Previous Page Next Page 
మరణ మృదంగం పేజి 40


                          20

    "మళ్ళీ వచ్చారేమిటీ?" జానీ అడిగాడు వాళ్ళని.

    "సారీ జానీ. పుస్తకం మార్చిపోయాం" అన్నాడు గుండప్ప.

    "ఏం పుస్తకం?"  బిల్హణ్ వాళ్ళ వైపు అనుమానంగా  చూస్తూ అడిగాడు.

    "పాకెట్ డైరీ! వచ్చేటప్పుడు తనతోపాటు తీసుకొచ్చాడట. బహుశ ఇక్కడ మార్చి పోయాడేమో కాస్త చూస్తారా?" రామూ అన్నాడు.

    "వచ్చినప్పుడు చేతిలో ఏ పుస్తకమూ లేదే."

    "చిన్న డయిరీ, నల్లది" అన్నాడు గుండప్ప. ".......ప్రోద్దున్నించీ ఎక్కడికీ వెళ్ళలేదు. ఇక్కడికే వచ్చాను జానీ. చాలా ముఖ్యమైన డయిరీ అది".

    "మీరీ గదిలోనే వున్నారు. ఇక్కడ లేదుగా" ఇక మీరు వెళ్ళవచ్చు- అన్నట్టు చూశాడు భిల్లూ.

    గుండప్ప లేచి ఆ గది బల్ల క్రింద, అద్దం దగ్గిర చూస్తున్నట్టు పరిశీలించసాగాడు. ఈ లోపులో రామూ తన జేబులోంచి నల్ల డైరీని చేతి రుమాల సాయంతో జాగ్రత్తగా తీసి, ఎవరూ చూడకుండా జానీ వెనుగ్గా పడేసి, ఒక నిముషం అయ్యాక, అప్పుడే దాన్ని చూసినట్టు "అదిగో, జానీ- అదేమిటో చూడు" అన్నాడు.

    జానీ వంగి దాన్ని తీసి, "ఇదే అనుకుంటాను" అంటూ అందించాడు. రుమాలుతోనేదాన్ని తీసుకుంటూ, "థాంక్స్ జానీ! పాపం ఇది కనపడనప్పటి నుంచీ మనవాడికి కంగారు ఎక్కువైంది" అని గుండప్పవైపు తిరిగి "-ఇంకేం, పని జరిగిపోయింది. పోదామా" అన్నాడు.

    "పోదాం"

    "థాంక్స్ చెప్పవా?"

    "థాంక్స్ జానీ" అన్నాడు గుండప్ప. ఇద్దరూ వెళ్ళిపోయారు.

    బిల్లూ వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ "ఏదో గూడుపుఠాణీ, జరుగుతూంది జానీ! నా మనసేదో కీడు శంకిస్తోంది" అన్నాడు.

    "నీ మొహం తేలిగ్గా అన్నాడు జానీ.

    "కాదు జానీ..... నిజంగా గుండప్ప డైరీ ఇక్కడే పారేసుకున్నాడంటావా? నాకు ఇంతకు ముందు కనపడలేదే".

    "లేకపోతే మళ్ళీ ఎందుకొస్తారు? ఉత్పల గురించి అసలు అడగలేదుగా వాళ్ళు".

    "చూద్దాం ఏమవుతుందో" అంటూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    జానీ కూడా ఒక క్షణం ఆగి, ఆ డైరీ అంతకు ముందు పడివున్న చోటుని చూశాడు. చాలాసేపట్నుంచి అది అక్కడ వున్నట్లయితే తమ దృష్టిలో అది ఎందుకు పడలేదు? తల అడ్డంగా విదిలిస్తూ అతడూ అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు.

    సరీగ్గా పది నిముషాల తరువాత సలీంశంకర్ కి ఫోటోలు అందిస్తూ "జీపులో వున్న వేలిముద్రలూ, ఈ డైరీ మీద వున్న ముద్రలూ ఒకరివే" అన్నాడు నిపుణుడు.

    సలీంశంకర్ మొహంలో ఎప్పుడూ లేనంత క్రౌర్యం కనపడింది.

