Previous Page Next Page 
ఊగవే ఉయ్యాల పేజి 41


    "సారీ!" అంటూ లేచి నిలబడి గోడనున్న స్విచ్ నొక్కింది. ఇప్పుడు గదంతా వెలుతురు ఆక్రమించుకుంది.

 

    అతని కళ్ళు తడిసి వున్నాయి. ఆమె ముఖంలోకి చూశాడు. కన్నీటి జీర కనిపించీ కనిపించనట్లు దోబూచులాడుతుంది.

 

    "సారీ సిస్టర్! ట్రబుల్ యిచ్చానా?"

 

    "లేదండీ!"

 

    "ఒంటరిగా వుండలేకపోతున్నానండీ. ఒక్కో నిముషం ఒక్కో యుగంలా గడుస్తుంది. అందుకని ఎప్పుడూ నావెంట ఎవరన్నా వుంటే బాగుండుననిపిస్తోంది."

 

    ఆమె ఒక్కక్షణం మెదలకుండా నిలబడి "మీ సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నానని భావించకపోతే ఒక విషయమడగమంటారా?" అన్నది ఎంతో నమ్రతగా.

 

    "అడగండి."

 

    "మీరు మాధవినెందుకంత గుండెల్లో దాచుకున్నారు?"

 

    "ఆమె లేనిలోటు, ఆమె లేని ప్రపంచం నేను భరించలేకుండా వున్నాను."

 

    "మీ కథంతా విన్నాను. మీరిస్తున్న విలువైన స్థానానికి ఆమె అర్హురాలు కాదనిపిస్తోంది."

 

    అతని హృదయం చాలా గాయపడినట్లయింది. "ఎందుకని అలా అంటున్నారు?"

 

    "ఆమె చాలా కఠినాత్మురాలని నా అభిప్రాయం. అంతేకాదు, మొదటినుంచీ మీరామెకోసం ఆరాట పడ్డారుగానీ, ఆమెకు మీమీద కొంచెమైనా ప్రేమలేదు. కనీసం జాలయినా లేదు."

 

    "నేనంటే అసలు ప్రేమ లేదా? మీరెలా చెప్పగలుగుతున్నారు?"

 

    "స్త్రీ హృదయం స్త్రీకి తెలుసుకాబట్టి."

 

    "మరి ప్రమీలాదేవి అలా చెప్పింది....? నేనంటే మాధవికి చాలా...చాలా...."

 

    "ఆమె గొప్ప రచయిత్రి. మరో స్త్రీ గురించి చెడుగా మాట్లాడేందుకు ఆమె సంస్కారం అడ్డువచ్చి వుంటుంది. అంతేగాక ప్రమీలాదేవిగారు సున్నితంగా ఊహించే మనస్తత్వం అయివుంటుంది. నాకంత ఉన్నతమైన సంస్కారంలేదు. యదార్థాన్ని యదార్ధంగా మాత్రమే పరిశీలించే శక్తి నాలోవుంది. మాధవి మీ జీవితంతో ఆడుకుంది. మీ జీవితంతో చెర్లాటాడింది. మీరు సమర్ధులని మీరు అనుకున్నారు కానీ ఆ మూడో పరీక్షలో మీరు గెలిచినా ఆమె మిమ్మల్ని జయించి అవలీలగా మీనుంచి దూరంగా తప్పుకున్నది....."

 

    రాజా కొంతసేపు నిశ్శబ్దంగా ఊరుకుని నెమ్మదిగా అన్నాడు "ఒకవేళ మీరు చెప్పేవన్నీ నిజాలైనాకూడా ఆమె ఇప్పటికీ నా ఆరాధ్య దేవత. ఇప్పటికే కాదు, ఎప్పటికీ."

 

    "అది మీ సంస్కారం"

 

    "అంత పెద్దమాటకు నేను అర్హుణ్ణి కాదు."

 

    మళ్లీ కొంచెంసేపు నిశ్శబ్దంగా గడిచింది "మరి నేను వెళ్ళిరానా?" అనడిగింది మాలతి.

 

    "నన్ను ఒంటరిగా విడిచా?"

 

    ఆమె నవ్వింది "మరేం చెయ్యమంటారు?"

 

    "డాక్టర్ గార్ని పర్మిషన్ అడుగుతాను, మిమ్మల్నిక్కడ ఉంచెయ్యమని...."

 

    "హాస్పిటల్లో మిగతా డ్యూటీస్ ఏమీ చెయ్యకుండానా? నా జీతం ఊరికినే యిస్తారా?"

