మరి కొంత స్వతంత్రం మేం తీసుకున్నాం. క్లబ్, క్యాబరే వుండే సరికి గన్స్ తప్పవు. పోలీసుల్తో లావాదేవీలన్నీ నిష్పత్తుల ప్రకారం జరుగుతాయి. కాబట్టి- అది కూడా తప్పు కాదని మా వుద్దేశ్యం" అని లేచి, "చాలా రాత్రయింది ఇక పడుకో" అని బయటకు వచ్చాడు.
అతడు బయటకు వచ్చేసరికి బిల్లూ మెట్లెక్కి పైకి వస్తున్నాడు.
"జానీ ఏదో వాసన వస్తోంది" అన్నాడు.
"ఏమిటీ"
"ముందు కారులో ఇద్దరు వున్నారు. వెనుకవైపు కూడా ఒక కారులోంచి వాసన వస్తోంది. ఇంకా నిర్థారణ కాలేదు".
"పొద్దున వాళ్ళకేదో అనుమానం వచ్చి వుంటుంది బిల్లూ! నువ్వు ముందు తలుపు దగ్గర నిలబడి వుండు. కస్టమర్లు ఇంకా చాలా మంది వున్నారు. వాళ్ళకి డిస్టర్ బెన్స్ వీలైనంతవరకు కలగకుండా చూడు" అంటూ పైకి వెళ్ళాడు.
ఉత్పల అప్పుడే లైటార్చి నిద్రకుపక్రమిస్తూంది. తలుపు తెరుచుకునేసరికి లోపలకొస్తున్న మనిషిని చూసి ఆమె గుండె కొట్టుకోవడం ఒక్కక్షణం ఆగిపోయింది. ఆ వ్యక్తి దగ్గరకొచ్చేసరికి జానీగా గుర్తించింది. జానీ ఆమె పక్క దగ్గర ఆగకుండా కిటికీ దగ్గరకెళ్ళి తెరల చాటు నుండి బయటకు చూశాడు. బిల్డింగ్ వెనుకవైపు సందులో దూరంగా కారు కనబడుతూ వుంది. అతను తెర మామూలుగా సర్దివేసి గుమ్మంవైపు నడవబోతూ పక్క దగ్గర ఆగాడు.
ఉత్పల ఊపిరి బిగబట్టింది.
అతను బెడ్ లైట్ ఆర్పివేశాడు. గదంతా పూర్తి చీకటి ఆవరించింది. అతడు ఆమె మీదకి వంగి, కాళ్ళ నుంచి బెడ్ షీటు తీసి కప్పుతూ "గదిలోంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు రాక. గుడ్ నైట్" అని అక్కణ్ణుంచి కదిలాడు.
ఉత్పలని ఎవరో ఛేళ్ళున చరిచినట్టయింది. కొద్దిగా వుంటే తన మనసులో భయం బయటపడి వుండేది. జానీ "ఇంకెందుకో" వస్తున్నాడనుకొని కెవ్వున కేక పెట్టి వుండేది! అతడన్నట్టు ఆడదానికి ఈ అనవసరమైన భయాలు పోవు.ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది.
బయట జరుగుతున్నదేమిటో ఆమెకు తెలీదు.
21
జానీ ఇంటి వెనుకవైపు తలుపు దగ్గరగా వేసి, చీకట్లోకి అడుగుపెట్టాడు. వెనుక అంతా చెత్త పేరుకుని వుంది. చిన్నసందు అది. సందు చివర్లో ఇంటికి కాస్త దూరంగా ఒక కారు ఆగి వుంది. పాత మోడలు మారిస్ మైనర్ కారు అది.
తను ఇంటి నుంచి బయటకు రావడం కారులో వాళ్ళు చూసి వుంటారని అతడికి తెలుసు. అందుకని అటువైపు వెళ్ళకుండా సందుకి మరో దిక్కుగా నడిచాడు. మెయిన్ రోడ్ మీదకి వచ్చి కుడివైపు తిరిగి, మరో సందు గుండా ఆగి వున్న కారు వెనుకవైపుకి వచ్చాడు. మూసి వున్న షాపుల అరుగుల మీద నుంచి, స్తంభాలు చాటు చేసుకుంటూ కారు దగ్గరకు నిశ్శబ్దంగా నడిచాడు.
