"మాధవి, మీరూ హోరాహోరీగా పోట్లాడుకోవటం, బయటకు ఎంత తిట్టుకున్నా ఆమెమీద మీకు ఎనలేని మమకారం వున్న సంగతి నాకు తెలుసు. ఆమెకూ మీమీద గొప్ప ప్రేమ వున్న విషయమూ తెలుసు. ఎలా విడిపోయారు? ఎందుకు విడిపోయారు? విడిపోకముందు ఏం జరిగింది? విడిపోయాక ఏం జరిగింది......?"
"ఒక్క నిముషమాగండి. మాధవికి నామీద గొప్ప ప్రేమ వున్న విషయం మీకెలా తెలుసు?"
"తెలుసు"
"ఎలా తెలుసు చెప్పండి?"
"స్త్రీ హృదయం స్త్రీకి తెలుస్తుంది."
"అయితే నేను అదృష్టవంతుడ్నే" అన్నాడు చిన్నగా తనలో తను గొణుక్కుంటున్నట్లు.
ప్రమీలాదేవి తనకూడా చిన్న టేప్ రికార్డర్ తెచ్చుకుంది. దాన్ని ఆన్ చేస్తూ "బాగా డిటెయిల్డ్ గా చెప్పండి. ఇలా జీవితచరిత్రలు సేకరించటం నాకు సరదా. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తే-మధ్యలో నేనేమన్నా మరిచిపోయి సందేహాలొస్తే మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకుండా వుండేందుకు" అని ప్రక్కనే వున్న కబోర్డ్ మీద వుంచింది.
రాజా చెప్పసాగాడు. మధ్య మధ్య ప్రమీలాదేవి ఏవేవో ప్రశ్నలు వేస్తోంది. మాధవితో పరిచయం, ఇద్దరిమధ్యా తీవ్ర విభేదాలు, ఆమె పెట్టిన పందేలు. తనకు జరిగిన ప్రమాదం, సంఘర్షణ, అయినా ఆమెచుట్టూ పరిభ్రమిస్తూ వుండటం, ఆఖరి పరీక్ష తాను ఓడిపోవటం, మళ్లీ యాక్సిడెంట్, కోమా....
టేప్ రికార్డర్ ఆఫ్ చేసింది.
ఆమె మనసులో రకరకాల ఆలోచనలు తలెత్తుతున్నాయి. ఇక్కడికి వచ్చేముందే ఓ ప్రముఖ వారపత్రిక సంపాదకుడు ఆమెకు ఫోన్ చేశాడు. అర్జంటుగా ఓ సీరియల్ కావాలన్నాడు. తనకి ఒంట్లో బాగోలేదు. ఆస్థమా చాలా తీవ్రంగా వస్తోంది. రోజూ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఎమినోఫిలిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఆయాసంతో రాత్రంతా కూర్చునేటట్లు చేస్తోంది. ఆ విషయమే చెప్పి తన అశక్తత వెల్లడి చేసింది. అయినా అతను ఒత్తిడి చేశాడు. విధి లేక, కాదనలేక ఒప్పుకుంది. ఏ వారానికా వారం మేటర్ ఇస్తానంది. కానీ మనసులో సిద్ధంగా ఇతివృత్తమే లేదు. ఏం రాయాలి? ఏం రాయాలి? ఎక్కువ టైములేదు ఆలోచించడానికి. మొహమాటానికి పోయి, మంచితనానికి పోయి ఆమె ఎప్పుడూ యిటువంటి ప్రమాదాల్నే తెచ్చుకుంటూ వుంటుంది. రాజా చెప్పింది విన్నాక, ముఖ్యంగా అతను కోమా గురించి చెప్పాక దానిచుట్టూ మంచి ఇతివృత్తం అల్లవచ్చుననిపించింది.
"మీరు నాకో పర్మిషనిస్తారా?" అనడిగింది.
"దేనికి?"
"మీ కథ ఓ నవలగా రాయడానికి."
"నా కథ రాస్తారా?"
"రాయాలని వుంది."
ఒక నిముషం తరువాత అన్నాడు "మీరు చాలాబాగా రాస్తున్నారు. మునుపటికన్నా చాలా మెచ్యూరిటీ వచ్చింది. తప్పకుండా రాయండి."
