Previous Page Next Page 
ఆనంద నిలయం పేజి 39


    వెంకట్రావుగారి విషయంలో ఈ 'త్యాగం' ప్రస్తావనేలేదు - మా ఇద్దరిలో ఎవరమూ త్యాగం చేశామనుకోవటం లేదు - అన్ని విధాలా ఇద్దరికీ అనుకూలంగా ఉండి పెళ్ళిచేసుకున్నాము - ఆయనకు నేను తోడుగా దొరికాను - నాకు జీవితంలో స్థిరత్వం దొరికింది - రక్షణ దొరికింది - మిసెస్ వెంకట్రావుగా సంఘంలో ఒక గౌరవనీయమైన స్థానం దొరికింది -  
    నామీద కోపగించుకోకండి - అభినందించండి - నా భర్తతో కలిసి మీ దగ్గిరకి వచ్చినపుడు మీరు నాకు నవ్వుతూ కనిపించాలి-    
                                                                                          ఉంటాను,

                                                                                      మీ స్నహితురాలు.

                                                                                           జ్యోత్స్న...."  
    ఎంత నిగ్రహించుకున్నా భాస్కర్ కళ్ళనుండి రెండు నీటి బిందువులు జారిపడ్డాయి - ఒక్క నిట్టూర్పు విడిచి అవి తుడుచుకున్నాడు భాస్కర్. రెండు ఉత్తరాలూ సుశీలకి చదివి వినిపించాడు భాస్కర్ -
    ఒక్కక్షణం నివ్వెరపోయిన సుశీల చాలా ఆనందించింది. ఆనందం పట్టలేక అప్పటికప్పుడు ఆ వార్తను మాజీ తహసీల్దారు గారి కుటుంబంలో అందరికీ చెప్పింది.... అందరూ ఆశ్చర్యపోయారు.
    ఐరావతమ్మ ఉండబట్టలేక, "మీ నాన్న చాటుగా బ్లాక్ మనీ ఎక్కడైనా దాచాడేమో! అందుకే జ్యోత్స్న పెళ్ళి చేసుకుందేమో!" అనేసింది.    
    "ఏం మా నాన్నను డబ్బుకోసమే చేసుకోవాలా! మా నాన్నకి నలభై రెండేళ్ళు. ముప్పై ఏళ్ళవాడిలా ఉంటాడు. పైగా బాగుంటాడు. జ్యోత్స మా నాన్నని ప్రేమించి పెళ్ళి చేసుకోవటంలో వింత ఏముంది? ఆ మధ్య పేపర్లో చదవలేదూ, నలభై ఏళ్ళవాడిని పద్ధెనిమిదేళ్ళ అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకుందని? మొగవాడికి నలభై అంటే ఒక వయసా?" అని గయ్ మంది సుశీల.
    సుశీల నోటికి భయపడి అంతటి ఐరావతమ్మ నోరు మూసుకుంది.
                                        19
    ఆనంద నిలయంలో అందరూ జ్యోత్స్న వెంకట్రావు దంపతులకు సంతోషంగా స్వాగతం పలికారు. జ్యోత్స్నకాని, సుశీలకాని ఏ విధమయిన 'సీన్సూ' సృష్టించలేదు. కొత్తగా వావి వరుసలు కలుపుకోనూ లేదు.
    "సుశీలగారూ! బాగున్నారా?" అని పలకరించింది జ్యోత్స్న.
    "ఆఁ! మీ దయవల్ల బాగున్నాను. అవును. మీ దయవల్లనే బాగున్నాను" అని నవ్వి, జ్యోత్స్న ఏమైనా అనుకుంటుందేమోనని భయపడుతూ "మా నాన్న చాలా అదృష్టవంతుడు జ్యోత్స్నగారూ! చాలా మంచివాడేకాని, పాపం చిన్నప్పటి నుంచీ ఎప్పుడూ సుఖపడలేదు. అయినా నవ్వుతూ ఉండేవాడు. ఇన్నాళ్ళకి మా నాన్నకి సుఖపడే రోజులు వచ్చాయి." అంది.
    "అదేంమాట! నేనూ అదృష్టవంతురాలినే! వెంకట్రావుగారు నాకు అన్ని విధాలా నచ్చకపోతే, నేను ఆయన్ని పెళ్ళి చేసుకునే దానిని కాను." అంది జ్యోత్స్న.
    "అవును. మా నాన్నకేం తక్కువ? అసలు అమ్మ పోగానే ఎందరో పిల్లనిస్తామంటూ వచ్చారు. చేసుకోనుగాక చేసుకోను అన్నాడు. ఇన్నాళ్ళూ నీకోసమే ఆగాడు." అని పకపకనవ్వింది సుశీల.   
    ఆ నవ్వు విని ఆశ్చర్యపోయాడు భాస్కర్. సుశీల అంత హాయిగా నవ్వగా అతనెప్పుడూ వినలేదు!
    పాపం! అభాగ్యురాలు! ఇన్నాళ్ళుగా తన కాంప్లెక్స్ తో తనను తాను దహించుకుంటూ, చుట్టుప్రక్కల వాళ్ళని కూడా కాల్చేసేది. జ్యోత్స్నకు పెళ్ళి అయిపోవటంతో సుశీలకు గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపినట్లయింది. దానికి తోడు గర్భవతి కూడా కావటంతో, తన సంసారం ఏమైపోతుందోననే దిగులు చాలావరకు పోయింది. అంచేత ఇప్పుడు తన దురదృష్టాన్ని అంగీకరించి. భరించి, నలుగురిలా నవ్వగలుగుతోంది!  
    రేవతి వెంకట్రావు దగ్గిరకు వచ్చి "ఇదివరకు చీటికీ మాటికీ పార్టీ లిచ్చేవారు. పెళ్ళి చేసుకున్నారు. పార్టీ ఇవ్వరా?" అంది.
    వెంకట్రావు నవ్వుతూ "రేవతిగారూ! మీరు అదృష్టవంతులండీ! పెళ్ళి చేసుకుంటే స్వతంత్రం పోతుందని చక్కగా గుర్తించి పెళ్ళి చేసుకోకుండా హాయిగా ఉన్నారు. నేను తెలివి తక్కువగా పెళ్ళి చేసుకున్నాను. ఇంకేముందీ? జ్యోత్స్నకు బానిసనై పోయాను. ఆవిడ ఎంతంటే అంత? మీరు జ్యోత్స్ననే అడగండి" అన్నాడు.   
    అందరూ ఘొల్లున నవ్వారు. రేవతి రోషంగా మూతి ముడుచుకుంది.
    "ఇలాంటి అనవసరం ఖర్చులు నేను పెట్టనివ్వను!" అంది జ్యోత్స్న.
    ఐరావతమ్మ జ్యోత్స్న దగ్గిరకు వచ్చి "ఆ మధ్య ఎవరో అన్నారు - వెంకట్రావు ఎలాగో బాగా నల్లధనం దాచాడటగా!.... అందుకే నువ్వతణ్ణి చాకచక్యంగా వలలో వేసుకుని పెళ్ళి చేసుకున్నావటగా?...." అంది.

 Previous Page Next Page