"మరిచిపోవాలనే అనుకున్నాను, మొదట! నీమీద ఎంతో కోపం వచ్చింది. నువ్వు లేని నా జీవితంలో ఆనందం లేదనుకున్నాను. అసలు నా దౌర్భాగ్యపు జీవితంలో ఆనందమే లేదనుకున్నాను. కానీ నా ఆలోచన నా మనసుకే నచ్చలేదు. నా జీవితంలో నేను ఆనందం అనుభవించిన అపురూపమైన క్షణాలు ఉన్నాయి. అసలు చదువుకోలేనేమోనన్న వ్యధతో కృంగిపోయిన నేను చదువుకోగలగటమే కాక, బి.ఏ.లో గోల్డ్ మెడల్ సంపాదించినపుడు.... ఎంత ఆనందం అనుభవించాను?"
"నా స్నేహితుడు ఒక పల్లెటూళ్ళో జబ్బు పడ్డాడు. వైద్య సహాయం లేక చచ్చిపోతాడనే అనుకున్నారు. దైవశాత్తూ అప్పుడే నేనా ఊరికి వెళ్ళాను. అప్పటికప్పుడు సైకిల్ మీద అంత దూరమూ టౌన్ కి వెళ్ళి డబ్బు ఆశ జూపి డాక్టర్ ని తీసుకొచ్చాను. నా స్నేహితుడు బ్రతికాడు. ఆనాడు నేను అనుభవించిన ఆనందం దేనితో పోల్చగలను?
"మరొక్క సందర్భం కూడా చెప్పాలి. చెప్పటానికి సిగ్గుగా ఉంది. అయినా చెపుతాను. నువ్వు నాతో రానప్పుడు క్రుంగిపోతూ ఇంటికి తిరిగి వచ్చాను. సుశీల గర్భవతి అని తెలిసింది. నా సంతానాన్ని దిక్కూ దివాణం లేని బికారిలా వీధిపాలు కాకుండా కాపాడుకోగలిగానన్న ఆనందం.... అలాంటి ఆనందం ఇంతకు ముందెన్నడూ అనుభవించలేదు.... నిన్ను మరిచి పోను జ్యోత్స్నా!.... నిజమయిన ఆనందం నేను అనుభవించగలిగినప్పుడంతా నిన్ను తలుచుకుంటాను. ఆ ఆనందాన్ని మానసికంగా నీతో పంచుకుంటాను...."
గంట కొట్టారు - వెంకట్రావు పరుగు పెడుతూ వచ్చి కంపార్ట్ మెంట్ లో ఎక్కాడు. ట్రైన్ కదిలింది....
జ్యోత్స్న రూపం కనుమరుగయ్యేవరకూ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు భాస్కర్.
ఇంటికి తిరిగి వచ్చిన భాస్కర్ ఇంటి ముందు వ్రాసి ఉన్న 'ఆనంద నిలయం' అన్న అక్షరాలను చూసి ఎప్పటిలా నిరాశతో క్రుంగిపోలేదు. ఆలోచనలో పడ్డాడు.
బాహ్య పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఆనందం అనుభవించాలని ఆరాటపడినంతవరకూ ఏదో ఒక సందర్భంలో ఆనందతృప్తిని ఎదుర్కోక తప్పదు. పరిస్థితులు మన చేతుల్లో లేవు. ఏ మహాశక్తి కనుసన్నలలోనో అనుసరిస్తూ ఎప్పటికప్పుడు మానవుని అంచనాలను తారుమారు చేస్తూనే ఉంటాయి.
ఈ విషయంలో మానవుడు అస్వతంత్రుడే అయినా, మరొక విషయంలో అతడు సర్వ స్వతంత్రుడు.... తనను తాను యథేచ్ఛగా రూపొందించుకోగలిగే స్వాతంత్ర్యం అతనికి ఉంది. తనకున్న ఈ స్వాతంత్ర్యాన్ని గుర్తించి ఉపయోగించుకోగలిగితే అవలీలగా పరిస్థితుల మీద ఆధిపత్యాన్ని సంపాదించగలడు.
ఆనందం ఒకరు దానం చేస్తే పొందేది కాదు - తాను సృష్టించుకొని అనుభవించగలిగేది.... అని తెలుసుకోగలిగినపుడు.... ఆ వ్యక్తి నిత్యానందుడే కాగలడు. అప్పుడు ఈ ఇల్లు మాత్రమే కాదు - సృష్టి మొత్తం ఆనంద నిలయం అవుతుంది!
ఆలోచనలో అతి సాధారణమనిపించే ఈసాధన ఆచరణలో ఎంత కష్టం!!
* సమాప్తం *