వ్రాయదలుచుకున్న నవల పేరు "పాడవే కోయిలా!" అని పెట్టింది. ఆమెకెప్పుడూ అగ్నిపరీక్షే. సీరియల్ రాస్తున్నన్ని రోజులూ కత్తిమీద సాములా వుంటుంది. నిద్రపోతున్నా, మెలకువగా వున్నా, హాస్పిటల్లో పనిచేస్తున్నా అంతర్లీనంగా అదే ధ్యానంచేస్తూ వుంటుంది. చేతికేది వస్తే అది రాయదు. తన రచన కొన్నివేలమంది పాఠకులు చదువుతూ వుంటారనీ, వారి మనసు ఆ రచనలోని మెరుపులకు స్పందిస్తూ వుంటుందనీ ఆమెకు తెలుసు. అందుకే తొందరపడదు. జాగ్రత్తగా ఆలోచించి రాస్తుంది. ఒక నవల రాసేముందు వాటి పాత్రలూ, వాటిచుట్టూ తిరిగే ఇతివృత్తం ఎప్పట్నుంచో మనసులో మెదుల్తూ వుండాలి. కాలక్రమేణా అవి మనసులో ఊరి ఓ స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి. రాయటం మొదలుపెట్టాక ఆమె ఆలోచన్లని మించి పాత్రలు కంట్రోల్ తప్పి ముందుకు పరిగెడుతూ వుంటాయి. వాటిని తరుముకుంటూ, ఆమె కలం అనుసరించాల్సి వస్తుంది.
ఈరోజు రాయాల్సింది మనసులో ఇంతవరకూ లేని కథ. అప్పటికప్పుడు విన్న కథ. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఎన్నోసార్లు రాజా సంభాషణను ఆలకించింది. అయినా కథ లొంగటంలేదు. మొదలు పెట్టేటప్పుడు కథ ముగింపు లీలగానైనా మనసులో మెదులుతూ వుండాలి. లేకపోతే ప్రారంభం చాలా అస్పష్టంగా పేలవంగా వుంటుంది.
కథలోకి ఎంట్రెన్స్ దొరకడంలేదు. ఎలా మొదలుపెట్టాలి? ఎక్కడ్నుంచి ప్రారంభించాలి? ఫ్లాష్ బ్యాక్ తో మొదలుపెడితే? చాలావరకు ఎస్కేప్ కావచ్చు కానీ కథనంలో క్లారిటీ వుండదు. కన్ ఫ్యూజన్ ఎక్కువగా వుంటుంది.
మెదడు మొద్దుబారినట్లు అయిపోతోంది. అసలు పనిచేయటంలేదు. ఒక సంచికకు రాయడం ఇవేళ మొదలెడితే, మరునాటికిగానీ పూర్తికాదు. విధి లేక అల్మైరాలోంచి యాంఫిల్ మిన్ టాబ్లెట్ ఒకటితీసి వేసుకుంది. అది వేసుకున్న కొంతసేపటికి మెదడు చురుగ్గా పనిచెయ్యడం మొదలుపెడుతుంది. కొత్త కొత్తగా భావాలు పుడుతుంటాయి. అనుకోకుండా చెయ్యి ముందుకు పరిగెడుతూ వుంటుంది. కానీ ఆమెకుతెలుసు మరునాడు ఆరోగ్యం భయంకరంగా మారుతుంది. చేతులు వణుకుతాయి. తలలో, గుండెలో నొప్పి. జ్వరం వచ్చినట్లు చేదు, నీరసం, విపరీతమైన విసుగు, కోపం. అయినా తప్పదు.
ఈ అవస్థ ఆమెను అభిమానించే అశేష పాఠకులకేం తెలుస్తుంది?
కొంతసేపటికి ఆమె మూడ్ లోకి వచ్చేసింది. బ్రెయిన్ స్టిమ్యులేట్ అయిపోయింది. ఆమెకు సంగీతమంటే ఇష్టం. టేప్ రికార్డర్ లోంచి రాజా సంభాషణ వున్న కాసెట్ తీసివేసింది. కష్టపడి ఇటీవల సేకరించిన గులాం అలీ పాటలున్న క్యాసెట్ ను అమర్చింది. పాకిస్తాన్ లో జనాన్ని ఉర్రూతలూగిస్తున్న ప్రస్తుత గాయకుడతను. ఆమె దృష్టిలో గజల్స్ ను అంత మధురంగా, శ్రావ్యంగా పాడగల గాయకుడు ప్రపంచంలో లేడు. అతని గొంతులో భావాలు పొంగుతాయి. విషాదాలు ప్రవహిస్తాయి. తియ్యని బాధలు ఎగజిమ్ముతాయి. మధుర శ్రుతులు ఏదో స్మృతుల్ని సుతారంగా రేపుతాయి.
