Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 40


    జ్యోత్స్న నవ్వుతూనే "అదేం మాటండీ! మా దగ్గిర డబ్బుంటే మీకందరికీ దర్జాగా పార్టీ ఇవ్వమూ?" అంది.
    "ఆఁ! ఇలా పార్టీలిస్తే పోలీసుల దృష్టిలో పడతామనే భయంతో, ఈ ఆడంబరాలన్నీ ప్రస్తుతానికి తగ్గించుకున్నారేమో!"  
    "ఏమిటండీ, ఐరావతమ్మగారూ! మీరు ఎవరో అన్నారంటూ ఏదో మాట్లాడతారు - ఆ తరువాత మీరే ఆ 'ఎవరో' మాటల్ని సమర్థిస్తూ వాదిస్తారు. మీకంత ఆత్మీయిలూ, ఆప్తులూ .... ఆ 'ఎవరో' ఎవరండీ?"  
    అందరూ మళ్ళీ పకపక నవ్వారు. ఐరావతమ్మ రుసరుసలాడుతూ "అయితే, నేను కల్పించి చెప్పానంటావా?" అంది.    
    "ఛ! పెద్దవారు - మిమ్మల్ని అంతమాట ఎలా అంటానండీ! అయినా ఆ మధ్య ఎవరో నాతోనూ అన్నారు, మీ గురించి...."
    "ఏమన్నారు?"
    "ఆ ఐరావతమ్మ, తన కూతురికి పెళ్ళి చెయ్యక పోగా అందరిని చూసి ఈర్ష్యతో ఉడికిపోతూ ఉంటుందనీ.... ప్రతి ఒక్కళ్ళ దగ్గిరకు వచ్చి 'ఎవరో అన్నా'రంటూ మనసు కుళ్ళబొడిచే మాటలని ఆనందిస్తూ ఉంటుందనీ...."    
    "ఆఁ! ఆఁ! ఎవరన్నారామాట?"
    రోషంతో బుసలు కొడుతోంది ఐరావతమ్మ.
    జ్యోత్స్న నవ్వు అణుచుకుంటూ "ఆఁ! ఎవరో అన్నారు.... అన్నట్లు గుర్తుకొచ్చింది. మీతో వెంకట్రావుగారు దాచిన నల్లధనం కోసమే ఆయన్ని పెళ్ళి చేసుకున్నానని చెప్పారే, ఆ 'ఎవరో' చెప్పారు - వెళ్ళి గట్టిగా కనుక్కుని మళ్ళీ ఇలాంటి వెధవ వాగుడు వాగకుండా గడ్డి పెట్టండి...." అంది.    
    అందరూ విరగబడి నవ్వుతోంటే ఐరావతమ్మ కోపంగా వెళ్ళిపోయింది.
    భాస్కర్ ఒంటరిగా ఉన్నప్పుడు వెంకట్రావు అతని చేతికి పెన్ యిచ్చి "ఇది నీకు నా బహుమతి...." అన్నాడు.
    భాస్కర్ తెల్లబోయాడు. ఆ పెన్ ఒకప్పుడు వెంకట్రావు భాస్కర్ కిచ్చిందే! భాస్కర్ దానిని జ్యోత్స్న కిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వెంకట్రావు దానిని తనకిస్తున్నాడు.     
    తలవంచుకుని నిలబడ్డ భాస్కర్ షర్ట్ జేబులో పెన్ పెడుతూ భాస్కర్! ఇది బహుమతి మాత్రమే కాదు - దీని వెనుక తేలిగ్గా తెంచుకోలేని బంధాలున్నాయి. ఈసారైనా నా బహుమతి జాగ్రత్తగా ఉంచుకుంటావు కదూ?" అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో.    
    మాఁవగారు విశాల హృదయం ముందు నిలవలేకపోయాడు భాస్కర్.
    "ఇకమీదట ఇది పోదులెండి - జాగ్రత్తగా దాచి 'మీ తాతగారి బహుమతి' అని మీ మనవడి కిస్తాను" అన్నాడు. ఆ సమాధానానికి వెంకట్రావు చాలా సంతోషించాడు.
    జ్యోత్స్నా వెంకట్రావులు ప్రయాణమయ్యారు.
    "సుశీలా! నేను కూడా స్టేషన్ కి వెళ్ళి వస్తాను" అన్నాడు భాస్కర్.
    "వెళ్ళి రండి" అంది సుశీల.
    అందరూ గడప దాటాక ఎవరికీ తెలియకుండా కళ్ళు తుడుచుకుంది. జ్యోత్స్నకు తుది వీడ్కోలు ఇయ్యటానికే భాస్కర్ స్టేషన్ కి వెళుతున్నాడని సుశీలకు తెలుసు.
    జ్యోత్స్న కంపార్ట్ మెంట్ లో కూచుంది. వెంకట్రావు, భాస్కర్ ఫ్లాట్ ఫాం మీద నిలబడ్డారు.
    "ప్రయాణంలో చదువుకోవటానికి ఏవైనా పుస్తకాలూ, పత్రికలూ కొనుక్కుని వస్తాను." అంటూ వెళ్ళిపోయాడు వెంకట్రావు.   
    "ఆయన ఎంత మంచివారో చూడు! మనం మాట్లాడుకోవటానికి వీలుగా మనను  ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు" అంది జ్యోత్స్న.
    "జ్యోత్స్నా! నన్ను మరిచి పోతావా?"
    "మర్చిపోను, ఎందుకు మరిచిపోవాలి? పడమటి దిక్కున సూర్యుడు సముద్రంలోకి దిగిపోతూ అస్తమిస్తున్నప్పుడు.... తూర్పు దిక్కున చంద్రుడు ఉదయిస్తూ తన వెన్నెలలు సముద్రం మీదకి ప్రసరింప చేస్తున్నప్పుడు.... ఆ చీకటి వెలుగులు ఒక దానితో మరొకటి పోటీలు పడుతూ సముద్ర తరంగాలతో దోబూచులాడుకుంటున్నప్పుడు.... ఆ వినోదాన్ని చూస్తూ నా మనసు సృష్టి సౌందర్యానికి పరవశిస్తున్నప్పుడు.... మిమ్మల్నే తలుచుకుంటాను.... అందంగా వికసించిన పూలు ఆకుల మాటునుండి తొంగి తొంగి చూస్తూ అశాశ్వతమైన ఆస్తిత్వంలో నిక్షిప్తమైన శాశ్వతానందానుభూతిని వ్యాఖ్యానిస్తున్నప్పుడు మిమ్మల్నే తలుచుకుంటాను. తొలకరి జల్లులతో తడిసిన తనువుతో హృదయం సేద తీరి సంతృప్తిగా రంగుల హరి విల్లును దర్శించగలిగినపుడు మిమ్మల్నే తలుచుకుంటాను.... వ్యావహారిక జగత్తులో నిమిత్తం లేని ఆనందం నన్ను పరవశింప చేసిన ప్రతి క్షణమూ మిమ్మల్నే తలుచుకుంటాను. మీరు చెప్పండి  - నన్ను మరిచిపోవాలనుకుంటున్నారా?"

 Previous Page Next Page