కనీసం సమస్యని ధైర్యంగా ఎదుర్కోని ఆలోచించలేడు. యశోదకి వివేక్ మీద ప్రేమ ఉంది, కానీ ఈర్ష్యతో ఉడికిపోతూ అన్నీ తనే ఊహించుకుని, అభాండాలు వేస్తోన్న వివేక్ తో ఏదీ మాట్లాడాలనిపించటం లేదు.
తన సహనానికీ, సహకారానికీ, ప్రేమకీ ఫలితాలు ఆ అభాండాలా.... అనిపించి మనసు ఎదురు తిరుగుతోంది. అన్నింటికంటే సమస్య ఎంతో సున్నితమైనది భార్యాభర్తలిద్దరూ సహనంతో అవగాహనతో, మనసులు విప్పి మాట్లాడుకుంటే తప్ప దీనికి పరిష్కారం ఉండదు.
తనను తను ఆ విధంగా హ్యూమిలియేట్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు యశోద, ఇదివరకు అత్తగారి అండ ఉండేది కల్పవృక్షం నీడలా.
ఇప్పుడు వివేక్ తాగుబోతు కావడానికి యశోద కారణమనే దురభిప్రాయంతో ఆవిడ యశోదని నిరసనగా చూస్తోంది.
ఆవిడ సంస్కారాన్ని బట్టి, దెప్పి పొడుపులు యీసడింపులూ లేవు, గానీ మౌనంగా తిరస్కారం ప్రకటిస్తోంది. అది మరింత బాధగా వుంది.
అన్నింటికంటే పింకూని యశోద ఎత్తుకున్నప్పుడు కూడా చాలా అసహనంగా చూస్తోంది ప్రసూన, ఇది అస్సలు భరించలేకపోతోంది.
ఇక దేవిశంకర్... జానీ వర్ణించినట్లు ఎరని మింగటానికి సిద్ధంగా ఉన్న కొండచిలువలాగే ఉన్నాడు. ఈ పరిస్థితుల మధ్య చావుకి తెగించి యుద్ధంలోకి ఊరికే వీరయోధుడిలాగా తయారయింది. యశోద మానసిక స్థితి ఎలాగూ విడిపోక తప్పని పరిస్థితులు వచ్చేస్తున్నాయి.
అంచేత విడిపోయే ముందు ఏదైనా సాధించగలిగితే, అందరికీ మంచిది. అలా కాకపోతే, విడిపోవటమే అనివార్యమైతే? ఎలా విడి పోయినా ఫర్వాలేదు. ఈ నిర్ణయానికి వచ్చాక ఎక్కడలేని తెగింపు వచ్చేసింది యశోదలో.
ఫోన్ లో జానీతో అంది "నాకన్నీ తెలుసు జానీ. కానీ నాకిది తప్పదు. మీ జగదేకవీరునితో నాకు సమావేశం ఏర్పాటు చెయ్యి."
"ఆల్ రైట్. అన్నీ పకడ్బందీగా చూసుకుని, నీకు ఫోన్ చేస్తాను"
ఫోన్ పెట్టేశాడు జానీ చాలా డల్ గా వినిపించింది అతని గొంతు. ఏ గుడ్ ఫ్రెండ్ అనుకుంది యశోద మనసులో.
* * *
జానీ గెస్ట్ హౌస్ ఆవరణలో ఆటో దిగింది యశోద. కంపరంగా ఉంది ఆమె మనసుకీ శరీరానికీ కూడా. అక్కడికి ఎలాంటి ఆడ వాళ్ళొస్తారో ఆమెకి తెలుసు. వెనక్కి తిరిగి పోవాలనిపించింది యశోదకి. డాక్టర్ అనంత పద్మనాభస్వామి వీరన్న మాట్లాడిన ధోరణి చెప్పాడు.
"అలాంటి వాడు నిజం చెప్తాడని కానీ వాడి ద్వారా మనకు కావలసిన నిజం వస్తుందని నేను అనుకోను. అలాంటి బ్లాక్ మెయిలర్ తో చేతులు కలపటం నాకిష్టం లేదు. నా ప్రొఫెషన్ కీ మంచిదీ కాదు. నువ్వు కూడా అతడికి దూరంగా ఉండు. మరో మార్గం ఆలోచించుకుందాం" అని హెచ్చరించాడు.
ప్రమాదం ఉన్నమాట నిజమే కానీ జానీ ఉన్నాడు అండగా. స్నేహితుడినికి స్నేహితుడు. గూండాలకి గూండా.
పక్క వీధిలోనే ఉండి, ఏం జరక్కుండా చూసుకుంటానన్నాడు. జానిని నమ్మొచ్చు పూర్తిగా. ఏమాత్రం ద్రోహబుద్ధి ఉన్నా అతని గెస్ట్ హౌస్ కి రావటానికి తనని ఇంతగా డిస్కరేజ్ చేసి ఉండేవాడు కాడు.
చిన్నవరండా. దాని నానుకుని అటాచ్డ్ బాత్ తో బెడ్ రూం, ఇంతే! గెస్ట్ హౌస్. వరండాలోని పేము సోఫా సెట్ ఉంది.