ఆ గొప్పదనం నేపథ్యంలో ప్రభావితం చేస్తోండగా ప్రమీలాదేవి కలం పరవళ్ళు త్రొక్కుతుంది.
* * *
మాలతి డబుల్ కాట్ మీద వంటరిగా పడుకుంది. రాత్రి పన్నెండు దాటినా ఆమెకు నిద్రపట్టడంలేదు గదిలో బెడ్ లైట్ నీలంగా వెలుగుతోంది.
డాక్టర్ నరేంద్ర తన స్టడీరూంలో ఈజీచైర్ లో చేతిలో "ప్రాక్టిషనర్" పట్టుకుని కూర్చున్నాడు. కానీ అతని మనసా మెడికల్ జర్నల్ పై లగ్నమైలేదు.
"డాక్టర్! నిజంచెప్పండి, మీరెప్పుడూ ఎక్సయిట్ మెంట్ కి గురికాలేదా?"
"ఎక్సయిట్ మెంట్!"
ఎదురుగా టేబుల్ మీద ఓ ఫోటోవుంది. ఆ ఫోటోలోని స్త్రీ చాలా అందంగా, అపూర్వంగా వుండటమే గాకుండా అచ్చం మాలతిలాగే వుంది. అమాయకంగా నవ్వే కళ్ళు అతన్నే గమనిస్తున్నాయి.
"మధూ! ఎక్కడున్నావ్?"
ఆ ఫోటోలోని స్త్రీ మూర్తిలో అతనికనేక భావాలు కనిపిస్తాయి. ఆమెతో మాట్లాడకుండా అతనేరోజూ నిద్రపోడు.
"మధూ! ఇవాళేం జరిగిందో తెలుసా? మన హాస్పిటల్లో రాజా అనే పేషెంట్ వున్నాడు. అతని జీవితంలో విషాదగాథేదో వున్నట్లుంది. "మీ జీవితంలో ఎక్సయిట్ మెంట్ లేదా" అని అడిగాడు."
"మీరేమన్నారు?" అని ప్రశ్నించినట్లుందా మూర్తి.
"ఎక్సయిట్ మెంట్ ను ఒక ఊపుగా తీసుకుని జీవితంలోకి దిగే శక్తిని సంపాదించాలన్నాను..."
"నా జవాబు నీకు నచ్చలేదా?"
ఫోటోలోని ముఖంలో గాంభీర్యం కనిపించింది.
"మధూ! అంత గంభీరంగా వుండకు. భరించలేను."
"ఎవరన్నారతను?"
"రాజా!"
"రాజానా?"
"అవును. రాజా!"
ఆమె ముఖం అంతలో బాధగా మారినట్లయింది.
"మధూ! ఏమిటలా అయిపోయావు?"
"ఏమీలేదు."
"మధూ! నువ్వు సంతోషంగా వుండాలి. నా ప్రవర్తనలో లోటుపాట్లుంటే సరిదిద్దాలి. మధూ! నువ్వలా వుంటే నేను నిద్రపోలేను. నువ్వు నవ్వాలి. సంతోషంగా ఉండాలి."
ఈజీచైర్ లోంచి లేచి నిలబడ్డాడు. ఆమెవంక ఆతృతగా చూస్తున్నాడు.
"మధూ! ప్లీజ్!"
ఆమె ముఖంలో ప్రసన్నత కనిపించింది.
అతనికి ఊరట కలిగింది. తేలిగ్గా ఓ నిట్టూర్పు - "గుడ్ నైట్ మధూ!"
గది బయట అడుగులు చప్పుడవటం విని మాలతి చప్పున కళ్ళు మూసుకుంది.
నరేంద్ర లోపలకువచ్చాడు. ఒక్క క్షణం తలుపుదగ్గరే నిలబడి ఆ నీల కాంతిలో మాలతివంక తదేకంగా చూశాడు. తర్వాత నెమ్మదిగా అడుగులు వేస్తూ మంచం దగ్గరకు వచ్చాడు.
అందంగా, అద్భుతంగా వుంది మాలతి. మూతలుపడ్డ ఆమె కనుదోయి.... అతన్ని ప్రశ్నలువేసే అధికారాన్ని కోల్పోయి వున్నాయి.
ముందుకు వంగాడు. అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది.
పెదవులు...