    "ఆ శాస్త్రి ఇంటి ముందు ఇంకెవడూ కాపలా కాయనవసరం లేదు. ఉత్పల ఎక్కడుందో తెలిసింది. జానీగాడి ఇంటికి ఈ రాత్రి మనం వెళ్ళబోతున్నాం! ఆ  అమ్మాయిని లాక్కువచ్చే పనిలో- పనిలో పనిగా అడ్డొచ్చిన ఆ ఇద్దర్నీ అక్కడికక్కడే చంపబోతున్నాం" అని గుండప్ప వైపు తిరిగి, "నడి రోడ్డు మీద జీపు తిరగ్గట్టడం అనుకున్నాడేమో..... గుండూ, ఈ రాత్రికి వాడింటిని కూడా ఇలాగే తల క్రిందికి, కాళ్ళు పైకి చెయ్యాలి గుర్తుంచుకో. రెండు స్టెన్లు కూడా తీసి కార్లో పెట్టు" అని సూచన్లు ఇచ్చాడు.

    "నా కప్పుడే ఆ ఇద్దరి ఆకారాలూ చూసి అనుమానం వచ్చింది శంకర్. ఆ భల్లూ-కంగాడికి బుద్ధి చెప్పాలని ఎప్పట్నుంచో వుంది. నాకు అంతకు అంతా జవాబు చెప్పాలి" అన్నాడు రాము.,

    గుండప్ప కర్ణాటక ప్రాంతానికి సంబంధించినవాడు. అతనికి జానీ- భిల్లూలతో అంతగా పరిచయం లేదు. ఇప్పుడిప్పుడే ఈ లొకాలిటీ 'ప్రముఖుల' తో కాంటాక్ట్స్ పెంచుకుంటున్నాడు. ".......రాత్రి వరకూ ఎందుకు? ఇప్పుడే వెళితే సరిపోతుందిగా" అన్నాడు.

    "ఉహూ వద్దు. రాత్రి అయితే వాళ్ళు కాస్త అజాగ్రత్తగా వుంటారు. అదీగాక పిట్ట సులభంగా అప్పుడే దొరుకుతుంది. మనం చేయబోయే గొడవ బయటకు వినపడినా అంత ప్రమాదం వుండదు"

    ఆ రాత్రి వరకూ వాళ్ళు, ముఖ్యంగా రామూ, గుండప్పలు అసహనంగా గడిపారు. ఆ ఇద్దరికీ అయితే ఎప్పుడెప్పుడెళ్ళి తమకు జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకుందామా అని తొందరగా వుంది.

    రాత్రి పదయింది. ఆ కొన్ని గంటల కాలమూ వాళ్ళకి కొన్ని యుగాలుగా తోచింది.

    రాత్రి పదయింది.

    ఉత్పల ఒక్కతే ఆ గదిలో వుంది. ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. గడిచింది ఒకరోజు! నిన్న ఈ పాటికి తనకే సమస్యలూ లేవు. ఆస్పత్రిలో ఆపరేషను, పిస్తోలు గుళ్ళ చప్పుడు-రిక్షాలో ప్రయాణం- అర్థరాత్రి మెలకువ రావడం- అక్కణ్ణుంచి పరుగు- పోలీస్ స్టేషన్ బస్ లో అపాయం కొద్దిలో తప్పిపోవడం- చివరికి ఇక్కడికి చేరుకోవటం- ఒక్క రోజులో ఒక జీవిత కాలపుటనుభవం....

    ఇలాటి రోజులు ఇంకా ఎన్ని....?