అక్కడ కూర్చుని ఉన్నారు, వీరన్న జానీ. సాధారణంగా యశోదని చూడగానే వెకిలి నవ్వు నవ్వేవాడు వీరన్న. ఇంటి కోడలని కూడా సంకోచించే వాడు కాదు.
అలాంటిది ఆ రోజూ... యశోద గెస్ట్ హౌస్ కి వచ్చినరోజు. మరింత చులకనగా చూడటానికి అవకాశమున్న రోజు.... మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేశాడు. జానీ శక్తిలో మరింత నమ్మకం కలిగింది యశోదకి. మనసు కుదుటపడింది.
"వెల్ కమ్! నన్నిక్కడ ఉండమంటావా?. లోపలిగదిలో ఉండమంటావా? మధ్య తలుపులు తీసి ఉంచనా? వేసి ఉంచనా? నాకు మళ్ళీ గెస్ట్ హౌస్ సాయంత్రం అయిదింటికి కావాలి. ఒక గెస్ట్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను."
"లోపలి గదిలో ఉండు. తలుపులు తీసి ఉంచు. గంట, గంటన్నరకంటే ఎక్కువసేపు ఉండను. నాకు కావలసిన విషయాలే ఇతనితో చెప్పిస్తాను."
"ఓకే" అని చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు జానీ.
ఆ తర్వాతి సంభాషణల్లో అతనికి ఇంట్రెస్ట్ లేదనటానికి నిదర్శనంగా బెడ్ రూంలోంచి సన్నగా పాప్ మ్యూజిక్ వినిపించసాగింది. యశోద, జానీని బెడ్ రూంలోకి వెళ్లమనటానికి కారణం ఉంది.
తనతో చిన్న టిఫిన్ డబ్బా అంత టేప్ రికార్డర్ తీసుకొచ్చింది ఆమె. ఇంపోర్టెడ్ టేప్ రికార్డర్ అది. చాలా పవర్ ఫుల్ చక్కగా రికార్డ్ అవుతుంది. కాటన్ బేగ్ లో పెట్టి తీసుకొచ్చింది.
టేప్ రికార్డర్ సంగతి జానీకి తెలియకూడదు. జానీ ఏదైనా మాట్లాడితే అది రికార్డ్ కాకూడదు. అంచేత జానీని బెడ్ రూంలో ఉండమంది.
తలుపులన్నీ తీసి ఉంచమన్నది. వీరన్నలో నమ్మకం లేక టేప్ రికార్డర్ వీరన్నకీ తనకీ మధ్య ఉన్న చిన్న టేబిల్ పైన ఉంచింది యశోద. టేప్ రికార్డర్ ఆన్ చేసి ఉంది. రెడ్ లైట్ వెలుగుతోంది. కానీ కాటన్ బేగ్ లోంచి అది కనిపించదు.
మధ్యలో కాటన్ బేగ్ పెట్టడం చూసి వీరన్న ఏమైనా అనుమానిస్తాడేమోననుకుంది. కానీ అతడికా దృష్టిలేదు.
అతడి వ్యవహారాలన్నీ కత్తులతో, కటార్లతో, నాటు బాంబులతో, మత్తు మందులతో సాగేవి. టేప్ రికార్డర్ లాంటి అతి సున్నితమైన పరికరాలు అతడి ప్రపంచంలో లేవు.
"ఏం చెప్పమంటారూ?" బెడ్ రూం వైపు దొంగచూపులు చూస్తూ అడిగాడు వీరన్న.
"వివేక్ చిన్నతనం గురించి. అతడి చిన్నప్పటి అలవాట్లు ఎలా ఉండేవి. తల్లిదండ్రులిద్దరిలో ఎవరి దగ్గర చేరిక ఎవరు ఎక్కువ ముద్దు చేసేవారు. ఎవరైనా పనిష్మెంట్స్ ఇచ్చేవారా? ఇస్తే అవి ఎలాంటివి?.... నువ్వు చెప్పుకుంటూ పో. నాకు కావలసినప్పుడు నేనే డౌట్స్ అడుగుతాను."
"అదేంటండీ? అయ్యగారు చేయించిన ఖూనీల గురించీ ఆడోళ్ల వ్యవహారాల గురించీ నాకు బాగా తెలుసు. మీకు కావాలంటే అయ్యన్నీ...."
"వీరన్నా! నాకు ఆ వివరాలు అక్కర్లేదు. నేనడిగింది చెప్పు చాలు అనవసరంగా నువ్వేమీ మాట్లాడకు" కచ్చితంగా అంది.
వీరన్న డిజప్పాయింట్ మెంట్ అతడి ముఖంలో స్పష్టంగా కనిపించింది. అతడికి చాలా ఇష్టమైన విషయాలు, ఖూనీలూ, ఆడవాళ్ళూ.
జరిగిన విషయాలకి చక్కగా రంగు పూసి యశోదకి చెప్పటానికి తయారు చేసుకున్నాడు. యశోద అవి వొద్దనేసరికి అతడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
మెదడూ శూన్యమైపోయింది.
"ఏం చెప్పమంటారండీ?" అన్నాడు.