కారులో ఒకే వ్యక్తి వున్నాడు. జానే ఇంటి వైపే చూస్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన జానీని గమనించలేదు.
"హలో" అన్నాడు జానీ తాపీగా.
పక్కలో బాంబు పడినట్టు అదిరిపడి ఆ వ్యక్తి వెనుదిరిగి చూశాడు. జానీ పిస్తోలు అతడి కణతికి అన్చి, "ఓ నువ్వా గుండప్పా! ఏమిటీ, చీకట్లో ఏం చేస్తున్నావ్?" అన్నాడు.
"ఏ.....ఏ.....ఏం లేదు. ఒక స్నేహితుడి కోసం చూస్తున్నాను".
"ఈ సందులో నీకు స్నేహితులెవరబ్బా?"
"వున్నారు."
"ముందు వీధి కారులో కూడా వున్నట్టున్నారు....."
"లేరు".
"కారు దిగు. వెళ్ళి చూద్దాం".
గుండప్ప దిగలేదు. జానీ తలుపు తీసి గుండప్ప భుజం పట్టుకుని బయటకు రమ్మన్నట్టు లాగాడు. గుండప్ప వళ్ళోంచి పిస్తోలు బూటు మీద పడింది. దాన్ని జానీ గమనించలేదని గుర్తించి, కాలితో జార్చి నొక్కిపట్టి వుంచాడు.
"కారు తలుపు తాళం వెయ్యనా?" అడిగాడు గుండప్ప.
"అక్కర్లేదు". అన్నాడు జానీ. "నిజంగానే నీకీ వీధిలో స్నేహితులుంటే సారీ- ఇంత దూరం వచ్చిన వాడివి, ఒకసారి మా హొటల్ కి కూడా వచ్చి వెళ్ళచ్చుగా, వెళ్దామా? అరె ఇదేమిటి పిస్తోలు చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను? సారీ" అంటూ పిస్తోలు జేబులో పెట్టుకున్నాడు.
అతడు తన పిస్తోలు పూర్తిగా జేలులో పెట్టుకున్నాడని నమ్మకం కుదిరాక గుండప్ప మెరుపులా వంగాడు క్రిందికి.
కర్ణాటకకి చెందిన ఆ గుండా చిరుతపులి కన్నా వేగంగా కదలగలడని ప్రసిద్ధి. కానీ కాలిక్రింద దాచిన పిస్టల్ ని తీయటానికి పూర్తిగా వంగకముందే ఏదో అనుమానం కలిగింది గుండప్పకి! కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే దాన్ని గ్రహించగలరు. అంతటి ప్రొఫెషనల్ గుండప్ప కూడా తలెత్తగానే కనపడిన దృశ్యాన్ని చూసి తన కళ్ళనే నమ్మలేనట్టు రెప్పలు ఆడించాడు.
అతడి చెయ్యి నేలమీదున్న పిస్టల్ వరకూ వెళ్ళనేలేదు, జానీ జేబులోంచి పిస్టల్ తీయటం జరిగింది. అతడు తలెత్తేసరికి కనపడిన దృశ్యం అదే! అతడి చెయ్యి అక్కడే ఆగిపోయింది.
జానీ నవ్వేడు.
వంగి, క్రిందనుంచి పిస్టల్ తన జేబులో పెట్టుకుని 'పద గుండప్పా. నీ మిత్రుల దగ్గిరకి వెళ్దాం' అన్నాడు. గుండప్ప ఇంకా ఎంత షాక్ లో వున్నాడంటే, అతడికింకా నమ్మకం కుదరలేదు- మనిషి చెయ్యి అంత వేగంగా కదలగలదని...... అప్రయత్నంగా జానీతోపాటు కదిలాడు.