    ఆమె ప్రశ్నకి సమాధానంగా అన్నట్టు తలుపు తెరుచుకుంది. జానీ లోపలికి ప్రవేశించాడు. అతడి మొహంలో అలసట కనపడుతున్నా, ఆమెని చూసి నవ్వి "ఒంటరితనం బోర్ కొట్టిందా?" అని అడుగుతూ అల్మైరా దగ్గరికి వెళ్ళి గ్లాసులో ఒక పెగ్ విస్కీ పోసుకున్నాడు. దాంట్లో నీళ్ళు కలుపుకుని వచ్చి కూర్చుంటూ "నేన్నీకో విషయం చెప్పనా? రాగానే మామూలు మాటలూ అవీ లేకుండా ఏమిటి ఇలా మొదలు పెట్టాడు అనుకోకు. నేను ఒక గుటక వేసాక ఇది చెప్పానంటే, వీడేదో తాగి మాట్లాడుతున్నాడని నువ్వు అనుకోవచ్చు. అందుకని తాగక ముందే చెప్పుతున్నాను. నువ్వు మాతో పాటు కొంతకాలం వుండక తప్పదు. ఈ గదుల్ని నేను, భిల్లూ షేర్ చేసుకుంటూ వుంటాం. అంతా అస్తవ్యస్తంగా వుంటాయి. నువ్వా మంచంమీద పడుకోవచ్చు. నేను పక్క గదిలో వుంటాను. అటు పక్క బిల్లు గది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే 'నేనొక స్త్రీని' అన్న ప్రత్యేకమైన బాధతో అనుక్షణం ప్రవర్తించకు. నాకు గానీ బిల్లూగ్గానీ అదొక్కటే నచ్చదు. కేవలం సెక్సు కోసమే స్త్రీ పురుషులు వేరు వేరుగా సృష్టించబడ్డారు తప్ప మిగతా అన్ని విషయాలు ఒకటే! ఈ సంగతి చాలామంది ఆడవాళ్ళు గుర్తించరు. అనవసరంగా సిగ్గుపడడం, భయపడడం తమ సహజ లక్షణాలు అనుకుంటారు. కొంతమంది మొగవాళ్ళకి అది నచ్చుతుందేమో గానీ నాకు నచ్చదు. అందుకే ఈ చెప్పడం. కష్టాలనేవి ప్రతివాళ్ళకి వుంటాయి. వాటి బాధని ప్రదర్శించడం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదు. మీ ఇంట్లో ఎలా పడుకుంటావో అలా హాయిగా నిద్రపో. మా భిల్లూ కూడా పైకి అలా మాట్లాడతాడు గానీ, చాలామంది మగవాళ్ళ కన్నా మంచివాడు! అఫ్ కోర్స్- నువ్వు కావాలీ అంటే ఎగిరి గంతేస్తాడనుకో. కానీ చాలామంది మగవాళ్ళలాగా "మంచి"గా నటించో, సానుభూతి సంపాదించడానికి బలహీనుడుగా నాటకమాడో, ఏదో మిష మీద స్పృశించటానికి ప్రయత్నించో వెకిలి వేషాలు వేయడు. మామూలుగా మాలో ఒక మనిషిగా వుండు. అదే నేను చెప్పాలనుకున్నది. ఇక మొదలు పెడతాను" అంటూ గ్లాసు ఎత్తి "ఛీర్స్" అని తాగటం మొదలు పెట్టాడు.

    ఆమె కసలు ఒక అయిదు నిమిషాల పాటు అతడు చెప్పింది అర్థం కాలేదు. బిత్తరపోయింది కానీ ఆలోచించింది. ఆలోచించే కొద్దీ ఒక్కొక్కపొరా విదిపోతున్నట్టు అనిపించి అతడు చెప్పింది అర్థమైంది.

    ఆమెకి ఈ ప్రపంచం అంతా చిత్రంగా అనిపించింది. ఎందుకో తెలీదు కాని రామబ్రహ్మం గుర్తొచ్చాడు. తమ ఇన్నేళ్ళ పరిచయంలో తాము ఎప్పుడూ ఇంత (పచ్చి?) ఫ్రాంక్ గా మాట్లాడుకోలేదు. అనూష చెప్పినట్టు ఎప్పుడూ అవతలి వారిని ఇంప్రెస్  చేయటానికో-ఏదో జోకు వేయటానికో ప్రయత్నం జరిగేది. అందులో అదో రకమైన వాంఛ అంతర్లీనంగా తొంగి చూసేది. అతడి పెన్ ని నోట్లో పెట్టుకుంటే "ఇంతకు ముందే నేను పెట్టుకున్నాను, ఎంగిలి" అనేవాడు. చప్పున తీసేసేది. నవ్వేవాడు. ఆ రాత్రంతా ఆ విషయం గుర్తొచ్చేది. ఒక గమ్యం కానీ, ఒక సమస్యని ఎదుర్కొనే అవస్థ కానీ  లేని స్థితి అది. అప్పుడది గమ్మత్తుగా వుండేది గానీ ఇప్పుడాలోచిస్తూ వుంటే ఎందుకో గిల్టీగా వుంది. ఇదేనా ఎదగడం అంటే? లేక ప్రేమ రాహిత్యమా??......సరీగ్గా అర్థం కావటం లేదు.

    "ఏమిటాలోచిస్తున్నావ్?"

    "ఏమీ లేదు".

    "నీ గురించి కొంచెం చెప్పు".