"కానీ ఇందులో ఓ ప్రమాదముంది. మీరు కథ కొంతవరకే చెప్పారు. చాలా విషయాల్ని పూరించాల్సి వుంటుంది."
"మీరు చాలా గొప్ప రచయిత్రి. అవలీలగా పూరించగలరు."
"కానీ ఇది జీవితంలోంచి వచ్చిన కథ. ఎలాపడితే అలా ఊహించడానికి వీల్లేదు. కత్తిమీద సాములాంటిది."
"అయినా మీరు తట్టుకోగలరు."
"కానీ ఇందులో ఇంకో ముఖ్యమైన, అతి ముఖ్యమైన వ్యక్తి ప్రమేయంకూడా వుంది. ఆ వ్యక్తి మాధవి. నిజానికి ఆమె అనుమతి కూడా పొందాల్సి వుంది. కానీ ఆమె ఎక్కడుందో తెలీదు కనుక చాలా సాహసమే చేస్తున్నట్లు లెక్క."
"కానీ మాధవికి కోపంరాదు. ఒకవేళ ఆమె ఈ నవల చదవటం తటస్థిస్తే బాధపడుతుంది తప్ప కోపం తెచ్చుకోదు."
కొంచెంసేపు వుండి ప్రమీలాదేవి వెళ్ళిపోవడానికి లేచింది.
"ఒక చిన్న రిక్వెస్ట్."
"ఏమిటో చెప్పండి?"
"నే చెప్పినదంతా క్యాసెట్ మీద రికార్డ్ చేశారు కదా. వేరే టేప్ రికార్డర్ మీద యింకో కాపీతీసి పంపించగలరా?"
"శ్రమేముంది? తప్పకుండా పంపిస్తాను."
ప్రమీలాదేవి వెళ్ళిపోయింది.
ఆ సాయంత్రమే రాజా చెప్పిన కథంతా రికార్డ్ చేసిన కేసెట్ ని అతని గదికి పంపించింది. ఎవరో కుర్రాడు తీసుకొచ్చి యిచ్చాడు.
ఆ సమయానికి మాలతి అతని గదిలో వుంది. అంతకుముందే న్యూరో సర్జి ఫిజీషియన్ వచ్చి అతన్ని పరీక్షచేసి సంతృప్తి ప్రకటించి వెళ్ళాడు.
మాలతి అతనికి ఇంజక్షన్ చేసి బయటకు వెళ్ళబోతోంది.
"సిస్టర్!" అని పిలిచాడు.
"చెప్పండి సర్!"
"ఈ కేసెట్ ని టేప్ రికార్డర్ లో అమర్చి కొంచెం ప్లే చేస్తారా?"
కప్ బోర్డ్ లో అతనికోసం సీతారామారావుగారు తెచ్చిన టూ ఇన్ వన్ వుంది. మాలతి కేసెట్ అందులో అమర్చి ఆన్ చేసింది.
టూ ఇన్ వన్ లోంచి రాజా గొంతు వినిపించసాగింది.
ఆమె వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలయింది. ఆమెను ఆగి కూర్చోమన్నట్లు సౌంజ్ఞ చేశాడు. ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు. ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి అతని మాట కాదనలేక వచ్చి కుర్చీలో కూర్చుంది.
టేప్ రికార్డర్ లోంచి రాజా చెబుతున్నాడు. అతని అనుభవాలు, అంతరంగ క్షోభ, తన గుండెల్ని పిండేస్తున్న మాధవి జ్ఞాపకాలు....
చీకటి పడింది. అతని స్వరం అలా వినవస్తూనే వుంది. మధ్య మధ్యలో అతను ఆలోచించుకుంటున్నప్పుడు వినబడని నిట్టూర్పులాంటి నిశ్శబ్దం.
అయిపొయింది. క్యాసెట్ లో అతని గొంతు ఆగిపోయింది. ఇప్పుడు గదంతా సుదీర్ఘమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడటంలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు.
"సిస్టర్!" అన్న పిలుపు విని ఉలికిపడింది.
"చెప్పండి సర్!"
"లైటు వెయ్యలేదేం?"