ఇద్దరూ సందులోంచి ముందు మెయిన్ రోడ్డులోకి వచ్చారు. జానీ అతడి భుజంమీద చెయ్యి వేసాడు. 'చూసావుగా... కేవలం నేనెంత ఫాస్ట్ గా పిస్టల్ తీయగలనో నీకు చూపించటం కోసం అలా చేసాను. మనం మిత్రుల్లాగ ఇప్పుడు వెళ్ళబోతున్నాం. నువ్వు నీ మిత్రులతో మన గురించి చెప్పి నన్ను పరిచయం చేయబోతున్నావు. అలాగే నా చేతి ఫాస్ట్ నెస్ గురించి కూడా! ఇదంతా నా గురించి నేను డబ్బా కొట్టుకోవటం కాదు- కేవలం నా హొటల్ ముందు బాణాసంచా పేలినట్టు పిస్టల్ గుళ్ళు పేలి, కస్టమర్లకు అసౌకర్యం కలగకూడదనే...."
ఇద్దరూ హొటల్ కి కొద్ది దూరంలో వున్న కారు దగ్గిరకి వచ్చారు. కారు అటువైపు తిరిగి వుంది. ముందు సీట్లో కూర్చుని వున్న ఇద్దరూ అటువైపుగావున్న హొటల్ నే చూస్తున్నారు.
"వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిస్టల్స్ తీయొద్దని చెప్పు గుండప్పా. నేనిక్కడ నుంచి చూస్తూనే వుంటాను. ముగ్గురిలో ఎవరి చెయ్యి కదిలినా ఆ కారు వెనుక అద్దం గుండా తలకూడా అద్దంలాగే బ్రద్దలైపోవడం ఖాయం! ణా కస్టమర్లకి అసౌకర్యం కలిగినా సరే....." అంటూ జానీ ఆగిపోయాడు.
గుండప్ప కారు దగ్గిరకి వెళ్ళాడు.
అతడు వంగి ఏదో చెబుతున్నాడు. ఈ లోపుగా జానీ, కారు రెండో వైపుకి వెళ్ళాడు. గుండప్ప చెప్పిన మాటలకి కార్లో వున్న ఇద్దరూ వెనుతిరిగారు. వాళ్ళ చేతులు పాంటు జేబుల మీదకు వెళ్ళినయ్. 'వద్దొద్దు, తియ్యొద్దు' అన్నాడు గుండప్ప.
"గుడ్" ఇటుపక్క నుంచి జానీ స్వరం వినిపించేసరికి చివాలున ఇటు తిరిగారు.
"హలో రామూ" అటూ పలుకరించాడు జానీ. గుండప్ప వైపు తిరిగి, 'వాళ్ళిద్దరి దగ్గిర్నుంచీ పిస్తోళ్ళు తీసుకో" అని ఆజ్ఞాపించాడు. రాము పక్కనే వున్న మరో రౌడీ కదలబోతూంటే గుండప్ప వారించి, అతడి పక్కనున్న పిస్తోలు కూడా తీసి జానీకిచ్చాడు. జానీ వెనుక సీట్లో కూర్చుంటూ, 'రా గుండప్పా! డ్రైవ్ చెయ్యి అన్నాడు.
"ఎక్కడికి?"
"నాక్కావలిస్తే ప్రశ్నలు నేను వస్తాను. సమాధానాలు చెప్పాల్సింది మీరు".
గుండప్ప వచ్చి కూర్చుని, కారు స్టార్ట చేసాడు. ఈ సంభాషణ ప్రశ్న జవాబులు అంతా ప్రొఫెషనల్ గా జరిగింది. అందుకే ఎక్కువ వివరణలు లేవు. కారు కదిలాక జానీ అన్నాడు. "కుడివైపుకి తిప్పి తిన్నగా ఫోనీ".
కారు కొంత దూరం వెళ్ళాక "ఇక్కడ ఆపు" అన్నాడు.
అది సలీంశంకర్ వుండే అడ్డా.