 

    "మీ జీత్మా? నేనిస్తాన్లెండి."

 

    "ఎదురుగా వుంచుకుని ఏం చేస్తారు?"

 

    "నా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటాను."

 

    "మీ ఒంటరితనం నాతో పోదు. పోవలసినవారితో పోతుంది."

 

    ఇంతలో బయట అడుగుల చప్పుడయింది. డాక్టర్ నరేంద్ర స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలకు వచ్చాడు.

 

    రాజా ఆయనను విష్ చేశాడు.

 

    "డాక్టర్! న్యూరోఫిజిషన్ ఏమన్నారు?"

 

    "టెస్ట్ లన్నీ నార్మల్ గానే వున్నాయి. ఇంకా కొద్దికాలంపాటు శారీరకంగా, మానసికంగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అఫ్ కోర్స్! అండర్ మెడికల్ సూపర్ విజన్. ముఖ్యంగా ఎక్సయిట్ మెంట్ వుండకూడదు."

 

    "ఎక్సయిట్ మెంట్ లేకుండా జీవితం ఎలా వుంటుంది డాక్టర్?"

 

    "పేషెంట్ అన్నాక ఉండాలి మరి...."

 

    "కానీ పేషెంట్ కూడా మనిషేకదా డాక్టర్! పోనీ ఓ సంగతి చెప్పండి, మీరెప్పుడూ ఎక్సయిట్ మెంట్ కు గురికారా?"

 

    అనుకోకుండా వచ్చిన ఈ ప్రశ్నకు డాక్టర్ నరేంద్ర అప్రతిభుడయ్యాడు. క్షణంసేపు మాట్లాడలేకపోయాడు.

 

    "చెప్పండి?"

 

    చివరకు డాక్టర్ నరేంద్ర అన్నాడు "మనిషన్నాక ఏదో ఓ దశలో ఎక్సయిట్ మెంట్ కి గురికాకుండా ఎలా వుంటాడు? అయితే దాని ఒత్తిడి జీవితాలను ఛిన్నాభిన్నం చేయకుండా శక్తిని సంపాదించాలి.

 

    "ఒక్కో పరిస్థితిని బట్టి ఆ శక్తి చెయ్యి దాటిపోతూ వుంటుంది డాక్టర్! మీరు చెప్పినట్లే నన్ను నేను నిలద్రొక్కుకునేందుకు ప్రయత్నిస్తాను. కానీ నాకు సంపూర్ణారోగ్యం త్వరగారావాలి. నాకు పనివుంది. చాలా పనివుంది. అవసరమొస్తే నాకు కావలసిన మనిషి దొరికేందుకు ప్రపంచమంతా తిరిగే శక్తి నాకు కలగాలి."

 

    "అదిగో మళ్లీ ఎక్సయిట్ మెంట్ కు గురవుతున్నారు."

 

    "సారీ డాక్టర్! అవను"

 

    అతనివంక సానుభూతిగా చూస్తూ డాక్టర్ నరేంద్ర "తప్పకుండా మీకా శక్తి వస్తుంది. కొద్ది నెలలు ఓపిక పట్టండి" అన్నాడు.


                                                              * * *


    రాత్రి పన్నెండుగంటలు దాటింది. ప్రమీలాదేవి చాలా అస్థిమితంగా, తపనగా ఇంట్లో అటూఇటూ తిరుగుతోంది.

 

    ఆమెకు రెండుమూడేళ్ళు ఆస్తమా బాగా వస్తోంది. ఒక రోజని లేదు. ఒక వాతావరణమని లేదు. ఎప్పుడూ వేధిస్తూనే వుంది. ప్రతిరోజూ మందులు తీసుకోవాల్సిందే. లేకపోతే రాత్రంతా ఆస్థమా మనిషిని కూర్చోబెట్టేస్తుంది. ఆమె తరచుగా సాల్ బుటమాల్, ఎఫిడ్రిన్ తీసుకుంటుంది. సాల్ బుటమాల్ వల్ల చేతివ్రేళ్ళు వణుకుతూ వుంటాయి. ఎఫిడ్రిన్ వల్ల గుండెదడ చాలా ఎక్కువగా వుంటుంది. అప్పుడప్పుడూ ఆస్థమా శృతి మించితే కొద్దిగా జోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటివల్లా విపరీతమైన నీరసం, నిద్రాను.

 Previous Page Next Page