    "చెప్పటానికేమీ లేదు. చాలా సామాన్యమైన అమ్మాయిని"

    జానీ నవ్వేడు. ఈ ప్రపంచంలో నిజంగా చాలా సామాన్యమైన అమ్మాయిలు కూడా అలా అనుకోవటం లేదు. నువ్వు అలా అనుకుంటున్నావంటే నీకు జీవితం పట్ల 'అక్సెప్టబులిటీ' వుందన్నమాట. పోనీ నీ ఇంటి గురించి, ఇంటి వాళ్ళ గురించి చెప్పు."

    ఆమె చెప్పింది. తండ్రి గురించి, తల్లి, అక్క చెల్లెళ్ళు, తమ్ముడు- అందరి గురించి చెప్పింది. అతడు వింటున్నాడో, లేక మాటల్లో పెట్టి తన బెరుకు పొగొట్టడానికి తన చేత మాట్లాడిస్తున్నాడో అర్థం కాలేదు. అతడు మాత్రం అంతా విని, సో..... ఈ పాటికి తండ్రి పక్కలో కూర్చొని ఏ భాగవతమో చదివి వినిపిస్తూ వుండవలసిన దానివి,.....ఒక మందు కొట్టే వాడి పక్కన వున్నావన్న మాట చూసావా ఎంత కాంట్రాస్టో...." అని నవ్వేడు.

    ఆమె అతడి నవ్వులో ఒక ప్రత్యేకతని గమనించింది. అది కేవలం అవతలి వాళ్ళ కోసం- 'మీ కోసం నేను నవ్వుతున్నాను సుమా' అనేట్టూ వుంటుంది. కళ్ళు మాత్రం సీరియస్ గా, ఇక్కడ లేనట్టూ వుంటాయి. అతడెపుడూ రెండుగా విడిపోయి, ఒకటి వారి సమక్షంలోనూ, మరొకటి తమ స్వంత విషయాల్లో మునిగి తేలుతున్నట్టు రెండు మనసులు గలవాడిగా కనపడతాడు. అర్థం కాకపోతే అతడికి మన ఉనికి ఏమీ పట్టనట్టు కనపడుతుంది.

    "నేనొకటి అడగొచ్చా" అంది.

    "అడుగు".

    "దీన్లోంచి నేనెలా బయటపడతాను? అంటే..... ఎంతకాలం ఇలా వుండాలి?"

    "తెలీదు. చూద్దాం- వాళ్ళ పైఎత్తేమిటో?"

    "కనీసం మా ఇంట్లో వాళ్ళకి తెలియకపొతే కంగారు పడతారు".

    "ఉత్తరం వ్రాయి. ఏ ఛండీగర్ నుంచో పోస్ట్ చేయిద్దాం".

    "ఏం చెయ్యను ప్రతి రోజూ ఇక్కడ?"

    "అదొక్కటే కష్టం. ఇరవై నాలుగ్గంటలూ గదిలోనే వుండాలంటే నిజంగా కష్టమే! బిల్లూతో చెపుతాను- అప్పుడప్పుడు బురఖా వేసుకుని అతడితో కలసి  బయటకు వెళ్దుగాని."

    ఆమె మౌనంగా వుండిపోయింది.

    "సారీ జోకుగా అన్నాను. నువ్వు ఏ దూరప్రాంతంలోనో వుంటే కాస్త బయట తిరిగే అవకాశం వుండేదేమో. కానీ అది రిస్కు! చెప్పానుగా వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళని".

    "మరి ఎలా? దీనికి పరిష్కారం ఏమిటి?"

    "ఇండియా మీద ఆటంబాంబు పడొచ్చు. వసంత్ దాదాకి ఎయిడ్స్ వ్యాధి రావొచ్చు. సలీంశంకర్ మనుష్యులు ఈ ఇంట్లో ప్రవేశించి మనందర్నీ కాల్చి చంపొచ్చు. ఎన్ని పరిష్కారాలున్నాయో చూసావా!"

    అతడు అంత తేలిగ్గా తీసుకుంటూంటే ఆమెకి మరేం  అడగాలో తెలియలేదు. కాని ;చివరి ప్రశ్న ఒకటి- అడగనా' అంది.

    "ఇంకో పెగ్ తాగే వరకు టైముంది అడుగు"

    "ముందు నన్నిక్కణ్ణించి పంపించేద్దామానుకున్నారు. కానీ తరువాత మళ్ళీ మనసు మార్చుకున్నారు. ఎందుకు?......

 Previous Page Next Page